స్నేహం ముసుగులో
ఇదే రామకృష్ణ ఇల్లు అనుకుంటా! ఏమి మార్పు లేదు. అప్పట్లోనే పడిపోతున్నట్టుగా ఉండేది. కొద్దిగా రిపేర్లు చేయించినట్టున్నారు. ఊరంతా మారిపోయింది. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేశారు. తారు రోడ్లు వేశారు. పూరిపాకలు తక్కువగా కనబడుతున్నాయి.
అవును, ఇది రామకృష్ణ ఇల్లే. ఇంటి ముందు దుమ్ము కొట్టుకుపోయిన మగ్గం అలాగే ఉంది. అవతల అరుగు మీద ఎన్నిసార్లు ఆడుకున్నామో! ఎన్నాళ్ళయిందో వాడిని చూసి… అసలు నన్ను గుర్తుపడతాడా లేదా?
ఎప్పుడో చిన్నప్పుడు ప్రతి ఏటా అమ్మమ్మని చూడడానికి వచ్చినప్పుడు ఎక్కువగా వీడితోటే ఆడుకునేవాడిని. నా కంటే రెండేళ్లు పెద్ద. అప్పట్లోనే వాళ్ల నాన్నకి సాయం చేసేవాడు. నేను వచ్చానంటే వాళ్ల నాన్న – "ఆడుకో!" అంటూ పంపించేవాడు. పాపం, వాళ్ల నాన్న మగ్గం నడిపితే గాని బ్రతుకు గడిచేది కాదు.
ఒక్కసారి పాత జ్ఞాపకాల్లోంచి బయటకి వచ్చి, "రామకృష్ణ!" అని గట్టిగా పిలిచాను.
"లేరండి, బయటకి వెళ్లారు!" – ఎవరిదో పిల్లల గొంతు వినిపించింది.
"నా పేరు ప్రవీణ్. నీవు, నేను రామకృష్ణ ఫ్రెండ్స్. అమెరికా నుంచి వచ్చాను" అని చెప్పండి అని పిల్లాడితో చెబుతూనే వెనక్కి తిరిగి వెళ్తుండగా, తలుపు తెరచిన చప్పుడైంది.
ఎదురుగా మాసిపోయిన అంగవస్త్రం, ఎండిపోయిన శరీరంతో ఒక ఆకారం బయటికి వచ్చింది.
"ఎవరు?" అని అడిగాడు.
"నేను రా ప్రవీణ్‌ని… చిరంజీవి గారి మనవడిని. అమెరికా నుంచి వచ్చాను!" అన్నాను.
నన్ను చూసి గుర్తుపట్టలేదేమో. దుమ్ము పేరుకుపోయిన అరుగు మీద ఎక్కడ కూర్చో పెట్టాలో తెలియక, అటూ ఇటూ చూశాడు. కనీసం చాప కూడా లేదనిపించింది. వాడి కళ్లల్లో ఎందుకో సిగ్గు కనిపించింది
"ఏవండీ ప్రవీణ్ గారు… ఎలా ఉన్నారు?" అన్నాడు.
"అదేమిటిరా! పిలుపు మారిపోయింది?" అన్నాను.
"మేము ఇంకా దిగజారిపోయాం రా… నువ్వు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయావు!" అన్నాడు రామకృష్ణ, నన్ను ఎగాదిగా చూస్తూ.
"ఊరుకోరా నీ కబుర్లు నువ్వు!" అంటూ భుజంపై చేయి వేసాను. వాడు మాత్రం తడబడి, దూరంగా జరిగిపోయాడు. వాడి మనసులో భావన నాకు అర్థమైంది.
"ఎలా ఉన్నావు?" అని అడిగాను.
"ఇలాగే రా… బతకలేక, చావలేక!" అన్నాడు రామకృష్ణ.
ఇంట్లో లేవని చెప్పారు అని అడిగాడు ప్రవీణ్.
లేదు నేనే అలా చెప్పమని చెప్పాను ఈ సమయంలో ఎవరు వచ్చినా ! ఎందుకంటే మా ఫైనాన్స్ వ్యాపారి ఈ సమయంలోనే వస్తాడు అన్నాడు రామకృష్ణ దిగులుగా.
"అప్పట్లో చదువుకోలేదు. చదివించే స్తోమత మా వాళ్లకు లేదు. చేతిలో ఉన్న పని నేర్పారు. పనిచేసే నేర్పు, ఓర్పు మాత్రం నేర్పారు.. కొంతకాలం బాగుండేది. పెళ్లిళ్లకి, పండుగలకి, పబ్బాలకు మా ఊరికి వచ్చి బట్టలు నేయించుకునే వాళ్లు ఉండేవారు. పెళ్లిళ్లలో అయితే అన్నీ పెద్దాపురం పట్టుచీరలే!"
"ఆ తర్వాత స్పీడు యుగం వచ్చింది. రకరకాల మార్పులు వచ్చాయి – నీకూ తెలుసు కదా. ఇప్పుడు పని లేకపోలేదు, కానీ దళారులు పెరిగిపోయారు. అంతా దోపిడీ. దాంతో ఖరీదు కూడా పెరిగిపోయింది. ఎవరు అంత ఖరీదు పెట్టి కొనడానికి ముందుకు రావడం లేదు" అన్నాడు రామకృష్ణ, ఆవేదనతో.
అవును – పెద్దాపురం సిల్క్ అంటే ఎంత మోజు! బామ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఎప్పుడో తన పెళ్లినాటి పట్టుచీరను బామ్మ చనిపోయే వరకు దాచుకునేది.
"కట్టుకుంటే మెత్తగా ఉంటుంది రా!" అని అనేది అని బామ్మ మాటలు తలుచుకున్నాడు ప్రవీణ్.
"సరే రామకృష్ణ, మన ఊళ్లో మగ్గం నేసే వాళ్లు ఇంకా ఎంతమంది ఉన్నారు?" అని అడిగాడు ప్రవీణ్.
"వంద కుటుంబాలు పైనే ఉంటాయి. అందులో మన స్నేహితులూ చాలామంది ఉన్నారు!" అన్నాడు రామకృష్ణ.
"అయితే రేపు సరదాగా అందరినీ మన టౌన్ హాల్‌లో కలుద్దాం!"
అంటూ తన బ్యాగ్ లోని కరపత్రాలు చేతిలో పెట్టాడు ప్రవీణ్.
ఇంతలో వీధిలో రిక్షాలో మైకు అనౌన్స్మెంట్ వినిపించింది – "బడుగు చేనేత కార్మికుల సదస్సుకి ఆహ్వానం!"
ఆ తర్వాత ప్రవీణ్ తన చేతిలోని బ్యాగ్ రామకృష్ణకి ఇచ్చి వెళ్లిపోయాడు.
రామకృష్ణ ఇంట్లోకి వచ్చి బ్యాగ్ తెరిచి చూశాడు. అందులో ఇరవై వేల రూపాయలు, అమెరికన్ చాక్లెట్లు, బట్టలు కనబడ్డాయి.
తన పరిస్థితి చూసి తనకే జాలి వేసింది రామకృష్ణకి. ఒక్కసారి తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ డొక్క ఎండిన పిల్లలవైపు చూసి మౌనంగా బజారుకు పరిగెత్తాడు.
ప్రవీణ్ ఇచ్చిన బట్టలు వేసుకుని మురిసిపోయి ,మెరిసిపోయి ఆ సాయంత్రం టౌన్ హాల్‌కి వెళ్లాడు. అప్పుడప్పుడే జనం వస్తున్నారు వాళ్లూ తనలాగే కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు. ఎప్పుడూ దీనంగా ఉండే వాళ్ల కళ్లలో మెరుపు కనబడుతోంది.
అంటే, ప్రవీణ్ చేతి చలవనేమో!
"పోనీలే! డబ్బు సంపాదించినా, అమ్మమ్మ గారు ఊరిని – పాత స్నేహితుల్ని – మర్చిపోలేదు" అని అనుకున్నాడు గర్వంగా, తన స్నేహితుడి గురించి రామకృష్ణ.
సదస్సు మొదలైంది. ఊరి పెద్దలు మాట్లాడారు. ప్రవీణ్ చేస్తున్న పనిని పొగిడారు. మధ్యలో ఖరీదైన అల్పాహారం. అది కూడా అమెరికాదే!
ప్రవీణ్ ప్రసంగం – "తనకు ఈ ఊరంటే ఇష్టమని, చిన్నప్పటినుంచి వీళ్లతో ఆడుకున్నానని, పెద్ద చదువులు చదివి అమెరికాలో వ్యాపారం చేస్తున్నానని, అయినా మన ఊరి కోసం ఏదైనా చేయాలని అనిపించిందని, అందుకే మన నేత పని వాళ్లందరికీ రేపటి నుంచి ముడి సరుకు సప్లై చేస్తానని, నేసిన బట్టలు అమెరికాకు తీసుకెళ్తానని, మన బట్టలకి అక్కడ విపరీతమైన గిరాకీ ఉందని, అక్కడ ఉన్న భారతీయులకి పెద్ద విలువ ఉందని, మళ్ళీ మన మగ్గాల చప్పుడు వినపడుతుందన్న ఆశతో ముందుకు వచ్చానని…" చెబుతూనే అందరికీ కాగితాలు ఇచ్చాడు.
తెలుగులో ఉన్న సారాంశం చదివితే – అడ్వాన్స్‌గా ఇరవై వేల రూపాయలు ఇచ్చామని, ఇక ఎవరికీ సరుకు అమ్మకూడదని స్పష్టంగా రాసి ఉంది.
అది చదివి రామకృష్ణ భారంగా నిట్టూర్చాడు.
"పొరుగూరి దళారీకి, ప్రవీణ్‌కి తేడా ఏముంది? ఇది స్నేహం ముసుగులో వ్యాపారం!"
"సంతకం పెట్టకుండా తిరిగి ఇస్తే అడ్వాన్స్ అడిగితే ఏమివ్వగలిగేది? ఇది కూడా గుడ్డిలో మెల్ల. దోపిడీ జరుగుతోంది తెలుసు... కానీ జీవితం గడవాలంటే తప్పదు." అనుకున్నాడు రామకృష్ణ. వినియోగదారుడు షాపులోనే కొంటాడు. ఆ చీర నేసిన వాడెవడో తెలియదు. కనీసం పేరు కూడా ఉండదు. షాపు వాడి స్టిక్కరే ఉండేది. పోనీలే! పేరు లేకపోతే ఏమైంది? మన బట్టలు అమెరికా వెళ్తున్నాయి – దేశానికి పేరు వస్తుంది అని అనుకుని" – ఆ కాగితాలపై సంతకం చేసి ఇచ్చేశాడు.
ప్రవీణ్ ప్రసంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ రామకృష్ణ ముఖం తిప్పుకొని ఇంటికి నడిచాడు…
ఆ తర్వాత… రామకృష్ణ అరు గు మీదే కాదు – ఆ ఊరంతా మగ్గం చప్పుడు మోగుతూనే ఉంది.
దోపిడీకి గురవుతున్న నేతన్నల బాధల్ని పట్టించుకోకుండా… మగ్గం తన పని తాను చేసుకుంటూనే ఉంది. ఎందుకంటే – తరతరాలుగా నేతన్నల బాధను చూస్తూనే ఉంది మౌనంగా.
ఆ తర్వాత ఆ ఊరిలో చేనేతకు బట్టల ఎగుమతి సంస్థ కార్యాలయం సిబ్బంది మాత్రమే చేనేత కార్మికులను పలకరిస్తున్నారు ప్రతిరోజు. కానీ చిన్ననాటి స్నేహితుడు ప్రవీణ్ తనకు కావలసిన పని పూర్తి చేసుకుని మళ్లీ కనపడలేదు. అది స్నేహమా! వ్యాపారమా! వ్యాపారం అనే ముసుగు వేసుకున్న స్నేహం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి