స్వర్గం

స్వర్గం.

గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అందులో ఉండే వాళ్లు కష్టాలు అనుభవించినప్పటికీ అది వాళ్ళకి స్వర్గసీమే.
స్వర్గంలో ఏముంటుందో మనకు తెలియదు. కానీ ఆ ఇల్లు ఆప్యాయత అనురాగం అనుబంధం ప్రేమ కొంచెం కోపం అన్ని రుచి చూపించిన ప్రదేశం. రుచి చూపించడం ఏమిటి సంపూర్ణంగా అనుభవించిన ప్రదేశం. అందుకే ఆ ఊరు వదిలేసి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మా ఇంటి మీద మమకారం తలుచుకున్నప్పుడల్లా ఉత్సాహం ఈనాటికి ఇంకా అలాగే కొనసాగుతూ ఉన్నాయి.. అది ఆ ఇంటి మహత్యం. ఆ ఇల్లు కట్టిన వాళ్ళ మనసు అటువంటిది. అది ఇటుకలతో కట్టిన ఇల్లు కాదు. ప్రేమ ఆప్యాయత అనుబంధం అనురాగం వీటితో కట్టిన ఇల్లు.

ఆకాశ వీధిలో ఆహారం వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు ఎగురుకుంటూ వెళ్లే పక్షి సాయంకాలానికి ఆ చెట్టు కొమ్మకు చేరినట్లే ప్రతివాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తమ గూటికి చేరవలసిందే. ఎక్కడా పట్టుమని పది రోజులు ఇల్లు విడిచి ఉండడం అంటే చాలామందికి బెంగ. అది రెండు గదులు ఇల్లు అయినా మైసూర్ ప్యాలెస్ అయిన ఒకటే విధంగా ఉంటుంది మమకారం. ఎందుకంటే అది అలవాటైన ప్రదేశం. ఇంటితో అంత అనుబంధం ఉంటుంది ప్రతి ఒక్కరికి.

సుమారు రెండు పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు ఆనందంగా కాపురం చేసిన ఇల్లు. ఇల్లు అంటే పిల్లలతోటి కళకళలాడుతూ ఉండాలి అనేదానికి ఉదాహరణ మా ఇల్లు. అన్ని వయసుల వాళ్ళు అందులో ఉండేవారు. ఇద్దరు అన్నదమ్ములు పిల్లలతో ఆనందంగా కాపురం చేసిన ఇల్లు. ఒకరి కోసం ఒకరు బతకాలి కలిసిమెలిసి ఉండాలి అనే దానికి నిర్వచనం మా ఇల్లు.

అలాంటి స్వర్గసీమలో పుట్టిన వాళ్లకి రిటైర్మెంట్ వయసు దాటిపోయిన ఇంకా ఆ ఇల్లు మాత్రం నిటారు అయిన గోడలతో చెక్కుచెదరకుండా రోజు ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ వానప్రస్తాశ్రమం స్వీకరించిన మహారాజులా గత వైభవాన్ని తలుచుకుంటూ అలాగే ఉండిపోయింది.

ఈ ఇల్లు గురించి అంతలా చెప్తున్నారు ఏమిటి ? అది ఏమైనా మైసూర్ ప్యాలెస్ కాదు కదా! అనే సందేహం అందరికీ కలగొచ్చు. కాదు ఆ మాట నిజం కానీ ఆ ఇంటి నిర్మాణం చేసిన వాళ్ళకి అప్పట్లో ఆ ఇల్లు కట్టడం మైసూర్ ప్యాలెస్ కట్టినంత కష్టం. ఎవరికైనా సొంత ఇల్లు నిర్మించుకోవాలంటే ఎన్నో కష్టాలు నష్టాలు జీవితమంతా చేయవలసిన త్యాగాలు ఉంటాయి. అయినా అవన్నీ భరించి సొంత ఇల్లు కట్టడానికి ఎంతో కష్టపడతాడు ఇంటి యజమాని.

ఆ ఇంటి యజమాని ఇంజనీరింగ్ చదవలేదు గానీ తనకున్న అభిరుచితో అందరి అవసరాలు తీర్చే విధంగా కట్టిన ఇల్లు.
ఒక్కొక్క ఇంట్లోకి అడుగు పెడుతుంటే మనసుకు చాలా హాయి అనిపిస్తుంది. కానీ ఈ ఇంటి ముందు నిలబడితే చాలా ఆనందంగా ఉంటుంది. 

ఎందుకంటే మూడువందల అరవై ఐదు రోజులు ఎప్పుడూ ఇంటి ముందు అందమైన తాటాకు పందిరి తో స్వాగతం చెబుతుంది ఆ ఇల్లు. నాలుగు మావిడాకు తోరణాలు కట్టి ఆ పందిట్లో ఎన్నో శుభకార్యాలు, .అలాగే ప్రతిరోజు ఎంతోమంది బాటసారులకి ఒక క్షణం సేద తీర్చుకునే అవకాశం, చిన్నప్పుడు పిల్లలందరికీ ఆటలాడుకోవడానికి అనువైన ప్రదేశం ఆ అందాల పందిరి ఉన్న ప్రదేశం. మరి గాలికి ఊగి పోయే చెట్లు నాకెందుకు
హాయిగా పందిరి చూరు నాకు చాలా బాగుందని అందమైన పిచ్చుకలు కాపురం చేసే ప్రదేశం కూడా అదే. 

ఆ ఇంటి చూరుకి ఎప్పుడు అందమైన ధాన్యపు కుచ్చులు వ్రేలాడుతూ ఉండేవి. అంటే మన వాళ్లకి భూత దయ ఎక్కువ.

అబ్బా పందిట్లోనే ఉండిపోవాలనిపిస్తోందా !లేదు పడమర వైపుకు తిరిగి నాలుగు మెట్లు ఎక్కిఇంటి లోపలకి అడుగుపెడదాం. అప్పుడే ఇంట్లోకి అడుగు పెడితే ఎలాగా నా గురించి చెప్పవా అని ఆ మెట్లకి కుడిపక్క ఎడంపక్క ఉండే అందమైన అరుగులు మా అడుగులు ఆపేసేయి. 

నిన్నెలా మర్చిపోతాం ఆ ఇంటిలో ముఖ్యమైన ప్రదేశం నువ్వే అంటూ అరుగుల గురించి ఎప్పుడో చెప్పేసాను అందరికీ అయినా ఎన్నిసార్లు చెప్పినా నీ లీలలు ఎలా మర్చిపోతాం అని అరుగులను బుజ్జగించాను.

 అవి అరుగులు కాదు మాకు అవి అప్పట్లో హంస తూలికా తల్పాలు. మండు వేసవి కాలంలో తలగడ వేసుకొని పడుకుంటే స్వర్గం చూపించే పుణ్యమూర్తులు.ఎంతోమందికి విద్యా దానం చేసిన సరస్వతి మూర్తులు. ఆ అరుగులు ప్రాణం లేనివి కానీ ఎన్నోసార్లు ఆ అరుగుల మీద రామాయణ మహాభారత భాగవతాలు చదివితే విని తరించిన ఆ ఊరి ప్రజలకి ఆశ్రయము ఇచ్చిన మహా దాతలు. 

ఎంతోమంది రోగులకి ఆయుర్వేద వైద్యం ద్వారా రోగాలను నయం చేసిన నారాయణ స్వరూపాలు. నిత్యం ఆ అరుగు మీద కూర్చునిఎన్నో రాజకీయ ప్రణాళికలు ఎత్తుకు పై ఎత్తులు వేసి గ్రామాభివృద్ధికి సహకరించిన మహానుభావులు కూర్చున్న పుణ్య ప్రదేశం. ఇంటిముందు తాటాకుల పందిరి అరుగుల మీద తాటాకు చాపలు ఎప్పుడూ అతిధులకు ఆహ్వానం పలుకుతుండేవి. పగటిపూట ఇలా గడిస్తే చీకటి పడిన తర్వాత మా అగ్రహారికులకి అది సేదదీరే ఒక ప్రదేశం. 

అందులో ఆవకాయ దగ్గర నుంచి అమెరికా వరకు అన్ని చర్చకు వచ్చేవి. ఆ ఇంట్లో ఉండే పిల్లలు ఆ అరుగుల మీద కూర్చుని చదువుకుని ఉన్నత స్థితికి వెళ్లిన వాళ్లే. 
అన్ని మంచి విషయాలు చెప్పారు అని అంటే కొన్ని సరదాలకి కూడా ఆ అరుగులు పండగ రోజుల్లో ఆశ్రయం ఇచ్చేవి. ఏమిటా సరదా ఇంకేముందండి చతుర్ముఖ పారాయణం. హమ్మయ్య అరు గు దాటి తలపైకెత్తితే ఎదురుగుండా రెండు గుండ్రటి ఎత్తయిన స్తంభాలు. రాజప్రాకారంలో ఉండే స్తంభాలులా అనిపిస్తాయి నాకు. దాన్ని ఆనుకుని ఎర్రటి గచ్చు వసారా. 

ఆ ఎర్రటి గచ్చు మీద ఇంకా చెరిగిపోని సుద్దముక్కల గుర్తులు. అవి అందమైన ముగ్గులు కాదు. జీవితంలో విద్యార్థి దశ దాటడానికి ఆ ఇంటి పిల్లలు చేసుకున్న లెక్కలు. ఆ ఎర్రటి గచ్చు వసారా కి కుడిపక్క ధన్వంతరి నిలయం అయితే ఎడంపక్క ధాన్య లక్ష్మీ నిలయం. కొద్ది సంవత్సరాలు పంచాయతీ కార్యాలయం కూడా అదే. ఆ ఇంటిలో పంచాయతీ కార్యాలయం ఉండడం ఊరివారి పంచాయతీలన్నీ ఆరుగు మీదే అంతేకాకుండా అప్పట్లో ఆ పంచాయతీకి వచ్చే అధికారులు ఆ ఇంటి వారసులు కొంతమందికి ఆదర్శ మూర్తులు కూడా.

నాలుగడుగులు ముందుకు వేసి సింహద్వారం దాటితే నలుచదరపు నడవ. తలపైకెత్తి చూస్తే ఎదురుగుండా బాధ్యతలు గుర్తుచేసే గంటల గడియారం ఆ పక్క ఏడుకొండలవాడి దర్శనం. ఎడంపక్క గోడకి నిలువెత్తు అద్దo. ఇంటి వాళ్లే కాదు ఇంటికి వచ్చిన అతిథులు కూడా అందాలన్నీ చూసుకుని మురిసిపోయే పెద్ద అద్దం. అతివల అందాలన్నీ నిగ్గు తేల్చేది అద్దం.
 మన ప్రతిబింబాన్ని చూపించడమే దాని పని. ఉన్నది ఉన్నట్టుగా పక్షపాతం లేకుండా చెప్పే సాక్షి. అద్దం మన అందం మంచి చెడ్డల గురించి చెబితే మనసు కూడా మనలోని మరో కోణాన్ని చూసి హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం పట్టించుకోము. కొట్టి పారేస్తాము.

నడవకు ఎడంపక్క పెద్దాయన కుడిపక్క చిన్నాయన విశ్రాంతి నిలయాలు. అవి నిజంగా అనురాగపూరిత నిలయాలు. ఆ గదిలో వారసత్వపు పందిరి పట్టి మంచములు గదికి అందం తెచ్చినప్పటికీ ఈనాటి పడకగదిల్లా అందమైన అలంకరణలు ఏమీ లేకుండా బోసి గోడలు ఉన్నప్పటికీ ఆ దంపతులు మధ్య అనంత అనురాగం వల్ల ఆ ఇంటి ఇల్లాళ్లు సంతాన లక్మి లు అయ్యారు. ఈరోజుల్లో కోట్లు వెచ్చించి అందమైన ఇల్లు కట్టిన దంపతుల మధ్య అనురాగం ఆప్యాయత ఎక్కడ కనిపించడం లేదు. ఎవరికి వారే యమునా తీరే. గది తలుపులు మూసుకున్న తలపులు మటుకు ఉండవలసిన దానిమీద ఉండట్లేదు. ఇది నేటి పరిస్థితి. సరే దాన్ని అలా ఉంచండి. 

ఆ గదులు నుండి బయటకు ఉత్తరం వైపు దక్షిణం వైపు ద్వారాలు దాటితే విశాలమైన పెరడు బయట నుండి వచ్చే చల్లటి గాలి ఇంకేం కావాలి. ఆ ఉత్తరం వైపు పడక గదిలో పందిరిపట్టే మంచం తో పాటు అద్దాల బీరువా అందులో ఎన్నో పుస్తకాలు గ్రంధాలు పురాణాలు అమెరికన్ రిపోర్టర్ అనే పత్రికలు అందంగా పేర్చబడి ఉండేవి. ఆ పూర్వీకులకి సాహిత్యాభిలాష ఎక్కువ. 
ఇప్పటి రోజుల్లో అద్దాల బీరువాలో కుక్క బొమ్మలు నక్క బొమ్మలు తప్పితే ఎక్కడ గ్రంధాలు కనపడలేదు. గ్రంధం ఎందుకు అరచేతి మందo ఉన్న ఈ పెట్టెలోనే బోల్డు గ్రంథాలు ఉన్నాయి అంటున్నారు.

సరే ఆ నడవలో ఎన్నో శుభకార్యాలు ఇంట్లో నివాసముండే వాళ్ళవే కాకుండా విశాలమైన ఇల్లు కావడం చేత పెళ్ళివారికి విడిది ఇల్లుగా కూడా పదిమందికి ఉపయోగపడి ఎన్నో శుభకార్యాలు జరిగేవి. ఇంక నడవ ముందు గుమ్మం దాటితే ఎర్రగచ్చుతో తయారుచేసిన భోజనాల వసారా. నడవ శుభకార్యాలకి ఎర్ర గచ్చు వసారా పితృ కార్యాలకి ఉపయోగించేవారు.  

ఇంకొక ముఖ్యమైన ఆకర్షణ పెద్దలకి పిల్లలకి కూడా ఏమిటంటే అందమైన ఇనప గొలుసులతో వేలాడుతుండేది ఉయ్యాల బల్ల. పెద్దవాళ్లు మనసు తీరేవరకు ఊగి దాని మీద పడుకునే వాళ్ళు.పిల్లలు మనసు పుట్టినప్పుడల్లా ఉయ్యాల బల్ల ఊగుతుండేవారు. అయితే పిల్లల చిన్నతనంలో అందమైన టేకుతో తయారుచేసిన ఉయ్యాల వేలాడుతుండేది. ఇంచుమించుగా అందరి బాల్యం అందులో గడిచిందే. అటువంటి ఉయ్యాలలు చేసే పనివాళ్ళు కానీ అటువంటి పనితనం కానీ ఇప్పటి రోజుల్లో కనపడవు. 

నాలుగు పక్కల నాలుగు ఇనప గొలుసులు కట్టుకుని వేలాడుతూ నాలుగు వైపులా నాలుగు కోళ్లు చుట్టూ అందమైన నగిషీ పనితనంతో ఎవరినైనా ఇట్టి ఆకర్షించేది ఆ ఉయ్యాల ఆ వసారాలో. చివరికి ఆ వసారా కి ఉయ్యాల వసారా అని పేరు చక్కగా కుదిరిపోయింది.  

ఆ ఉయ్యాల వసారాలో ఒక మూలగా మెరిసిపోతూ అందమైన ఇత్తడి డబ్బా ఉండేది. డబ్బా గురించి చెప్పడం ఏమిటి అని అందరికీ సందేహం కలగొచ్చు. ఇంతకీ ఆ డబ్బాలో ఏముంది. ధూమపాన ప్రియులకి అవసరమైన సరుకు పొగాకు అందులో దాగి ఉంది. పూర్వీకులు అంతా పద్ధతి ప్రకారం చేసేవారు. పొగాకు పీల్చేటప్పుడు స్వర్గం చూపిస్తుంది. ఇది నా అభిప్రాయం కాదు. నాకు ధూమపానం అలవాటు లేదు.గొంతు దిగిన తర్వాత నరకానికి దారి చూపిస్తుంది. ఏమిటో చిన్నప్పుడు ఉండే అనారోగ్య సమస్యలు పోగొట్టడానికి చుట్ట తాగడం అలవాటు చేశారట . అది తర్వాత ప్రాణo తీసుకుపోయింది.
ఆ పొగాకు డబ్బాలో ఒక కత్తెర, దారం ,చుట్ట జేబుకు తగలకుండా పెట్టుకోడానికి కాగితంతో తయారుచేసిన ఒక కవరు ఇన్ని దాగి ఉండేవి అందులో. ఉయ్యాల వసారా కి చుట్టూ చెక్కతో కటకటాలు ఉండేవి. అందుకే కటకటాల వసారా అని కూడా పిలిచేవారు. 

ఆ ఉయ్యాల వసారాలోకి అడుగుపెడుతుంటే కుడిపక్క దేవుడి ఇల్లు. ఈశాన్యం మూల గూట్లో దేవుడు పూజలు అందుకుంటుంటే చెక్కబల్ల మీద ఊరగాయ కుండలు రకరకాల ఊరగాయలతో నోరూరించేవి. దానికి ఎదురుగా పెద్ద టేకు కర్రతో చేసిన బియ్యం పెట్టె. అందులో నిండుగా తెల్లగా మెరిసిపోతూ ముత్యాల్లాగా బియ్యం పండగలకి పబ్బాలకి తయారుచేసిన పాకుండలు జంతికలు కూడా అందులోనే దాగి ఉండేవి. అది ఒక మిలటరీ క్యాంపస్. లోపలికి వెళ్లాలంటే కావాలి పరిమిషన్. మడికట్టుకోకపోతే ఊరగాయ కుండ ముట్టుకోవడానికి లేదు పరిమిషన్. అంత కట్టుదిట్టంగా ఉండేది ఆ గది. ఆ దేవుడింటికి ఎదురుగా నవతరం పడకగది. పిల్లలు ఎదిగే కొద్దీ గదుల అవసరం తెలుస్తుంది. అంత ముందు చూపు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.

అలా నవతరం పడకగది లోంచి బయటకు వచ్చేసరికి ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక పెద్ద గచ్చు వసారా పైన తాటాకు పందిరి. ఆ గచ్చు వసారాలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరూ పక్కపక్కన కూర్చుని అన్నం తిన్న రోజులు మరిచిపోలేని మధురమైన రోజులు. చల్లటి గాలి ఆత్మీయమైన పలకరింపులు ఆదరణతో పెట్టే మంచి రుచికరమైన భోజనం అయిన వాళ్ళ మధ్యన కూర్చుని తిన్న భోజనం అవి పచ్చడమెతుకులైన పరమాన్నంతో సమానం. అలా ఎన్నో సంవత్సరాలు. ఈ వసరా ఎడం పక్కంతా భోజనాలకి కుడి పక్కంతా ఇత్తడి గుండి గ లతో నీళ్లు నిలువ చేసుకొని స్నానాలు చేయడానికి చాలా బాగా ఉపయోగపడేది.  
అంతేకాదు వేసవికాలంలో ఊరగాయలు అక్కడ కూర్చుని పెట్టే వారు మా అమ్మ మా పిన్ని గారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఆ వసారా కి మధ్యలో తులసమ్మ కాపురం. ఆ తులసమ్మకి అందమైన కోట. చాలా ప్రశాంతమైన ప్రదేశం. ఆ వసారా మీద చేసే స్నానం ఒంటికి హాయినిస్తే, రుచికరమైన భోజనం శరీరానికి శక్తినిస్తే, ప్రతిరోజు ఆ తులసమ్మకు చేసే నమస్కారం మనసుకు ప్రశాంతత ఇచ్చేది. 

ఆ గచ్చు వసారాన్ని దాటితే ప్రత్యేకంగా వంట కోసం భోజనాల కోసం కట్టిన ఇల్లు ఉండేది. ఒక వంటిల్లు అందులో మట్టితో చేసిన పొయ్యి దాన్ని ఆనుకుని మట్టి భోజనాల వసారా ఉండేది. ఒక వర్షాకాలంలో మాత్రమే అక్కడ భోజనాలు చేసేవాళ్ళం. 

ఈ భోజనాల వసారా కి ఎడంపక్క అంటే వంటిల్లు పక్కన పాలు పెరుగు నెయ్యి దాచుకోవడానికి ఒక బీరువా ,పాలు కాచుకోవడానికి దాలి పొయ్యి , పెరుగు చిలికి వెన్న తీయడానికి ఒక కవ్వం, కవ్వపురాట ఇన్ని ఉండేవి. ఆధునిక యుగంలో ఇవి ఎక్కడా కనిపించవు. ఆ పెరుగు కుండలో కవ్వం పెట్టి చిలుకుతుంటే వచ్చే శబ్దం ఇప్పటివరకు మళ్ళీ ఎప్పుడు వినలేదు. ఇంకా కుడి పక్క అంటే భోజనాల వసారా కి పక్కన నీళ్ల పొయ్యి ఉండేది. ఇది మా స్వర్గపు అక్షర రూప చిత్రం. 

మీ స్వర్గంలో నేను లేనా అని వెనకనున్న పెరడు కోపంగా చూస్తే నువ్వెందుకు లేవు వస్తున్న అక్కడికే వస్తున్న అంటూ ఆ విశాలమైన పెరడు వేపుకు దారి తీస్తే అక్కడ అంటే ఇంటికి ఉత్తరం వైపు కొబ్బరి చెట్లు తర్వాత నారింజ చెట్టు పెద్ద నేరేడు చెట్టు ఆ తర్వాత మళ్లీ నారింజ చెట్టు ఇలా వరుసగా ఉండి మధురమైన ఫలాలను అందిస్తూ చల్లటి గాలి ఇస్తూ ఆ కుటుంబ సభ్యుల్ని ఆనందపరిచేవి. నారింజ చెట్టుకి కట్టిన ఉయ్యాల తెగిపడితే మొదటిసారి తిన్న చెంప దెబ్బ బాధలు మధురమైన జ్ఞాపకాలు. ఆ చెట్లని ఎవరు నీరు పోసి నారు పోసి పెంచలేదు. అయినా అవి పరోపకారార్థం మిదం శరీరం అనే సూక్తిని బాగా నమ్మి బ్రతికినంత కాలము మంచి మంచి పళ్ళు అందించి చనిపోయిన తర్వాత వంట చెరుకుగా ఉపయోగపడిన చెట్లు. చెట్టు కింద రాలిపడిన నేరేడు పళ్ళు తిని బ్రతికిన రోజుల నుంచి వీధిలో రూపాయలు పోసి నేరేడు పళ్ళు కొనుక్కునే రోజుల్లోకి మారిపోయిన ఆ ఇంటి వాళ్ళకి అవన్నీ మధురమైన రోజులే.
చెట్టు మీద పండిన పళ్ళని పక్షులకి చెట్టు కింద పడిన పండ్లని చీమలకి కూడా పెట్టి ఆ చెట్టుకి ఎంత పరోపకారి బుద్ది గలదో ఇప్పుడు అర్థమైంది. 

అంత విశాలమైన పెరడు ఉన్న అక్కడ ఏదో లోటు కనిపిస్తోంది. ఏమిటా లోటు అంటే మీకే అర్థమవుతుంది. దూరం నుంచి మంచినీళ్ళ బిందెలు మోసుకొస్తూ ఆ ఇంటి ఇల్లాళ్ళు కనబడ్డారు.
ఇలాంటి స్వర్గంలో ఒక చిన్న లోటు. సరే సరిపెట్టుకుని ముందుకు నడిస్తే ఎదురుగుండా ఒక చిన్న నిమ్మ చెట్టు నిండా కాయలు.  
ఇంటి యజమానికి ఆయుర్వేద మందులోను, ఆ ఊరి వారికి అత్యవసరానికి ఉపయోగపడుతూ ఉండేది. ఆ చెట్టు సంగతి అలా ఉంచితే ఇంతలో అంబా అని అరుపు వినిపించితే తల పైకి ఎత్తి చూస్తే రేకులతో పశువుల పాక, ఆ పాకలో ఆ ఇంటి అవసరాలకి సరిపడే పాలు ఇస్తూ ఉండే పశువులు కళ్ళకు కనపడ్డాయి. ఆ పక్కన గడ్డివాము , ఆ రేకుల షెడ్డు వెనకాల పచ్చటి పంట పొలాలు , మామిడి చెట్లు, పెంట కుప్పలు, పిల్ల కాలువలు ఇంకేం కావాలి మనకు ఈ స్వర్గంలో. అందుకే ఆ ఇల్లు మాకు అందరికీ స్వర్గమే. 

ఆ ఇల్లు చూసినప్పుడల్లా శీతాకాలంలో నీళ్ల పొయ్యి దగ్గిర కూర్చుని చలి కాచుకున్న రోజులు, బాబాయ్ పాలేరు మీద వేసిన కేకలు, పిన్ని పెనం మీద వేసిన అట్లు తిన్న రోజులు, దొడ్లో నేరేడు పళ్ళు ఏరుకుని తిన్న రోజులు, వీధి అరుగు మీద కూర్చుని వచ్చే పోయే వాళ్లని తెలిసి తెలియక ఏడిపించిన రోజులు గుర్తుకొస్తాయి . కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆ ఇంటి గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలి అనిపిస్తుంది.

ఇంతకీ ఈ ఇల్లు ఎక్కడ ఉంది కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామం లో ఉంది. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సామర్లకోట

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం