కన్యాదానం లో కన్నీటి ముత్యాలు
పసిపిల్లగా ఒడిలోకి వచ్చావు, పలుకలేని పలుకులతో నన్ను తడిపినావు. నిన్ను నిద్రపుచ్చేందుకు పాటలే నేర్చుకున్నా, నీ నవ్వు కోసం నేనూ చిన్న పిల్లనైపోయా. నడక నేర్పించేందుకు పట్టుకున్న చిటికెన వేళ్ళు – ఇప్పుడు నీ జీవితాన్ని నడిపించబోతున్నాయి. ఇది బాధ్యతల బంధం, ఇక్కడ అనురాగాల బంధం. మా ఇంట్లో మహాలక్ష్మిగా వెలిగిన నువ్వు, ఈరోజు మరో ఇంటికి దీపశిఖవై వెళుతున్నావు. రేపటినుండి అది నీ ప్రపంచం, మన ఇల్లు ఓ విశ్రాంతి గృహం మాత్రమే. ఇప్పటివరకు నీ కళ్ళలో వెలుగు చూసి నా గుండెల్లో కన్నీళ్లు దాచుకున్నాను. ఇన్నాళ్లు నీ గుండెలో బంధాలే ఉండేవనుకున్నా, ఇప్పుడు నీ హృదయం కొత్త బంధాలతో నిండిపోయింది కదా... మరి మేమెక్కడ? నాన్న – మగమహారాజు కాబట్టి – గంభీరంగా కనిపిస్తున్నాడు, కానీ... ఉప్పొంగే కన్నీటి కెరటాలని గుండె గదుల్లోనే అడ్డుకట్ట వేస్తూ కర్తవ్యం నిర్వహిస్తున్నా విడిపోవడం వేదన అయినా నీ సంతోషమే మా ఆనందం. కన్యాదానం పుణ్యమని శాస్త్రం నోరు మూయించింది దానం చేసిన దానిని అప్పగించడమే మన విధి. ఆడపిల్లకి జన్మనిచ్చినందుకు తల్లితండ్రుల కర్తవ్యం మనసు గాయపడిన గుండె బాధపడిన తీర్చుకోవాల్సిన...