వేసవి వచ్చిందంటే

వేసవి వచ్చిందంటే

ఆ పూర్వీకుల పుణ్యమా అని ఇంటి వెనుక మామిడి తోటల్లో కాయ కోసుకుని ఆవకాయ పెట్టుకోవడం ఒకప్పుడు మా తల్లిదండ్రుల అదృష్టం. కాలం మారిపోయింది. ఒకప్పుడు కాకినాడ చుట్టూ ఉండే మామిడి తోటలు క్రమేపీ మాయమైపోయి ఆవకాయ కాయ కరువయ్యింది. 
బజార్లో బోల్డ్ కాయలు దొరుకుతాయి. వాటి పరిస్థితి అందరికీ తెలిసిందే. తోటల మధ్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ లో ఆవకాయ కాయ ప్రతి ఏటా కాపు తగ్గిపో తోంది.నాణ్యమైన కాయ లేదనే చెప్పచ్చు.

 ఇంకేముంది రమణయ్యపేట మార్కెట్ మీద ఆధారపడి ఆవకాయ పెట్టడానికి శ్రీకారం చుట్టాము. ఖరీదు జాస్తి.నాణ్యం నాస్తి అన్నట్టుంది కాయ పరిస్థితి. ఏదో పరిస్థితికి సర్దుకుని కాలానికి తలవగ్గి ఇంటికి చేర్చాము.

ఎవరింట్లో అయినా ఆవకాయ కాయ తరగడానికి కత్తిపీట మీద పెద్ద వీరుడిలా కూర్చునే మా బాబాయి గుర్తుకొచ్చాడు. పక్క వీధిలో తడికలు తయారు చేసే ఈ బాబాయిని పిలిచి తగిన మూల్యం చెల్లించి కాయి జీవితాన్ని ముక్కలు చేసి జీడి తీసి శుభ్రంగా తుడిచి ఆరబెట్టాం. అక్కడినుంచి ఆవిడ డ్యూటీ మొదలైంది. ఆ అవకాయిల ముందు ఈ ఆవకాయలు ఎంత వందల కొలది మామిడికాయలతో ఊరగాయలు పెట్టేవారు. దేవుడి ఇంట్లో చెక్క బల్ల ఊరగాయ కుండలతో నిండి పోయేది. ఆ గది ఒక నిషిద్ధ ప్రదేశం. ఒకసారి వెనక్కి వెళ్ళిపోదాం.

 వేసవికాలం ఎండలు ముదిరేసరికల్ల ఊరగాయలు హడావుడి మొదయ్యేది . ఎండాకాలం వచ్చేటప్పటికల్లా ఆడవాళ్ళకి ఈ ఊరగాయలు పెద్ద పని. ఏ కూర లేకపోతే ఆ రోజు సాయంకాలం పూట ఊరగాయ తోటి సరిపెట్టుకునేవారు. దానికి తోడు ఎవరో ఒకరు పాపం ఊరగాయ పెట్టండి అని అడుగుతూ ఉండేవారు. అది ఆ కాలం.

ఈ రోజుల్లో ఊరగాయ తింటే రోగమంటున్నారు గానీ ఆ రోజుల్లో తప్పనిసరిగా మన తెలుగు కుటుంబాల్లో ఊరగాయ లేకపోతే ముద్ద దిగేది కాదు. కంచల్లో పంచభక్ష పరమాన్నాలు ఉన్న ఆవకాయ లేకపోతే చిన్నబోయేది. అందులో రకరకాల ఆవకాయలు. ఈ ఆవకాయ పెట్టడం కూడా ఒక అద్భుతమైన కళ.ఎవరు చెయ్యి పట్టుకుని నేర్పిన విద్య కాదు. అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నది. అనుభవం కొద్దీ నేర్చుకున్నది.
 ఆ రోజుల్లో అదొక దీక్ష. ప్రతిదీ వ్రతం పట్టినట్లు శాస్త్రోక్తం గా చేసేవారు. వారం రోజులు ముందు నుంచి ఎండు మిరపకాయలు ఆవాలు ఉప్పు తెచ్చుకుని ఎండలో పెట్టుకోవడం ఇది ఒక పెద్ద పని. 

తర్వాత ఒక శుభముహూర్తంలో మధ్యాహ్నం పూట కారాలు రోకటిలో వేసే దంచే పని. ఈ పనికి ప్రత్యేకమైన వారు ఉండేవారు. మండే ఎండ వేళ ఆ రోకటి పోటుల శబ్దం . ఆ దంపుడు పనివాళ్ళు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ కళ్ళు వెంట ముక్కు వెంట నీళ్లు కారుతుంటే ఏదో పాపం వాళ్ల వృత్తి అటువంటిది. రోకటిలో దంచిన కారంపొడి ,రోటిలో రుబ్బిన పచ్చడి రుచి చాలా బాగుంటుంది. అలా దంచిన కారంపొడిని చక్కగా జల్లెడపెట్టి తర్వాత ఆవపిండిని ఉప్పును విడివిడిగా దంచి కాస్త చల్లని మజ్జిగతో దాహం తీర్చుకుని వెళ్లిపోయేవారు. కానీ ఇంటి లోపల కూర్చున్న వాళ్లకి ముక్కు ,కళ్ళు మండిపోయేవి.

సరే ప్రధాన ముడి సరుకులు రెడీ అయిపోయాయి. ఇక్కడ నుంచి మా బాబాయ్ గారు మా పిన్నిగారు మా అమ్మగారు మరియు పిల్లల పని మొదలయ్యేది. మా చిన్నతనాల్లో మేము బజార్లో కాయలు కొన్న పాపాన్ని ఎప్పుడు పోలేదు. అన్నీ పూర్వీకులు వేసిన ఆ చెట్లవే. అదొక సరదా. ఆ తోట అంటే ఒక సరదా. ఎండ లేదు కొండా లేదు తోటలోకి పరిగెత్తుకుని వెళ్లేవాళ్ళ o. 

చేతికందిన మామిడికాయ కోసుకుని ఉప్పు కారం నంచుకుని తినేవాళ్ళం. ఆ అనుభూతి వేరు. ఈ కాలం పిల్లలకి ఆ అనుభూతి ఎక్కడ వస్తుంది. కారాలన్నీ రెడీగా ఉన్నాయి ఇక మీదే ఆలస్యం అంటూ అమ్మ చూసిన చూపులకి నాన్న, బాబాయ్, పిల్లలం, పాలేరు అందరూ ఒక పెద్ద సైన్యం లాగా చిక్కం గడ పట్టుకుని తోటలోకి పరిగెత్తి చిటారు కొమ్మునున్న మిఠాయి పొట్లం కోసి ఇంటికి తీసుకొచ్చి ఇత్తడి గుండిగలో నానబెట్టి శుభ్రంగా తుడిచి ఈ లోగా మా బాబాయి గారు పెద్ద కత్తిపీట మీద కూర్చుని నిర్ధాక్షిణ్యంగా కాయని ముక్కలు ముక్కలుగా నరికి కింద పడేస్తే జీడి తీసి తుడిచే వాళ్ళం పిల్లలందరూ. అక్కడి నుంచి మా పిన్ని మా అమ్మగారు వాళ్ళవే కష్టాలన్నీ. పాపం ఎంత ఊరగాయ పెట్టేవారో. రకరకాలు. ఆ పేర్లు కూడా ఇప్పుడు తెలియదు చాలామందికి. అద్భుతమైన రుచి. అంత ఓపికమంతులు వాళ్ళు. ఇంచుమించుగా ఆవకాయలు పేరు చెప్పి పదిహేను రోజులు పాటు శ్రమలు పడేవారు. ఆ మండువేసవకాలంలో. 

ప్రతి ఏడాది ఆవకాయలు పెట్టినప్పుడల్లా ఆ కాలాన్ని అప్పటి మనుషుల్ని ఆ తోటల్ని తలుచుకోకుండా ఉండలేం. ఇప్పుడు అన్ని ఒక రోజులో అయిపోతున్నాయి. మూడో రోజుకి రుచి కూడా. ఏదో ఒక పెద్ద పని అయిపోయింది. రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్న నాకు ఒక రోజు కాలక్షేపం దొరికింది. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం