ఆశయం

ఆశయం.

అందాల రంగురంగుల బల్బుల వెలుగులో ఆ బహుళ అంతస్తుల భవనం మీద అందంగా మెరిసిపోతున్న" పరంధామయ్య నిలయం "అనే పేరు చూసి ఆనందపడిపోయాడు రఘురామయ్య. 

ఎన్నో ఏళ్ల కలల ఫలితం. ఎన్నో సంవత్సరాలు వంటరితనంతో బాధపడిన రఘురామయ్య తొమ్మిది కుటుంబాలతో కాపురం ఉంటున్నాడు. వాళ్లు రక్త సంబంధీకులు కాదు. దూరపు బంధువులు మరియు స్నేహితులు. అయినా కావాలని అందర్నీ ఒక చోటుకు చేర్చాడు. పదిమందితో కలిసి ఉండాలని జీవితాశయం. తనకంటూ ఎవరూ తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా కట్టుకున్న భార్య లేకపోయినా ఇవాళ నా వెనుక తొమ్మిదికుటుంబాలు వాళ్ళు ఉన్నారని ఆనందం రఘురామయ్య కళ్ళల్లో కనబడుతోంది ఆ అపార్ట్మెంట్ చూసి. పిల్లలు సందడితో అపార్ట్మెంట్ అంతా కళకళలాడి పోతోంది. 

 ఒంటరితనం నిజంగా అంత భయంకరమైనది. డబ్బు ఒంటరితన్నాన్ని దూరం చేయలేదు. వ్యసనాలు ఒంటరితనాన్ని దూరం చేస్తాయని చాలామంది దానికి అలవాటు పడతారు. కానీ ఆ కొద్ది సేపే అది తోడు ఇస్తుంది కానీ ఆ తర్వాత మామూలే. ఎవరు ఒంటరితనాన్ని కోరుకోరు. 

జీవితంలో ఎవరికి ఏది వ్రాసిపెట్టి ఉంటే అదెలా జరిగిపోతుంది. దాన్ని ఆపే శక్తి ఎవరికీ ఉంటుంది. ఏది మన ప్రయోజకత్వం కాదు. ఏదో తెలియని శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందులోనూ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం కావడం వయసు మీరి పోయి తల్లి తండ్రి కాలం చేయడం చూసే వాళ్ళు చేసే వాళ్ళు లేక పెళ్లి కాకపోవడం ఇవన్నీ ఒంటరి వాడిని చేసేయ రఘురామయ్యని.

రఘురామయ్య తండ్రి పరందామయ్య ఒక ప్లీడరు దగ్గర గుమస్తాగా పనిచేస్తుండేవాడు. స్వతహాగా ఆస్తిపరుడు కాకపోయినా వృత్తిలో చాలా నైపుణ్యంతో వ్యవహరించి వచ్చిన వాళ్ల దగ్గర డబ్బు బాగా గుంజుతూ సంపాదనకు బాగా అలవాటు పడిపోయాడు. చాలా సంవత్సరములు అద్దె ఇంట్లో ఉన్న తర్వాత అదృష్టం కలిసి వచ్చిందేమో కాకినాడ లో ఐదువందల గజాల స్థలం సంపాదించుకున్నాడు. ఎప్పటికైనా అందమైన ఇల్లు కట్టుకోవాలని కలలుకని స్తోమత సరిపోక అద్దెలు భరించలేక ఆ స్థలంలో ఒక పెంకుటిల్లు మాత్రమే కట్టుకుని ఆనందంగా కాలక్షేపం చేస్తుండేవాడు. 

పరంధామయ్య కూడా తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. దూరపు బంధువులు తప్పితే. కానీ వృత్తి రీత్యా ఎంతోమందితో పరిచయాలు ఉండేవి. అలా పరంధామయ్యకి చాలా రోజులకి పుట్టిన రఘురామయ్యని చాలా గారాబంగా పెంచుతూ లాయర్ చేయాలని కలలు కంటూ ఉండేవాడు. రఘురామయ్యకి చిన్నప్పటినుంచి స్నేహితులు అంటే చాలా ఇష్టం. 
బడిలో ఉన్నంతసేపు చుట్టూ చాలా మంది స్నేహితులు ఉండేవారు. ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఆడుకోవడానికి ఎవరు ఉండేవారు కాదు. దూరంగా వెళ్ళవలసి వచ్చేది. కారణం ఆ ప్రదేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రదేశం. అందరూ స్నేహితులు స్కూలుకు సెలవు ఇచ్చినప్పుడల్లా అమ్మమ్మగారింటికి మామ్మగారింటికి వెళ్లేమని చెబుతుంటే రఘురామయ్య వాళ్ల మాటలు అలా వింటూ ఉండి పోయేవాడు. ఎందుకంటే ఎప్పుడూ సెలవులకి తల్లిదండ్రులు ఎక్కడికి తీసుకెళ్లలేదు. కారణం తండ్రి తరఫు వాళ్ళు కానీ తల్లి తర పు వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఎవరో దూరపు బంధువులు తప్పితే ఎవరూ లేరు పాపం. 

అయినా చదువు మీద శ్రద్ధతో స్కూల్ విడిచి కాలేజీ మెట్లు ఎక్కిన దగ్గర్నుంచి కాలేజీ పుస్తకాలతో పాటు గ్రంథాలయంలో అనేక మంచి మంచి రచనలు చదువుతూ విజ్ఞానం పెంచుకున్నాడు రఘురామయ్య. జీవితం అంటే ఏమిటి. మనిషి అంటే ఏమిటి? సంఘంలో మనిషి పాత్ర ఏమిటి?. సంఘం లేకుండా మనిషి ఉండలేడా! ఇలాంటి అనేక విషయాలు మీద కాలేజీల్లో జరిగే డిబేట్లో పాల్గొంటూ ఉండేవాడు.  

 వంటరితనాన్ని దూరం చేసుకోవడం కోసం అలవాటు చేసుకున్న పుస్తక పఠనం రఘురామయ్య జీవితాన్ని మలుపు తిప్పింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన తర్వాత సంవత్సరం పాటు కోచింగ్ తీసుకుని సర్వీస్ కమిషన్ పరీక్షలు వ్రాసి సబ్ రిజిస్టర్ గా ఉద్యోగం సంపాదించుకున్నాడు.
బ్రతకడానికి ఆధారం దొరికింది కానీ వయసుకి ఒక తోడు దొరికే ప్రయత్నం చేసిన ఎందుకో ఫలించలేదు. ఎన్నో సంబంధాలు చూసాడు. అమ్మాయి నచ్చక ,కుటుంబం నచ్చక ఇలా రకరకాల వంకలతో కాలం గడిచిపోయింది. 

ఈలోగా వయసు మీరి తల్లిదండ్రులు ఒకరు తర్వాత ఒకరు కాలం చేయడం రఘురామయ్యని మరింత ఒంటరి వాడిని చేసింది. తల్లి తండ్రి పోయిన తర్వాత ఆ నలుగురు కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది పాపం. ఆ కబురు తెలియచేయడానికి ఎవరి అడ్రస్ లు తెలీక పరంధామయ్య బీరువా వెతుకుతుంటే ఒక డైరీ దొరికింది. అదే ఆధారం. బంధువుల సమాచారం కోసం.

 తల్లి తండ్రి బతికున్నప్పుడు ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా వచ్చేవాళ్ళు తప్పితే అంత రక్తసంబంధీకులు ఎవరూ లేరు. ఏదైనా శుభకార్యం జరిగితే బంధువులు పనిగట్టుకుని వస్తారు. ఎందుకంటే బంధుత్వం నిలబడుతుందని. మరి అటువంటి శుభకార్యాలు ఏవి జరగలేదు ఆ ఇంట్లో . తల్లి తండ్రి బతికున్నప్పుడు దూరపు బంధువులు ఎవరైనా పసుపు కార్డు వేయడం పాపం వెళ్లి వస్తుండేవారు. 

అలా తల్లితండ్రి చనిపోయిన తర్వాత ఇంక పూర్తిగా అంకితం అయిపోయాడు రఘురామయ్య. నేను అటువంటి వాడిని కాదురా! అని మొత్తుకున్న సాయంకాలానికి జేబులు నింపే ఉద్యోగం అది. నిత్య పంట. ఖర్చు ఏముంటుంది? ఒంటరి వాడు. రాత్రి పది గంటల వరకు ఆఫీసు తోటే గడిచిపోయేది.
ఆ తర్వాత నిద్రా దేవత తోడు. తెల్లవారి లేస్తే మామూలే.

అలా జీవితం అంతా గడిపేసి అరవై సంవత్సరములు నిండేసరికి ప్రభుత్వం వారు ఇచ్చే పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్ లు,  
రెండు చేతులా సంపాదించిన సొమ్ము కాకినాడలో ఉన్న అయిదు వందల గజాల స్థలం ఇవి మిగిలే యి రఘురామయ్యకి. కానీ పలకరించే నాథుడు లేడు. ఇప్పుడు ఎవరినైనా తోడు తెచ్చుకుందాం అంటే ఇది వయసు కాదు. మరి ఏం చేయాలి?

 అనాధ శరణాలయంలో చేరిపోదాం అంటే ఈ సొమ్ము అంతా ఏం చేయాలి? ఏదో ఒక మంచి పని చేయాలి. పదిమందికి ఉపయోగపడాలి. మీ స్థలంలో ఒక మంచి అపార్ట్మెంట్ అవుతుందండి! అంటూ రోజు పని మీద రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చి ఒక బిల్డర్ అంటూ ఉంటే అపార్ట్మెంట్ కడతాం బానే ఉంది కట్టి ఏం చేయాలి? అనేవాడు ఉద్యోగం చేసే రోజుల్లో.  

ఇప్పుడు అపార్ట్మెంట్ కడతాడు ఒక ప్లాట్ లో తను ఉంటాడు బాగానే ఉంది మరి మిగిలిన ప్లాట్లు అద్దెకిస్తాడు. సొమ్ము బాగానే వస్తుంది. కానీ సొమ్ము కోసం కాదు కదా!. జనం కోసం. ఇది చాలామందికి హాస్యాస్పదంగానే ఉంటుంది. కానీ ఒంటరితనం అనుభవించిన వాడికే తెలుస్తుంది. ఇలా రెండు సంవత్సరాలు ఆలోచించి కాకినాడలోని స్థలంలో సొంత సొమ్ము తోటి పది ప్లాట్లతో" పరంధామయ్య నిలయం "నిర్మాణం చేశాడు. అయితే అక్కడి నుంచి తక్కువ ఆదాయo తో కాకినాడలో ఉద్యోగం చేసి అద్దెలు కట్టుకోలేకుండా ఉండే దూరపు బంధువులను స్నేహితులని తొమ్మిది కుటుంబాల వాళ్ళని అతి కష్టం మీద సేకరించి " పరంధామయ్య నిలయం" లో గృహప్రవేశం చేయించాడు. కానీ వాళ్ళ దగ్గరి నుంచి నెలకు వెయ్యి రూపాయిలుమాత్రమే అద్దె వసూలు చేసేవాడు.

ఉదయం లేస్తూనే అందర్నీ పలకరిస్తూ అందరి తలలో నాలుకలో ఉంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ కాలక్షేపం చేసేవాడు. అలా వాళ్లతోటి అనుబంధం పెరిగింది. ఏదైనా అంతే మనం ఇతరులతో ప్రవర్తించిన తీరు విధంగానే వాళ్లు కూడా ఉంటారు.

రఘురామయ్య గురించి తెలిసిన వాళ్ళు పాపం మనుషుల కోసం వెతుకుతున్నాడు కాబోలు ఒంటరితనం భరించలేక అయినా ఈ రోజుల్లో ఇటువంటి వాళ్ళు చాలా అరుదు అనుకుని తమకు వచ్చిన అవకాశాన్ని ఆనందంగా స్వీకరించారు.

అలా నిండుగా ఉన్న ప్లాట్లు చూసి రఘురామయ్య గుండె సంతోషంతోటి ఉప్పొంగిపోయింది. తెల్లవారి లేస్తే తాతయ్య అని పిల్లలు ,బాబాయ్ అని పెద్దవాళ్ళు ,మామయ్య గారు అని ఆడవాళ్లు ఇలా ఒక్కొక్కరు బంధుత్వాలు పెంచుకొని పిలుస్తూ ఈ వయసులో మీరు హోటల్ తిండి ఎందుకు అండి మేము పంపిస్తాం అంటూ పూట పూట ఇంటి భోజనం పెడుతుంటే ఉప్పొంగిపోయాడు . ఇంటి భోజనం తిని ఎన్ని రోజులైందో! అలాగే పిల్లల తోటి కాలక్షేపం చేస్తుంటే సమయమే తెలియట్లేదు రఘురామయ్యకి. 

అలా కొన్ని సంవత్సరాలు గడిచేయి. ఇప్పుడు రఘురామయ్యకు మరొక సమస్య. తన తర్వాత వారసులు ఎవరు ఈ ఆస్తికి. కొంతమంది తనలాంటి వాళ్ళు గుడులకి గోపురాలకి అన్నదాన సత్రాలకి ఆస్తులు దానంగా ఇస్తారు. మరి ఏం చేయాలి? అని చాలా రోజులు ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు. అలా కొద్ది కాలం గడిచిన తర్వాత జబ్బ పడి మంచం పట్టి ఒకరోజు ఆ తొమ్మిది కుటుంబాలు వాళ్లని సమావేశపరిచి తన నిర్ణయం చెప్పి కొద్ది కాలానికి చనిపోయాడు. ఆ తొమ్మిది కుటుంబాల వాళ్ళు తన వారసులని రఘురామయ్య అనుకుంటే, ఆ ప్లాట్ లో ఉండేవాళ్ళు రఘురామయ్యని దేవుడిచ్చిన బంధువు అనుకుని యధావిధిగా తమ కర్తవ్యం నిర్వర్తించి ఆనందంగా కాలక్షేపం చేసుకుంటూ తరతరాలుగా పరంధామయ్య నిలయంలోనే ఉండిపోయారు.

 ఎందుకంటే పరంధామయ్య నిలయం ఆనందంగా కాపురం చేయడానికి గాని అమ్ముకోవడానికి ఎవరికీ అధికారం ఇవ్వలేదు రఘురామయ్య. లోకంలో ఇలాంటి వాళ్ళు అరుదు. 

ఈమధ్య యూట్యూబ్లో ఒక వీడియో చూసా." అది అందరి ఇల్లు" . అక్కడ భాగ్యనగరానికి వచ్చేవాళ్ళకి ఉచితంగా వండుకు తిని అక్కడ పని పూర్తయ్యే వరకు ఉండడానికి వసతి కూడా కల్పించాడు ఒక మహానుభావుడు. ఆ మహానుభావుడిని మనస్ఫూర్తిగా అభినందించడం తప్ప ఏం చేయగలo. అందుకే ఆయనకి ఈ కథ అంకితం. ఆయన పేరు నాకు తెలియదు. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట