శాస్త్రి గారి పాట
శాస్త్రి గారి పాట తెలుగు పదాల మూట.
అనకాపల్లి ఒకప్పటి విశాఖ జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణం
ఆ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది తీయటి బెల్లం. బంగారపు రంగులో మెరిసిపోయే బెల్లపు అచ్చులు కానీ . బెల్లపు వ్యాపారానికి ప్రసిద్ధ స్థలం.
బెల్లపు పానకం లాంటి తెలుగు పదాలతో సినీ కళామతల్లిని
ఆరాధించే పాటల బ్రహ్మ అక్కడ పుడతాడని ఎవరికి తెలుసు.
అంతా విధాత తలపు. మెడలో శ తస్కోప్ వేసుకుని మన రోగాలను నయం చేస్తాడు అనుకుంటే పాటలతో ధైర్యాన్ని ఇచ్చి పదాలతో మెదడుకు పదును పెట్టి మన ఆరోగ్యాలను బాగుచేసే పాటలకు జన్మనిచ్చాడు మన సీతారామశాస్త్రి. ఏది మన చేతుల్లో ఉండదు కాలం చేసే మార్పులకి మనం తలవగ్గి నడవ వలసిందే. కాలానికి నాయకుడు ఈశ్వరుడు. కళలకు అధిపతి కూడా ఆ నటరాజే. ఆయన అందుకునే మార్గం మళ్లించి తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డగా విశ్వనాథుడి దరి చేర్చాడు .
ఈయన సీతారాముడు. ఆయన విశ్వనాధుడు. ఇంకేముంది సీతారాముడి కలo నుంచి పుట్టిన పాట తెలుగుజాతి కీర్తి కిరీటాలను ఎక్కడకో తీసుకుని పోయేలా చేసింది. ఒకపక్క పాట మరొక పక్క విశ్వనాథుడు దర్శకత్వం ఇంకేముంది సినిమాలన్నీ శతదినోత్సవ చిత్రాలే. ఇంటి పేరు అసలు ఎవరికీ తెలియదు సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోయి సిరివెన్నెల సీతారామశాస్త్రి అయిపోయాడు.
సందర్భానికి తగినట్టుగా పాట వ్రాసి ప్రేక్షకుల నాడిని పట్టుకున్నాడు ఈ పాటల వైద్యుడు. అప్పట్లో "బోటనీ పాఠం ముంది హిస్టరీ లెక్చర్ ఉంది దేనికో ఓటు చెప్పరా సోదరా" అంటూ కాలేజీ కుర్రాళ్ళ మనసుల్ని ఒక ఊపు ఊపేసాడు.
"ఆది భిక్షువు వాడిని ఏది అడిగేది బూడిద ఇచ్చేవాడని ఏమి అడిగేది పరమాత్మని మరొక రకంగా మనకు చూపించిన ధైర్య శాలి మన సిరివెన్నెల. ఎవరైనా దేవుడి మీద గీతాలు వ్రాసేటప్పుడు దేవుడుని పొగుడుతూ వ్రాస్తారు. భగవంతుడి గుణగణాల్ని కీర్తిస్తూ పాట వ్రాస్తారు. కానీ ఈ పాట శైలి భిన్నంగా ఉంది. భిన్నమైన పాటలు వ్రాయగల సత్తా ఉన్నవాడు కాబట్టే ఆ పాట అంత జనాదరణ పొందింది.
ఎవరికైనా సొంత ఊరు వెళ్లినప్పుడు విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని తన పాటల రూపంలో వ్రాసి మనల్ని మెప్పిస్తూ " ఈ గాలి ఈ నేల ఈ ఊరు ఈ సెలయేళ్లు నన్ను గన్న నా వాళ్లు నా కళ్ళ లోగిళ్ళు అంటూ జన్మభూమి సందర్శించినప్పుడు ఆ సినిమాలోని నాయకుడు పాడిన పాట రచించి మనల్ని ఊహల రూపంలో మన జన్మభూమి దగ్గరికి తీసుకెళ్లిపోయారు శాస్త్రి గారు.
ఇలాగా అనేక చిత్రాలలో పాటలు వ్రాసిన అవి అంకెలలోవేల సంఖ్యలు దాటిన అన్నీ కూడా ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకున్నాయని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఈ మధ్య కాలంలో అంటే శాస్త్రి గారు శివైక్యం చెందే ముందు వ్రాసిన ఈ పాట నా మనస్సుని బాగా హత్తుకుంది. నా మనసే కాదు చాలామంది మనసులని. పాటలోకి వెళదాం పదండి.
ప్రేయసి ప్రియులకు అందమైన ఊహ పెళ్లి. ఆ పెళ్లి గురించి ఎన్నో కలలు కoటారు. ఇలలో అయితే చరవాణి ద్వారా సందేశాలు పంపుకుంటారు. సినిమాల్లో అయితే కానున్న కళ్యాణం గురించి పాటలు పాడుకుంటారు. అందమైన నృత్యాలు చేస్తారు. అందమైన ప్రదేశాల్లో విహరిస్తారు. సినిమాల్లో ప్రేయసి ప్రియులు పాడుకునే సినిమా పాటలు ఎన్నో వచ్చాయి. ఇటీవల కాలంలో విడుదలైన ఒక అందమైన సినిమా సీతారామo. పేరు కూడా సహజత్వానికి దగ్గరగా ఉంది. మన ఇంటిలో పిల్లలకు పెట్టుకున్న పేరులా ఉంది. ఇంకేముంది మన సీతారాముడు అందమైన పాటలు మనకు మిగిల్చి సురలోకం వెళ్ళిపోయాడు. ఈ పాటంతా ఒక ప్రేయసి ప్రియుల మధ్య జరిగే కళ్యాణం గురించి ప్రశ్న సమాధానాలతో సాగిపోతుంది. ప్రియురాలు అడిగిన ప్రశ్నకి ప్రియుడు ఎంత అందంగా సమాధానం చెప్తాడో శాస్త్రి గారుతన కలం నుండి తీయని పదాలతో రచించారు.
కానున్న కళ్యాణం ఏమన్నది అనే పల్లవి తో పాట మొదలవుతుంది. దానికి ప్రియుడు సమాధానం స్వయంవరం మనోహరం అంటాడు. ఇలా మొదలైన పాట మనసుని హత్తుకునేలా ఉంది. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.
అలా పల్లవి తో ప్రారంభమైన పాటలో ఆ ప్రియుడు ఎక్కడో కాశ్మీర్ కొండల్లో ఆర్మీలో పని చేస్తుంటాడు. ఒక చరణంలో ప్రియురాలు సందేహం కొండల్లో నువ్వు ఉంటున్నావు చుట్టూ ఎవరు ఉండరు కదా అని అడుగుతుంది. చుట్టూ ఉండేవాళ్ళ చూపులు గిట్టని చూపులు అంటూ ప్రియుడు సున్నితంగా సమాధానం ఇస్తాడు. మన పెళ్లికి చుట్టాలు ఎవరు అని అడుగుతుంది. చుట్టూ ఉండే నాలుగు దిక్కులే మనకి చుట్టాలంటాడు. అంటే శాస్త్రి గారి దృష్టిలో ఆ ప్రదేశంలో ప్రేయసి ప్రియుడు తప్ప ఎవరూ లేరని మనకి చెప్పకనే చెప్పారు. సీతారామం కథలోని సన్నివేశానికి తగినట్లుగా ఉంది ఈ పాట. ఇంతకీ ఆ సన్నివేశం ఏమిటి అనే ప్రశ్న ప్రేక్షకుల మదిలో కలుగుతుంది ఇంకేముంది వారి ఇద్దరి మధ్య జరిగే పెళ్లి . అతిథులు లేని పెళ్లి . మంగళ వాయిద్యాలు లేని పెళ్లి . అదీ ఇతి వృత్తం .శాస్త్రి గారు ఆ పాత్రలలో ఒదిగిపోయి ఆ పాత్రలోని భావాలను అనుభవించి తన కలo నుంచి విడుదల చేశాడు. ఒక సినిమా కవి ఆ పాత్రను అనుభవించి వ్రాసిన ఏ పాట అయినా పది కాలాలపాటు ఉంటుంది. ఇందులో ఈ పాటలో శాస్త్రి గారు ప్రేయసి ప్రియుడి లో పరకాయ ప్రవేశం చేసి వ్రాసిన పాట.
పెళ్లికి ముఖ్యంగా కావలసినది ,అందమైనది గట్టి మేళం. అందమైన సంగీత స్వరాలతో సన్నాయి మేళం హోరులో పంచభూతాల సాక్షిగా వేదమంత్ర ఘోషతో వధువు మెడలో వరుడు తాళి కడతాడు. అదే విషయం శాస్త్రి గారు ప్రియురాలు పాత్ర ద్వారా అడిగించారు.
దానికి ప్రియుడు సమాధానం గుండెల్లో అలజడి సరిపోదా అంటాడు. వధూవరుల గుండెల్లో జరిగే అలజడి పైకి వినపడదు. ఒక అందమైన రాగం ఉంటుంది అందులో. మనసు అత్యున్నత ఆనందం పొందినప్పుడు జరిగే అలజడి. సముద్ర తరంగాలను చూసినప్పుడు కలిగే అలజడి. పసిపాపల నవ్వులను చూసినప్పుడు కలిగే ఆనందం.
అలా సమాధానం చెప్పి ప్రియుడు ప్రియురాలని సమాధానం పరుస్తాడు. ప్రేయసి ప్రియుడు మీద ఎన్నో వందల పాటలు రాసిన శాస్త్రి గారు ఈ ఒక్క పాట తో తెలుగు సినిమా పాటను ఎక్కడకో తీసుకుపోయాడు.
ప్రేయసికి ప్రియుడికి అందమైన కల పెళ్లి. కలలు అందరూ కంటారు. కానీ కలలు నెరవేరేది కొందరికే. కన్నులలోని కలలన్నీ కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడుగా . చరణం ఎంత బాగుంది. అనుకున్నది జరుగుతుందని ఆనందం వారి కలలో కనిపించి అందంగా ఈ పాటను పాడుకుంటారు. పాటలు రాయడo ఆయనకేమీ కొత్త కాదు. ఇటువంటి సన్నివేశాలు కూడా ఆయనకి కొత్త కాదు. కానీ ఈ పాటలో కొత్తదనం చూపించాడు.
ప్రియురాలి ప్రశ్నకి ప్రియుడు ద్వారా అందమైన పదాలు చెప్పించాడు. శాస్త్రి గారు గారు నిజానికి పగలంతా నిద్రపోయి రాత్రంతా జాగరణ చేసి పాటను తెల్లవారేసరికి వెలుగులోకి తీసుకొస్తాడు అని ఎవరో చెప్పగా విన్నాను. ఎన్ని రాత్రులు కష్టపడ్డాడో ఈ పాట కోసం.
ఒక సినిమా కవిని ఆంక్షలు పెట్టకుండా స్వేచ్ఛగా వదిలేస్తే పాట ఇంత అందంగా పుడుతుంది.ప్రజల గుండెల్లో పది కాలాలపాటు ఉండిపోతుంది. సామాన్యుడు కూడా భావo అర్థమవుతుంది. భావము అర్ధమైనప్పుడే ప్రేక్షకుడికి ఆనందం కలుగుతుంది.
సరే పెళ్ళికి కావాల్సినవన్నీ ప్రియుడు ప్రియురాలుకు ఇచ్చిన సమాధానంతో సమకూరాయి. తదుపరి ఏమిటి అనే ప్రియుడు ప్రశ్నకి తమరి చొరవట అని ప్రియురాలు సమాధానం . సహజంగా మగవారికి చొరవ ఉంటుంది. ఆడవారికి బిడియం ఉంటుంది. అందుకే ప్రియురాలు తరునికి తెగువ తగదు కదా అని సమాధానం ఇస్తుంది. మరొక వాక్యంలో పలకని పెదవి వెనుక పిలుపు పోల్చుకో అని సమాధానం చెబుతుంది. ఎంత సున్నితంగా చెప్పారు. భావం ఒక పదంలోనే ఉంది. ప్రేక్షకులకి మనసుపెట్టి చూస్తే ఆ అమ్మాయి చెప్పిన సమాధానం లోని అర్థం తేలిగ్గా తెలిసిపోతుంది. ఎక్కడ శృంగారపరమైన భాష వాడలేదు. ప్రియుడి భావం అందంగా చెప్పించారు.
ఏదైనా ఒక మాట మంచి పాట విన్నప్పుడు మనసుకి ఆనందం కలుగుతుంది. ఈ పాటలో మంచి సాహిత్యం ఉంది. తేలికైన పదాలతో అందమైన భావం వెలుగులోకి వచ్చింది. ఎవరైనా సరే ఆనందంగా ఈ పాటను వినొచ్చు. ఇంత మంచి పాటలు చివరిసారిగా మనకిచ్చిమననుండిశాస్త్రిగారుదూరమైపోయారు. కానీ ఆయన పాటలు విన్నప్పుడల్లా మనముందున్నట్టుంటుంది. ఎలా మర్చిపోగలం ఆ మహా మనిషిని.
అందులో ఈ రోజు ఆయన జన్మదినం. ఈరోజు నాడు శాస్త్రి గారిని తలుచుకోకుండా ఎలా ఉండగలం.
రచన మధు నా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి