హరి విల్లు
హరివిల్లు
ఆకాశంలో హరివిల్లు చూడాలంటే
వర్షఋతువు రావాల్సిందే
ఆ పల్లెకి ఋతువులతో పనిలేదు.
ఏ ఋతువులోనైనా నేలతల్లి
ఒడినిండా హరివిల్లులే.
మండు వేసవిలో నిండు పున్నమిలా
నేల తల్లి ఒడిలో మల్లెల పవళింపు
పిండి వెన్నెల ఆరబోసినట్టు ఉంటుంది
మండే ఎండకు చల్లని తోడు ఆ మల్లె
ఏ కళ్యాణమైనా ముఖ్య అతిధి ఆ సిరిమల్లె.
ఆకాశంలోని నక్షత్రాలులా అరుగులన్నీ ఆక్రమిస్తాయి
నిండు పున్నమిలా నవ్వుతూ పలకరిస్తాయి.
పదిమందికి కడుపునిండా బువ్వ తినిపిస్తాయి.
పెళ్లికూతురు జడగా మారి సిగ్గు వలకబోస్తాయి.
హిమమంతా పచ్చని పైరు మీద కురిపించి
హేమంతం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.
ముద్దబంతి పువ్వులను పూయిస్తుంది.
గుండె మండుతున్నా బంతి మాలలో ఒదిగి
స్వాములు అందరికీ అలంకరణ తెస్తుంది
నల్లటి నేల తల్లి ఒడిలో ఉదయిస్తున్న
సూర్యుడిలా మెరిసిపోతోంది కనకాంబరం.
కన్నెపిల్ల మదిని దోచి జడను ఆక్రమించుకుంటుంది.
బంతికి చామంతికి ఎప్పుడూ పోటీయే.
బంతి పూజకు పనికిరాని పువ్వు.
చామంతికి అందుకే కాస్త గర్వం ఎక్కువ.
చామంతి చేరని చోటు లేదు.
జడలోను మెడలోను దేవుడి గుడిలో ను
ఆఖరికి గుమ్మాల మెడలో హారమై
కనువిందు చేస్తుంది.
కొత్త కాంతి తెస్తుంది.
గుమ్మాల అలంకరణలో బంతికి కూడాచోటిస్తుంది
ఆ పల్లె పచ్చటి నేల తల్లికి
గోదారమ్మ నీళ్ళు తాగించి
గోవుల నుంచి కాపాడి
కనకాలమ్మ ఆశీస్సులతో కనకం కురిపించి
హనుమయ్య అభయహస్తంతో రైతన్నలకు భయం తొలగించి
మూడు పువ్వులు ఆరు కాయలు పూయించి
పొద్దు వాలే సూరీడులా గోదారమ్మకు
పడమర దిక్కుగా పూల జడలు కుట్టించి
వేదం నాదం భూపాల రాగంగా పలికించి
అందంగా తెలుగు తల్లి ఒడిలో వెలుగుతోంది ఆ పల్లె
అనాదిగా అందరితోటి బంధాలు కలుపుకుంది ఆ తల్లి.
ఆ పల్లె రేపల్లె కాదు
పూల పల్లె.
కాసులతో మెరిసిపోయే కాకరపర్రు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి