భజన
భజన
" శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనo
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం "
ఇవి వ్యాస మహర్షి చెప్పిన నవవిధ భక్తి మార్గాలు. భగవంతుని చరిత్ర వినడం, భగవంతుని లీలలను కీర్తించడం ఇవన్నీ భగవంతుని చేరుకునే మార్గాలు. ఈ నవవిధ భక్తి మార్గముల ద్వారా భగవంతుని ఆరాధించి ముక్తి పొందిన అనేకమంది చరిత్రలు మనకి పురాణ గాథలు చెబుతున్నాయి.
అలాంటి నవవిధభక్తి మార్గాలలో భగవంతుని లీలలు కీర్తించడం ఒకటి. అనేకమంది భక్తులు రామదాసు అన్నమయ్య త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితులు వంటి వారు తమ కీర్తనల ద్వారానే భగవంతుని ఆరాధించి ముక్తి పొందారని మనకి చరిత్ర చెబుతోంది.
ఈనాటికీ మనం అనేక గ్రామాల్లోనూ పట్టణాలలోనూ దేవాలయాల్లో భజనలు చేయడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పర్వదినాల్లోనూ పండుగలలోనూ ఈ భజన కార్యక్రమాలు జరుగుతూ ఉండడం అనాది నుంచి వచ్చే సాంప్రదాయం. మా చిన్నతనాల్లో మా గ్రామంలో మా ఇంటిలో కూడా ప్రతి శనివారం భజనలు చేసేవారు.
అసలు భజన అంటే ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తుంది. పదిమంది ఒకచోట కూర్చుని చేసే భగవన్నామస్మరణ "భజన. భగవంతుని లీలలు తలుచుకుంటూ ప్రార్థించడం భజన. ఇది కూడా భగవంతుని చేరుకునే మార్గమే. నిరంతరము భగవన్నామస్మరణ చేయడం వలన భగవంతుడు మనస్సు కరిగి భక్తుడి కోరికలు తీరుస్తాడు. ఇలా పదిమంది ఒకచోట కూర్చుని ఒక బృందంగా లయబద్ధంగా చేతిలో చిడతలు పట్టుకుని బృంద గానం చేస్తుంటే మానసిక ఉల్లాసం పెరుగుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు పెరుగుతుంది. బాహ్య ప్రపంచంలో ఉండే బాధలన్నీ మరిచిపోయి మనం ఏదో లోకంలోకి వెళ్ళిపోతాం. ఈ భజన కీర్తనలు సుస్వరమైన గొంతులో చెవులకు చాలా ఆనందకరంగా ఉంటాయి . ముక్తి మాట అలా ఉంచితే ముందు ఇది మంచి వ్యాపకం. చెడు ఆలోచనలు మనసు నుండి తొలగిపోతాయి. మనుషులు సన్మార్గవంతులు అవుతారు.
అయితే పూర్వకాలంలో గ్రామాల్లో చాలామంది భజన కీర్తనలు రచించి లయబద్ధంగా ఆలపించేవారు. వారంలో ఒకరోజు ఒకరి ఇంటిలో ఈ భజనలు చేస్తూ ఉండేవారు. ఇంట్లో ఉండే వృద్ధులు నిత్యము ఈ భజన కీర్తనలు పాడుకుంటూ ఉండేవారు. రాను రాను ఆధునిక కాలంలో ఉండే ఆకర్షణలకు లోబడి ఇటువంటి సాంప్రదాయాన్ని మర్చిపోయారు.
అయితే సమాజం ఆధునికంగా ఎంత ముందుకు పరిగెడుతున్నప్పటికీ ఈ భజన సాంప్రదాయాన్ని ఇంకా సుమారు వంద సంవత్సరాల నుంచి కొనసాగిస్తోంది ఒక గ్రామం. ఆ గ్రామం పేరు కాకరపర్రు పెరవలి మండలం. ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలోను ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోనూ ఉండే కుగ్రామం.
ప్రతి సంవత్సరము ధనుర్మాసం ప్రారంభం కాగానే ఈ గ్రామంలో ఉదయం ఐదు గంటలకి భజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ గ్రామంలో అత్యధికంగా ఉండే ఒక సామాజిక వర్గం ఒక బృందంగా ఏర్పడి వాయిద్య సహకారాలతో భజన కీర్తనలు పాడుకుంటూ గ్రామం అంతా తిరుగుతూ నెలరోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగిస్తారు. దీనికి ఆంజనేయ స్వామి వారి భజన అని పేరు. అయితే ఒక మంచి పని చేయడానికి ఎవరో ఒకరు పూనుకోవాలి.
అటువంటి మంచి సాంప్రదాయాన్ని ప్రారంభించినవారు హనుమద్దాసు సోదరులు ఆ తదుపరి కంచిరాజు సోమశేఖర్ గారి కుటుంబ సభ్యులు అని ఇప్పుడే చదివాను.
ఆ తర్వాత అటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు ద్విభాష్యం జయ సద్గురు మూర్తి అంటే ఆ ఊరివారు ముద్దుగా జయబాబు అని పిలుచుకుంటారు.
ఇటువంటి మంచి కార్యక్రమానికి ఆ గ్రామస్తులు రామదండులా సహకరించడం గర్హించదగ్గ విషయం. ఇది స్వామి కార్యం. ఆ ఊరి వారికి ఆంజనేయ స్వామి అంటే ఎనలేని భక్తి. ఎంతోమంది ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్న వారు అక్కడ ఉన్నారు. ఆ ఊరి మండల కేంద్రంలో నిలువెత్తు స్వామి విగ్రహం ఎలాంటి వారినైనా ఆకర్షిస్తుంది. ఈ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో తీపర్రు అనే ఊరిలో ఆంజనేయ స్వామి వారి దేవాలయము చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుస్తాడని ఒక నమ్మకం.
ఆ సంగతి అలా ఉంచితే ఇంతవరకు నాకు తెలిసినంతవరకు గ్రంథస్తం కానీ ఆ భజన కీర్తనలు చర్ల శివప్రసాద్ సోదరులు పుస్తక ముద్రణ చేయించడం గర్వించదగ్గ విషయం. అలాగే చర్ల శివప్రసాద్ సోదరుడు చిరంజీవి గోపాలకృష్ణ ఆ భజన కీర్తనలను తన గొంతులో పాడి ఆడియో వీడియో రూపంలో విడుదల చేయడం కూడా చాలా ఆనందించవలసిన విషయం. ఈ భజన గీతాలను ఒకప్పుడు ఆ గ్రామస్తులైన కీర్తిశేషులు దుడ్డు సుబ్బమాంబ మరియు కీర్తిశేషులు కూచి బొట్ల సీతారామశాస్త్రి గారి చేత రచించబడి చాలా ప్రాచుర్యం పొందిన భజన కీర్తనలు.
సామాన్యుడు కూడా అర్థమయ్యేలా వ్రాసిన కీర్తనల పుస్తక ముద్రణతో రచయిత ల కీర్తి వెలుగులోనికి వచ్చింది.ఆంజనేయ స్వామి ఈశ్వరుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు లాంటి దేవతామూర్తుల మేలుకొలుపు గీతాలు చాలా సులభమైన పదాలతో రచించడం జరిగింది. ఇందులో దశావతార క్రమ చరణములు చాలా బాగున్నాయి. దశావతార వర్ణన సులభ శైలిలో వ్రాసిన రచయిత నిజంగా అభినందనీయులు.
ఇలా అనాదిగా నెల రోజులు సాగే భజన సంక్రాంతి పండగ వెళ్లిన తర్వాత స్వామి వారి ఆరాధన మరియు అన్నదానంతో ముగుస్తుంది. సంక్రాంతి పండగ కోసం దూర ప్రదేశాల నుండి వచ్చిన బంధువులు పిల్లలు స్వామివారి ప్రసాదం తిన్న తర్వాతే ఆ ఊరు నుండి తమ తమ ప్రదేశాలకు వెళ్లడం ఒక ఆనవాయితీగా అలవాటుగా వస్తోంది. సంతర్పణ భోజనం అంటేనే రకరకాల పదార్థాలు ఉంటా యి. దానికి తోడు స్వామివారి ప్రసాదం. అదీ కాకుండా కొంతమంది గ్రామస్తులు బంధువులు ఏదో ఒక తీపి వంటకం కూడా ఇస్తామని మొక్కుకుంటారు. ఇంకేముంది విస్తరి చూస్తేనే కడుపు నిండిపోతుంది.
ఇటువంటి సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఆ గ్రామస్తులను అభినందిస్తూ
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి