అవును ఆయన చనిపోలేదు
అవును ఆయన చనిపోలేదు !. " నిన్న ఉదయం ఇద్దరం కలిసి వాకింగ్ కి వెళ్లొచ్చాం. ఆరోగ్యం బాగాలేదని ఏమీ చెప్పలేదు. ఇంతట్లో ఇలా అయిపోతాడని ఎలా ఊహిస్తాం అంటూ చనిపోయిన పరంధామయ్య స్నేహితులు మాట్లాడుకుంటున్నారు." ఎంత మంచివాడు ఎప్పుడూ గట్టిగా కూడా మాట్లాడేవాడు కాదు అంటూ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తలోరకంగా చెప్తున్న మాటలు పరంధామయ్య భార్యకి తలకెక్కట్లేదు. ఒకపక్క భర్త పోయిన బాధ ఇంకొకపక్క ఆయన ఆశయం ఎలా నెరవేర్చాలనే భయం బంధువులు ఏమనుకుంటారు అని మరొక పక్క భయం. పోనీ పరంధామయ్య ఆశయం డబ్బుతో కూడుకున్నదైతే ఏ గొడవ లేదు. ఆ స్తోమత ఉంది కుటుంబ సభ్యులకి. మరి ఆచార వ్యవహారాలకు సంబంధించింది. మరి పరంధామయ్య నాలుగు వేదాలు చదువుకున్నవాడు. తెల్లవారి లేస్తే అందరికీ మంచి చెడ్డ చెప్పే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇటువంటి కోరిక ఏమిటి? మరి దీన్ని లోకం ఎలా తీసుకుంటుంది. " ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. దీన్ని కచ్చితంగా నువ్వు పాటించాలి. ఇది నా కోరిక. నా వయసు అరవై సంవత్సరాలు దాటింది. ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు. మనిద్దరిలో ఎవరు ముందో తెలియదు. కానీ నేనే ముందుగా పోతే నా అవయవాలను రంగరాయ మెడికల్ కాలేజీకి దానం ఇచ్చే...