స్పూర్తి
స్ఫూర్తి ఏ క్షణం ఈ భూమి మీద పడ్డానో అప్పటి నుంచి నడకవచ్చి నాలుగు వీధులు తిరిగే వరకు అమ్మ తిన్నా తినకపోయినా ఒడిలో పడుకోబెట్టుకుని జుట్టు నిమురుతూ నా ఆకలి తీర్చేది. నడకవచ్చి నాలుగు వీధులు తిరిగే వయసు వచ్చిన తర్వాత కుండలో వండిన నాలుగు మెతుకులు నాకూ వాటా పెట్టి అమ్మ పస్తులు ఉండేది. ఎందుకంటే నాతో పాటు నాలుగు మెతుకులు పంచుకునేందుకు మరో ఇద్దరు మొత్తం ముగ్గురం. మాతో పాటు అమ్మానాన్న. ఎన్నోసార్లు అమ్మానాన్న కుండలోని మంచినీళ్ళతో కాలం గడిపేవారో. ఆకలి గురించి ఆలోచించే సమయం కానీ తీరిక గాని ఆ దంపతులకు లేవు. తెల్లవారి లేస్తే తట్టబట్ట సర్దుకుని పొలం గట్టుకు చేరకపోతే మర్నాడు మా ఇంట్లో పొయ్యిలోంచి పిల్లి లేచేది కాదు. కాలచక్రాన్ని ఎవరు ఆపలేం. తిరిగే కాలం నాకు 10 సంవత్సరాల వయసుని మా ఇంటి పరిస్థితిని అదే సమయంలో మా ఊరిలో ఉండే పెద్ద మేడలో ఉన్న నా వయసు వాళ్ల నిత్య కృత్యాన్ని గమనించుకునే జ్ఞానం కలిగించింది. కాలం అంటే అందరూ భయపడతారు. కానీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా కున్న పరిస్థితిని దాటడానికి నా బాధ్యతను గుర్తుచేసింది. అంటే ఒకటి మా పేదరికం రెండోది నా చదువు . చదువు నాకు అందని ద్రాక్ష...