మానవత్వం
మానవత్వం
రచన : మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
" ఏమండీ మన సుజాత పిల్లలనీ మనం తెచ్చుకుని పెంచుకుందామా! అంటూ ఆప్యాయంగా అడిగింది భర్త రాజారావుని భార్య రాధిక. మనకు పెళ్లయ్యి మూడు ఏళ్లు అయింది కదా! రేపు మాపో మనకు కూడా పిల్లలు పుడతారు. మనకి కూడా పిల్లలు పుడితే రేపొద్దున ఈ పిల్లలందరినీ కలిపి పెంచి పెద్ద చేయగలమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు రాజారావు భార్యతో. భర్త సందేహం కూడా నిజమే అనిపించింది రాధిక కి. ఏం చేయాలి ? పాపం పసివాళ్లను చూస్తే జాలేస్తుంది.
సుజాత పోయిన దగ్గర నుంచి భర్త కూడా వాళ్ళని పట్టించుకోవడం మానేశాడు. సుజాత బతికున్నప్పుడు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేది. అంత చిన్న వయసులోనూ క్యాన్సర్ తోటి పోవడం ఏంటి ఈ పిల్లల కర్మ ఇలా కాలిపోవడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అనుకున్నారు భార్యాభర్తలు . అలా భార్యాభర్తలిద్దరికీ చాలాసేపు ఆ రాత్రి నిద్ర పట్టలేదు.
సుజాత రాజారావుకి ఒక్కగా నొక్క చెల్లెలు. భర్త రామ్ గోపాల్ తో ఇద్దరు పిల్లలతో హైదరాబాదులో చక్కగా కాపురం చేసుకుంటూ ఉండేది. ఆడపిల్లకి ఐదు సంవత్సరాలు వచ్చే యి.
మూడు సంవత్సరాలు వాడు మగపిల్లాడు. ఈమధ్య సుజాత కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి బ్లడ్ కాన్సర్ అని చెప్పారు. క్యాన్సర్ అని తెలిసిన వారం రోజుల్లోనే సుజాత చనిపోయింది. పిల్లలిద్దరూ దిక్కులేని వాళ్ళు అయిపోయారు పాపం. సుజాత అత్తగారు కూడా చాలా పెద్ద ఆవి డ.
సుజాత భర్త కూడా చిన్న వయసులో ఉన్నాడు. రేపు మాపో పెళ్లి చేస్తాను అంటారు మళ్లీ ఆ వచ్చిన ఆవిడ కూడా పిల్లల్ని సరిగా చూస్తుందో లేదో. అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఎలాగా? అనుకొని సుజాత కర్మ కాండ్లన్నీ పూర్తయిన తర్వాత వెళ్ళిపోతూ బావగారు పిల్లలు మేము తీసుకెళ్తాము అంటూ రాజారావు రాధిక చెప్పారు.' ఇవాళ తీసుకెళ్తారు బాగానే ఉంది కానీ మీరు జీవితాంతం చూడలేరు కదా అంటూ రాజారావు గారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు
సుజాత భర్త రామ్ గోపాల్. బావగారు మాటల్లోనీ శ్లా ష అర్థం కాలేదు రాజారావుకి. కానీ రాధిక కి అర్థం అయింది. ఆ మాటల్లోని అంతరార్థం . అంటే పిల్లలని శాశ్వతంగా తీసుకొని వెళ్ళిపొమ్మని అర్థం అన్నమాట.
'ఏది ఏమైనా తల్లి బ్రతికి ఉన్నంతకాలమే పిల్లలకి తండ్రి కి బంధం గట్టిగా ఉంటుంది. తల్లి పిల్లలకి తండ్రికి మధ్య వారధి లాంటిది. ఒక్కసారి తల్లి లోకం నుంచి వెళ్ళిపోతే ఆ పిల్లలకు తండ్రికి మధ్య మధ్య లింకు తెగిపోతుంది. అలా అనుకుంటూ ఎలాగైనా సరే భర్తని ఒప్పించి సుజాత పిల్లల్ని పెంచుకోవాలని సంకల్పించుకుంది రాధిక. రాధిక పడుకున్న, కూర్చున్నా, లేచిన ఇదే ఆలోచనలు.. ఎంతసేపు ఆ పసివాళ్ళ దీనంగా ఉన్న మొహాలు గుర్తుకొస్తున్నాయి.
సుజాత పోయిన రోజులలో పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్లకుండా రాధిక దగ్గరే మెడ గట్టిగా పట్టుకుని నిద్రపోయేవారు. మధ్య మధ్యలో ఉలిక్కిపడి లేచి ఏడుపు ప్రారంభించే వారు. రాధిక వెంటనే దగ్గరకు తీసుకునేది.ఆ సమయంలో తల్లి గురించి ఏడుస్తుంటే ఓదార్చే వాళ్ళు ఎవరు కనపడ లేదు. రామ్ గోపాల్ కి తల్లి తప్పితే ఎవరు చుట్టాలు లేరు.
అంత వయసున్న తల్లి ఈ చంటి పిల్లను ఎలా పెంచగలదు. ఎత్తుకుని ముద్దాడ గలదా! వేళకి ఇంత అన్నం బుజ్జగించి పెట్టగలదా! ఏమిటో పాపం ఈ పిల్లలు దురదృష్టవంతులు.
ఒకరోజు రాత్రి భర్తతో " ఏవండీ నా మనసేం బాగాలేదు. ఒక పది రోజులు మా పుట్టింటికి వెళ్లి వస్తాను. రెస్ట్ తీసుకుని వస్తాను. సుజాత పోయిన దగ్గర నుంచి నాకు భయం పట్టుకుంది. తరచుగా కడుపునొప్పి, కాళ్లు లాగుతున్నాయి.
కడుపు నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా క్యాన్సర్ ఏమోయినని భయం పట్టుకుంది. ఒకసారి అక్కడ మా ఫ్యామిలీ డాక్టర్ గారు కూడా చూపించుకుని వస్తానంటూ చెప్పింది రాధిక. రాధిక పుట్టింటి వారి ఊరు సుజాత భర్త ఉండే ఊరు. పక్కపక్క ఊళ్లే. అందుకే అలాగే ఆ పసి గుడ్డులను కూడా ఒకసారి చూసి వస్తానండి. అప్పుడే నెల రోజులు అయిపోయింది. వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో? . అని భర్తకు చెప్పింది రాధిక.
ఎందుకంటే సుజాత, రాధిక ఇద్దరు చిన్నప్పటినుంచి బాల్య స్నేహితులు. సుజాత బతికున్న రోజుల్లో రాధిక ఆ ఊరు తరచుగా వెళ్లి వస్తుండే ది. ఇద్దరూ వీలున్నప్పుడల్లా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా స్నేహం కంటిన్యూ అవుతూ వచ్చింది. పైగా ఆడపడుచు కూడా. అందుకే సుజాత మరణం రాధిక తట్టుకోలేకపోయింది.
మర్నాడు ఉదయమే రాధిక పుట్టింటికి బయలుదేరింది. ఇంటిదగ్గర ఆటో దిగగానే తల్లి ఎదురొచ్చి ఏమిటే తల్లి అంత చిక్కు పోయావు? నీ ఫ్రెండ్ గురించి బెంగ పెట్టుకున్నావా! అంటూ అడిగేసరికి ఎక్కడలేని దుఃఖం పొంగు కొచ్చింది రాధికకి. తల్లి అందించిన గ్లాసుడు మంచినీళ్లు తాగేసి తన మనసులోని విషయం చెప్పింది రాధిక తల్లికి. నువ్వు చెప్పింది బాగానే ఉంది రేపు నీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ల మీద అభిమానం తగ్గిపోతుంది.
అప్పుడు ఏం చేస్తావు ?. పైగా మీ ఆయన చిన్న ఉద్యోగస్తుడు. ఇంత బాధ్యత అతని నెత్తి మీద పెట్టడం ఎంతవరకు సబబు ఆలోచించు అంటూ తల్లి చెప్పుకుంటూ వచ్చింది. రాధిక తల్లి మాటలు కూడా రాజారావు మాటలు లాగే ఉన్నాయి.
ఎవరూ ఒక మంచి పని చేయడానికి సపోర్ట్ చేయటం లేదు. అనుకుని మనసులో బాధపడుతూ, భయపడుతూ ఆ రాత్రి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.
మరునాడు ఉదయమే లేచి స్నానం చేసి టిఫిన్ తిని సుజాత ఊరికి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి బయలుదేరి మధ్యలో రాధిక వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ని కలిసింది. పెళ్లయి మూడు సంవత్సరాలైనా ఇంతవరకు డాక్టర్ గారికి ఎప్పుడు చూపించుకోలేదు రాధిక.
గర్భసంచిలో ఉన్న సమస్య కారణంగా గర్భసంచి తీసేయాలని ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేద ని చెప్పింది డాక్టర్. డాక్టర్లు చెప్పిన మాటలకి ఒక్కసారిగా షాక్ అయింది రాధిక.
అట్నుంచి అటు సుజాత ఇంటికి వెళ్ళింది. సుజాత ఇంటికి వెళ్ళేటప్పటికి హాల్లో పిల్లలు ఇద్దరు కనబడ్డారు ఒంటి మీద బట్టలు లేకుండా. పిల్లలు ఇద్దరు నీరసపడిపోయి ఉన్నారు. చేతిలో అన్నం గిన్నెతో కూడా పరిగెట్టుకుంటూ వస్తోంది సుజాత అత్తగారు. రాధికను చూడగానే బోరున ఏడ్చింది. "చూడమ్మా ఈ వయసులో నాకు దేవుడు వేసిన శిక్ష. పిల్లలిద్దరూ అమ్మ కావాలని రోజు ఏడుపు. నేను సముదాయించలేను. వాడు మన లోకంలో ఉండటం లేదు.
పిల్లలకి స్నానం చేయించడం, అన్నం పెట్టడం ,ఈ వయసులో వాడికి అన్నం వండి పెట్టడం చాలా కష్టంగా ఉంది. మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పే ధైర్యం నాకైతే లేదు.
మహాలక్ష్మి లాంటి పిల్ల సుజాత. వెళ్ళిపోయిన తర్వాత కొంప అంతా చీకటి అయిపోయింది అంటూ ఆవిడ చెప్తున్న మాటలు విని రాధిక ఒక్కసారి ఏడుపు ముంచుకొచ్చి తమాయించుకుని ఆవిడ చేతిలోంచి అన్నం గిన్నె తీసుకుని పిల్లలిని బుజ్జగించి లాలించి అన్నం తినిపించి పడుకోబెట్టింది.
ఇంతలో సుజాత భర్త బయటనుంచి వచ్చాడు. బాగా నీరసపడిపోయి ఉన్నాడు. కళ్ళు పీక్కుపోయి గడ్డం పెరిగిపోయి తల మాసిపోయి ఏదో పిచ్చివాడిలా ఉన్నాడు. ఎప్పుడొచ్చావ్! అని కూడా పలకరించలేదు. రాధిక సుజాత భర్త దగ్గరికి వెళ్లి బాగున్నారా! అన్నయ్యగారు అంటూ పలకరించింది. ఒక వెర్రి నవ్వు నవ్వేడు తప్పితే సమాధానం లేదు.
ఆ ఒక్క మనిషి లేకపోవడం వల్ల అందరి జీవితాలు ఇలా అయిపోయాయి అనుకుంటూ సుజాత భర్తని, సుజాత అత్త గారిని కూర్చోబెట్టి తన మనసులో ఉన్న మాట ధైర్యంగా చెప్పేసింది. 'అన్నయ్య గారు పిల్లల పెద్దయిన తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పిల్లలు తీసుకు వెళ్ళచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. ఇది కేవలం నా స్నేహితురాలు, నా ఆడపడుచు పిల్లలని గాలికి వదిలేయలేక ఈ నిర్ణయం తీసుకున్నాను.
'మన మధ్య మాట తప్పితే చట్టపరంగా ఎప్పటికీ వాళ్ళు మీ పిల్లలే అంటూ చెప్పిన రాధిక మాటల కి సుజాత భర్త కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఇంతవరకు పిల్లల్ని ఎంతోమంది దత్తత తీసుకుందామని ముందుకు వచ్చారు.
కానీ నీ పద్ధతి అందుకు భిన్నంగా ఉంది అంటూ చెప్పాడు సుజాత భర్త. పిల్లల మీద కన్న ప్రేమ ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని పెంచలేక సుజాత భర్త సరేనని తల ఊపే డు. ఈ వయసులో బాధ్యత మోయలేక సుజాత అత్తగారు కూడా అడగగానే ఒప్పేసుకుంది. పిల్లలిద్దరినీ బట్టలు ,మందులు తీసుకుని ఆటోలో పుట్టింటికి వచ్చేసింది రాధిక.
పుట్టింటికి వచ్చిన వెంటనే గుమ్మం లోంచి తల్లి తిట్టడం ప్రారంభించింది. అయినా వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు రాధిక. మధ్యాహ్నం భోజనం చేసి పిల్లల్ని సామాను తీసుకుని సాయంకాలం బస్సు ఎక్కి తన ఇంటికి వెళ్లిపోయింది.
సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన తర్వాత రాజారావు హాల్లో ఆడుకుంటున్న పిల్లలిద్దరిని చూసి మౌనంగా ఉండి పోయాడు. తిడతాడని భయపడిన రాధిక రాత్రి పడక గదిలో తమ ఇద్దరి మధ్య పిల్లలు పడుకోబెట్టుకుని వాళ్ళిద్దరి తలనిమురుతూ వీళ్లను తీసుకొచ్చేసాను కదా కోపం వచ్చిందా! అంటూ ప్రేమగా అడిగింది.
నాకు కోపం ఏమీ లేదు. వీళ్ళు నీకంటే నాకే బంధుత్వం ఎక్కువ కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్లావు కదా !ఏమన్నారు అంటూ ప్రశ్నించాడు భార్యని రాజారావు. జరిగిన విషయం అంత పూస గుచ్చినట్లుగా చెప్పింది రాధిక.
పోనీలే ఏది ఏమైనా వీళ్లు మనకి దేవుడిచ్చిన బిడ్డలు. నాలుగు రోజులు స్థిమిత పడిన తర్వాత ఆపరేషన్ చేయించుకుందువు గాని అన్నిటికన్నా ఆరోగ్యం ముఖ్యం అంటూ ఎంతో ప్రేమగా భార్యను దగ్గరకు తీసుకున్నాడు రాజారావు. అయితే ఏ పనైనా సరే రాధిక తలుచుకుంటే అది చేసి తీరుతుందని రాజారావుకి బాగా తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా భార్య ఊళ్లో లేని సమయంలో తను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న విషయం రాధిక కి చెప్పలేదు.
ఎంత మంచి ఆశయం రాధిక ది. ఇలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకరు ఉంటారు అనుకున్నాడు రాజారావు. ఆ తర్వాత కొద్ది రోజులకి సుజాత అత్తగారు చనిపోయారు. సుజాత భర్త రాంగోపాల్ ఎవరినో పెళ్లి చేసుకుని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. పిల్లలు ఇద్దరినీ తన కన్న పిల్లల్లా పెంచుతూ ఆనందంగా జీవితం గడుపుతూ వచ్చారు రాధిక రాజారావు.
*******************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి