పేరు
వాడు ఎవరు? సమాధానం ఏం చెబుతాము? వాళ్ల అమ్మా నాన్నల పేరు చెప్పి “వాళ్ల కొడుకు” అంటాము. అక్క పేరు చెప్పి “దాని తమ్ముడు” అంటాము. నిన్న మొన్నటి వరకు అమ్మ కడుపులో విహారం చేసి భూమ్మీదకి వచ్చి మూడు నెలలు అయింది. ఇవాళ్టి నుంచి వాడికో పేరు ఉంది. నిన్నటి వరకు ఏదో నోటికి వచ్చిన ముద్దుపేరుతో వాడిని పిలిచేవాళ్లం. ఇప్పుడు ఆ బాధ లేదు. పేరు పెట్టుకున్నాడు కాబట్టి సర్కారు వారు గుర్తింపు పత్రం కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ముద్దు పేరుతో పిలిస్తే వాళ్ల అమ్మ ఊరుకోదు.
ఎంతో కష్టపడి వాళ్ల అమ్మానాన్న ఈ పేరు నిర్ణయించారు. పేరు నిర్ణయించడానికి ఎన్నో ఆలోచించాలి. ఆకాశంలో మెరిసే తారలను, గతించిపోయిన తరాలను కలుపుకోవాలి. ఇలవేల్పులను, ఇష్టదైవాలను మర్చిపోకూడదు. చివరలో ఎవరు పెట్టని పేరు ఉండాలి. అవి కదా నిబంధనలు! ఈ నిబంధనల చట్రంలో గిరగిరా ఎన్నో రాత్రులు తిరిగి అలసిపోయి, ఒక పేరుకు ఓట్లు వేసి, ఆ పేరు మనసులో మననం చేసుకుంటూ ఆ శుభముహూర్తం కోసం ఎదురు చూశారు వాడి తల్లిదండ్రులు.
పేపర్ ఎక్కడా లీక్ అవ్వలేదు. అంత పగడ్బందీగా పబ్లిక్ పరీక్షల్లాగా ఏర్పాట్లు చేసుకున్నారు. అవును, పేపర్ లీక్ అయితే మజా ఏముంటుంది! పెళ్లి చూపుల్లో వధూవరులు ఒకరిని ఒకరు చూసుకున్నా, వేదిక మీద సుముహూర్తం సమయానికి కలుసుకున్న కళ్లే జీవితాంతం కట్టిపడేస్తాయి. అలాగే పెద్దలు నిర్ణయించిన సమయానికి ఆ పని చేయడం ఆచారం.
అయితే వాడి కోసం చేస్తున్న ఈ శుభకార్యానికి బంధువులు, స్నేహితులు అందరూ అందంగా తయారై వచ్చారు. వాడికి ఏం తెలియదు. అయినా అమ్మ ఒడిలో బుల్లి పట్టు పంచతో, ఎర్రటి చొక్కాతో అందంగా పడుకుని ఆ లోకంలో ఉన్నాడు. అబ్బా! ఎంత శ్రమ పెట్టారు వాడ్ని! గడియారంలో తేదీ మారిందో లేదో, అమ్మమ్మ తలస్నానం చేయించేసింది. కారులో కళ్యాణ మండపానికి తీసుకొచ్చేసింది. బుగ్గన చుక్క, నుదుటున అగరబొట్టు, కాళ్లకు వెండి కడియాలు—అబ్బో! ఆకాశంలో చందమామ అమ్మ ఒడిలోకి వచ్చిందని కొందరు, బుల్లి ఆంజనేయస్వామి అని కొందరు ముద్దు పెట్టుకున్నారు.
నా సంగతి, అమ్మ సంగతి తెలుసు. అందుకే తాత సౌకర్యవంతమైన బస సమకూర్చాడు కళ్యాణ మండపంలో. ఎవరైనా నిద్రపోనిస్తేనే కదా!
“పేరులో ఏముంది పెన్నిధి?” అని తీసిపారేస్తారు. పెన్నిధి అంటే సంపద అని అర్థం. సంపద అంటే ధనం ఒక్కటే కాదు; జ్ఞానం, గుణం, ప్రేమ వంటి విలువలు కూడా.
పేరు అనేది మనిషి జీవితానికి మొదటి గుర్తింపు. “నీవు ఎవరు?” అనే ప్రశ్నకు సమాధానం మన పేరు. నామకరణం శాస్త్రోక్తమైన సంస్కారం. అందుకే మనం దేవతల పేర్లు, మహనీయుల పేర్లు, సద్గుణాలను సూచించే పేర్లు పెట్టుకుంటాం.
పినతల్లి కోరిక ప్రకారం అరణ్యవాసం చేశాడు శ్రీరాముడు. ధర్మం నిలబెట్టిన వాడిగా రామచంద్ర మూర్తి పేరు మనకు టక్కున గుర్తుకొస్తుంది. శ్రీరామచంద్రమూర్తి చేసిన త్యాగం వలన అతని పేరు శాశ్వతంగా నిలబడిపోయింది. అలాగే ఎంతోమంది వారు చేసిన మంచి పనుల వలన చరిత్రలో వారి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.
పేర్లు తల్లిదండ్రులు పెడతారు. ఆ పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం చేసే పనులు మంచిగా ఉండాలి. గోకులంలో అల్లరి చేసిన బాలుడు, తదుపరి ధర్మసంస్థాపకుడుగా శ్రీకృష్ణుడిగా ఎదిగిన పేరు అలాగే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
పేరు అనేది ఒక వారసత్వం. పాత తరాన్ని గుర్తు చేస్తుంది. తాతకి గర్వాన్ని పెంచుతుంది. పేరు అనేది పిలవడానికి మాత్రమే కాదు; పదిమందిలో తను ఒకడుగా నిలబడడానికి, పేరు నిలబెట్టడానికి కూడా.
చూశారా గమ్మత్తు! మంచి పనులు చేసిన వారి పేర్లే పెట్టుకుంటారు. కానీ చెడ్డవాడిగా చరిత్రలో నిలిచిపోయిన రావణాసురుడు, దుర్యోధనుడు, కంసుడు లాంటి వాళ్ల పేర్లు ఎవరు పెట్టుకోరు. పేరు అంటే కేవలం ఒక శబ్దం కాదు. మన ప్రవర్తన, మనం చేసే పనులు, విలువలు—ఆ పేరుకు అర్థం ఇస్తాయి.
చంటి బిడ్డని ఎత్తుకొని దారిన పోతున్న దానయ్యను కూడా “ఏం పేరు పెట్టారు?” అని అడగకుండా ఉండలేం. పేరు తెలుసుకోవడానికి అంత ఉబలాటం ప్రతి ఒక్కరికి.
సాధారణంగా నామకరణ మహోత్సవానికి బంధువులు, స్నేహితులు అతిథులుగా వస్తారు. మరి నక్షత్ర ప్రభావమేమో—ఈ బారసాలకు అగ్నిదేవుడు నవగ్రహాలను పిలుచుకు వచ్చి సంతృప్తి పరిచి పంపించేశాడు. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి ఆకాశం నుండి దిగివచ్చి ఆశీస్సులు ఇచ్చి ప్రసాదం మనకు మిగిల్చి వెళ్లిపోయాడు. పరమశివుడు అభిషేకాలతో సంతృప్తి చెంది వెళ్ళాడు.
ప్రముఖ కథారచయిత పాలగుమ్మి పద్మరాజు కథ బాగా పండిస్తారని మనకు తెలుసు. కానీ ఈ పాలగుమ్మి చలపతి గారు నలభీమపాకంలో దిట్ట అని ఇప్పుడే తెలుసుకున్నాం.
మల్లెపువ్వు లాంటి అన్నం, గుమ్మడిపువ్వు లాంటి పప్పు, కారుమబ్బు లాంటి వంకాయ కూర, ఆవపెట్టిన పనసపొట్టు కూర, కూర లాంటి దొండకాయ వేపుడు, తీపి–పులుపు సమపాళ్లలో కలిపిన గుమ్మడికాయ దప్పలం, తోపు తక్కువ తీపి ఎక్కువగా వేసిన పూర్ణంబూరె, ఏ మూల కొరికినా పాకం ప్రవాహమై పారే గజిబిజి జిలేబి, పైకి చూస్తే పసుపుపచ్చగా కళ్లకు ఇంపుగా ఉంటుంది—లోపలికి వేస్తే గాండ్రు పులిలా గర్జిస్తుంది అదేనండి పులిహోర! భోజనంలోకి జంటకవులు లేకపోతే ఎలాగా? అదేనండి కొరికితే చప్పుడు చేసే అప్పడం, వేయింపు ఎక్కువైతే ముఖం మార్చుకునే వడియం, చందమామ రంగులో మెరిసిపోయే పెరుగు వండి తన చేతి వంటకి నూటికి ఎనభై శాతం మార్కులు కొట్టేసాడు ఈ చలపతి.
అతిథులు కళ్లుతుడుచుకోకుండా నవ్వుముఖాలతో పీటల మీద నుంచి లేచి నోరు పండించుకున్నారు.
అన్నీ చెప్పేశారు—“బావుంది!”“ఇంతకీ నా పేరు ఏమిటో చెప్పుకో చూద్దాం?” అనగానే, వాళ్ల నాన్న వెండి పళ్లెంలో బియ్యం మీద రాస్తే, పురోహితులుగారు గట్టిగా చదివి పేపర్ లీక్ చేశారు.
ముందు పేరు — “వెంకట చలపతి లక్ష్మీ నరసింహ మణికంఠ స్కంద శ్రీ రామాంజనేయ” — లో దేవుళ్లందరూ అందంగా ఇమిడికూర్చున్నారు. ఆఖరి పేరు కూడా పరోక్షంగా దేవుడి పేర్లే అయినప్పటికీ, ఫ్యాషన్ పేరు “విరాజ్ వర్దిష్ణు” అందంగా కుదిరింది. ఇంతకీ వాడు ఎవరు? వాడు నా మనవడు. జరిగింది నామకరణ మహోత్సవం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి