మా ఊరి గణపతి

మా ఊరి గణపతి

వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకారేషు సర్వదా"

ఏ శుభకార్యం ప్రారంభించాలన్న గణపతి పూజ తోటే ప్రారంభం.
గణపతికి చేసే ప్రత్యేక పూజ కూడా గణపతి ప్రార్ధన తోటే ప్రారంభం. విఘ్నేశ్వరుడు అన్ని గణాలకు అధిపతి. విఘ్నాలను తొలగించేవాడు. అందుకనే ఆది పూజలు అందుకుంటున్నాడు. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుడు జన్మదినం. ఆ రోజున వినాయక చవితి పండగ చేసుకుంటాం. ఈ పూజ ప్రతి ఇంటిలో కార్యాలయంలో దుకాణాల సముదాయాల్లో గుడిలో ప్రతి వీధిలో ప్రతి వాడలో కూడా చేసుకునే పండుగ. పండగ వారం రోజులు ముందు నుంచే ఆ వీధిలో ఉండే వినాయక ఉత్సవ కమిటీ వారు వీధి వీధినా తిరిగి చందాలు వసూలు చేసి పందిళ్లు వేసి మైకులు పెట్టి ఉత్సవాలు అందంగా జరుపుతారు.

 మా స్వగ్రామమైన కాజులూరు మండలంలోని పల్లిపాలెం లో కూడా ప్రతి ఏటా ఈ ఉత్సవాలు జరుపుతారు. రెడ్డి సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్న మా గ్రామంలో ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో నాకు తెలియదు. ఈనాటి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా వినికిడి. ఆ రోజుల్లో వారం రోజులు ముందు నుంచి చవితి హడావుడి ప్రారంభం అయ్యేది. మా చిన్నతనంలో తొలిరోజు మధ్యాహ్నం స్కూల్ కి సెలవులు ఇచ్చేసేవారు. పత్రికోసుకోవడానికి పిల్లలందరూ తోటలు వెంబడి పరిగెత్తేవారు. పత్రి అంతా సేకరించి ఇక ఇంటిలో పాలవెల్లి అలంకరణ చేయడంలో బిజీబిజీగా ఉండేవాళ్ళo. అది ప్రతి ఇంటి కథ. ఇక వీధుల్లో జరిగే వినాయక ఉత్సవాలకు
 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువకులు ఎంతో ఉత్సాహంతో వీధి వీధి తిరిగి చందాలు ప్రోగు చేసి తాటాకు తోటి పందిళ్లు వేసి లౌడ్ స్పీకర్లు పెట్టి ముందుగా ఘంటసాల గారి నమో వెంకటేశా ప్రార్థన గీతంతో చవితి ముందు రోజు నుంచే హడావిడి ప్రారంభమయ్యేది. ఆ రోజుల్లో వచ్చిన కొత్త సినిమా పాటలు పాత సినిమా పాటలు ఎవరి అభిరుచి తగినట్టుగా వారు గ్రామ ఫోన్లో రికార్డులు వేయించుకుని లౌడ్ స్పీకర్ లో విని ఆనందించేవారు. ఆ వినాయకుని విగ్రహం ఎంతో అందంగా ఉండేది. ఆ రోజుల్లో ఆ విగ్రహాన్ని ఎక్కడ తయారు చేయించేవారు నాకైతే తెలియదు. చవితి రోజున మేళతాళా లతో బాణాసంచాలతో విగ్రహం పెట్టి పూజలు జరిపించి ప్రసాదాలు అందరికీ పంచిపెట్టేవారు. ఈ పూజలు ఉదయం సాయంకాలం కూడా తొమ్మిది రోజులు పాటు చేసేవారు. ఇక వినాయక చవితి రోజు సాయంకాలం పూట మా నాన్నగారు కీర్తిశేషులు మధునాపంతుల వెంకట చలపతిరావు గారు మరియు ఓలేటి సీతన్న గారితో కలిపి శమంతకమణి కథ మరియు శ్రీకృష్ణుడికి వచ్చిన నీలాపనిందకి సంబంధించిన భాగవత ఘట్టం మైక్ లో చదివి వినిపించే వారు. ఇది ప్రతి యేటా వినాయక చవితి రోజున మా ఊరిలో జరిగే ప్రత్యేక కార్యక్రమం. ఇంకా సాయంత్రం పూట పూజలతో పాటు ప్రసాదాలు కూడా పంచిపెట్టేవారు. ఇక రాత్రి గణపతి ఉత్సవాల్లో భాగంగా ఏదో ఒక వినోద కార్యక్రమం జరుగుతుండేది. హరి కథలు బుర్రకథలు నాటకాలు రికార్డింగ్ డాన్సులు మరియు ప్రొజెక్టర్ తో రోడ్డు మీద వేసే సినిమా రాత్రి 8
గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు సాగుతుండేది. రాత్రి జరగబోయే కార్యక్రమం గురించి మధ్యాహ్నం నుండే మైక్ లో అనౌన్స్మెంట్ జరిగేది. మా చిన్నతనంలో గోనె సంచి తీసుకుని ఆ స్టేజ్ కి దూరంగా ఉండే కోమటి కొట్టు దగ్గర రోడ్డుమీద గోనెసంచి వేసుకుని కూర్చుని సరదాగా కార్యక్రమం తిలకించేవాళ్ళం. మధ్యలో వర్షం వస్తే పరుగు పరుగున ఇంటికి వచ్చిన రోజులు ఇప్పటికి బాగా గుర్తు. ఈ వినాయకుని నిలబట్టే ఇల్లు మా అగ్రహారానికి దగ్గరగా ఉండేది. అందుకని ఆ రోజుల్లో ఆ కార్యక్రమాలను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మారుమూల 

గ్రామమైన మా ఊరిలో నా చిన్నతనంలో ఇది ఒక ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్. ఇక రికార్డింగ్ డాన్స్ లకి ఈలలో గోలలు అదొక రకమైన మానసిక ఆనందం.
అలా జరిగిన వినోద కార్యక్రమాల్లో నిట్టల బ్రదర్స్ వారి బుర్రకథ మరియు చింతామణి నాటకం నా చిన్నతనంలో చూడడం జరిగింది. ఈ రోజుల్లో పిల్లలకి నాటకం గురించి తెలియదు. అందులో ఉండే పద్యాల సంగతి తెలియదు. ఒక షణ్ముఖ ఆంజనేయరాజు గారి పద్యంగురించి తెలియదు. శ్రీకృష్ణ రాయబారం ఘట్టంలోని పద్యాలు ఆయన చదువుతుంటే ఆ లౌడ్ స్పీకర్ లో విని పొలంలో పనిచేసుకుంటున్న రైతు కూడా ఆనందించేవాడు. అక్షరజ్ఞానం లేకపోయినా పద్యం అంటే చెవి కోసుకునే వాళ్ళు లేకపోలేదు. ఇక కార్యక్రమాల మధ్యలో చదివింపులు కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమం చూసి ఆనందించి పదో పరకో మధ్యలో చదివించేవారు. చాలా వినోదాత్మకంగా ఉండేది. బుర్రకథల్లో మనకి తెలియని చారిత్రక గాథలు చిన్నతనంలో నేర్చుకోవడం జరిగింది. అలా అలా తొమ్మిది రోజులు పాటు ఉత్సవాలు జరిపి ఆఖరి రోజున గణేష్ మహారాజును ఊరంతా ఊరేగించి కాలువలో నిమజ్జనం చేసేవారు. భారీ ఎత్తున అన్న సమారాధన కూడా జరిగేది. ఇది మా ఊరి వినాయకుడి ఉత్సవం. . ఇప్పుడు ప్రత్యేకంగా వినాయకుడికి ఆలయం నిర్మించినట్లు తెలిసింది. ఆ రోజులే వేరు. ఆ అనుభవాలు వేరు . ఆ ఆప్యాయతలు వేరు. ఆ బాల్య స్మృతులు గుర్తు వచ్చినప్పుడల్లా చాలా ఆనందంగా ఉంటుంది. అక్షర రూపం ఇవ్వాలని ఉంటుంది. మనుషులు మాయం అయిపోతుంటారు. అక్షరం పది కాలాలు పాటు ఉంటుంది.
జై గణేష్ మహారాజ్ .

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
           కాకినాడ 9491792279.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం