గుండెల్లో నిలిచిన వైద్యుడు
గుండెల్లో నిలిచిన వైద్యుడు
ప్రతిరోజు ఎంతోమంది రోగుల గుండెలకి స్వాంతన చేకూర్చే డాక్టర్ రామారావు కి ఆరోజు గుండెల్లో చాలా గుబులుగా ఉంది. ఆ వయసులో కూడా చాలా ఉత్సాహంగా జూనియర్ డాక్టర్లతో కలిసిమెలిసి పని చేస్తూ గుండె శస్త్ర చికిత్సలు చేసే డాక్టర్ రామారావు మనసు అదోలా ఉంది. నాలుగు దశాబ్దాల పాటు గవర్నమెంట్ డాక్టర్ గా సేవలందించిన రామారావు కి ఆ రోజుతో ఆసుపత్రితో అనుబంధం తెగిపోతోంది
డాక్టర్ రామారావు గుండె సంబంధిత వ్యాధులు చికిత్స చేసే డాక్టర్ గా ఆ మండలంలో బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. వృత్తిపరంగా ఎన్నో సమస్యలున్న తన తోటి ఉద్యోగులతో మంచిగా ఉంటూ కాలక్షేపం చేశాడు ఇన్ని రోజులు.
ఎప్పటిలాగే సాయంకాలం ఆరోజు కూడా ఐదు గంటలు అయింది . పదవి విరమణ సభ మొదలైంది. ఒక్కొక్కరే లేచి డాక్టర్ గారితో తన అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నారు.
ఇంతలో చివర వరుసలో కూర్చున్న ఒక జూనియర్ డాక్టర్ లేచి మైక్ తీసుకొని చెప్పడం ప్రారంభించాడు. నా పేరు రవి ప్రకాష్. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ జూనియర్ డాక్టర్ గా జాయిన్ అయ్యి నెలరోజులు అయింది. అయితే డాక్టర్ గారితో పని చేసిన అనుభవం కంటే ఒక పేషెంట్ కొడుకుగా నా అనుభవం ఎక్కువ.
నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే రెండు రకాలుగా డాక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఒకటి మా తండ్రిగారికి పునర్జన్మిచ్చినందుకు రెండవది నాకు మా నాన్నగారు ఆసుపత్రిలో ఉన్నంతకాలం డాక్టర్ గారు వార్డులో తిరుగుతూ మిగతా రోగులతో ఎలా మాట్లాడుతున్నారు మిగతా రోగులు డాక్టర్ గారి గురించి ఏమనుకుంటున్నారు ఆ మాటలన్నీ నా చెవిని పడేవి. డాక్టర్ గారిని చూస్తేనే సగం రోగం తగ్గిపోతుందని
అని అనుకునేవారు అందరూ. ఇద్దరు ముగ్గురు జూనియర్ డాక్టర్లు కూడా వస్తుంటే నర్సులు ట్రే లో ఏదో పట్టుకుని కూడా వస్తుంటే మెడలో శతస్కోప్ చేసుకుని తెల్లటి కోటు తొడుక్కుని నడిచి వస్తుంటే రోగులు వాళ్ల బంధువులు చేతులెత్తి నమస్కరిస్తుంటే నాకెంత ఆనందంగా ఉండేది. ఒక వ్యక్తికి అంత విలువ ఇస్తున్నావంటే అది కేవలం ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మరియు విద్య మూలంగానే కదా అనుకునేవాడిని. ఆ రోజుల్లో
ఒక సినిమా చూసినప్పుడు ఆ హీరో ధరించిన దుస్తులు మాటతీరు తలకట్టు చాలామంది అనుకరించేవారు. ఎందుకంటే మేము ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు చాలా నిదానమైన మాట తీరుతో పేషెంట్లకు కావాల్సిన వైద్యం చేసి ధైర్యం చెప్పే ఆ డాక్టర్ గారు నా గుండెల్లో నిలిచిపోయారు. ఒక రోల్ మోడల్ అయిపోయారు .
కానీ నేను ఆ స్థాయికి చేరాలంటే మా నాన్న పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధం. మా నాన్న ఒక వడ్రంగి మేస్త్రి. ఏరోజు పనికి వెళ్లకపోతే ఆ రోజే మా ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు.
నలుగురు పిల్లలతో తాతలనాటి ఇంట్లో గుట్టుగా కాలక్షేపం చేసేవాడు మా నాన్న. కానీ నెలకొకసారి ఆయాసం వచ్చి బాధపడుతుండేవాడు. ఆయాసం వచ్చినప్పుడల్లా ఏదో మoదు మింగడం తప్ప ఎప్పుడు ఆసుపత్రి మెట్లు ఎక్కిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే ఆసుపత్రి మా ఊరికి ముప్పైకిలోమీటర్ల దూరంలో ఉంది.
ఒకరోజు ఆయాసం వచ్చి ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే పరుగు పరుగు ఆసుపత్రికి వస్తే చాలా అరుదైన గుండెజబ్బు కి శస్త్ర చికిత్స చేయాలని కోలుకునే సరికి రెండు మూడు నెలల సమయం పడుతుంది అని చెప్పిన డాక్టర్ గారు మాటలకి మాకు ఏం చేయాలో తోచలేదు. అప్పుడు డాక్టర్ గారితో మా పరిస్థితి అంతా వివరించి చెప్పింది మా అమ్మ. ఆరోగ్యశ్రీ కార్డు పుణ్యమా అని నాలుగు గంటల పాటు శ్రమపడి మా నాన్నకి ఆపరేషన్ చేసి బతికించారు. అయితే ఆ తర్వాత రమారమి మూడు నెలలపాటు ఆస్పత్రిలోనే ఉండిపోయాం. కేవలం ఆసుపత్రి వారు పెట్టే బలమైన తిండి కోసమే. అది కూడా డాక్టర్ గారు సలహా.
అయితే డాక్టర్ గారి సలహా ఏమిటని అందరికీ అనుమానం రావచ్చు. ఇది కేవలం మానవత్వంతో చేసింది. మా నాన్నని కావాలనే ఆసుపత్రిలో అన్ని రోజులు ఉంచడం జరిగింది. కారణం ఏమిటంటే ఒకటి బలమైన ఆహారం రెండోది ప్రతి పదిహేను రోజులకి వచ్చి పరీక్ష చేయించుకోవడం మా ఆర్థిక స్తోమతకు మించిన పని ఆయన ఉద్దేశం కాబోలు.
ఒక గుండెకు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి తొలి రోజుల్లో బస్సులో కానీ ఆటోలో కానీ ప్రయాణం చేయాలంటే చాలా కష్టం కదా. మావంటి పేదవాళ్ళకి కారులో ప్రయాణం చేసే ఆర్థిక స్తోమత ఉండదు.
ఏదేమైనా మా నాన్న మామూలు తన పనులు తను చేసుకుంటూ పిల్లలందరినీ బాధ్యతగా చదివించడం ప్రారంభించాడు. రోజు ఎన్నో చెక్క కుర్చీలు తయారు చేసే మా నాన్న తన పిల్లలందరిని మంచి చదువులు చదివించి కుర్చీ మీద కూర్చుని ఉద్యోగం చేసే స్థాయికి తీసుకురావాలని కలలు కన్నాడు. అయితే అందర్నీ చదివించడం తన స్థాయికి మించిన పని. కనీసం నన్నైనా పెద్ద చదువులు చదివిస్తే కుటుంబానికి ఉపయోగిస్తానని పదో తరగతి తర్వాత పట్నం కాలేజీకి పంపించాడు. అక్కడ నుంచి జీవితం కష్టాలు కన్నీళ్లు బాధలు తట్టుకుంటూ ఏదో భగవంతుడి దయ వల్ల ఇలా మీ ముందు డాక్టర్ గా ఒక డాక్టర్ గురించి చెప్పుకునే అదృష్టం కలిగింది.
మా నాన్న కనుక ఆసుపత్రిలో అన్ని రోజులు ఉండకపోతే వేరే ఏదో ఉద్యోగంలో ఉండేవాడినేమో. నాకు ఎప్పటికీ డాక్టర్ గారు గుండెల్లోనే ఉంటారు. మా నాన్నతో పాటు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఎంతో స్నేహపూర్వకంగా ప్రేమగా మాట్లాడేవారు. ఆయన స్వభావం అటువంటిది. నా చదువు గురించి ఎంక్వయిరీ చేసేవారు.
నాకు మెడికల్ కాలేజీలో సీటు వచ్చిందని చెప్పినప్పుడు చూడు ఫీజుల కట్టవలసి వచ్చినప్పుడు పుస్తకాలు కొనవలసి వచ్చినప్పుడు నన్ను వచ్చి కలుస్తూ ఉండు. మొహమాట పడకు అంటూ అంటూ చెప్పి నాలో ధైర్యం నుంచి నాకు డాక్టర్ అనే అక్షరాలు నా పేరు ముందు వచ్చేలా చేశారు అంటూ కన్నీళ్లు పెట్టుకుని తన ఉపన్యాసం ముగించాడు ఆ జూనియర్ డాక్టర్.
ప్రతినెల ఎంతో మంది పదవీ విరమణ చేస్తూ ఉంటారు. ఎంతోమంది పదవీ విరమణ చేసే వాడి గురించి ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతుంటారు. నిజానికి ఆ మాటలు గుండెల్లో నుంచి వచ్చినవి కాదు. ఈ జూనియర్ డాక్టర్ చెప్పిన మాటలు నిజంగా గుండెలోంచి వచ్చినవే అని ఆసుపత్రి పెద్ద అధికారి చెప్పి మైకు డాక్టర్ రామారావుకి ఇచ్చారు.
డాక్టర్ రామారావు అందరికీ నమస్కారం పెడుతూ నేను నా సర్వీస్ గురించి కానీ నేను చేసిన గొప్ప పనుల గురించి గానీ నేను ఏమి మాట్లాడను. ఎందుకంటే అందరూ ఆ మాటలు చెప్పేశారు. రోజు ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధుల తో బాధపడేవారు నా దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ పేషెంట్లు బంధువులు కళ్ళల్లో వచ్చే కన్నీళ్లు నా గుండెలో నిండిపోయాయి. ఆ కన్నీళ్లు నేను బాధ్యత గల డాక్టర్ గా పని చేసేలా చేసేయి. అయితే పైకి ఇంత గంభీరంగా ఉత్సాహంగా అందరి తోటి కలిసిమెలిసిపోయే నాకు గుండెల్లో ఒక తీరని బాధ ఉంది.
తండ్రి డాక్టర్ వృత్తిలో ఉంటే కొడుకును కూడా డాక్టర్ గా చేయాలని కలలు కంటారు డాక్టర్ వృత్తిలో ఉన్నవాళ్లు. అలాగే నేను కూడా కలలు కన్నా ను.
దేవుడు దయవల్ల ఒక గవర్నమెంట్ కాలేజీలో నా కొడుక్కి ఎంబిబిఎస్ సీట్ వచ్చింది. ఆఖరి సంవత్సరంలో ఉండగా ఒకరోజు కాలేజీ గేట్ నుంచి బయటకు వస్తుంటే ఎదురుగా వచ్చిన లారీ గుద్దేసింది.. నేను ఎంత పెద్ద డాక్టర్నైనా నా కొడుకు రోడ్డు మీదే ప్రాణం వదిలేసాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి నా భార్య బెంగ పెట్టుకుని ప్రాణాలు వదిలేసింది. ఇంటికి వెళ్తే నేను ఒంటరి వాడిని. అందుకే ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే గడుపుతాను. అప్పటినుంచి నా కొడుకుని ఎలాగైనా డాక్టర్ చేయలేకపోయాను అందుకని డాక్టర్ చదువుకునే రవి ప్రకాష్ లాంటి వాళ్లకి సహాయం చేస్తూ తృప్తి పడుతున్నాను. అయితే ఇప్పుడు ప్రైవేట్ ఆస్పత్రిలు ఎన్నో నాకు లక్షల జీతం ఇస్తామంటూ ముందుకొచ్చే యి. కానీ నా జీవితం అంతా నా సొంత ఊర్లో ఉచిత ఆసుపత్రి నడుపుకుంటూ గడిపేస్తాను అంటూ తన ఉపన్యాసం ముగించి కన్నీళ్లు పెట్టుకున్నాడు డాక్టర్ రామారావు.
మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు
ఆ తర్వాత మన జీవితంలో జరిగే ముఖ్యమైన వాటికి అన్నిటికి మనం సంతోషిస్తాం. కానీ పదవి విరమణ చేసినప్పుడు కన్నీళ్లు పెడతాం.
ఎందుకు ఆ కార్యాలయంతో మనం పెంచుకున్న అనుబంధం అలవాటు చేసిన క్రమశిక్షణ తోటి ఉద్యోగులతో పనిచేస్తున్నప్పుడు కలిగిన ఆనందం బాధ కోపం రేపటినుండి ఉండవని. రేపటినుండి ఆ కార్యాలయానికి వెళ్తే మనం కొత్త మనుషులు. ఎందుకంటే యి న్నాళ్ళు మనం సొంత మనుషులం ఆ కార్యాలయానికి.
ఆ కార్యాలయంలో ఒకరోజు మన వెళ్లకపోతే మన గురించి వాకబు చేసే వాళ్ళు చాలామంది ఉండేవారు. రేపటి నుంచి శాశ్వతంగా రాకపోయినా ఎవరూ పట్టించుకోరు. మనవసరం లేదు ఇంక ఆ కార్యాలయానికి. ఎందుకంటే మన సీట్లో వేరే వ్యక్తి వచ్చి కూర్చున్నారు. మనకింకా సీట్ లేదు. వెయిటింగ్ హాల్ తప్ప. ఎన్నాళ్ళు మనం పని చేసిన ఫైల్స్ గాని వస్తువులు గాని మనం ముట్టుకోవడానికి వీల్లేదు. అని ఒక తీయని బాధ మనసులో మెదులుతుంటే ఆ ఆసుపత్రి గుమ్మం దాటాడు డాక్టర్ రామారావు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి