అంతిమ ఘడియల్లో నైతిక విజయం

 * అంతిమ ఘడియల్లో నైతిక విజయం"


"చనిపోయిన వాళ్లకి ఏం తెలుస్తుంది? కట్టెలతో కాలిస్తే ఏమిటి, కరెంట్ మీద దహనం చేస్తే ఏమిటి? మీ చాదస్తం ఏమిటీ?" — ఇలా అన్నాడు బ్రహ్మయ్య గారి దూరపు బంధువు రాజయ్య.


"వద్దు బాబూ... నాన్నకు కరెంట్ అంటే భయం. లైట్ స్విచ్ వేయడానికి కూడా ఎప్పుడూ తడబడేవాడు. అలాంటి మనిషిని కరెంట్ మృతదహనానికి పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు..." అన్నాడు పెద్దకొడుకు రమణ, తలవంచుకొని.


"మామూలు స్మశానం మన ఇంటికి చాల దూరం. అక్కడికి వెళ్లాలంటే ఖర్చు ఎక్కువ. పెద్దవాళ్ళు రావడం కష్టం. అక్కడ అంతసేపు ఉండలేరు, ఆతిథ్యం ఎలా చూస్తాం?" అంటూ కోపంగా రాజయ్య వాదించాడు.


"పర్వాలేదు. రాలేని వారు రాకపోవచ్చు. కానీ కుటుంబ సభ్యులంతా వెళ్తాం," అన్నది సరోజ, బ్రహ్మయ్య గారి పెద్ద కూతురు.


"రోజూ యూట్యూబ్‌లో చూస్తున్నాం… ఎవరో తెలియని వ్యక్తిని కూడా అలా బూడిద అయ్యే దృశ్యం చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు. నాన్న గురించి ఊహించలేకపోతున్నాం అక్కా..." ఆమె మాటల్లోకి బాధ తళతళలాడింది.

"నిజమే. చివరకు మిగిలేది బూడిదే. కానీ శాస్త్రం చెప్పిన విధంగా, తలకొరివి కొడుకు చేతి మీద చేయకపోతే, నాన్నకు మనం అన్యాయం చేసినట్టే. నాన్నకేమీ తెలియకపోయినా ఆయన భావాలు మనకి తెలుసు కదా. పాపభీతి ఎక్కువ ఉన్నవాడు. పదిమందికి సహాయం చేస్తూ, ధర్మంగా జీవించినవాడు. ఆయనకి కరెంట్ దహనం నచ్చదు, ఇదెప్పుడూ చెప్పలేదుగానీ అర్థం చేసుకోవాలి" అని కన్నీళ్లతో చెప్పింది సరోజ.


బ్రహ్మయ్య గారు తెలుగు మాస్టర్. శాస్త్రజ్ఞుడు. నాలుగు మగపిల్లలతో పాటు, పెద్ద కూతురు సరోజతోనే ఎక్కువగా మనసులోని విషయాలు పంచుకునేవాడు.


వయసు పెరిగే కొద్దీ పెద్ద కొడుకు రమణ గురించి భార్య రమణితో పదేపదే మాట్లాడేవాడు. "వాడూ చాల దూరంలో ఉన్నాడు. అక్కడకి మనం వెళ్లలేమ్. వాళ్లకి ఇక్కడ ఉద్యోగాలు ఉండవు. చివరి రోజులు ఎలా గడుస్తాయో!" అని ఆవేదన వ్యక్తం చేసేవాడు.


ఆయన భయపడినట్టుగానే హఠాత్తుగా మరణించారు. కొడుకు రాలేకపోయాడు. ఇప్పుడు దహనం విషయంలో తర్జనభర్జనలు.

ఇటువంటి సందర్భాల్లో ఈ తరం యువతకు అనుభవం లేదు. దూర బంధువుల మాటలే విని తమ నిర్ణయాలు తీసుకుంటారు.


 కానీ రమణ ఆలోచనలో పడ్డాడు — "నిజమే… నాన్నకు కరెంట్ భయం. సనాతన ధర్మం అంటే గౌరవం. చనిపోయాక మన ఇష్టానుసారం చేస్తామా? ఆయన అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి. బ్రతికి ఉన్నట్టు గౌరవించాలి."


తర్వాత వచ్చిన ప్రతిఒక్కరిలో ఎవరో ఒకరు సలహా ఇచ్చారు. కానీ వాటిని విని కోపపడక, రమణ తుదిర్ణయం తీసుకున్నాడు


 — "కరెంట్ దహనం కాదు. నేను నాన్నకిష్టమైన విధంగానే శాస్త్రోక్తంగా అన్ని విధానాలు పాటిస్తాను."


దగ్గరి బంధువులు తప్ప మరికొంతమంది నెమ్మదిగా వెళ్లిపోయారు. మిగిలిన తమ్ముళ్లతో కలిసి శాస్త్రప్రకారం ఏర్పాట్లు చేశారు. సాయంకాలం నాలుగు గంటలకి దహన కార్యక్రమం పూర్తయింది. శరీరం బూడిదైంది. కానీ మనసులో ఒక తృప్తి మిగిలింది — "నాన్న మనం ఎలా బ్రతకాలో నేర్పినట్టు, ఆయన అంతిమ సంస్కారాలను కూడా ఆ విలువలకే అర్పించాం."

మరణం అనేది ముగింపు కాదు. అది జీవితం గడిపిన తీరుకి మనం నివాళులర్పించే క్షణం.


ఎవరి జీవితం ఏ విలువలపై నడిచిందో, చివరి ప్రయాణం ఆ విలువలకే అంకితం కావాలి. శాస్త్రం అనేది కేవలం పద్ధతి కాదు — అది మనస్సుల ప్రయాణానికి మార్గదర్శిని.


గౌరవం, బాధ్యత, త్యాగం… ఇవే నిజమైన సంస్కృతి.

"చనిపోయినవారికి ఏం తెలియదు?" అని చెప్పే ముందు — మనకు తెలిసిన వారి మనసు గుర్తుంచుకోవాలి.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కా కినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట