కాఫీ తాగారా
కాఫీ తాగారా!
" దిక్కుమాలిన అలవాటయింది! ఇలా మొహం కడుక్కుంటున్నారో లేదో అలా కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఐదు నిమిషాలు ఆలస్యం అయితే చిందులు తొక్కుతారు అంటూ ప్రతిరోజులాగే దండకం చదివి కాఫీ కప్పు అక్కడ పెట్టింది మా శ్రీమతి రాజ్యలక్ష్మి. కాఫీ రుచి ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ కాఫీ తాగదు.
'కప్పు కాదండి పెద్ద స్టీల్ గ్లాస్. ఆ గ్లాస్ తో కాఫీ తాగకపోతే కాఫీ తాగినట్టు ఉండదు. ఇంకా నయం మా తాతగారు ఒకాయన పెద్ద చెంబుతో కాఫీ తాగేవాడుట. అయితే మేము మటుకు తక్కువేముంది . ఒక్కసారి తాగే బదులు నాలుగు సార్లు తాగుతున్నాం.
ఇంట్లో ఉంటే ఏ బెంగ ఉండదు. ఎన్ని తిట్లు తిట్టినా వేళకు కాఫీ వచ్చి పడిపోతుంది. మరి ఎక్కడికైనా వెళ్తే మనకా ఉదయం లేచి కాఫీ తాగడం అలవాటు. అవతల వాళ్ళు లేస్తారా! లేచిన వెంటనే కాఫీ ఇస్తారా! అనేది ఒక పెద్ద బెంగ.
సరే పెళ్లిళ్లకి ఫంక్షన్లకి వెళితే ఆ కాఫీ తాగితే ఏడుపొస్తుంది . డోసు తక్కువ రుచి నేను వర్ణిస్తే బాగుండదు. మా చిన్నతనంలో పొయ్యి మీద కాచిన కాఫీ ఎంత రుచికరంగా ఉండేది. ఇప్పుడు కాఫీ మేకర్లు వచ్చేసి పని సులువు అయింది గానీ సరుకు రుచి మరి ఏమో!
ఉదయం లేచిన దగ్గర్నుంచి మామూలుగా తాగే కాఫీ తో పాటు ఎవరైనా అతిధి వస్తే వారితో కంపెనీకి ఒక కప్పు నీరసంగా ఉందని ఒక కప్పు మనసు బాగా లేకపోతే ఒక కప్పు ఇలా అదనపు కప్పులన్నీ రోజు లేస్తూనే ఉంటాయి.
మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కాఫీ కప్పు చేతులో పెట్టకుండా మంచినీళ్లతో సరిపెట్టేస్తే ఇంటికి వెళ్ళిన వాళ్ళకి కాఫీకి కూడా ఇవ్వరు అటు ఊరంతా ప్రచారం చేస్తారు . కాఫీ మన మర్యాదను ఊరంతా చాటింపు వేస్తుంది. భోజనం పెట్టకపోయినా పర్వాలేదు గాని కప్పు కాఫీ కూడా ఇవ్వకపోతే మన మర్యాదని మంట కలిపేస్తారు.
కాఫీ శరీరానికి ఏదైనా మేలు చేస్తుందా అంటే డాక్టర్ గారు కూడా కాఫీ తాగుతూ కనిపించారు. మరి కాఫీ తాగడం వల్లనే లాభం ఎంత నష్టం ఎంతో ఎప్పుడు తెలుసుకోలేదు.
తొలి రోజు రాత్రి ఫిల్టర్ వేసి ఉదయం తాగడానికి రెడీగా ఉంచుకునే కాఫీ జీవితంలో ముఖ్యపాత్ర వహిస్తోంది. మా చిన్న తనాల్లో పెద్ద స్టీల్ గిన్నెతోటి కాఫీ కాచేది మా అమ్మ . ఎందుకంటే ఆ రోజుల్లో ఇంట్లో పశువులు ఉండేవి కాబట్టి. అప్పుడే తీసిన పాలు కాచి చిక్కగా కాఫీ కాచుకొని ఆనందంగా వసరాలో కూర్చుని ప్రకృతిని అనుభవిస్తూ కాఫీ తాగేవారు. నెలకి ఎన్ని కేజీల కాఫీ పొడి పంచదార వాడేవారో నాకు తెలియదు.
అయితే తప్పనిసరిగా గ్రూప్ బాండ్ కంపెనీ కాపీ మటుకు వాడేవారు. లేదు కాకినాడలో దొరికే పెదపూడి కాఫీ వర్క్ కాఫీ పొడి పని గట్టుకుని వెళ్లి తెచ్చుకునేవారు.
ఈరోజుకి కూడా చాలామంది కాకినాడ పెద్ద బజార్లో కాఫీ గింజలు వాడే ఒక షాపు దగ్గర నుంచి ప్రత్యేకంగా వెళ్లి కాఫీ పొడి తెచ్చుకుంటారు. అంత మమకారం కాఫీ అంటే
కప్పులో పోసిన కాఫీ నురగలు కక్కుతూ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అది మంచి వాసన కొడుతూ మనల్ని కప్పు దగ్గరికి లాగేస్తుంది. ఎక్కడ పుట్టిందో ఈ బంగారం. మన మనసులను దోచేసిన అందమైన పానీయం.
సాధారణంగా దేవుళ్లను స్తుతిస్తూ దండకాలు చదువుతారు వ్రాస్తారు. కానీ ఒక కవి గారు ఏకంగా కాఫీ మీద దండకం వ్రాశారు.
కాఫీ తాగితే బరువు పెరుగుతారని ఎవరో చెప్పారు. అలా అని రెండు రోజులు మానేస్తే లోకమంతా శూన్యంగా అనిపించింది. ఏదో వెలితిగా ఉంది. మందు మానేసిన మందుబాబు లాగా అయిపోయింది పరిస్థితి. లోపలనుంచి నరాలన్నీ కాఫీ కాఫీ అని అరుస్తున్నట్టుగా అనిపించింది.
సమయానికి పాలు లేకపోతే వేడివేడి డికాషన్ తాగేసి వాళ్ళు కూడా ఉన్నారు. కాఫీ అంటే అంత ఇష్టం మరి
సరే కొంతమంది నీళ్ల కాఫీ తాగరు ఫిల్టర్ కాఫీ మటుకు తాగుతామని మడి కట్టుకుని కూర్చుంటారు.
ఈ జనరేషన్ వాళ్ళు మన ఇంట్లో కాఫీ అంటే మూతి ముడుస్తారు. రోడ్డుమీద కాఫీ షాప్ అంటే పడి చస్తారు.
మరి కొంతమంది ఎవరే కాఫీ ఇచ్చిన తాగుతారు . కొసమెరుపుగా మా అమ్మ కాచిన కాఫీలా లేదు అనేసరికి ఎదుటి వాళ్ళకి మండిపోతుంది. అది ఎదుటివారిని కించపరచాలని కాదు వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ అమ్మ మీదకు మమకారం చంపుకోలేక.
ఈ తరం వాళ్లకి రకరకాల కాఫీలు అలవాటు. ఐస్ కాఫీట అదేంటో దాన్ని రుచి చూడలేదు ఎప్పుడు .
ఇది నిజంగా జరిగింది. ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ కాలనీలో ఉండేటప్పుడు మా ఇంట్లో పని చేసే ఆవిడతో పాటు ఒక పది ఏళ్ల పిల్లాడు ఆవిడ కూడా వస్తుండే వాడు. వాళ్ళ అమ్మతోపాటు ఆ కుర్రాడి కూడా గ్లాసుడు నిండా కాఫీ పోసి ఇచ్చేది మా వదినగారు. ఆ కుర్రాడు పెరిగి పెద్దవాడై ఒక ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఈ మధ్య కాలంలో మా ఇంటికి వచ్చినప్పుడు ఆ సంఘటన గుర్తు చేశాడు.
మీ వదిన గారు చాలా మంచివారండి గ్లాసు నిండా కాఫీ పోసి ఇచ్చేవారు మాకు అప్పట్లో అంటూ గుర్తు చేశాడు ఆ విషయం. నిజానికి ఆవిడ ఈ లోకంలో లేదు కానీ ఆ మంచి పని వాడికి గుర్తుంది. ఇది ఒక్క రోజు కాదు. ప్రతిరోజు అదే పని. అందుకే వాడికి బాగా గుర్తుంది . అది గుర్తుపెట్టుకోవడం వాడి సంస్కారం.
కాఫీ ఒక అలవాటు కాదు. ఒక భావోద్వేగం. ఓ బంధం! తెల్లవారుజామున మనసును తట్టి లేపే మంత్రం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి