భాధ్యత
ఉదయం 5 గంటలు అయింది. ఎప్పుడూ ఐదు గంటలకు కాఫీతో పలకరించే కేర్ టేకర్ లక్ష్మీ ఇవాళ ఇంకా కనపడలేదు. ఏమిటి? ఏం చేయాలి అబ్బా! బీపీ మందు వేసుకోవాలి. మొహం కూడా కడుక్కోలేదు. ఏమిటో, నీరసంగా ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఎవరు పిలిచినా పలకరు. రాజేష్ ఫోన్ తీయట్లేదు. వాడు ఇంకా నిద్ర లేచాడో లేదో.
ఏమిటో ఈ వయసులో ఈ కర్మ అనుకుంటూ, అలాగే నెమ్మదిగా మంచం దిగి డేకుతూ, మొహం కడుక్కుని, నేల మీద ఉన్న స్టవ్ మీద పాలు పెట్టి, కాఫీ కాచుకుని తాగింది కాంతమ్మ. "కొడుకు ఒక మంచి పని చేశాడు. ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉంచినా స్టవ్ సామాన్లు కూర్చుంటే అందేలా పెట్టాడు" అని అనుకుంది కాంతమ్మ.
అయినా, ఎప్పుడూ ఈ కేర్ టేకర్ ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్లలేదే! ఇవాళ ఏమైందో ఏమో! మార్కెట్కు గాని వెళ్ళిందా, అయినా చెప్పి వెళ్తుంది కదా! ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. పోనీ, రాజేష్ కి విషయం చేద్దాం అంటే వాడు ఫోన్ తీయట్లేదు.
ఏమిటో, వాడు కళాకళల మనిషి. కోపంగా ఉంటే ఫోన్ తీయడు. వాడికి కోపం వస్తే, "అమ్మ" అనే సంగతి మర్చిపోతాడు.
ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది? రాజేష్ నోరు విప్పి మాట్లాడేవాడు కాదు. ఎంత బాగా చూసుకునే వారు. నేల మీద కాలు పెట్టనిచ్చేవారు కాదు. బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. పాపం, టీచరుగా పనిచేస్తూ కొడుకుని పెద్ద చదువులు చదివించి, ప్రయోజకుడ్ని చేసి, బాగా డబ్బున్న వాళ్ల సంబంధం వచ్చిందని మురిసిపోయి రాధని కోడలిగా తెచ్చుకున్నారు. నాలుగుేళ్లు బాగానే గడిచింది.
ఆయన హార్ట్ ఎటాక్ తో పోవడం తర్వాత, పక్షవాతం రావడం, మరి కోడలు నా వైపు చూడడం మానేసి, కొడుకుకి ఏం చెప్పిందో ఏమో, వాడు మాటలు తగ్గించేసి ఇలా కేర్ టేకర్‌ని పెట్టి వేరు కాపురం పెట్టాడు. కొడుకు అనుకుని బాధపడుతూ, కాఫీ తాగుతూ కూర్చుని కాంతమ్మ.
ఇది అసలే అపార్ట్మెంట్. కేర్ టేకర్ లక్ష్మీ తన బాధ్యతను చేసుకుంటూ పోతుంది. మాట మంత్రి ఉండదు. ఇంకెవరు మాట్లాడే వారెవరు ఉండరు. ఒంటరితనం ఎంత భయంకరం! అందులో ఈ వయసులో. బయటికి వెళ్లలేదు. ఫోన్ చేసిన ఎప్పుడో గాని రాజేష్ తీసి సమాధానం చెప్పడు. ఎన్ని రోజులు ఈ కర్మ అనుభవించాలో! పోయిన వాళ్లు మంచోళ్ళే అనే మాట నిజమే అనిపిస్తుంది అనుకుంది కాంతమ్మ.
అలాగే డేకుతూ, బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి, ఫ్రిడ్జ్‌లో ఉన్న బ్రెడ్ ముక్కలు తీసుకుని తిని, మందులు వేసుకుని, మంచం మీదకు వచ్చి పడుకుంది. జీవితం తొలి దశలో డబ్బు గురించి బాధపడేవాళ్ళం. ఇప్పుడు సరిపడే పెన్షన్ వస్తుంది. ఉండడానికి ఇల్లు ఉంది. ఆరోగ్యం మాట అలా ఉంచితే, ఇప్పుడు ఒంటరితనమే బాధిస్తోంది.
ఈ ఒంటరితనానికి మందు ఏమిటి? ఈ మందు ఎవరు ఇవ్వాలి? అయినవాళ్లే దూరంగా పెడితే, వంటరితనానికి ముందు ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తూ, కళ్ళు మూసుకుని పడుకుంది.
కాంతమ్మ గారికి మెలకువ వచ్చి లేచేటప్పటికి మధ్యాహ్నం పన్నెండు గంటలు అయింది. ఆకలవుతోంది. "ఇప్పుడు ఎలాగ రా దేవుడా?" అనుకుంది కాంతమ్మ. ఇంతలో వీధి తలుపు తాళం తీస్తున్న చప్పుడయింది. అంటే లక్ష్మీ వచ్చిందా!
"ఇప్పుడు అసలు మాట్లాడను. ఉదయం నుంచి నన్ను ఇంత బాధ పెట్టింది. పోనీ ఊరికినే చేస్తోందా, చాకిరి! నెలలో మొదటి రోజునే జీతం పట్టెకిళిపోతుంది కదా! మరింత బాధ్యతారహితంగా ఉంటే ఎలా! నా పరిస్థితి తెలుసు అయినా ఇలా!" అంటూ కోపంగా అటు తిరిగి పడుకుంది.
లక్ష్మీ ఇంట్లోకి వస్తూనే, "క్షమించండి మామ్మ గారు, మా అత్తగారికి హార్ట్ ఎటాక్ వచ్చిందండి. పొద్దున్నే మా ఆయన ఫోన్ చేశాడు. తిని తిరిగే మనిషికే అలా వచ్చింది. నేను ఇంట్లో లేకపోయినా, మా ఆయనకి ఇంత అన్నం ఉడకేసి పెడుతుంది ఈ వయసులో కూడా పాపం. ఏం చేస్తాం? భార్యాభర్తల ఇద్దరూ ఉద్యోగం చేస్తే గాని గడవని కుటుంబం మాది. మాకు రోజు ఇంత సాయం చేస్తున్న ఆమెకు అలా వచ్చిందంటే, నేను తట్టుకోలేక పోయాను. పైగా నేను పెద్ద కోడల్ని. మీకు చెబుదామంటే, మీరు మంచి నిద్రలో ఉన్నారు. మీ అబ్బాయి గారికి చెప్పాను. తొందరగా వెళ్ళిరా అని చెప్పారు. ఇప్పుడు మా అత్తకి బాగానే ఉంది. వస్తూ వస్తూ, మీకు భోజనం సమయం అయిపోయిందని, ఇంటి దగ్గర నుంచి క్యారేజీ కూడా పట్టుకుని వచ్చాను. లేవండి, అన్నం పెడతాను. రేపటి నుంచి మీకు మొహం కడిగించేసి, టిఫిన్, కాఫీ ఇచ్చి, మందులు వేసి వెళతాను మధ్యాహ్నం ఇదే సమయానికి వచ్చేస్తాను" అంటూ చెప్పేసరికి, ఒకసారి కాంతమ్మకి కళ్ళు నీళ్లు వచ్చేయి.
బాగా చదువుకుని, డబ్బు సంపాదిస్తున్న కొడుకు కి లేని జ్ఞానం గురించి బాధపడాలా, రెక్కాడితే గాని డొక్కాడని, ఈ లక్ష్మీ లాంటి వాళ్లకి ఉన్న బాధ్యతకి ఆనందపడాలా… అర్థం కాలేదు కాంతమ్మకి.
బాధ్యత ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు. మనకు మనమే పరిస్థితులను అర్థం చేసుకొని, అహాన్ని దూరంగా పెట్టి, బాధ్యత పంచుకోవాలి. బరువులు మోయాలి. మనిషిగా పుట్టినందుకు, జ్ఞానంగా మెలగాలి.
ఆ తర్వాత కాంతమ్మ జీవితం ఆ బాధ్యత గల లక్ష్మీ చేతిలోనే ముగిసిపోయింది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి