ముసలితనం
ముసలితనం
ఉదయం ఏడు గంటలు అయింది.
ఎప్పుడూ తెల్లవారుజామునే లేచే నాన్న ఇంకా లేవలేదు ఏమిటి. ఒంట్లో ఏమైనా బాగోలేదా ! రాత్రి బాగానే ఉన్నాడు గదిలో చప్పుడు ఏమీ లేదు అనుకుంటూ తండ్రి రామయ్య గదిలోకి అడుగుపెట్టి న శరత్ కి రామయ్య గారు ఇంకా దుప్పటి ముసుగులోనే ఉండడం చూసి దుప్పటి తీసి ఒంటి మీద చెయ్యి వేసాడు. ఒళ్ళు వేడిగా ఉంది. కాలిపోతోంది. వెంటనే నాన్న ధర్మా మీటర్ నోట్లో పెట్టుకో అంటూ కంగారుగా రామయ్య గారిని లేపి ధర్మా మీటర్ నోట్లో పెట్టాడు. 102 జ్వరం. ఏమైంది నాన్న? అంటూ కంగారుగా అడిగా డు. ఏమి లేదురా ఈమధ్య రోజు ఎండకు తట్టుకోలేక రాత్రి పగలు a c వేసుకుని పడుకుంటున్నాను కదా. కాస్త జలుబు చేసి జ్వరం వచ్చింది.
నాకు ఏసీ పడదు కదా! నేను మొహం కడుక్కొని వస్తానంటూ బాత్రూంలోకి వెళ్ళాడు రామయ్య. శరత్ కి చిన్నతనం నుంచి కంగారు ఎక్కువ. భయం. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాడు. పైగా రామయ్య గారికి ఒక్కడే కొడుకు శరత్. తల్లి పోయిన దగ్గర నుంచి తండ్రిని చంటి పిల్లాడిలా చూసుకుంటాడు.
అయిందానికి కాని దానికి డాక్టర్ దగ్గరికి బలవంతంగా తీసుకుపోతుంటాడు రామయ్య గారిని. అతి ప్రేమతో చచ్చిపోతున్నారు ఇంట్లో జనం.
మావయ్య గారు ఇప్పుడు ఎలా ఉందండి ?అంటూ కాఫీ కప్ తో గదిలోకి అడుగుపెట్టిన శరత్ భార్య రాధ రామయ్య గారిని అడిగింది. మామూలు జ్వరమే. కంగారు పడాల్సిన పనిలేదు. వీడికి శరత్ కి అన్ని కంగారు ఎక్కువ అంటూ కోడలు అందించిన కాఫీ కప్పు తీసుకుని కాఫీ తాగి టాబ్లెట్ వేసుకున్నాడు. నాన్న 10 గంటలకి డాక్టర్ శర్మగారు హాస్పిటల్ కి వెళ్దాం. ఆయన నీకు అలవాటు కదా! అంటూ చెప్పిన శరత్ మాటలు విని డాక్టర్ గారి దగ్గరికి అక్కర్లేదు టాబ్లెట్ వేసుకున్నాను కదా! నాకు తగ్గిపోతుంది. నువ్వు కంగారు పడకు. నువ్వు మామూలుగా నీ ఆఫీస్ పని నువ్వు చూసుకో. అవసరమైతే కోడలు తీసుకెళ్తుందిలే అంటూ చెప్పిన రామయ్య గారు మాటలు వినిపించుకోలేదు శరత్. లేదు నాన్న ఈరోజు నేను సెలవు పెట్టేసాను అంటూ చెప్పిన శరత్ మాటలకి రామయ్య గారు ఇంకేమీ మాట్లాడలేక ఊరుకున్నాడు.
డాక్టర్ శర్మ గారు ఆ ఊర్లో పేరు ఉన్న డాక్టర్. గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యి సొంత ఇంట్లోనే ప్రాక్టీస్ పెట్టుకున్నారు . వైద్యంలో సుదీర్ఘ అనుభవం ఉంది. దానికి తోడు మాట మంచితనం అందుకే ఉదయం 10 గంటలకు క్లినిక్ ప్రారంభం అయితే ఇంచుమించుగా రాత్రి 9 గంటల వరకు పేషెంట్లు అలా వస్తూనే ఉంటారు. చాలా దూర ప్రదేశాల నుంచి ముందుగా అపాయింట్మెంట్లు తీసుకుని వస్తుంటారు.
ఉదయం 11 గంటలు అయింది. ఎంత చెప్పినా వినకుండా శరత్ డాక్టర్ శర్మ గారి దగ్గర తీసుకువెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. డాక్టర్ శర్మగారు 12 గంటలకి ఇచ్చారు అపాయింట్మెంట్ .శరత్ భార్య రాధ ఒక ప్లాస్క్ లో కాఫీ బిస్కెట్లు పళ్ళు మంచినీళ్లు సర్దుకుని ముగ్గురూ కలిసి ఆటో లో బయలుదేరి శర్మ గారి క్లినిక్ వెళ్లారు. శర్మ గారి హాస్పిటల్ లోపలికి వెళ్లాలంటే చాలా మెట్లు ఎత్తుగా ఉంటాయి. శరత్ ని ఆసరాగా చేసుకుని అతి కష్టం మీద లోపలికి వెళ్ళాడు రామయ్య. వయస్సు ప్రభావం గదా మెట్లకి వెళ్లేటప్పటికి రామయ్యకు ఆయాసంగా అనిపించింది. అయినా ఈ విషయం శరత్ కి చెప్పలేదు. అయినా ఏ హాస్పిటల్ అయినా ఇలాగే మెట్లు ఉంటాయి. ఈ వయసులో మెట్లు ఎక్కడ ఉంటే చాలా కష్టం. ఎంత చెప్పినా ఈ పిల్లలు వినిపించుకోరు అంటూ అనుకున్నాడు మనసులో రామయ్య.
అప్పటికే హాలంతా పేషంట్లు తోటి బంధువులతోటి నిండిపోయింది. ఎక్కడ కుర్చీలు ఖాళీ లేవు. పాపం ఎవరో చిన్న కుర్రాడు రామయ్య ను చూసి లేచి కుర్చీ ఇచ్చాడు. పాపం రాధ, శరత్ ఇద్దరూ హాల్లో ఒక మూలగా అలా నిల్చుని ఉన్నారు. సమయం 12 గంటలు దాటిపోయింది. అయినా రామయ్య గారి పేరు రాలేదు. ఈ లోగా ఒక కప్పుతో కాఫీ బిస్కెట్లు పట్టుకొచ్చి ఇచ్చింది రాధ రామయ్యకి. అప్పటికే రామయ్య కి నీరసంగా అనిపిస్తోంది.
ఉదయం మామూలుగా వేసుకునే మందులతో పాటు ఈ జ్వరానికి మందు వేసుకున్నాడు కదా. టిఫిన్ తిని వచ్చినప్పటికీ ఇంటి దగ్గర ఇదే సమయంలో ఏదో ఒకటి తింటాడు అది రామయ్య అలవాటు.
ఈలోగా రామయ్య గారు ఎవరండీ ?అంటూ నర్స్ పిలిచింది. శరత్ తండ్రిని తీసుకొని డాక్టర్ గారు గదిలోకి వెళ్లి నమస్కారం పెట్టి విషయం చెప్పాడు. డాక్టర్ శర్మ గారు శతస్కోప్ తో పరీక్ష చేసి ఊపిరితిత్తుల్లో శ్లేష్మం ఉంది. దగ్గు వస్తుందా! అని అడిగారు. అవునని సమాధానం ఇచ్చాడు రామయ్య. ఈ మందులు వాడితే సరిపోతుంది అంటూ మందులు గబగబా రాసిచ్చాడు డాక్టర్ శర్మ గారు. అయినా సంతృప్తి పడలేదు శరత్. రక్త పరీక్షలు ఏమైనా చేయించాలా! అని సందేహం వ్యక్తం చేశాడు. వెంటనే డాక్టర్ గారు పోనీ ఒకసారి చేయించండి అంటూ రక్త పరీక్ష ఎక్సరే ,ఎబ్డామిన్ స్కానింగ్ ,మూత్ర పరీక్ష అంటూ లిస్ట్ రాసిచ్చాడు. ఆ డాక్టర్ గారు రాసిచ్చిన స్కానింగ్ సెంటర్ అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ తప్పితే ఎక్కడ చేయించుకోకూడదు.
అప్పటికే మధ్యాహ్నం రెండు గంటలు అయింది. ముగ్గురికి ఆకలి బాగా వేస్తోంది. నాన్న ఒక పని చేద్దాం ఈ పక్క హోటల్లో టిఫిన్ తినేసి తర్వాత స్కానింగ్ సెంటర్ కి వెళ్లిపోయి పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం.
నేను రిపోర్టులు పట్టుకుని డాక్టర్ గారికి చూపిస్తాను అప్పుడు నువ్వు రావక్కర్లేదు అంటూ శరత్ చెప్పిన మాటలకి రామయ్య సరే అన్నాడు. ఉదయం నుంచి జ్వరం ఎక్కువగా ఉండటం వల్ల బాగా నీరసంగా ఉంది నోరు కూడా అరుచిగా ఉంది. హోటల్ కి వెళ్ళే అందరూ ఇడ్లీ తిని కాఫీ తాగి ఆటోలో స్కానింగ్ సెంటర్ కి వెళ్లారు.
అది ఆ ఊరిలో బాగా పేరు ఉన్న స్కానింగ్ సెంటర్. డాక్టర్లందరూ అక్కడికే పంపిస్తుంటారు. బాగా రద్దీగా ఉంది. దానికి తోడు మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళేటప్పటికి రామయ్యకి ఇంకా బాగా నీరసంగా అనిపించింది. అన్ని పరీక్షలు అయ్యేటప్పటికి సాయంకాలం ఐదు గంటలు అయింది. రిపోర్టులు రేపు ఉదయం ఇస్తానని చెప్పారు. ఈలోగా శరత్ డాక్టర్ గారు రాసి ఇచ్చిన మందులు కొని ఆటోలో ముగ్గురి ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్లారు.
ఇంటికి వచ్చిన వెంటనే రామయ్య అమ్మ రాధా !కాస్త మిరియాల చారు అన్నం వండు తొందరగా అన్నం తింటాను అని చెప్పి ఒరేయ్ శరత్ ఆ ఆవిరి పట్టే మిషన్ నీళ్లు పోసి ఇలా తీసుకురా అంటూ దుప్పటి ముసుగేసుకుని ఒక అరగంట సేపు ఆవిరి పట్టి కోడలు పెట్టిన భోజనం తినేసి పారాసెట్మాల్ టాబ్లెట్ వేసుకుని దుప్పటి ముసుగు పెట్టి పడుకున్నాడు.
మధ్యలో శరత్ రెండు మూడు సార్లు వచ్చి ఒంటి మీద చేయి వేసిన విషయం రామయ్యకు తెలియదు అంత బాగా నిద్ర పట్టింది. కావాలనే ఆలస్యంగా లేచిన రామయ్యకి టెంపరేచర్ చూసిన శరత్ కళ్ళలో వెలుగు కనిపించింది.
నేను రిపోర్టులు తీసుకుని డాక్టర్ గారికి చూపించుకుని వస్తాను అటు స్కానింగ్ సెంటర్ కి బయలుదేరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి రిపోర్టు చూపిస్తే ఏమీ లేవండి !అన్ని నార్మలే !అoటు డాక్టర్ గారు చెప్పిన మాటలకి హాయిగా ఊపిరి పీల్చుకుని ఇంటికి వచ్చి రామయ్యకి విషయం చెప్పాడు. "ఒరేయ్ శరత్ నిన్న ఖర్చు ఎంత అయింది రా ?అని అడిగిన తండ్రి మాటలకి ఆరు వేలు వరకు అయింది నాన్న కొడుకు చెప్పిన మాటలకి రామయ్యకి ఒళ్ళు మండిపోయింది.
చూడు శరత్ ఒక మాట చెప్తాను విను వృద్ధాప్యo అనేది జీవితంలో ఆఖరి దశ. ఈ దశలో శరీరంలో ఉన్న అన్ని అవయవాలు శక్తి కోల్పోతాయి. ముసలి వాళ్లు గట్టిగా ఎండలు కాసిన చలివేసిన వానలు కురిసిన శరీరం తట్టుకోలేదు. అంతేగా కాకుండా అందరికీ సాధారణంగా బీపీ షుగరు గుండె జబ్బులు మూత్రపిండా వ్యాధులు ఉంటాయి. వీటికి తోడు ఎవరో అదృష్టవంతులకు తప్పితే రోజు ఏదో ఒక సమస్య అందరికీ వస్తూనే ఉంటుంది. ఈరోజుల్లో మీలాంటి కుర్రవాళ్ళు కంగారు పడిపోయి మీరు మా మీద ఉన్న అభిమానం కొద్ది ప్రేమ కొద్ది హాస్పిటల్ చుట్టూ మమ్మల్ని వేసుకుని తిరుగుతున్నారు
హాస్పటల్లో గంటల తరబడి వేచి ఉండే శక్తి సహనం మాకు ఉండవు. దానికి తోడు ఏ హాస్పిటల్ చూసినా మెట్లు ఎక్కి వెళ్లాలి. కాళ్లు సహకరించవు. లేదంటే వీల్ చైర్ లో వెళ్లాలి. కొన్నిచోట్ల వీల్ చైర్ వెళ్లడానికి సరైన మార్గం ఉండదు. అప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది.
దానికి తోడు ఏ ఆసుపత్రికి వెళ్ళినా చాలామంది రోగులు ఉంటారు మనలాగే. ఒక రోజంతా అక్కడే గడిచిపోతుంది. మీలాంటి కుర్రవాళ్ళు మా గురించి సెలవులు పెట్టుకోవాలి. మళ్లీ స్కానింగ్ లు టెస్ట్ లు అంటూ ఆ స్కానింగ్ సెంటర్లు చుట్టూ తిరిగే ఓపిక పెద్దవాళ్లకు ఉండదు. ఇప్పుడు మా శరీర భాగాలన్నీ అరిగిపోయి ఉంటాయి. అవి పెట్టే చిన్న చిన్న బాధలు మేము తట్టుకుంటూ దైవనామస్మరణలో కాలక్షేపం చేయాలి. ఎన్ని పెద్ద డిగ్రీలు ఉన్న డాక్టర్ అయినా సరే మమ్మల్ని మళ్లీ మీలాగా చేయలేరు. అంటే యువకులు లాగా చేయలేరు. పైగా డాక్టర్ గారు రాసి ఇచ్చిన అన్ని మందులు ఇంజక్షన్లు శరీరానికి సరిపడవు. ఇంజక్షన్ చేయించుకునే శక్తి కూడా శరీరానికి ఉండదు.ఆ మందులు మూలంగా కూడా లేనిపోని బాధలు. ఈ వయసులో కూడా ఎక్కువ మందులు వాడకూడదు.బాగా శరీరం సహకరించకపోతే తప్పితే ప్రతిరోజు ఆస్పత్రి, డాక్టర్లు అంటూ తిరగకూడదు. ఇంకొక విషయం చెప్తున్నాను విను రేపొద్దున్న ఆరోగ్య పరిస్థితి ఇంకా క్షీణిస్తే నువ్వు ఆసుపత్రిలో నన్ను పెట్టకు. అక్కడకు వెళ్లిన తర్వాత ఐసీయూ లో పెడతారు. వైద్యశాస్త్రం ప్రకారము వాళ్లు ప్రాణం పోయే వరకు వైద్యం చేస్తూనే ఉంటారు.
అది భరించే శక్తి గాని ఓపిక గాని నాకు ఉండదు. ఆ సమయంలో అందరూ రకరకాలుగా సలహా చెప్తారు .
రకరకాల మాటలు మాట్లాడతారు. తండ్రిని హాస్పటల్ కూడా తీసుకెళ్లలేదు అంటూ రకరకాలుగా చెప్పుకుంటారు. నీ తండ్రి నువ్వు ఎలా చూసావు ?అన్నది నీకు తెలుసు
. ముసలి వయసులో మేము కోరుకునేది ప్రేమ ,అభిమానం. మంచి మాట ,వేళకి బలమైన ఆహారం. మామూలుగా వయసులో వచ్చే వ్యాధులకి వాడే మందులు చాలు. అంతేగాని కనబడిన ప్రతి ఆసుపత్రికి శరీరంలో ప్రతి అవయవానికి వైద్యం కోసం పరుగులు పెట్టడం నాకు ఇష్టం లేదు.
నాకు ఇంట్లో ఉంటేనే ఆనందంగా ఉంటుంది. నేను కట్టుకున్న ఇల్లు. నాకు ఇదే హాయి. పైగా నేను బ్రతికినంత కాలం నీ దగ్గరే హాయిగా ఉండాలన్నదే నా కోరిక. నాకున్న వ్యాధులకి సామాన్య వైద్యం చేయించుకుంటూ కాలక్షేపం చేస్తాను. అంతేగాని ఆ కార్పొరేట్ ఆసుపత్రులు డాక్టర్లు వైద్యం నాకొద్దు !అంటూ చెప్పాడు రామయ్య. అది అనుభవం ఉన్న తండ్రి చెప్పిన మాటలలో నిజం లేకపోలేదు అనిపించింది శరత్ కి.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
Interesting perspective but may not be applicable to all situations and people. Discretion should be applied.
రిప్లయితొలగించండి