బామ్మ ఉంటే
బామ్మ  ఉంటే  " అవును అమ్మ  ఉంటే ఎంత బాగుండేది. ఇంట్లో ముఖ్యంగా పిల్లలకి  మంచి చెడ్డ చెప్పేది. రామాయణం ,భారతం, భాగవతం కథలు రాత్రి కూర్చోబెట్టుకుని చెప్పేది. ఏది మంచి ఏది చెడు ప్రతిరోజు ప్రతి పనిలోనూ  గుర్తు చేసేది. నా బాల్యంలో మా  బామ్మ ఉండేది అలాగే బామ్మ క్రమశిక్షణలో గడిచిపోయింది మా బాల్యం. ఈ పిల్లల బాల్యం చూస్తుంటే భయమేస్తుంది. ఇంట్లో ఎవరూ పెద్దవాళ్ళు లేరు. వీళ్ళ జీవితం ఎలా నడుస్తుందో ఏమిటో అంటూ తన బాల్యం గుర్తు  చేసుకో సాగాడు  ముప్పైఏళ్ల రాజారావు.  రాజారావు  కామేశ్వరరావు గారికి ఆరో సంతానం. కామేశ్వరరావు గారి పిల్లలు అందరి బాల్యం కామేశ్వరావు గారి తల్లి సుందరమ్మ గారి పెంపకoల్లో గడిచిపోయింది. మరి అంత క్రమశిక్షణ కాదు గాని సుందరమ్మని చూస్తే పిల్లలకు హడలు. ఉదయం లేస్తూనే అందరూ స్నానాలు చేయాలి. దేవుడికి దండం పెట్టుకోవాలి. అప్పుడు గాని పాలు తాగడానికి వీల్లేదు. కాఫీ టీల ప్రసక్తే లేదు. చిన్నపిల్లలు పాలు తాగాలి రా. ఎముకలు బలంగా ఉంటాయి అoటు సైంటిఫిక్ రీజన్ చెప్పేది. అప్పట్లో  ఉదయం పూట టిఫిన్ కూడా లేదు. చక్కగా చద్దన్నం పెరుగు వేసి పెట్టేది.  మళ్లీ మధ్యాహ్నం పూట స్కూల్ నుంచి వచ్చి బట్ట...