ఆడపిల్ల

ఆడపిల్ల 

జీవితంలో కొన్ని అదృష్టాలు కొంతమందికే కలుగుతాయి.
అటువంటి వాటిలో ఇంటిలో ఆడపిల్ల పుట్టడం.

ఆడపిల్ల పుట్టిందంటే అందరూ భయపడతారు.దాన్ని పెంచి పెద్ద చేయడం ఒక బాధ్యతని,సంఘంలో గౌరవంగా మసిలే బుద్ధులు చెప్పడం మరొక బాధ్యతని,పెళ్లిళ్లు చేయాలని పేరంటాలు చేయాలని,అందుకే అది మన గుండెల మీద కుంపటి అనిఇలా రకరకాలుగా ఆడపిల్ల గురించి భయపడతారు.

నిజానికి ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి రూపం. కళ్ళకు కాటుక పెట్టుకుని ,కాళ్లకు గజ్జెలు కట్టుకుని ,నుదుట తిలకం దిద్దుకుని, చేతులకు గాజులు ,పట్టుపరికిణి పట్టుకుని ఇల్లంతా కలయ తిరుగుతుంటే లక్ష్మీ స్వరూపమే కనపడుతుంది.

అసలు ఆడపిల్ల పుడితేనే తండ్రికి బాధ్యత అంటే ఏమిటో తెలుస్తుంది. కన్యాదాన ఫలితంగా ముందు తరాలు తరిస్తాయి.
ఆడపెళ్లి వారు అయితేనే అతిధిని ఎలా గౌరవించాలి అనే విషయం , ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే విషయం నేర్చుకుంటారు తల్లిదండ్రులు. అందుకనేమో పెళ్లి చూసి చూడు ఇల్లు కట్టు చూడు అనే సామెత వచ్చింది

నిజానికి ఆడ మగ ఒక ప్రకృతి స్వరూపమైన తేడాయే కానీ
ఈ రోజుల్లో ఇద్దరకి తేడా ఏమీ లేదు. ఇద్దరికీ విద్యాబుద్ధులు నేర్పించాలి. పెళ్లిళ్లు చేయాలి పేరంటాలు చేయాలి. ఇంకా పెద్ద తేడా ఏముంది. పెళ్లయిన తర్వాత అక్కడ ఉండే పిల్ల అవుతుంది. అదొక్కటే. ఆ వంశానికి మూల స్తంభం అవుతుంది.
అన్నీ మారిపోతాయి. కానీ కనిపెంచినతల్లి తండ్రి పేర్లు ఎవరూ మార్చలేరు

 అప్పటివరకు నాన్న గుండెల మీద ఆడుకున్న ఆ చంటి దాన్ని పెళ్లి అనే తాయిలం చూపించి అక్కడికి పంపుతాము. అంతవరకు మన గుండెల్లో ఉన్న ఆ బొమ్మ వేరొకరు గుండెల్లో అందాల బొమ్మగా మారిపోతుంది.మన ఇంట్లో మనం చందన బొమ్మతో ఆడుకుంటూ ఉంటాం.. ఆ వయ్యారిభామ మళ్ళీ మన ఇంటికి వచ్చే పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అవసాన దశలో కూడా మన గుండె ఆగిపోకుండా కొట్టుకుంటూ ఉంటుంది.
ఆఖరి చూపు అమ్మాయి కోసం. అమ్మాయి వచ్చింది చూడు అంటారు ఎవరో .దాంతో మన శ్వాస ఆగిపోతుంది. ఇదీ ఆడపిల్ల అంటే నాన్న గుండెల్లో ఉన్న స్థానం.

ఆడపిల్లలంటే పుట్టింటి మెట్టినింటి గౌరవం నిలిపే ఒక వారధి.
పలానా ఇంటి ఆడపడుచు అని, పలానా ఇంటివారి కోడలని ప్రతి ఆడపిల్లకి రెండు రకాల బాధ్యతలు ఉన్నాయి. నాన్నంటే ఆడపిల్లకి దాసుడు. ఆడపిల్ల అంటే నాన్న కూచి.చిన్నప్పుడు అల్లరి చేసిన ఆడపిల్లను మటుకు గారంగా మందలిస్తాడు
కోరినవన్నీ ఇస్తాడు .కోరకుండానే కోరికలు తీరుస్తాడు. 
అల్లరి చేస్తుంటే చంకనెత్తుకుని ముద్దాడుతాడు. ఒళ్ళు వెచ్చగా ఉంటే తల్లడిల్లిపోతాడు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కంటికిరెప్పలాకాచుకుంటాడు.ఆడపిల్లలోతనఅమ్మనిచూసుకుంటాడు. అమ్మా అని పిలుచుకుంటాడు.అమ్మ కంటే నాన్న దగ్గర చనువు ఎక్కువ. నాన్నను ఆప్యాయంగా మందలిస్తుంది. నాన్నవస్తువులు ధైర్యంగా తీసుకుంటుంది.చంక ఎక్కి అవి ఇవి కావలసినవి కొనిపించుకుంటుంది. అమ్మకు కావలసివి నాన్నకు రికమెండ్ చేస్తుంది ఆడపిల్ల.

 ఇది ఆడపిల్లలకు ఉండే నైపుణ్యం. అన్నయ్య మీద చాడీలు చెప్పి నాన్న చేత అన్నయ్యని కొట్టిస్తుంది. అన్నయ్యని తిడుతుంటే నాన్నకి అడ్డుపడుతుంది. అమ్మ పెట్టిన తాయిలం కొరికి సగం అన్నయ్య కి ఇస్తుంది. ఎందుకంటే ఆడజన్మంటే త్యాగం. 

ఆడపిల్ల పెద్ద ఆరిందాలా అమ్మని అనుకరిస్తుంది. పెద్దక్క లాగా అన్నదమ్ములను అనునయిస్తుంది. నాన్న గుండెలో నిదు రించి
గుండె బరువు తగ్గిస్తుంది. ఆడపిల్లంటే ఇంటిలో ఉన్న అమ్మకి ప్రతిరూపమే కదా.

అమ్మతనంతో తరాలను తరింప చేస్తుంది. కమ్మగా వండిపెట్టి
అన్నపూర్ణ దేవిని మరిపిస్తుంది. నిశి రాత్రిలో చందమామ వలే మగనికి వెలుగు చూపి మగని మనసు దోచుకుంటుంది.
.

ఆడపిల్లలంటే ఎందుకు అంత ప్రత్యేక అభిమానం అంటే అది మన వదిలి అత్తవారింటికి వెళ్ళిపోతుందనే బెంగ బాధ పుట్టినప్పటినుంచి తండ్రి గుండెల్లో ఉంటుంది.  

మంచి వరుడిని చూసి వివాహం అంగరంగ వైభవంగా చేసిన బాధ్యత తీరిపోయిందని ఆనందించిన ఏదో ఒక తీయని బాధ ఎప్పుడు మనసులోనే ఉంటుంది నాన్నకి. మంగళసూత్రధారణ కాగానే తన ప్రాణం ఎవరో తీసుకుపోతున్నట్లు అనిపించిన అంతకంటే ఆనందం కూడా కలుగుతుంది. 

భర్తతో కలిసి ఏడు అడుగులు నడుస్తుంటే చిన్నప్పుడు తన వేలుపట్టుకునిఅడుగులునేర్చుకొనితనతోదొంగపోలీస్ఆటాడుకున్న,దాగుడుమూతలు ఆడుకున్న క్షణాలన్నీ గుర్తుకొచ్చి ఆ క్షణం తిరిగి రాదనే బాధ కలుగుతూనే ఉంటుంది. తప్పు చేసిన ఒప్పు చేసిన కడుపులో పెట్టుకుని చూసుకోండని ఆ పిల్ల చెయ్యి అత్తవారికి అందించినప్పుడు అంతవరకు దాచుకున్న సముద్రం పొంగిపోతుంది తండ్రికి.

ఒక మంచి తోడు దొరికిందని నవ్వుతూ అల్లుడు అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్తున్నప్పుడు ఇంతవరకే మన బాధ్యత అని సరిపెట్టుకుంటాడు
పెళ్లి అయ్యేంతవరకు ఒక బాధ . పెళ్లయిన తర్వాత తాళి కట్టినవాడు మనసున్న మహారాజా కాదా అని ఆందోళన పడుతుంటాడు. అత్తారింటికి వెళ్లిన ఆడపిల్ల మొహంలో వెలుగు కోసం వెతుకుతాడు. ఆ వెలుగు దీపావళిలా ఉంటే ఆనంద పడిపోతాడు. నిరంతరం మతాబులా వెలగాలని చేయని ప్రార్థన అంటూ ఉండదు.

ఆ ఇంటిలో అడుగుపెట్టిన పిల్ల భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆ కుటుంబానికి వారసులను ఇస్తూ అత్తమామలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఆర్థికంగా భర్తకి చేయూతనివ్వడానికి బయటకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఆ భర్త జీవితంలో ఒక ముఖ్య పాత్ర వహించే స్త్రీని ఎల్లవేళలా మహారాణిలా చూసుకునే కుటుంబాలు ఎన్నో. కొన్ని కుటుంబాల్లో స్త్రీ కన్నీళ్లు కారుస్తూనే ఉంది. వేధింపులకు గురి అవుతూనే ఉంది. ఆడపిల్లలంటే బాధ్యతని బాధ్యతలకు భయపడి ఆడపిల్లని ఆదిలోనే హత్య చేయడo ప్రకృతి విరుద్ధమైన పని.సృష్టి ఆగిపోతుంది. ప్రపంచంలో కరుణ అనే మాటకు ఉండదు.త్యాగం అనే మాట వినపడదు

కరుణా సహనం ఓర్పు అనేవి ప్రతి స్త్రీకి అంతర్లీనంగా ఉండే
సద్గుణాలు. త్యాగం ఆమె ట్రేడ్ మార్క్. అంధుడైన భర్త కోసం తన కళ్ళకు కూడా గంతలు కట్టుకుని స్త్రీ అంటే త్యాగమూర్తి అని నిరూపించిన గాంధారి మహా పతివ్రత నేటికీ ఈనాటికి మరి ఎన్నటికీ మనకు ఆదర్శమూర్తి. కద నరంగంలో కత్తి దూసి భారత తొలి స్వాతంత్ర సంగ్రామంలో పోరాడి అసువులు బాసిన ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వానికి ఎప్పటికీ ఆదర్శమే. 

ఏ రంగం చూసినా ఆమె వీరంగం చేస్తోంది. ఆడపిల్ల అంటే భయం ఎందుకు. చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి మంచి నడవడిక నేర్పిస్తే చాలు. పెళ్లి వారు వెతుక్కుంటూ మరీ వచ్చి పిల్లని అడిగి మరీ పెళ్లి చేసుకుంటా రు. ఇది ఈ రోజుల్లోని పరిస్థితి.

ఈరోజు ఆడపిల్లను వద్దని మనం అనుకుంటే రేపు సమాజం అమ్మలేని అనాధ అవుతుంది.. నేటి ఆడపిల్ల రేపటి అమ్మ.
ఆడపిల్లకు వందనం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
          కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం