పేరంటం
ఏమిటి ఇవాళ కూడా శనగ ల వేపుడేనా! అని అడిగాడు రాజారావు భోజనం వడ్డిస్తున్న భార్య సుమతిని.
అవునండి! శ్రావణమాసం నోములు కదా! పేరంటానికి వెళ్లొచ్చాను అంది సుమతి.
ఈ వారంలో అప్పుడే రెండోసారి! శనగల వేపుడు ఏమిటో అని విసుక్కున్నాడు రాజారావు
వచ్చిన శనగ లు పారేసుకుంటామా ఏమిటి! ఇది దేవుడి ప్రసాదంలాటి దేరా అంది అమ్మ వాకిట్లోంచి.
నీకు గుర్తు లేదేమిటి రా! చిన్నప్పుడు మీ పిన్ని తో పాటు నువ్వు కూడా పేరంటానికి వెళ్లే వాడివి. కోతి పేరంటాలని ఏడిపించేవారు. దాని అర్థం తెలియక అదే మాట పదేపదే సార్లు ఇంటికి వచ్చి అనుకుంటూ ఉండేవాడివి. మేమంతా నవ్వే వాళ్ళము అంది అమ్మ. అప్పుడు మీరు అంతా పచ్చి శనగలు బొక్కేసేవారు అoది అమ్మ. ఇప్పుడు శనగల వేపుడు అంటే అలా మొహం అలా చిట్లించుకుంటావు ఏంటి
అంది అమ్మ వాకిట్లోంచి.
అవును శ్రావణ మాసం అంతా పేరంటం హడావుడి. నాలుగు మంగళవారాలు, నాలుగు శుక్రవారాలు వాయినాలు ఇంటి నిండా శనగలే. చిన్నప్పుడు తెలియక వాయినాలలో ఇచ్చిన పచ్చి శనగలు తింటే పెద్దవాళ్లు తిట్టేవారు. నిజానికి వాళ్లు తిట్టినట్టుగానే మర్నాడుకడుపు నొప్పి వచ్చేది. శనగలు ఒకటే కాదు దాంతోపాటు ఇచ్చిన పచ్చి చలిమిడి తీయగా ఉంటుందని తింటే ఇంక మర్నాడు స్కూలుకు సెలవు.
ఎప్పుడూ అమ్మ, పిన్ని కలిసి పేరంటాలకు వెళ్లేవారు. అమ్మ ఏ కారణం వల్లనైనా రాకపోతే పిన్ని నన్ను చంకను ఎత్తుకొని తీసుకు వెళ్ళేది .
"ఏరా మీ పిన్ని తో పాటు నీకు కూడా పసుపు బొట్టు ఇమ్మంటావా అని వేళాకోళం ఆడేవారు అక్కడ ఉన్నవాళ్లంతా.. ముత్తయిదువు మర్యాదల్లో భాగంగా నుదుటన బొట్టు, కాళ్లకు పసుపు, ఒక గరిట మీద నల్లగా పేరుకుపోయిన కాటుక, ఇవ్వడం అయిపోయిన తర్వాత పిన్ని చేతిలో పట్టుకున్న జేబురుమాలు నేల మీద పరిస్తే దాని మీద సెనగలు పోసేవారు.
పిన్ని రుమాలు నాలుగు మూలలు కలిపి శనగలను మూట కట్టేది. పచ్చటి శనగలు , తెల్లటి చలిమిడి ఉండ, ఆకుపచ్చని రంగులో తమలపాకులు, పసుపుపచ్చ రంగులో అరటిపండు, నల్ల రంగులో పోక చెక్క మధ్యలో కొబ్బరి ముక్క లు తెల్లటి రుమాలు మీద ఒక అందమైన బొమ్మలా కనిపించేవి.
సాయంకాలం నాలుగు గంటలకు మొదలుపెడితే రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళం. అసలే బ్రాహ్మణ అగ్రహారం. ఆ ఊరు చాలా పెద్దది.
అక్కడ అందరూ ఆడవాళ్లే నేను తప్ప. రంగు రంగులు పట్టుచీరలతో మెడ నిండా వస్తువులతో రకరకాల కబుర్లు చెప్పుకుంటూ పేరంటం అంతా హడావిడిగా ఉండేది. నలుగురు ఆడవాళ్ళ కలిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే.
ఇంటికి వచ్చిన తర్వాత రుమాళ్లను ఇప్పి శనగలన్నీ ఒకచోట చలిమిడి ఒకచోట ఆకు ఒక్క వేరు చేయడం లాంటి పనులు చేసి అక్కడ నుంచి దండయాత్ర మొదలుపెట్టేవాళ్ళం. ఆ తర్వాత కథ మీకు తెలిసినదే.
అసలు ప్రకృతి కూడా ఈ శ్రావణమాసంలో ఎంత అందంగా ఉండేదో ఆకాశంలో నల్లటి మబ్బులు, వాన జల్లులు, మెరుపులు ,ఉరుములు, వర్షపు జల్లులకి మురికి అంత వదలగొట్టుకుని మెరిసిపోతున్న చెట్లు, రోడ్డుమీద బురద, చీర కుచ్చిళ్లు పైకి పట్టుకుని జాగ్రత్తగా రోడ్డు మీద నడిచే వెళ్ళే పేరంటాళ్ళు లీలగా గుర్తొచ్చేయి రాజారావుకి. ఈ కాలంలో చూస్తే ఎండ మండిపోతోంది.
గురుగ్రహ ప్రీతి కోసం మామూలుగా శనగలు దానం ఇస్తుంటారు. మరి శ్రావణమాసంలో అమ్మవారి ప్రీతి కోసం చేసే పూజలో నానబెట్టిన సెనగలు నైవేద్యంగా పెడుతుంటారు శనగలు అమ్మవారికి ప్రీతికరమైనవి. పైగా మంచి బలవద్దకమైన ఆహారం. సులువుగా జీర్ణం అయ్యే ఆహారం. ఫైబర్ ఎక్కువ అని బామ్మ చెబుతూ ఉండేది
అలా వాయినాల కింద వచ్చిన శనగల్ని ఏం చేయాలన్నదే ఇంట్లో పెద్ద సమస్య. ఇదిగో ఇలా వేపుళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు మసాలా వడలు, పాఠోళి తయారు చేసేవారు పూర్వకాలంలో. ఇంకాస్త ఎక్కువ ఓపిక ఉన్న వాళ్ళు శనగలు ఎండలో ఎండబెట్టి శనగ పప్పుచేసుకున్న వాళ్ళు కూడా ఉండేవారు. మామూలుగా ప్రత్యేకంగా శనగలు కొనుక్కుని నానబెట్టి వేపుళ్ళు ఎవరు చేసుకోరు. ఇలా శ్రావణమాసం పేరంటంలోకి వచ్చిన వాటితో తప్పితే!
అప్పట్లో మా బామ్మ మాతోపాటు చలివిడి తినడంలో పోటీపడేది. బెల్లం తక్కువ అయిందని, కొబ్బరికాయ ముక్కలు వేయలేదు అని , లేదంటే చలివిడి ఉండ చిన్నగా ఉందనీ ఏదో ఒక కామెంట్ విసిరేది బామ్మ. ఆ కాలం వాళ్లు కొంచెం అలా ఉండేవారు.ఇప్పుడు పేరంటo ఎక్కడ జరుగుతోంది నగరంలో. ఇంటికి వచ్చి ప్లాస్టిక్ కవర్లో పోసిన వాయనం ఇచ్చి నోము పూర్తి చేసుకుంటున్నారు.
"ఏమిట్రా ముద్ద నోట్లో పెట్టుకోకుండా అలా ఉండి పోయావు అని గట్టిగా అరిచింది అమ్మ వాకిట్లోంచి !
"ప్రతిరోజు ఇలా తింటే కడుపు నొప్పి వస్తుంది .అమ్మ నువ్వు చెప్పిన మాట నేను చెప్తున్నా అన్నాడు రాజారావు.
రాళ్లు తిన్న అరిగిపోయే వయసు నీది కడుపు నొప్పి ఏమిటి నీ మొహం నేను చూడు ప్రతిఏటా శ్రావణ మాసంలో నేనే తింటాను ఆ వాయనంలోని చలిమిడి ఉండదు. ఈ వయసులో కూడా నన్ను ఏమీ చేయలేదు. నువ్వు ఇంకా భయపడతావు ఏంట్రా ! అంది రాజారావు తల్లి.
" అయితే ఇందాక చలివిడి ఉండలు కనపడలేదు అనుకున్నా మీరు తినలేదనమాట అది భర్తను ఉద్దేశించి సుమతి.
ఆ మాటలు విని రాజారావు తల్లి తనలో తానే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ కనబడింది సుమతికి. ఓరి దేవుడోయ్ రేపటి నుంచి ముసలావిడ పరిస్థితి ఏమిటో అనుకొని భయపడ సాగింది సుమతి.
చిన్నపిల్లల్లాగా వాయనంలోని చలిమిడి ఉండలు తినడం ఏమిటో అని నవ్వుకున్నాడు రాజారావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి