రాఖీ పండుగ
రాఖీ పండుగ
ఉదయం 9 గంటలయింది
రామరాజు ఆఫీస్ కి వెళ్లే హడావుడిలో బిజీబిజీగా ఉన్నాడు.
రామరాజు మలక్ పేట్ లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నత ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఎప్పుడు ఆఫీసుకి 9 గంటలకే బయలుదేరుతాడు
ఏవండీ రేపు ఆఫీస్ కి రెండు గంటలు ఆలస్యంగా వస్తానని పరిమిషన్ తీసుకోండి అంటూ భార్య సరోజ వంటింట్లోంచి
గట్టిగా అరిచింది.
ఏమిటి విషయం అంటూ భార్యని ప్రశ్నించాడు రామరాజు.
రేపు రాఖీ పౌర్ణమి అండి. మీ చెల్లెలు రాఖీ కట్టడానికి వస్తానని నిన్ననే ఫోన్ చేసి చెప్పింది అంటూ సమాధానం ఇచ్చింది.
రామరాజుకి ఒక్కగానొక్క చెల్లెలు సుమతి కూడా అదే ఊర్లో వనస్థలిపురం లో ఉంటుంది. ప్రతి ఏడాది రాఖీ పండక్కి తప్పకుండా ఇంటికి వచ్చి అన్నగారికి రాఖీ కట్టి వెళుతుంది.
ఉత్త రోజుల్లో మొబైల్లో పలకరించుకోవడం తప్ప రాకపోకలు ఉండవు. ఒకే సిటీలో ఉంటున్న ఎవరి పనులు , ఎవరి హడావుడి వారిది. ఉదయం లేచిన దగ్గర్నుంచి పరుగే. ఎవరిని ఏం అనడానికి లేదు .
రామరాజు మాత్రం ప్రతి ఆదివారం చెల్లెలికి ఫోన్ చేసి క్షేమమాచారాలుతెలుసుకుంటాడు. ఇంటికి వెళ్లి పలకరించే తీరుబడి ఇద్దరికీ ఉండదు. రామరాజు చెల్లెలు సుమతి కూడా స్కూల్లో టీచర్ గా పని చేస్తోంది. ఒక తల్లి కడుపున పుడితే మటుకు ఏంటి. పెద్దవాళ్ళు అయిన తర్వాత బాధ్యతలు ఏర్పడిన తర్వాత ఎవరి కుటుంబం వారిది. ఎవరి సమస్యల వారివి. అందులో వారం అంతా ఆ ట్రాఫిక్ లో ప్రయాణించి అలసిపోయి సెలవు పూట బయటికి వెళ్లాలంటే బద్ధకం వస్తుంది.
రాఖీ పౌర్ణమి సోదరీ సోదరుల అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగ. అన్నదమ్ముల క్షేమం కోరుతూ అక్కలు చెల్లెళ్లు రక్షాబంధనం కడతారు. తర్వాత హారతి ఇచ్చి నోరు తీపి చేసి ఆశీర్వాదం పొందుతారు. అన్నదమ్ములు కూడా బహుమతులిచ్చి సోదరిని సంతృప్తి పరుస్తారు. పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్లిపోయిన తర్వాత ఈ రకంగా అయినా సోదరీ సోదరులు కలుసుకుంటారని పండుగ అంతరార్థo. తెలుగు నాట భగిని హస్త భోజనం పండుగ కూడా ఇదే అంతరార్థం.
ఆఫీసుకెళ్లాడన్నమాట కానీ రామరాజు మనసు మనసులో లేదు.
క్రితం ఏడాది రాఖీ పండక్కి వారం రోజులు ముందుగా రామరాజుకి గ్రేడ్ వన్ ఆఫీసర్ గా ప్రమోషన్ వచ్చింది. ఆ సంతోషంలో భార్య చేతికి ఇరవై వేల రూపాయలు ఇచ్చి నువ్వు సుమతి చెరో పదివేలు తీసుకుని మీకు కావాల్సింది కొనుక్కోండి. సుమతి రాఖీ కట్టడానికి వస్తుంది కదా.
అప్పుడు హారతి పళ్లెంలో పది వేలుపెట్టు అంటూ భార్యకు చెప్పాడు రామరాజు.
రామరాజు చెల్లి సుమతి ఎప్పటిలాగే రాఖీ పండక్కి అన్నగారింటికి వచ్చి రాఖీ కట్టి హారతి ఇచ్చి స్వీట్ తినిపించింది.
ఈలోగా భార్య తాంబూలం తీసుకొచ్చి పళ్లెంలో పెట్టింది. ఒక్కసారిగా పళ్లెంలోకి తొంగి చూసిన రామరాజు అవాక్కయ్యాడు. ఆ తాంబూలంలో వంద రూపాయల కాగితం కనబడింది..అంటే భార్య మర్చిపోయిందా లేకపోతే కావాలని చేసిందా అంటూ ఆలోచనలో పడిపోయాడు రామరాజు. ఇప్పుడు చెల్లెలు ఎదురుగుండా భార్యని అడిగితే
భార్యను లోకువ చేసుకున్నట్లు ఉంటుంది అనుకుంటూ మదనపడ్డాడు.
ఆ రాత్రి గదిలోకి వచ్చిన భార్యని సుమతికిపదివేల రూపాయలు ఇవ్వడం మర్చిపోయావా అంటూ ప్రశ్నించాడు. మర్చిపోలేదండి మీరు ఇచ్చిన ఇరవై వేల తోటి బంగారం వస్తువు కొన్నాను
అంటూ జవాబు చెప్పింది. ఎవరికి ఏమిటి అని ప్రశ్నించలేదు రామరాజు.మరి సుమతికి మాట మధ్యలోనే ఆపి మౌనంగాఉండిపోయాడు మౌనం చాలా సందర్భాల్లో మంచిది. కలహాన్ని పెంచదు. అవతల వ్యక్తి తప్పు చేసిన మనం మాట వదిలితే మాటని వెనక్కి తీసుకోలేం. అలా ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు.
రామరాజు ఉదయం లేచేటప్పటికి ఎనిమిది గంటలు అయింది
అప్పటికే రామరాజు భార్య కమల చెల్లెలు సుమతి వంటింట్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. రామరాజు చెల్లిని పలకరించి గబగబా బాత్రూంలోకి దూరిపోయాడు. తల తడుచుకుంటూ బయటికి వచ్చి బావగారు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు అంటూ సుమతిని ప్రశ్నల వర్షం కురిపించాడు. అందరూ బాగానే ఉన్నారు సుమతి అన్నగారికి సమాధానం చెప్పి అన్నయ్య బట్టలు మార్చుకొని రా రాఖీ కడతానుఅంటూచెప్పింది
ఈలోగా రామరాజు భార్య కమల కాఫీ తీసుకొచ్చి రామారావు చేతులో పెట్టింది. రామరాజు కాఫీ గబగబా త్రాగి బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్లిపోయాడు.
రామరాజు బట్టలు మార్చుకుని బయటకు వచ్చి కుర్చీలో కూర్చోగానే అప్పటికే సిద్ధం చేసుకున్న రాఖీ తో హారతి పళ్లెంతో సుమతి రెడీగా ఉంది. అన్నగారిని కుర్చీలో కూర్చోబెట్టి చేతికి రాఖీ కట్టి నోరు తీపి చేసి హారతి ఇచ్చింది. ఇంతలో చేతులో ఒక తాంబూలం ఒక చిన్న బాక్సు పట్టుకుని రామరాజు భార్య లోపల్నుంచి వచ్చింది. రామరాజు మనసులో లేదు. కమల ఎప్పట్లాగే వంద రూపాయలు ఇచ్చి ఊరుకుంటుందా అని ఆలోచనలో పడిపోయాడు రామరాజు.
ఇలా రామరాజు ఆలోచనలో ఉండగా కమల సుమతి నుదుటన బొట్టు పెట్టి చేతిలో ఉన్న పెట్టి లోంచి ఒక నెక్లెస్ తీసి సుమతి మెడలో పెట్టింది. నీకు నచ్చిందా అని సుమతిని ప్రశ్నించింది కమల. సుమతి మొహం వెయ్యి ఓల్టుల బల్బులా వెలిగిపోయింది. ఆశ్చర్యంగా చూస్తున్న రామరాజు వైపు కమల తిరిగి ఏమండి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కదా. మీ మనసులో మీరు ఏమనుకున్నారో నేను ఊహించుకోగలను. నేను స్వార్ధంగా డబ్బు వాడేసుకున్నానని అనుకున్నారు మీరు. పాపం సుమతి మెడలో ఏమీ లేదండి అందుకనే మీకు చెప్పకుండా నా డబ్బులు కూడా కలిపి ఈ నెక్లెస్ కొ న్నాను అని చెప్పింది
రామరాజు మనసు మనసులో లేదు .ఒక వయసు వచ్చిన తర్వాత ఉన్నవి లేనివి ఏవేవో ఊహించుకుని ఆ వ్యక్తి మీద తప్పుడు అభిప్రాయం పడడమే పెద్ద తప్పు. భార్యను అనవసరంగా నిందించానని కమలకి సారీ చెప్పి తేలికబడిన మనసుతో ఆఫీసుకు బయలుదేరిపోయాడు రామరాజు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి