పండుగలో పల్లె_టూరు

పండగలో పల్లె _టూరు

"ఊరూ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు "అంటూ మనవాళ్లు ఈ మధ్యన నా గురించి అందమైన పాట ఒక చలనచిత్రంలో చాలా గొప్పగా వ్రాశారు. అప్పటినుంచి పల్లె టూరు మొదలైంది.
పల్లెటూరు అంటే చుట్టూ అందమైన చెట్లు గలగల పారే సెలయేళ్లు పిల్ల కాలువలు చెరువులు పంట చేలు పాడి పశువులు అందమైన పెంకుటిల్లు విశాలమైన మనసులు ఆత్మీయమైన పలకరింపులు ఇవి నా గుర్తులు 

మామూలుగానే నేను చాలా అందంగా ఉంటాను. అందులో సంక్రాంతి పండుగ. పండగ అందం పల్లెటూర్లోనే కనబడుతుంది. నా వీధుల్లో ఉండే ఇళ్ళు తోరణాలతోటి, రంగుల తోటి ,వాకిళ్లు ముగ్గుల తోటి అందంగా మెరిసిపోతూ వంటగదిలన్నీ పిండి వంటల వాసనలతో నిండిపోతూ వచ్చే అతిధుల కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి

ఏదో వాహనం ఆగిన శబ్దం వినబడింది . డోర్ తీసి కళ్ళకు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని నలుగురు కుర్రాళ్ళు అందంగా బ్యాగులు భుజాన్ని తగిలించుకుని కారు దిగుతూ కనబడ్డారు. వీళ్ళు ఎవరబ్బా ఆనమాలు తెలియడం లేదు ఆ ఇంటికి వచ్చేవాళ్ళు నాకు తెలియని వాళ్ళు ఎవరుంటారు. ఇంట్లో తరాలు మారిన నేను మాత్రం మారలేదు కదా. 

ఎవరి పిల్లలు వీళ్ళు అని నాలో నేను అనుకుంటూ ఉంటే మన "ఊరంతా మారిపోయింది అమ్మ రోడ్లన్నీ చాలా బాగున్నాయి ప్రయాణం చాలా సుఖంగా జరిగింది అంటూ నా గురించి గొప్పగా చెబుతుంటే కొంచెం సేపు నన్ను నేను మర్చిపోయాను. వేషం భాష మారిపోయింది కానీ ఆ గొంతు ఎక్కడో విన్నట్లుగా ఉంది. ఆ గుర్తుకొచ్చింది ఈ ఇంటి యజమాని ముగ్గురు పిల్లలు చాలా రోజులు అయింది చూసి. మరి నాలుగో వ్యక్తి ఎవరు అని తెలుసుకునే లోపే అల్లుడుగారు లోపలికి రండి అంటూ ఇంటి యజమానులు ఆహ్వానించడం వినబడింది.

వీళ్లంతా చిన్నప్పుడు చెడ్డీలు వేసుకుని తోటలు దొడ్లు తిరుగుతూ కాలువలో ఈతలు కొడుతూ చెట్ల మీద నుంచి దూకుతూ కోతిమూకలా ఊరంతా పాడు చేసే కుర్రకారు వీళ్ళు. మూతి మీద మీసం మొలిచిన తర్వాత ఎర్ర బస్సు ఎక్కి పట్టణంలో చదువు ముగించుకుని విమానం ఎక్కి అమెరికా వెళ్లిపోయారు. పండక్కి నా దగ్గరికి వచ్చారు. జన్మభూమి కదా ఎలా మర్చిపోతారు. అబ్బా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అమ్మయితే ఆనంద భాష్పాలు రాలుస్తోంది. నేను రవివర్మ గీసిన మాటలు రాని అందాల బొమ్మని. ఏమి చేయగలను నేను. సరే వీళ్ళు ఒక కన్నతల్లి బిడ్డలు. ఏ ఊరు మీది అని ఎవరైనా అడిగితే నా పేరు చెప్పి అడ్రస్ కూడా చెప్పే వాళ్లు చాలామంది ఈ ఊర్లో అందరూ నా దగ్గరకు వచ్చేసారు. 

పండగ సందడి మొదలైపోయింది. అత్తవారింటికి తొలిసారిగా వచ్చిన అల్లుళ్లు, ఆడపిల్లలు నన్ను చూద్దామని వచ్చిన బంధువులతో మా ఇళ్లన్నీ కళకళలాడుతున్నాయి.. 

అరుగులన్నీ ఆడుకునే పిల్లలతోటి ,వాకిళ్ళన్ని పోటీపడి ముగ్గులు పెట్టే ఆడపిల్లల తోటి నిండిపోయే యి. ఈ రోజుల్లో అరుగులు ఎవరు కడుతున్నారు. ఆ పాత తరo ఇళ్ళల్లో తప్ప అరుగులు ఉండవు. పిల్లలందరూ ఊరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏమి తోచట్లేదు. పాపం వయసు మీద పడిన వాళ్ళు తొందరగా భోజనాలు చేసేసి టీవీలకు అతుక్కుపోతుంటే అరుగులన్నీ ఖాళీగా ఉండేవి ఇంతవరకు. ఇంక సందడే సందడి. రాత్రి పొద్దుపోయే వరకు ఏదో ఒక వాహనం నన్ను పలకరిస్తూనే ఉంది. ఈ నాలుగు రోజులు నాకు అలా సందడిగా ఉంటుంది. ఆ తర్వాత అంతా మామూలే. అమ్మో చాలా సమయం అయిపోయింది. రేపు భోగి పండుగ . మళ్లీ తెల్లవారుజామునే లేచిపోవాలి. లేదంటే ఆ గంప కింద కోడి ఊరుకోదు. ఆకాశంలో పక్షి అసలు సమయాన్ని మర్చిపోదు. పాకలో లేగ దూడ ఆకలేస్తుందని గుర్తు చేసేస్తుంది. 
నేను చాలా బాధ్యతగల దాన్ని . మా ఊరు జనానికి బాధ్యతలు గుర్తు చేసే దాన్ని. 

అదిగో అప్పుడే ఇళ్లల్లో లైట్లన్నీ వెలుగుతున్నాయి. అమ్మలు నిద్ర లేచిపోయినట్టున్నారు. దొడ్లో అల్లుడు గారికి పిల్లలకి పెద్దలకి తలంటు కార్యక్రమం మొదలైంది. పండగ మర్యాదలు ప్రారంభమైపోయాయి.
 పిల్లలు చలిలో తలంటుకోనని ఒకటే ఏడుపు. వీధిలో యజమానులు భోగిమంట వేయడానికి రెడీగా కూర్చున్నారు. ఏ వీధి చూసినా భోగి మంటలు హడావిడి. ఆకాశాన్ని అంటే ఎర్రటి మంటలు. పిల్లల కేరింతలు. ఎగిసిపడే మంటలని బుల్లి కెమెరాలో బంధించడానికి చేసే ప్రయత్నాలు మంటకి దూరంగా జరగండి అంటూ చెప్పే పెద్దవాళ్ల మాటలు ప్రతి వాకిట్లోనూ ఇదే హడావుడి. 
ప్రతి ఇంటి ముందు ఇంత హడావిడిగా ఉంటే సందు చివర పెద్ద భోగి మంట. అలా బుల్లి కెమెరా ని భోగిమంటతో నింపేసి 
బొ జ్జలోకి నాలుగు ఇడ్లీలు వేసుకుని నా మీద పడ్డారు జనం. కనబడిన మొక్క చెరువు చెట్టు పంట చేను ఆకాశంలో ఎగిరే పక్షిని పొలంలో మేత మేసే పశువుని చెరువులోని నీటిని ఎర్రకలవని పువ్వు మీద వాలిన సీతాకోకచిలుకని ఫోటోలు తీసేసి పల్లె టూర్ ప్రపంచానికి చూపించడం మొదలుపెట్టారు. అబ్బా నాకు చాలా గర్వంగా ఉంది నా పేరు వార్తల్లోకి ఎక్కింది . నా అందాలన్నీ ఎంతమంది చూస్తారో ఎన్ని లైకులు కొడతారో! ఏమిటో టెన్షన్ గా ఉంది. ఇంతవరకు నా అందం గురించి నాకు తెలియదు. 

ఏ సమయానికి ఏం జరగాలో అది జరగాలి కదా! అందుకే ఇంటికి చేరిపోయిన బంధువుల్ని పిల్లల్ని కాళ్లు కడిగించేసి అరిటాకుల ముందు కూర్చోబెట్టేసారు. మర్యాద మా ఊరు మర్యాద. ముందుగా కలిపిన ముద్దపప్పులోకి కమ్మగా ఉన్న దొడ్లో పశువుల పాల నుండి తీసిన వెన్న కాచిన నెయ్యి గుత్తి వంకాయ కూర లోకి పప్పు నూనె ఆవకాయ దప్పలం లోకి అప్పడం మల్లె పువ్వు లాంటి అన్నం ఆ మూల ఏదో పరమాన్నం చివర్లో కమ్మటి గడ్డ పెరుగు.

  అల్లుడు గారిని మాటిమాటికి కొంచెం వేసుకోండి కొంచెం వేసుకోండి అంటూ మర్యాదలు నవ్వులు కేకలు తో ఊరు మారుమోగిపోయింది. ఈ పిల్లలు ఇలా ఆనందంగా భోజనం చేసి ఎన్నాళ్ళై ఉంటుందో. రోజు ఆఫీసులో లంచ్ రూమ్ లో పని గురించి మాట్లాడుకుంటూ ఏం తింటారు వీళ్ళు.ఎవరికి స్థిమితం లేదు. 
అలా కడుపునిండా తిని శ్రీమతి అందించిన తమలపాకు చిలకల్ని నములుతూ గదిలోకి చేరి అబ్బా ఎవరైనా చేసుకుంటే పల్లెటూరు సంబంధమే చేసుకోవాలి. ఏమి మర్యాదలు ఏమి భోజనాలు ఏమి సందడి అని అనుకుంటున్న అల్లుడు గారి మాటలు నాకు ఆనందంగా తోచెయ్. 

మధ్యాహ్నం అల్లుడు గారికి ఏంటి మర్యాద అనుకుంటూ ఆలోచిస్తున్న ఇంటి యజమానురాలు ఏం చేస్తుందని చూస్తుంటే గూట్లో పూతరేకులు డబ్బా జంతికలు డబ్బా కనబడింది. పాపం ఎన్నాళ్ళయిందో పట్నం నుంచి వచ్చిన అల్లుడుగారు గట్టిగా ఒక గంట కునుకు తీసిన తర్వాత మొహం కడుక్కుని వచ్చేటప్పటికి ప్లేట్లో పూతరేకులు జంతికలు అందిస్తూ అత్తగార్లు బాబు బజారు సరుకు కాదు ఇంట్లో చేసినవే తినండి అంటే రుచిచూసిన అల్లుడుగారు మారు ఒడ్డిస్తుంటే మొహమాట పడలేదు.

 అలా అందరూ ఆత్మరాముడిని సంతృప్తి పరిచిన తర్వాత చిన్నప్పటి స్నేహితుల తో చె ట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది.

ఊరంతా తిరిగి అలిసిపోయి సాయంకాలానికి ఇంటికి చేరిపోయిన పండగ అతిధులు కాస్తంత ఆత్మా రాముడుని సంతృప్తిపరిచి నిద్రాదేవి ఒడిలోకి జారిపోతే సందడి అంతా ఆ రోజుకి సద్దుమణిగిపోయింది. భోగిమంటలన్నీ చల్లారిపోయాయి. 

మరునాడు మామూలుగానే తెల్లారింది .పండగ ఉన్న లేక పోయినా సూర్య భగవానుడి డ్యూటీ మామూలే. అయితే ఆ రోజుకో ప్రత్యేకత ఉంది. సూర్యుడు మకర రాశిలో సంచారం మొదలుపెట్టి లోకానికి ఉత్తరాయన పుణ్యకాలాన్ని, సంక్రాంతి పండుగను తీసుకుని వచ్చేసాడు. పండగ అతిథులకి పిండి వంటలు గతించిన పెద్దలకి తిలా తర్పణాలు పెట్టడంతో సందడిగా అయిపోయింది ఊరు. ఏడాదికో మారోచ్చే పండగ అంటూ బసవన్న నడిపించుకుని ఆ వీధి చివరి నుంచి ఈ వీధి చివరి వరకు తనకొచ్చిన సినిమా పాటని పాడుకుంటూ గంగిరెద్దును ఆడించుతూ గంగిరెద్దుల వాళ్లు అయ్యవార్లకు దండాలు పెట్టించి దందా చేయకుండా ఎప్పటిలాగే ఇచ్చినది పుచ్చుకొని ముందుకు సాగుతున్న దృశ్యం కన్నుల విందుగా అనిపించింది. 

ప్రతి ఏటా శ్రీశైలం నుండి మల్లన్ననీ ఎత్తుకుని వచ్చే వాళ్లు నా చుట్టూ తిరుగుతుంటే నాకు ఎంతో ఆనందం అనిపించింది. నేను ఎంత ధన్యురాలిని. ఒక పక్క నందీశ్వరుడు మరొక పక్కా మల్లికార్జున స్వామి కూడా మా ఇంటికి అతిధులుగా వచ్చారు. మరి నెల రోజుల నుంచి హరినామ స్మరణతో నా చుట్టూ తిరుగుతూ ఉన్న హరిదాసు నడవలేక రెండు చక్రాల బండికి దాసుడై బహుమానాలకి నా చుట్టూ తిరుగుతుంటే చూసే కుర్రకారుకి ఆనందకరంగాను పెద్దవాళ్ళకి ఒక వింత గాను అనిపించింది. ఏదైనా సంబరం వస్తే చాలు సినిమా పాటలతో హోరెత్తిపోయే రోజులలో నెల రోజుల నుంచి గుడిలో తిరుప్పావై వీధిలో హరిదాసు కీర్తనలతో చాలా ఆనందంగా ఉన్నాను. ఇది మన సంస్కృతి. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు నా ఒడి మాత్రమే.

మధ్యాహ్నం పులిహార బొబ్బట్లు తో అల్లుడు గారికి విందు పూర్తి చేసి అమ్మవారి గుడి దగ్గర జరిగే కోడి పందాలు చూడడానికి తీర్థంలో నచ్చినది కొనుక్కోవడానికి పిల్లలకి పెద్దలకి డబ్బులు ఇచ్చి పంపుతున్న ముసలి వాళ్ళను చూసి నాకు పట్టలేని ఆనందం కలిగింది. ఇది ఒక సరదా. కోడిపందాలు అంటే నాకు బాధే. ఆ మూగజీవులకు ఏమి తెలుసు. జాతి పౌరుషం తప్పితే. అంతవరకు వీధుల్లో దొరికినది ఏదో తింటూ కలిసిమెలిసి తిరిగే ఆ కోడిపుంజులు బరిలో దిగిన తర్వాత బద్ధ శత్రువులు అయిపోతాయి. ఎత్తుకు పై ఎత్తు. కత్తి గొంతులో దిగితే ఇంతే సంగతులు.

ఒక జీవి అన్యాయంగా చనిపోతుంటే ఎవరికి బాధ ఉండదు. అయినా ఏమీ చేయలేం. పండగ సందడి అంతా అక్కడే ఉంది. ఎటు చూసినా జనం. ఇలాంటి సంబరాలు అంటే నాకు అంబరం ఎక్కినంత ఆనందం. నా గ్రామస్తుల ఆనందమే నా ఆనందం. పండగ కాసేపు ఉంటే బాగుంటుంది అని అందరం అనుకుంటున్నా సూర్యుడు డ్యూటీ దిగిపోయాడు. ఏ పూట ఏ పని చేయాలో ఆ పూట ఆ పని చేయాలి. లేదంటే జీవన సమతుల్యం దెబ్బతింటుంది. ఇప్పుడు అలాగే ఉంది రాత్రిపూట డ్యూటీ చేసి పగటి పూట నిద్రపోయే వాళ్ల పరిస్థితి. నా అతిథులంతా మంచాలకి బందీలైపోయారు. చడి చప్పుడు లేదు.

నిన్నటి అలసట తో ఆలస్యంగా లేచిన అల్లుడుగారికి పిల్లలకి బంధువులకి నా అతిథులుకి ఇంటి యజమానులు ఇన్నాళ్లు తమకి తోడుగా ఉండి సహాయం చేసిన పశువులకు కృతజ్ఞతాపూర్వకంగా పూజలు చేయడం కనబడింది. ఇంకేముంది పూజలు అందుకున్న మా పశువులు ఇంస్టాగ్రామ్ లో ప్రపంచాన్ని చూస్తున్నాయి. అవి కూడా మా ఊర్లో ఈ పండక్కి అతిధులే. కనుమ నాడు మినుము తినాలని అత్తగారు చేసి పెట్టిన చిల్లు గారి కొరికి ఆహా ఏమి రుచి అంటూ అత్తగారిని మెచ్చుకోలుగా చూడడం నాకు ఆనందం అనిపించింది. కనుమనాడు కాకి కూడా కదల కూడదని పిల్లలు అమ్మకి ఆకబురు ఈ కబురు చెబుతూ రేపు వెళ్ళిపోతానే బాధతో అమ్మని అంటిపెట్టుకొని తిరగడం నాకు బాధగా అనిపించింది.

మూడు రోజుల పండగ మూడు రోజులపాటు మురిపించి బాధలన్నిటిని మరిపించి సందడిని రథం ఎక్కించి తీసుకొని పోయింది. ఇళ్లన్నీ నిశ్శబ్దం అయిపోయే యి . వీధులన్నీ వెలవెల పోయాయి. ఊరంతా మూగబోయింది. పండగ నాడు తప్పితే మామూలు రోజుల్లో నిశ్శబ్దంగా ఉంటుంది. వెళ్లే ముందు పిల్లల కళ్ళల్లో కన్నీళ్లు చూసి తల్లడిల్లి పోయాను. ఆడపిల్లలు మళ్లీ ఎప్పుడు వస్తారో అని తల్లులు మనవలిని వదల్లేక తాతలు స్నేహితులు మళ్లీ ఎప్పుడు కలుస్తారో అని మగ పిల్లలు ఇలా ఎవరికి వాళ్లే దిగాలుపడిపోయి వాహనాలు ఎక్కడానికి రెడీగా ఉన్నారు.

 ఒకరిని ఒకరు కౌగిలించుకుంటూ జాగ్రత్తలు చెబుతూ మళ్లీ పండక్కి వస్తావని చెప్పుకుంటూ తల్లితండ్రులకి ఆరోగ్య జాగ్రత్తలు చెబుతూ వాహనాలు ఎక్కి వెళ్ళిపోతుంటే నా గుండె చెరువు అయిపోయింది. మా ఊరిలో ప్రతి ఇంట్లో ఉన్న నడవలో భోగిపళ్ళు పోసుకోవడానికి కూర్చున్న బుడ్డి గాడు యువరాజులా కనపడేవాడు. ఆ బుడ్డి గాడు కూర్చున్న కొయ్యకుర్చి రాజు గారి సింహాసనంలా ఉండేది. పట్టు చీరలు కట్టుకొని సాంప్రదాయబద్ధంగా నగల ధరించి నట్టింట్లో తిరిగాడే ఆడపిల్లలు మహాలక్ష్మిలా కనపడ్డారు. ప్రతి ఇల్లు ఒక మహాలక్ష్మి పీఠంలా అనిపించింది. అడుగులకు మడుగులొత్తి అల్లుడు గారికి చేసే మర్యాదలకి నా మనసు పొంగిపోయింది. పాలేరు దగ్గర నుంచి ఇంటి యజమాని వరకు అందరికీ కడుపునిండా రుచికరంగా పరిశుభ్రంగా విందు భోజనం వండి పెట్టే ఇంటి యజమానురాళ్ల ను చూస్తే చాలా గర్వంగా అనిపించింది.
ఏదో ఏడాదికి ఒకసారి వచ్చి పిల్లలను చూసి నాకు సంతోషం వెళ్లే ముందు దుఃఖం కలగడం కొత్త ఏమీ కాదు. భోగిపళ్ళ పేరంటం బొమ్మలు కొలువు గొబ్బెమ్మలు అలనాటి సాంస్కృతి సాంప్రదాయాలను ఈనాటి వరకు కొనసాగిస్తూ ఆనందంగా పండగ జరుపుకున్నాను. నాకో భయం ఉంది సహజ సిద్ధంగా ప్రకృతి రమణీయత కలిగి ఉండే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి క్రమేపీ జారిపోతున్నాను. అయినా నా అందం తగ్గడం లేదు. మీరు మాత్రం పండక్కి రాకుండా ఉండకండి. రాకపోతే నేను మీ అమ్మ కూడా బాధపడతాం. 

ప్రతి పండక్కి పల్లెకు రండి. నిశ్శబ్దంగా ఉండే పల్లె వీధుల్ని సందడి చేయండి. ప్రకృతిని ఆస్వాదించండి . అమ్మని ఆనంద పరచండి. బంధువులను సంతోష పరచండి. ఆ ఊరిలో ఏముంది మనకి అనుకోకుండా ఒకసారి ఊరిని చూడండి వీలున్నప్పుడల్లా కాదు కాదు ప్రతి పండక్కి. ఆ అనుభవం వేరు. ఆ ఆత్మసంతృప్తి వేరు నేను మీ జన్మభూమి కదా! మర్చిపోకండి. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం