కృష్ణ

కృష్ణ

ఉదయం  పది గంటలు అయింది.  చుట్టూ పోలీసులు మధ్య చేతులకు బేడీలు వేసుకొని ఉన్న సుమారు ముప్పై సంవత్సరములు యువతి నడుచుకుంటూ కోర్టు లోపలికి అడుగుపెట్టింది 
కోర్ట్ ఆవరణలో ఉన్న అందరూ ఆమెకేసి వింతగా చూస్తున్నారు. ఈమె కూడా నేరం చేసిందా అన్నట్లు! ఆవిడకు మినహాయింపు ఏమిటి ?అని చూస్తే పాపం ఆవిడ నిండు గర్భిణీ. 

న్యాయదేవతకు అవి ఏమీ సంబంధం లేదు. సాక్ష్యం బలంగా ఉంటే ఎవరైనా నేరస్తులు. అది దొంగ సాక్ష్యం కావచ్చు ,దొరల సాక్ష్యం కావచ్చు. సాక్ష్యాన్ని నమ్మి ఇంకేముంది యావత్ జీవిత కారాగర శిక్ష  విధించింది.

సాధారణంగా ప్రతి స్త్రీ  పురిటి కోసం పుట్టింటికి వెళ్తారు. కానీ  విధి వ్రాత అలా ఉంది. జైలు గోడలే పుట్టిల్లు అయింది. మానవతా దృక్పథంతో  కోర్టు ప్రభుత్వాసుపత్రిలో చేర్పిస్తే మరో ప్రాణికి జన్మనిచ్చింది సరిత.  ఆ బిడ్డను చూసి కుమిలి కుమిలి ఏడ్చింది  సదరు ఖైదీ సరిత.  రేపటి సమాజంలో దీని బ్రతుకేమిటి? 
 సరిత భర్త ఎప్పుడో పారిపోయాడు. ఇంక నా అన్న వాళ్ళు ఎవరూ లేరు సరితకి. ఆ నాలుగు గోడల మధ్య ఆ పిల్లని పెంచుకోవడానికి అనుమతించింది ప్రభుత్వం.

శ్రీకృష్ణ పరమాత్మ లాగా చరసాలలో పుట్టింది కాబట్టి "కృష్ణ" అని పిలిచేవారు ఖైదీలు పోలీసులు అందరూ. శ్రీకృష్ణుడైతే భగవంతుడు కాబట్టి ఆ చరసాల నుండి బయటకు వచ్చాడు కానీ ఈ కృష్ణ ఎలా వస్తుంది బయటికి?. నేరం చేసిందో లేదో తెలియదు కానీ తల్లి జైలు శిక్ష అనుభవిస్తోంది.. ఆ తల్లి బిడ్డ కాబట్టి  ఆ పుట్టిన పిల్ల
 కూడా జైల్లోనే పెరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఖైదీల అరుపులు,  పోలీసు బూట్లు ,
 చప్పుళ్ళు పోలీసు వారి వేసే ఈలలతో జైలు ఆవరణ అంతా సందడిగా ఉంటుంది. 

కానీ చంటి పిల్ల ఏడుపుతో  ఆ పదో నెంబర్ సెల్ ఎప్పుడు సందడిగానే ఉండేది. సమయం సందర్భం లేకుండా చంటి పిల్ల ఏడుస్తుంటే చుట్టుపక్కల ఉండే సెల్ లోంచి ఖైదీలు ఆత్రంగా చూసేవారు. ఇరవై నాలుగు గంటలు కాపలా కాసే పోలీసు సెంట్రీలు  " ఏమ్మా సరిత !బిడ్డకు పాలు కావాలా! కడుపు నొప్పి వచ్చిందా! మరి ఎందుకు ఏడుస్తోంది? అంటూ మానవతా దృక్పథంతో ప్రశ్నలు వేసి అవసరమైంది సమకూరుస్తూ ఉండేవాళ్ళు. 

ఎప్పుడూ కోర్టులు గొడవలు ఖైదీలు తో విసిగిపోయిన సెంట్రీలు కూడా  ఆ పదో నెంబర్ సెల్లులో ఆ చంటిపిల్ల దగ్గరికి వచ్చి కాసేపు ఆడుకునే వాళ్ళు. 

మామూలుగానే ఒక తల్లికి చంటి బిడ్డ పెంపకం ఎంతో కత్తి మీద  సాము లాంటిది. అలాంటిది నాలుగు గోడల మధ్య అయిన వాళ్ళు ఎవరూ లేకుండా  పిల్లని పెంచడం ఎంత కష్టమైన పని. తల్లి కదా ఎంత కష్టమైనా భరిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా బిడ్డను పెంచుతుంది. కానీ సరిత ఒక స్వేచ్ఛ జీవి కాదు. ప్రభుత్వం వారి నియమ నిబంధనలకు లోబడి నిత్యజీవితం గడపాలి. 

తెల్లవారుజామున ఐదు గంటలకి  జైలు ఆవరణలో సైరన్ మోగుతుంది. అంటే ఖైదీలు అందరూ వరుసలో నిలబడితే అందరి హాజరు  తీసుకుంటారు జైలు ఉద్యోగులు. అంత ఉదయమే లేస్తే చంటిపిల్ల కూడా లేచి ఏడుస్తుంది. హాజరు ఇవ్వడానికి వెళ్లకపోతే  జైలు అధికారులు ఊరుకోరు.

 అలాగే పిల్లని భుజాన్ని వేసుకుని సరిత  లాలిస్తూ వరుసలో నిలబడేది.  అక్కడ  కరుడుగట్టిన నేరస్తులు, హత్యలు మానభంగాలు దోపిడీలు చేసి దొరికిపోయిన దొంగలు, తప్పు లేకపోయినా దొరికిపోయిన సరిత లాంటివాళ్ళు అందర్నీ ఒక్కసారి అక్కడ చూసేసరికి పిల్లను ఏదైనా చేస్తారేమోనని భయపడేది సరిత . 
అయినా పాపం వాళ్లు ఏదో పాపం చేసి జైలుకు వచ్చి ఉంటారు. అందుకే పెళ్ళాం బిడ్డలకి తల్లిదండ్రులకి కుటుంబానికి దూరంగా ఇలా బ్రతుకుతూ ఒక్కసారి ఆ చంటి పిల్లని  చూడగానే వాళ్ల కళ్ళల్లో ఆనందం కనిపించేది సరితకి.  పిల్లని ఎత్తుకుంటామని పాపం చేతులు చాచేవారు. అంత సమయం ఎవరిస్తారు?

అలా హాజరు తీసుకున్న తర్వాత బ్రేక్ ఫాస్ట్ తినేసి అప్పచెప్పిన పనిలో చేరిపోతారు ఖైదీలు. అలా సరిత చేత ఒక్కొక్కసారి  బట్టలు ఉతకడం ,మరొకసారి వంటశాలలో పని ,మరొకసారి జైలు అంతా ఊడవడం లాంటి పనులు చేయించేవారు. ఇలాంటి సమయంలో పాపం కృష్ణని చెట్టు కొమ్మకు ఉయ్యాల వేసి పడుకోబెట్టి తనకి అప్ప చెప్పిన పనికి న్యాయం చేకూర్చేది సరిత. 

ఏంటో విధి విచిత్రంగా ఉంటుంది . లాఠీలు మోసే చేతులు చంటిపిల్ల ఉయ్యాల ఊపుతుంటే  ఈ పిల్ల ప్రభుత్వాధికారుల చేత సేవలు  చేయుంచుకుంటోంది ఇది జాతకు రాలే ! అనుకునేది సరిత. తోటి ఖైదీలు  కొంతమంది ఆ చంటి బిడ్డను ప్రేమగా చూస్తుంటే మరి కొంతమంది ఇది ఇంకో  నేరస్థురాలు అవుతుంది తల్లిలాగే అనే మాటలకి బాధపడుతూ ఉండేది సరిత. మాట తేలిగ్గా మాట్లాడేయొచ్చు. కానీ ఎవరి తలరాత ఎలా ఉంటుందో ఎవరికి తెలుస్తుంది.ఆ బిడ్డ చేసిన పాపo ఏమిటి? 
అలాంటి మాటలు పడడానికి. అలా మధ్య మధ్యలో బిడ్డను చూసుకుంటూ మధ్యాహ్నం ప్రభుత్వం  వారు పెట్టే ఆ జైలు కూడు తినలేక పోతుంటే పాపం అసలే బాలింతరాలు ఈ తల్లికి సరైన ఆహారం లేకపోతే ఆ చంటి పిల్లకి పాలు ఎలా వస్తాయి ?అని సెంట్రీలు చాటుగా మాటుగా ఏదో బలమైన ఆహారం తెచ్చి పెడుతుండేవాళ్ళు.  

పుట్టింట్లో ఉన్న బాలింతరాలని ఎలా చూసుకుంటారో ఇంచుమించుగా అలాగే చూసుకునే వారు ఆ జైలు అధికారులు కూడా వాళ్ల పరిమితులకు లోబడి. ఎందుకంటే తల్లి మీద ప్రేమ కాదు ఆ చంటి బిడ్డ మీద జాలి. పాపం పుణ్యం ఎరుగని ఆ చంటిది మామూలుగా అయితే ఎంతో అపురూపంగా పెరిగేది కదా !అని కన్నీళ్లు పెట్టుకునే వారు . 

సాయంకాలం వరకు సరిత దినచర్య అలా గడిచిపోయేది. కానీ చంటిపిల్లకు ఎన్ని చూడాలి. నీళ్లు పోయాలి పాలు పట్టాలి. మలమూత్రాలు కడగాలి.  కోర్టు వారు శిక్షలు అయితే విధిస్తారు కానీ కొన్నిటిలో మానవత్వం చూపిస్తారు. అందుకే అటువంటి విషయాలకి సరితకి కృష్ణని పెంచడంలో ఇబ్బంది లేకుండా పోయింది.

సరిత జీవితంలోను దినచర్యలోను ఏ విధమైన మార్పు లేదు. కానీ కృష్ణ వయసు ఆగదు కదా. జైల్లో ఉంటే ఖైదీలకి సత్ప్రవర్తన అలవాటవుతుంది. కానీ ఈ చంటిపిల్లకి ఆ నాలుగు గోడల గదిలో వచ్చిరాని మాటలు చెప్పడం దగ్గరనుంచి లేచి పరుగులెత్తే వయసు కూడా వచ్చేసింది. 

నడక వచ్చిన దగ్గర్నుంచి ఎంతసేపు ఆ నాలుగు గోడలు దాటి వరండాలోకి  తీసుకెళ్లమని ఒకటే ఏడుస్తూ ఉండేది. జైలు అధికారులని కృష్ణ ముద్దు ముద్దుగా తాత ,మామ అని పిలుస్తుంటే మురిసిపోయి సెంట్రీలు వరండాలో కృష్ణతోపాటు పరుగులు తీస్తూ ఆడుకుంటూ ఉండేవారు.

కృష్ణ సహజంగానే చాలా తెలివైనది . చాలా అందమైనది.  కాలం ఎంత సేపు గడుస్తుంది. అలా కృష్ణకి  జైల్లోనే ఆరేళ్లు వచ్చేసేయి. ఎదుగుతున్న కూతురిని చూసి సరిత రోజూ దిగులు పడుతూ ఉండేది. మామూలుగా అయితే పలక బలపం పట్టుకుని బడికి వెళ్లవలసిన వయసు. స్వేచ్ఛగా ఆడుకోవాల్సిన వయసు. తల్లిదండ్రుల మధ్య గారాబంగా పెరగవలసిన వయసు. చదువు సంస్కారము ఏమీ లేకుండా ఇలా నాలుగు గోడల మధ్య పెరిగితే రేపు దాని జీవితం ఏమవుతుంది. వెనక చూస్తే ఏమీ ఆస్తి పాస్తులు లేవు. మరి ఈ పిల్ల జీవితం ఎలాగా! తను ఖైదీ అయినప్పటికీ ఒక బాధ్యత గల తల్లిగా ఎలా ప్రవర్తించాలి అని అనుకునేది.
మామూలు మనుషులు అయితే నిత్య జీవితంలో వచ్చే కష్టాలకి భగవంతుని ప్రార్ధిస్తుంటారు. ఈ ఖైదీలు భగవంతుడితోపాటు కోర్టు వారిని కూడా ప్రార్థించాలి. 

ఏదో ఒకటి చేయాలి లేకపోతే కృష్ణ జీవితం ఎటు కాకుండా పోతుంది అని అనుకుని ఎదుగుతున్న కూతురు జీవితం పాడు చేయకూడదని నిశ్చయించుకుని కోర్టుకు ఒక అర్జీ పెట్టుకుంది. 

న్యాయదేవతకి నిత్యం సవాళ్లే.  నిత్య సమరంలో అనేక సమస్యలుకి ఎప్పుడో వ్రాసుకున్న చట్టాలు సమాధానం చెప్పలేవు. ఇటువంటి ప్రశ్నలకు. అయినా ఇది ఖైదీ జీవితానికి సంబంధించింది కాదు. కేవలం తన బిడ్డ అభివృద్ధి కోసం ఒక ఖైదీ పడే ఆవేదన. సరిత తన శిక్ష తగ్గించమని అభ్యర్థించలేదు. 

కేవలం తన కన్నబిడ్డ భవిష్యత్తు జీవితం గురించి పడుతున్న వేదన చూసి మానవత్వంతో ఆలోచిస్తే తప్పేముంది అనుకుని  ప్రభుత్వం వారు నిర్వహించే హాస్టల్లోనూ స్కూల్లోనూ  కృష్ణని జాయిన్ చేసింది కోర్టు.

ఇన్నాళ్లు అమ్మ ఒడిలో ఎంతో ప్రేమగా జైలు నాలుగు గోడల మధ్య ,ఒక కుటుంబంలో పెరిగిన పిల్లలాగా  బ్రతికిన కృష్ణ ఒక అనాధల ఆయాల చేతిలో  బిడ్డగా మారిపోయింది. చిన్న వయసులో గారాబంగా మంచి ఆహారం తింటూ పెరగవలసిన వయసు కానీ ఆయమ్మ  ఏది పెడితే అది అమృతంలా భావించి ఆకలి తీర్చుకున్న పసి మనసు అయిపోయింది. ఆకలేసినప్పుడల్లా అమ్మ ఆదరించి కడుపు నింపుతుంది. ఈ ఆయమ్మ నిర్ణీత సమయాల్లో కానీ ముద్ద నోట్లో పెట్టదు. ఏడిస్తే కసిరి కొడుతుంది . అమ్మయితే లాలించి చంక నేసుకుని బుజ్జగిస్తుంది. అక్కడ అమ్మల లాలన కాదు. ఆయమ్మల పాలన. అక్కడ చేరిన వాళ్ళని విధి ఒకరకంగా చిన్న చూపు చూస్తే మరొక రకంగా భగవంతుడు కృష్ణ కి మేలు చేశాడు.సర్కార్ వారి బడిలో చదువుల తల్లి బిడ్డగా ఉపాధ్యాయుల అభిమానం సంపాదించుకుంది కృష్ణ. చదువుల తల్లి వరిస్తే కడు పేదరికంలో ఉన్న వాళ్లు కూడా ప్రపంచాన్ని ఏలే వ్యక్తులుగా తయారవుతారు.

 అలా కృష్ణ చదువులో చూపిస్తున్న చురుకుదనం తెలివితేటలు చూసి  పదో తరగతిలో వచ్చిన మార్కులు చూసి ప్రధానోపాధ్యాయురాలు  గవర్నమెంట్ వారి కాలేజీలో చేర్పిస్తుంది. కానీ ప్రతిరోజు ఒక సమస్య వేధిస్తూ ఉండేది కృష్ణని.
జ్ఞానం వచ్చిన దగ్గరనుంచి తెల్లవారి లేస్తే ఆయమ్మ అని పిలుస్తున్నాం. మరి అసలు అమ్మ ఎక్కడ ఉంది ?. పదో తరగతి సర్టిఫికెట్లో అమ్మ పేరు సరిత అని ఉంది. మరి అమ్మ బతికే ఉంటుంది. లేకపోతే లేటు అని వ్రాస్తారు కదా!  అమ్మ ఎక్కడ ఉందని అడిగితే ఆయమ్మ  మంచి మనసుతో ఆ జైలు లో ఉన్న సరితని చూపిస్తుంది. "ఎందుకమ్మా అలా అనాధలా వదిలేసావు అనే ప్రశ్నకి సరిత ఏడుస్తూ  నేను నేరం చేశానని నన్ను ఖైదీ అంటున్నారు. కానీ నా కూతురుగా పుట్టిన నీకు నాతోపాటు ఈ శిక్ష ఎందుకు? అని సమాధానం ఇచ్చింది.

అలా నెలకు ఒకసారి తల్లిని కలుసుకుంటూ కృష్ణ న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకుని  ప్రభుత్వo వారి పరీక్షలు పాస్ అయ్యి ఒక జడ్జిగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. అలా ఒక తల్లికి బిడ్డగా ఆ జైలు ఆవరణలో అడుగుపెట్టినప్పుడు ఇంతకాలం తనని పెంచి పెద్ద చేసిన ఆ జైలును చూస్తే ఒక పుట్టింటికి వచ్చినట్లు అనిపించేది కృష్ణ కి.  ఒక న్యాయాధికారిగా అందరూ చేతులు ఎత్తి నమస్కారం చేస్తుంటే ఎంతో సిగ్గుగా అనిపించేది కృష్ణకి. కన్నబిడ్డ ఎంత ఉన్నతాధికారైన తల్లి నమస్కారం పెడుతుంటే ఎలా ఉంటుంది మరి. అలాగే ఉంది మరి కృష్ణ కి కూడా.

 ఎందుకంటే ఆ జైలు తల్లిని ఖైదీగా చూపెడితే తనని ఒక చంటి బిడ్డగా ముద్దు చేసింది. ఆడించింది .పాడించింది .లాలించింది. చివరికి చెప్పాలంటే బ్రతుకుతెరువు కూడా చూపించింది అని అనుకునేది కృష్ణ. 

అలా అని సినిమాల్లో చూపించినట్లు తన చేతిలో అధికారం ఉంది కదా అని తల్లి సరిత ఖైదీ జీవితాన్ని మధ్యలోనే ఆపకుండా  శిక్షకాలం పూర్తయ్యే వరకు వేచి ఉండి ఒక కూతురుగా సరిత బాధ్యత తీసుకుని  ప్రభుత్వ శరణాలయాల్లో ఉండే పిల్లల భవిష్యత్తు బాగుండడానికి సహాయం చేస్తూ జీవితం గడుపుతూ ఉంటుంది కృష్ణ. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట