కాలమహిమ

కాల మహిమ

" అన్నింటికన్నా బలమైనది ఏది? అని అడిగారు తెలుగు ఉపాధ్యాయులు పదో తరగతిలోని పిల్లలకి తెలుగు పాఠం చెబుతూ. 

" అందరికన్నా బలమైన వాడు భీముడు ఒక విద్యార్థి లేచి చెప్పాడు. 

" కాదు మాస్టారు ఆంజనేయుడు ఇంకో విద్యార్థిని నువ్వు తప్పు చెప్పావు అని ఆ విద్యార్థి కేసి చూస్తూ. 

ఇంకెవరైనా చెప్పగలరా ! అని తరగతి గది అంతా చూశారు తెలుగు ఉపాధ్యాయులు. 

ఎప్పుడూ చివరి బెంచిలో కూర్చుని ఉండే కుర్రవాడు గబుక్కున లేచి అన్నిటికన్నా బలమైనది "కాలము" సార్ అన్నాడు.

నీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? అని అడిగారు మాస్టారు. 
మా అమ్మ చెబుతూ ఉంటుందండి. ఒకప్పుడు మాకు తినడానికి తిండి ఉండేది కాదట. ఇప్పుడు మా పరిస్థితి బావుంది . అంతా ఆ ఈశ్వరుడు దయ అని రోజు చెబుతూ ఉంటుందండి. కాలస్వరూపమే ఈశ్వరుడని మీరే చెప్పారు అని అన్నాడు ఆ కుర్రాడు. 
ఆ తెలుగు ఉపాధ్యాయుడు ఆ కుర్రవాడు తెలివితేటలకు ఆనందించి అభినందించి కూర్చోబెట్టాడు.

కాలం కళ్ళకి కనపడదు. అది ఏదో అదృశ్య శక్తి. కానీ అత్యంత బలీయమైనది. ఈ లోకంలోకి మనం తీసుకొచ్చేది తీసుకువెళ్లిపోయేది కూడా కాలమే. సమయం అయిందంటే ఒక క్షణం కూడా ఉంచదు.

కాలం గమనించలేని వేగంతో పరుగులు తీస్తూ మన జీవితాన్ని మౌనంగా నిర్దేశించే అద్భుత శక్తి. ఒకప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటే మనకి బాధ కలుగుతుంది సంతోషము కలుగుతుంది. 

కాలం చేసే మాయలు మహిమలు అద్భుతాలు ఎవరికి అర్థం కావు. ఒక క్షణంలో మన జీవితంలో ఏది జరుగుతుందో మనకు తెలియదు. కాలానికి ఎదురు వెళ్లే శక్తి ఎవరికీ లేదు.

కాల మహిమ వలన మంచి వాడు చెడ్డవాడైపోతాడు. అన్ని వ్యసనాలు ఉన్నవాడు అన్ని వదులుకొని మంచివాడిగా మారిపోతాడు. 

కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. మన రోజులు బాగున్నప్పుడు విర్రవీగిపోకుండా కాలం పట్టే బాధలు భరించలేనప్పుడు బాధపడకుండ ఉండడం నిజమైన విజ్ఞత.

కాల ప్రవాహంలో జరిగే సంతోషాలు నష్టాలు, కష్టాలు బాధలు భయాలు అన్ని మర్చిపోతాం. కాలం అలా మనల్ని మరిపించకపోతే ఒక్క అడుగు ముందుకు వేయలేం. అదేనండి కాల మహిమ. 

కాలం బాగుండాలంటే ఏం చేయాలి. మనిషిగా పుట్టిన తర్వాత నీ ధర్మం ఏది ఉంటే అది పాటించి మౌనంగా ఉండడమే. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మన కర్తవ్యాన్ని బాధ్యతను మటుకు మర్చిపోకూడదు అని అంటారు పెద్దలు. 

కాలం ముందు మనం ఎంత? మనం మానవమాత్రులo . దైవ సమానులు మహా బలవంతులు అయినవారే కాల మహిమకు తలవంచారు. 

విలువిద్యలో అర్జునుడు ని మించినవాడు లేడు. మత్స్య యంత్రాన్ని పడగొట్టినవాడు. శ్రీకృష్ణ పరమాత్మ కి అత్యంత ఆప్తుడు. అయినా పేరు మార్చుకుని రూపం మార్చుకుని ఊరు మార్చుకుని ఒక అజ్ఞాత వ్యక్తిగా కాలక్షేపం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. 

రేపే పట్టాభిషేకం అనుకున్నారు. కానీ తెల్లారేసరికి కాల మహిమ వలన నార చీరలు ధరించి అరణ్యవాసం చేయవలసి వచ్చింది శ్రీరామచంద్రమూర్తికి. అక్కడి నుంచి అన్ని కష్టాలే. అన్నీ మౌనంగా భరించి మానవాళికి మార్గదర్శకుడు అయ్యాడు శ్రీరామచంద్రమూర్తి. 
పంచ పాండవులు అందరూ చూస్తుండగానే ద్రౌపదికి ఘోర అవమానం జరిగింది. అది కూడా కాలమహిమే. 

శ్రీకృష్ణ పరమాత్మకే తప్పలేదు నీలాప నిందలు. మనం ఎంత మానవ మాతృలం. 

ఇలా చరిత్ర చదువుకుంటూ పోతే అహింసతో దేశానికి స్వాతంత్రం సంపాదించిన గాంధీ మహాత్ముడు లాంటివాడిని తుపాకీ గుళ్ళకు బలి చేశారు. ఏమిటి చెప్పండి. 

దేశ ప్రధానులైన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలు కూడా తుపాకీ గుళ్ళకు బలైపోయారు. చుట్టూ ఎన్ని రక్షణ వలయాలు ఉన్నప్పటికీ.

రోజు ప్రయాణించే విమానమే కానీ ఆరోజు చేసిన ప్రయాణం ఆఖరి ప్రయాణం అవుతుందని ఎవరు ఊహించగలరు. పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతా కాల మహిమ. 

కాలం బాగుండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా నీది పిచ్చి ప్రశ్న అని సమాధానం ఇస్తారు. ప్రత్యేకమైన పూజలు వ్రతాలు నోములు ఏవి ఉండవు.. కాలస్వరూపమే ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు కాళ్లు పట్టుకొని వదలకుండా ఉండడమే. అంతకంటే మనం ఏం చేయగలం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. 

మనం నాటిన మొక్క ఎప్పటికో కానీ అమృత ఫలాలు ఇవ్వదు. అంతవరకు వేచి ఉండడమే. ప్రతిక్షణం వృధా చేయకుండా కృషి చేస్తూ దైవం మీద నమ్మకం పెట్టుకుంటూ ముందుకు నడుస్తుంటే కాలము యొక్క మనసు కరిగి మంచి చేస్తుంది. 

మనం నిమిత్తమాత్రులం. కాల ప్రవాహంలో ముందుకు సాగిపోవడమే తప్పితే మనం ఆగిపోయిన మన కాలo ఆగదు.
అందుకే అన్నిటికన్నా కాలం బలీయమైనది. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట