వనభోజనం
ఆదివారం ఉదయం ఆరు గంటలు అయింది. నగరం ఇంకా నిద్ర లేవలేదు. నగర సరిహద్దుల్లో అందమైన తారు రోడ్డు మీద బస్సు దూసుకుపోతోంది. బస్సు అంతా కోలాహలంగా ఉంది.
మంచం మీదనుంచి లేవగానే కాఫీ కప్పు పట్టుకునే నరసింహ శాస్త్రి కాలు గాలిని పిల్లిలా బస్సు అంతా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా గంటకు గాని కాఫీ కప్పు చేతిలోకి రాదు. పోనీ ఎక్కడైనా ఆగి కాఫీ తాగుదామంటే నిన్న సాయంకాలం కమ్యూనిటీ మీటింగ్లో రామశాస్త్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేయ్.
“రేపు ఉదయం ఏమీ బయట వస్తువులు తినడానికి వీల్లేదు. అన్నీ మనం స్వయంగా తయారు చేసుకునే ఉదయం కాఫీ దగ్గర నుంచి మధ్యాహ్నం ఫలహారం వరకు. లేదంటే వనభోజనాలనే మాటకు అర్థం లేదు. సాధారణంగా వనభోజనాలంటే బయట హోటల్ కి ఆర్డర్లు ఇచ్చేసి ఎంజాయ్ చేయడం కాదు. మనకు మనమే స్వయంగా తోటలో వండుకుని పదిమందితో హాయిగా చెట్లు కింద అరిటాకులు వేసుకుని తింటే ఆ ఆనందమే వేరు. ఏడాదికి ఒకసారి కదా! అలా చేస్తే ఎంతో తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది,” అన్నాడు రామశాస్త్రి.
అనుకున్న విధంగా ఉదయం ఐదు గంటలకి పెద్ద బస్సు మా కాలనీ పార్కు దగ్గరికి వచ్చి ఆగింది. మగవాళ్లంతా వంట సామాన్లు, ఆట సామాన్లు, స్పీకర్లు, తాటాకు చాపలు, కిరాణా సామాన్లు బస్సు ఎక్కిస్తుంటే ఆడవాళ్లు ఆనందంగా గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ పెళ్లి వారిలా బస్సు ఎక్కుతున్నారు. కాలనీ వాసులు అంతా వచ్చారా లేదో సరిచూసుకొని రామశాస్త్రి బస్సు ఎక్కి “రైట్, రైట్!” అని గట్టిగా అరిచాడు. బస్సు బయలుదేరింది.
బస్సు కిటికీల్లోంచి ఉదయ సూర్యకాంతి గీతలుగా లోనికి జారుతోంది. పిల్లలు “మనం ఎప్పుడు చేరుకుంటాం?” అని ఆత్రంగా ప్రశ్నలు వేస్తుంటే, పెద్దలు పాత జ్ఞాపకాలతో పొంగిపోతున్నారు. ఒక మూలలో రమణయ్య హార్మోనియం తెచ్చి పల్లెటూరి పాటలు మొదలుపెట్టాడు. కాసేపట్లో బస్సే కచేరీగా మారిపోయింది.
నరసింహ శాస్త్రి మాత్రం ఇంకా కాఫీ కోసం గిలగిల కొట్టుకుంటున్నాడు. “అయ్యో, ఈ వనభోజనం ఆలోచన ఎవరిదో! ఉదయాన్నే కాఫీ లేకుండా మనిషి బతుకుతాడా?” అని గద్దిస్తున్నాడు. దగ్గర కూర్చున్న అమ్మాయిలు నవ్వుకుంటూ, “శాస్త్రిగారూ, ఇంకో అరగంటలో చేరతాం. అప్పటి వరకు మీ పని ఇంతే,” అని ఆట పట్టించారు.
ఇంతలో బస్సు పల్లెల మధ్యలోకి దూసుకుపోతూ, ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు, వరి పొలాలు, చెరువులు కనబడుతుంటే అందరి మనసూ మధురంగా మారింది.
కొద్దిసేపట్లో బస్సు పెద్ద తోట దగ్గర ఆగింది. ఎప్పుడూ పార్కులో ఆట ఆడుకునే పిల్లలు అంత పెద్ద తోట చూడగానే బంతులు తీసుకుని ఉత్సాహంగా పరుగులు మొదలుపెట్టారు. మగవాళ్లు బస్సులోంచి సామానంత దింపి కింద తాటాకు చాపలు పరుస్తుంటే, ఆడవాళ్లు కొంగులు దోపుకుని నాలుగు ఇటికలు పేర్చి కట్టెలు వెలిగించి ఇత్తడి గిన్నెలో కాఫీ డికాషన్ మరగబెడుతుంటే ఆ వాసనకి నరసింహ శాస్త్రికి ప్రాణం లేచి వచ్చినట్లు అయింది.
ఆ పొగ వాసనలో కాఫీ వాసన చూస్తుంటే, అందరికంటే పెద్దదైన మహాలక్ష్మి అమ్మగారికి తన చిన్నతనంలో వనభోజనం గుర్తుకొచ్చింది. ఆ వాసన ముక్కుకి తగలగానే నరసింహ శాస్త్రి పరుగు పరుగున గ్లాస్ పట్టుకుని వచ్చాడు. నరసింహ శాస్త్రి గారి ఆత్రం చూసి అందరికీ నవ్వొచ్చింది. “పాపం, ఆయనది కాఫీ ప్రాణం! ఎంతసేపు ఓపిక పట్టి ఉంటాడు !” అని నవ్వుకున్నారు.
కాఫీ అయిపోయింది సరే! మరి టిఫిన్ సంగతి ఏమిటి? “అసలే నాది ముసలి ప్రాణం. ఎనిమిది అయింది అంటే చాలు, షుగర్ మందు వేసుకోవాలి,” అంటూ ముందుకు వచ్చిన మహాలక్ష్మికి దూరంగా కట్టెల పొయ్యి మీద మరుగుతున్న నీటిలో ఉప్మాను కలుపుతున్న సుభద్రమ్మ కనిపించింది.
“కాస్త నెయ్యి ఎక్కువగా పోయమ్మ! లేదంటే ఉప్మా రుచి రాదు. అలాగే కాసిని జీడిపలుకులు పోస్తే పిల్లలు శుభ్రంగా తింటారు,” అంది మహాలక్ష్మి. అరిటాకు ముక్కలో పెట్టిన వేడివేడి ఉప్మాలోంచి నెయ్యి జారిపోతుంటే, పక్కనే ఉన్న అల్లం పచ్చడితో కలిపి సుభద్రమ్మ గారి చేతి వంటను మెచ్చుకుంటూ, శీతాకాలపు నులి వెచ్చని ఎండలో అందరం తోటలో తలో దిక్కున కూర్చుని పాతకాలపు పెళ్లిల్లో తయారుచేసిన ఉప్మాను గుర్తు చేసుకుంటూ అల్పాహారం లాగించేశారు.
టిఫిన్ అయిన వెంటనే క్రికెట్ బ్యాట్ పుచ్చుకుని అరవై ఏళ్లు దాటిన అచ్యుతరావు గారు పిల్లలతో సహా పోటీపడుతూ తోటలోకి పరిగెత్తారు. మరోసారి కాఫీ చుక్క జాడ ఎక్కడైనా కనబడుతుందేమోనని నరసింహ శాస్త్రి పదే పదే ఆ పొయ్యి వైపు చూడడం మొదలు పెట్టాడు. కానీ కాలనీలో పెద్ద వయసు ఉన్న ఆడవాళ్లు అందరూ కూరలు తరగడంలో మునిగిపోయారు. ఈసారి మగవాళ్లు వంటవాళ్ల అవతారం ఎత్తారు.
వయసులో ఉన్న కుర్రాళ్లు కంప్యూటర్ గేములు వదిలేసి కబడి, దొంగ–పోలీసు, కోతికొమ్మచ్చి ఆటలు మొదలుపెట్టారు. “ఎంతకాలం అయింది ఇలాంటి ఆటలాడి!” యువతరం అని పెద్దలు మెచ్చుకోలుగా చూశారు. వయసు దాటిన వాళ్లు చెట్ల దగ్గరున్న గట్ల మీద కూర్చుని పాతకాలం ఉన్నది కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఒక్కసారి ఆ విశాలమైన తోట చెట్లు చూస్తుంటే వాళ్లకి చిన్నతనం గుర్తుకొచ్చింది.
ఆడవాళ్లు కూరలు తరగడం పూర్తి అయిపోయింది. ఒకపక్క పొయ్యి మీద కందిపప్పు ఉడుకుతుంటే, మరొక పక్క కంద–బచ్చలి ముక్కల పులుసు, పనసపొట్టు కూర వాసనలు ముక్కును అదరగొడుతుంటే; ఇంకో పక్క మూకుట్లో వేగుతున్న బూరెలు, గంగాళంలో ఉడుకుతున్న పాయసం తీపివాసనలు; మరొకపక్క ఆవపెట్టిన పులిహార ఘాటు గాలిలో ఎగిరి పడుతుంటే… హమ్మయ్య, వంట అయిపోయింది! అనుకుని అలసిపోయిన కాలనీవాసులు ఒక చుక్క కాఫీ తాగి పిల్లలతో ఆటల్లో కలిసిపోయారు.
ఆటపాటలతో అలసిపోయిన జనం తిరిగి వచ్చేటప్పటికి ఉసిరిచెట్టు కింద పదార్థాలన్నీ చేర్చి పూజ చేసుకుని నైవేద్యం పెట్టారు. పచ్చటి అరిటాకుల ముందు కూర్చున్న జనాన్ని చూస్తుంటే చిన్నతనాల్లో కార్తీక వనభోజనం గుర్తుకొచ్చింది మహాలక్ష్మికి.
పట్టణ వాస సంస్కృతికి అలవాటు పడిన పల్లె జనానికి పాతకాలపు మర్యాదలు, వడ్డనలు మళ్లీ గుర్తుకొచ్చి నవ్వుతూ, తుళ్లుతూ, చలోక్తులు విసురుకుంటూ రోజు కంటే ఎక్కువ ఆనందంగా తెలుగువారి భోజనం కార్తీక వనభోజనం కడుపు నింపగా, భోజనం చేయకుండా మిగిలిపోయిన వారికి మొదటి బంతి వాళ్ళు వడ్డన చేసి కార్తీక వనభోజనం ఆనందంగా ముగించారు.
సాధారణంగా వనభోజనాలంటే పట్టణాలలో పిక్నిక్ అంటారు. కుటుంబాలతో కలిసి బయట హోటల్ లో ఆర్డర్ ఇచ్చి ఫాస్ట్ ఫుడ్ తిని, ఏదో మనసుకు నచ్చిన ఆటలాడి కాలం గడిపి, ఏవిధమైన అనుభూతి లేకుండా ఇంటికి చేరుకునే పద్ధతికి భిన్నంగా, అందరూ ఆనందంగా, ఆప్యాయంగా, కబుర్లు చెప్పుకుంటూ కలిసి మెలిసి వంటలు చేసుకుని తిని ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంటే కన్నీళ్ళు వచ్చాయి అందరికీ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి