ఇది ఏమి ఉప్మా చెప్మా!
ఇది ఏమి ఉప్మా చెప్మా!
ప్రతిరోజు ఇంటి ఇల్లాలికి అనేక సమస్యలు. ఏమిటా సమస్యలు? ఆర్థిక సమస్యలు కాదు. అల్పాహారం సమస్యలు. పదుగురు మెచ్చే అల్పాహారం చేయాలని తాపత్రయం. అందుకే ప్రతి ఉదయం కాఫీ తాగిన వెంటనే ఇవాళ ఏం టిఫిన్ చేసుకుందాం అoటు పిల్లలు మరియు భర్త మనోగతం తెలుసుకుంటుంది. ఎవరు ఏమి చెప్పకపోతే మౌనంగా తనకు నచ్చినది తయారు చేసుకుంటుంది. ఇంటి పనులతో అలసిపోయి ఉంటే కాస్తంత ఉప్మా కలియబెట్టి పెట్టేస్తుంది. ఆ అల్పాహారం చూడగానే కుటుంబ సభ్యుల మొహాలు మాడిపోయిన పెసరట్టులా అయిపోతాయి. అయినా తప్పదు మరి. అయితే ఒకటి ఉంది చెయ్యి తిరిగిన ఇల్లాలు చేసిన ఉప్మా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
ఇప్పుడైతే రకరకాల టిఫిన్లు వచ్చేయ్ గాని ఒకప్పుడు సదరు ఉప్మాయే పెళ్లి వారికి అల్పాహారం. ఆకుపచ్చటి అరిటాకులో నూనెలో తేలియాడుతూ తెల్లగా మెరిసిపోయే ఆ ఉప్మా ఆ పెళ్లి వారికి అమృతమే.ఆ రోజులు కాబట్టి అలా ఉండేది. ఈ రోజుల్లో ఉప్మా చూస్తే తేలికగా చూస్తారు. పెసరట్టు కాంబినేషన్తో అయితే మారు అడుగుతారు. మాట్లాడకుండా తినేస్తారు. అప్పట్లో ఈ ఉప్మాలో పసుపు రంగులో మెరిసిపోయే శనగపప్పు తప్ప ఈ రోజుల్లో లాగ రకరకాల పప్పులు ఉప్మా తో పాటు ఉడికేవు కాదు.
ఉప్మా ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు. దాని కథ గూగుల్ తల్లిని అడిగి తెలుసుకోవాల్సిందే. లేదంటే ఆ కథలు చెప్పే పెద్దవాళ్ళు కూడా ఎవరూ లేరు.
అకస్మాత్తుగా వచ్చే అతిధులకి చేసే అతిధి సత్కారానికి అతి ముఖ్య ఫలహారo ఈ ఉప్మా . ఆకాశంలో ఉండే చందమామ లాగా ప్లేట్లో మెరిసిపోతూ నాలుకకి కమ్మటి రుచినిచ్చి పంటికి ఎక్కువ శ్రమ లేకుండా అతి సులువుగా గొంతులో నుండి పొట్టలోకి జారిపోయి ఆకలి తీర్చే అతి సులువైన తెలుగు వారి వంటకం ఉప్మా. తయారు చేయడo ఇల్లాలికి కష్టమైన పని కాదు. నేర్చుకోవడం అతి సులువు. ఇది తింటే అతిధికి కూడా ఆకలి తొందరగా వేయదు. ఇన్ని సుగుణాలతో ఉన్న మన తెలుగువారి ఉపాహారం ఉప్మా ని ఎలా మర్చిపోగలం.
మన పంటికి రుచికరమైన ఉపాహారం తయారు చేయడానికి రోజు ఎన్ని వస్తువులను బాధ పెట్టాలో. పొయ్యి మీద బాణలిని వేడెక్కించి అందులో నూనెను మరిగించి పోపు డబ్బాను గుమ్మరించి పెరట్లో ఉన్న సువాసన ఇచ్చే కరివేపాకు నిర్దాక్షిణ్యంగా అందులో వేయించి నీళ్లు పోసి కెరటాలు కొట్టేవరకు మరిగించి తెల్లటి నూకని అందులో పోసి గరిటతో కలియ తిప్పుతూ అన్నట్టు మర్చిపోయాను మధ్యలో జీడిపప్పును తగిలించి ముక్కుకి కమ్మటి ఉడికిన వాసన తగిలే వరకు ఉంచి పొయ్యి మీద నుంచి దించి కాస్తంత అల్లం పచ్చడి వేసుకుని తింటే నా సామి రంగ నేను చెప్పలేను ఎవరి అనుభవం వారిది. అమ్మ దీని పేరు ఏంటి అని అడిగితే జీడిపప్పు ఉప్మా అని అమ్మ చెప్పింది.
ఎప్పుడూ ఇదే ఉప్మా అంటే అమ్మ కాసిన్ని టమాటా ముక్కలు వేసి సరుకులన్నీ యధావిధిగా వేసి పద్ధతి మార్చకుండా టమాటా బాత్ అని చెప్పి ఉప్మా తినిపించింది.
మనుషుల్లో నలుపు తెలుపు రంగుల మనుషులు ఉన్నట్లే ఈ ఉపాహారం తెల్ల నూకను దూరం పెట్టి గోధుమ నూకను ఒడిలో చేర్చుకుని ఎర్ర ఉప్మా గా పేరు తెచ్చుకుంది. తయారు చేసే పద్ధతి అంతా షరా మామూలే. జీడిపప్పును దూరం పెట్టి పల్లీల్ని దగ్గర చేర్చుకుని క్యారెట్టు టమోటా కూరగాయల ముక్కలను కలుపుకొని నాలికకి రుచి పెంచడంతోపాటు ఒంటికి బలాన్ని కూడా ఇస్తుంది ఈ గోధుమ ఉప్మా. కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు దరి చేర్చుకుని ఒంటికి చలవ నిస్తుంది..
అత్తయ్య రాత్రి ఇడ్లీలు మిగిలిపోయాయి! మళ్లీ పొద్దున్న ఇడ్లీ ఎవరూ తినరు ఏం చేయాలి అని అడిగే కోడలికి బాధ్యతగల మరియు అనుభవం ఉన్న అత్తగారు ఆ ఇడ్లీల జీవితాన్ని ముక్కలు చేసి ఉప్మాగా అవతారం మార్చి కాస్తంత కొబ్బరి శనగపప్పు కలిపిన పచ్చడి తగిలిస్తే పిల్లల మాట్లాడుకుండా తింటారు అంటూ చెప్పే అత్తగారి సలహా మెచ్చుకోదగినది.
మరి ఉప్పు పిండికి ఉప్మా కి తేడా ఏమిటని అని అడిగే కొత్త కోడలు ప్రశ్నకి అత్తగారు సమాధానం మీరు కూడా వినండి. ఏమి ఉందమ్మా పోపు సామాను తో పాటు బియ్యం నూక పోసి ఉడికిస్తే అది ఉప్పు పిండి అంటూ తేలిగ్గా సమాధానం చెప్పింది అత్తగారు.
అరగంటలో తయారైపోయే ఈ ఉప్మాని మరి పావుగంటలో చేయడం ఎలాగా అని ఆలోచిస్తే ఎదురుగుండా డబ్బాలో అటుకులు డబ్బా కనపడింది. ఇంకేముంది పోపు సిద్ధం చేసి అటుకులకు స్నానం చేయించి కాస్తంత చింతపండు రసం తగిలించి కాస్తంత బెల్లం జోడించి కనబడిన పప్పులన్నీ అందులో కుమ్మరించి గరిట పెట్టి కలియబెట్టి పది నిమిషాల్లో ప్లేట్లో పెట్టి కుటుంబ సభ్యులకి అందిస్తే చివరికి సరుకు లేదనిపించారు. అది అటుకుల ఉప్మా మజా.
సరే రకరకాల ఉప్మాలు నాలుకకి రుచి చూపించాం. మరి నేను కూడా మీ ఉపాహారానికి ఆధారాన్ని అవుతానంటూ ముందుకొచ్చిన సేమ్యాని ఒకసారి ప్రయత్నిస్తే అది సేమ్యా ఉప్మా అయింది. పాయసంతోటి పరమానందాన్ని తెచ్చిన సేమ్యా ఉప్మా లో కూడా అద్భుతమైన రుచిని ఇచ్చింది. ఇది సేమ్యా ఉప్మా.
మరి ఇంకా సగ్గుబియ్యం పరమాన్నం అంటే మొగ్గు చూపుతాం గానీ ఇంకా ఉప్మా వైపు చూడలేదు. రాయలసీమ వారితో సంబంధం కలుపుకున్నాక ఉగ్గాని తినిపించారు. అది మరమరాలు తోటి.
నేను తిన్న ఉప్మా లన్ని చెప్పేశాను. ఎప్పుడూ తయారు చేయలేదు లెండి. వెరైటీ ఉప్మా ఉంటే మీరు చెప్పండి. అందరూ తిని ఆనందిద్దాం.
ఆఖరిగా ఒక మాట నూక ఉడకాలంటే కాక మీద ఉన్న నూనె బాగా పొయ్యాలి. బాగా కలుపుతూ ఉండాలి. లేకపోతే అది ఉప్మా కాదు. ఉండ కింద మారిపోతుంది. ఎంత నూనె పోస్తే అంత రుచి. అందుకే నూక ఉప్మా కంటే అటుకుల ఉప్మా ఎంతో మేలు.
తెల్లటి ఉప్మా పక్కన నల్లటి అల్లం పచ్చడి అదిరిపోతుంది. అటుకులు ఉప్మాకి తోడు ఎవరూ అక్కర్లేదు. ఎర్ర నూక ఉప్మా తో
కొబ్బరి శనగపప్పు కలిపిన పచ్చడి కాంబినేషన్ అదుర్స్. ఆకలేసినప్పుడు కాంబినేషన్ లేకపోయినా పర్వాలేదు. అప్పుడు అన్ని రుచులు ఉప్మా లోనే ఉంటాయి. అదే అమృతంలా అనిపిస్తుంది.
ఎప్పుడూ కథలు చెప్పే మీరు ఉప్మా మీద పడ్డారేమిటి ? అన
సందేహానికి నా సమాధానం ముఖచిత్రంలో శ్రీ పార్థసారథి గారి
పెట్టిన మన ఉప్మా బొమ్మ నన్ను ఈ ఉప్మా వైపు మళ్ళించింది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి