ఒక తల్లి గుండె చప్పుడు


మధ్యాహ్నం మూడు గంటలు అయింది.

ఇందిరా గాంధీ లేడీస్ క్లబ్ ఆవరణ అంతా హడావిడిగా ఉంది. కార్యకర్తలంతా అటు నుంచి ఇటు తిరుగుతూ, సభ ప్రారంభానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ, ముఖ్య అతిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
"ఆ బ్యానర్ ఎదురుగుండా కట్టండి" అని చెప్పి ఒక్కసారి బ్యానర్ చూసిన లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్,
"అదేమిటి? ముఖ్య అతిథి పేరు కింద జిల్లా కలెక్టర్ అని రాయలేదు ఏమిటి?" అని అడిగింది.
"లేదు మేడం. కలెక్టర్ గారు ఒక సాధారణ మహిళగానే ఈ కార్యక్రమానికి వస్తారట. అందుకని పేరు మాత్రమే రాయమన్నారు" అంటూ సమాధానమిచ్చింది లేడీస్ క్లబ్ సెక్రటరీ.
ఆ జిల్లాకి కలెక్టర్ ఆయన శ్రీమతి సుమతి. ఆ రోజు ముఖ్య అతిథి. జరగబోయే ఫంక్షన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

---
సరే, అనుకున్న సమయానికి కలెక్టర్ గారు రావడం, వేదిక మీదకి ఆహ్వానించడం, అలాగే ఆ రోజు సన్మానితులను కూడా వేదిక మీద కలెక్టర్ గారి పక్కన కూర్చోబెట్టడం జరిగింది.
అతి సామాన్యమైన దుస్తులతో, ఏవీ అలంకరణలు లేకుండా, కనీసం జుట్టు కూడా దువ్వుకోకుండా ఉన్న స్త్రీని కలెక్టర్ గారి పక్కన కూర్చోబెట్టారు.

ఒక్కసారి కలెక్టర్ సుమతి ఆమెను చూసి,
"రోడ్డు మీద పోయే వాళ్లని సన్మానించడానికి తీసుకొచ్చినట్టున్నారు. వీళ్లకి ఎవరూ దొరకలేదా ఏమిటి?

 సంఘంలో అనేకమంది ఉన్నత స్థానాలు అలంకరించిన స్త్రీలు ఉన్నారు. వాళ్లందర్నీ వదిలేసి ఎవరినో పట్టుకుని వచ్చారు. ఈ మాత్రం దానికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం ఎందుకు? ఈ క్లబ్ వాళ్లే వాళ్లని సన్మానిస్తే సరిపోయేది. అయినా వీళ్ళు జీవితంలో ఏం సాధించారో ఎవరికీ తెలీదు. పనులన్నీ మానుకొని ఇలాంటి కార్యక్రమానికి వచ్చాను... ఏమిట్రా దేవుడా!" అని అనుకుంది.

---
ఇక ఆ సన్మాన గ్రహీత పోచమ్మ పరిస్థితి కూడా అంతే విచిత్రంగా ఉంది.
ఆమె మనసంతా దిగులుగా ఉంది. "రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు. రేపు పిల్లలకి ఏం పెట్టాలి? ఈరోజు పనిలోకి వెళ్ళలేదు కదా! అంతా నష్టం! ఎందుకు వచ్చిన సన్మానాలు నాకు?" అనుకుంటూ బాధపడుతోంది.

ఇంటి దగ్గర ఉండే భర్త, పిల్లలు గుర్తుకొచ్చారు. "పిల్లలు అన్నం తిన్నారో లేదో!" అని తనలో తాను బాధపడసాగింది. దానికి తోడు, నేల మీద కూర్చోడమే కానీ, ఎప్పుడూ ఇలాగా కుర్చీలో కూర్చోవడం అలవాటు లేక ఇబ్బంది పడసాగింది పోచమ్మ.

---
సభ ప్రారంభమైంది.
"ప్రతి ఏటా ఎంతోమంది వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలు అలంకరించిన మహిళా మణులను సన్మానించుకోవడం జరుగుతోంది మా క్లబ్బులో. అయితే అందుకు భిన్నంగా ఈసారి ఒక ప్రత్యేక వ్యక్తినీ సన్మానించాలని నిర్ణయించాం.

ఒక స్త్రీ నిత్యజీవితంలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ, తన కుటుంబాన్ని సమర్థవంతంగా చూసుకుంటూ, దేశానికి మంచి పౌరులను అందిస్తోంది. ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక పైలట్... ఇలా అనేక రంగాల్లో రాణిస్తున్న వారు ఉన్నారు. అయితే ఈ వేదిక మీద కూర్చున్న పోచమ్మ అనే స్త్రీ సాధారణ రైతు కుటుంబానికి చెందినది.

భర్త, ఇద్దరు పిల్లలతో చుట్టుపక్కల ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ జీవిస్తోంది. అయితే పోచమ్మ పనిచేసే ఒక ధనవంతురాలి ఇంట్లో యజమానురాలు రమ్యకి పిల్లలు లేరు…"

---
తర్వాత సరోగసీ కథ, పోచమ్మ త్యాగం, రమ్య గారి అనుభవం అన్నీ వివరంగా చెప్పిన తర్వాత, అధ్యక్షురాలు సుమతి హృదయపూర్వకంగా ఒప్పుకుంది.

"ఉద్యోగిగా ఉన్న స్త్రీ సాధించిన ప్రగతి ప్రపంచానికి తెలుస్తుంది. కానీ కుటుంబంలో ఒక స్త్రీ సాధించిన విజయాలు బయటికి కనిపించవు. పోచమ్మ లాంటి త్యాగమూర్తులు నిజంగా సమాజానికి ఆదర్శం."

అని ఆమె, పోచమ్మ రెండు చేతులు పట్టుకుని నమస్కారం చేసింది.

---
తర్వాత సన్మానం, శాలువా, బహుమతి అందుకున్నాక, పోచమ్మ కళ్లలో నీరు తెప్పించేలా అంది:
"అమ్మా! నాకు ఈ గిఫ్ట్ లవి వద్దమ్మా! నాకు ఒక రోజు కూలి ఇప్పించండి. లేదంటే రేపు అంతా మా పిల్లలు పస్తులు ఉంటారు. ఈ రోజంతా నేను పనికి వెళ్లలేదు కదా!"

పోచమ్మ మాటలకి అక్కడ ఉన్న వారందరికీ కళ్లలో నీళ్లు తిరిగాయి.

---
అవును, ఒక స్త్రీ మాత్రమే ఇలా ఆలోచించగలదు. స్త్రీ నిజంగా కరుణామూర్తి.
ఎప్పుడూ సంఘాల్లో ఉన్నత స్థానాలు అలంకరించిన వాళ్ళకే సన్మానాలు జరుగుతుంటాయి. కానీ ఇలాంటి "మట్టిలో మాణిక్యాలకి" సన్మానం జరగడం ఇదే మొదటిసారి.

పేపర్లన్నీ ఆ క్లబ్ గురించి చాలా గొప్పగా రాశాయి. నిజమే కదా!

✍️ రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
📍 కాకినాడ

📞 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట