కలలు కన్న రాజ్యం
ఉదయo ఎనిమిది గంటలు అయింది.
ఆకాశమంత దట్టంగా మబ్బులు పట్టి ఉంది. ఉదయం నుంచి ఒకటే ఈదురుగాలులు . గత రెండు రోజుల నుంచి బంగాళాఖాతంలో తుఫాను హెచ్చరికలు రేడియోలో టీవీలు గంట గంటకి వినిపిస్తున్నాయి.ఈ సమయంలో తుఫాన్లు ఏమిటి విపరీతకాలం కాకపోతేను .ఇదివరకు వర్షాకాలంలోనే వచ్చేవి. ఇప్పుడు కాలంతో పనిలేదు. ఏమిటో పంటలన్నీ కోతకు రెడీగా ఉన్నాయి.
ఇప్పుడు కనక తుఫాను వస్తే రైతులు మట్టి కొట్టుకుపోతారు. పైగా ఇది గోదావరి నది ఒడ్డు పక్కన ఉన్న పల్లెటూరు. వర్షం వస్తే గోదావరి కూడా వరదలు వస్తాయి. గత ఏడాది వచ్చిన వరదలకే ఇంకా ప్రజలు తేరుకోలేదు. ఎంత ప్రాణ నష్టం జరిగింది . పంటలన్నీ పాడైపోయా యి. పశువులన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయేయి. ప్రభుత్వ సహాయం అందేటప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోయింది అనుకొని భయపడుతూ ఆ వీధి అరుగు మీద కూర్చుని విద్యార్థులకి వేద పాఠాలు చెబుతున్నారు చలపతి శాస్త్రి గారు.
పరోపకారార్ధం ఇదం శరీరం అనే సూక్తిని గట్టిగా నమ్మిన వ్యక్తి చలపతి శాస్త్రి గారు. పైగా అగ్రహారంలో ఉండే వేద పండితుల్లో ఒకరు.
వారసత్వంగా వచ్చిన ఆస్తి, పెద్ద ఇల్లు పదిమందితో కలిసి పోయే మంచితనం, స్నేహ తత్వం, కులమతాలు అంటే పెద్దగా నమ్మకం లేని గుణం ఇవి చలపతి శాస్త్రి గారికి ఉండే ప్రత్యేక లక్షణాలు. పైగా చలపతి శాస్త్రి గారు మంచి ఆయుర్వేద వైద్యులు. డబ్బు కోసం జనాలను పీడించే వ్యక్తి కాదు. అవసరమైతే అర్ధరాత్రి కూడా ఇంటికి వెళ్లి వైద్యం చేసే వ్యక్తి. ఏ అవసరం వచ్చినా ఆ ఊరి వారికి ముందు జ్ఞాపకం వచ్చేది చలపతి శాస్త్రి గారు. పైగా చలపతి శాస్త్రి గారు ఆ ఊరి ప్రెసిడెంట్ కూడా. ఆయన ఆధ్వర్యంలోనే ఆ ఊరు పంచాయితీకి ఉత్తమ పంచాయతీ అవార్డు వచ్చింది.
ఆ ఊరు ఒక మినీ భారతదేశం లాంటిది. ఇక్కడ లేని కులం గాని మతం గాని లేదు. ఎప్పటినుంచో ఆ కులవృత్తులను నమ్ముకుంటూ ఆ గ్రామం విడిచి వెళ్లిపోలేదు ఎవరు. చలపతి శాస్త్రి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ ఊరిలో ఒక అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేశాడు. ఒకే ఆవరణలో ఒక రామాలయం, ఒక చర్చి ,ఒక మసీదు కట్టించాడు.ఇది చాలామంది అగ్రవర్ణాల వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చలపతి శాస్త్రి గారిని ఎదిరించే ధైర్యం లేక ఆయనని అనుసరిస్తూ వచ్చారు. ఎవరికి నచ్చిన గుడిలోకి వాళ్ళు వెళ్లొచ్చు. ఇది కొద్ది రోజుల కైనా ప్రజల్లో ఈ రకంగా చేస్తే మార్పు వస్తుందని ఆయన ఉద్దేశం.
ఆయనకు అన్ని కులస్తుల ప్రజల తోటి సన్నిహిత సంబంధాలు ఉండేవి అన్ని కులాల వాళ్ళు తమ పండగలకు శాస్త్రి గారిని పిలిచేవారు . వాళ్ళ ఇంటికి వెళ్లి ఆనందంగా వాళ్ళతో గడిపి వచ్చేవారు శాస్త్రి గారు.
అంతే కాదు అంతకుముందు ఆ ఊరిలో ఉండే ప్రతి వీధి కులం పేరుతో పిలిచేవారు .బ్రాహ్మణ అగ్రహారం అని, హరిజనవాడని ,రెడ్ల వీధి అని పిలిచేవారు. వాటిని శాస్త్రి గారు మార్చివేసి వీధికొక స్వాతంత్ర్య సమరయోధుల పేరు పెట్టి తన దేశభక్తిని చాటుకున్నారు. అందువలన ఆ వీధిలో నివసించే ప్రజల కులం ఎవరికీ తెలిసేది కాదు. శాస్త్రి గారి పూర్వీకులు అందరూ గాంధీ గారి అభిమానులు.
అలా అరుగు మీద కూర్చుని పాఠాలు చెబుతున్న శాస్త్రి గారికి ఒక్కసారి గతం గుర్తుకొచ్చి ఒళ్ళు జలదరించింది. గత ఏడాది సరిగా శ్రద్ధకు తీసుకుపోకపోవడం వల్లనే కదా అంత ప్రాణ నష్టం జరిగింది. పాపం ఎంతోమంది పిల్లలు పెద్దవాళ్లు తుఫాన్ తగ్గిన రెండు మూడు రోజుల వరకు ఆకలితో నకనకలాడిపోయారు. ఆ గోదావరి పక్కనున్న పూరి గుడిసెలో ఉండే జనం దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఊర్లో అందరూ మోతుబరి రైతులే. పెద్ద పెద్ద బంగ్లాల్లో నివసించే వాళ్లే. ఎవరూ పక్కన ఉన్న వాళ్ళకి చోటు ఇవ్వలేదు.
గత సంవత్సరం ఆరోగ్యం బాగా లేక ఎవరికి ఉపకారం చేయలేకపోయాను అనుకుంటూ ఇప్పటికే హోరున వర్షం ప్రారంభమైంది. ఏం చేయాలి అబ్బా అనుకుంటూ ముందుగా తన మనసులోని ఆలోచన భార్య సీతమ్మ గారికి చెప్పాడు.
సీతమ్మ గారు వెనుక ముందు ఆలోచించకుండా పని వాళ్ళ సహాయంతో వెనకవైపు ఉండే ఇల్లు అంతా ఖాళీ చేయించింది ఇంట్లో ఉండే చాపలు బరకాలు దుప్పట్లు అన్ని వెనక ఇంట్లో పడేయించింది. అలాగే ఊర్లో ఉండే వంట బ్రాహ్మణుని పిలిచి వంట ఏర్పాట్లు చేసింది.
ఈలోగా చలపతిశాస్త్రి గారు పాలేరులు ఊర్లో ఉన్న యువకుల సహాయంతో ఆ ఊరిలో గుడిసెలో ఉండే వాళ్లందర్నీ ఖాళీ చేయించి ఇంటికి తీసుకొచ్చేరు. యువకులందరూ కలిసి పశువుల పాకలోకి వెళ్లి పశువుల కట్లు విప్పేసారు.
మొదట్లో గూడెం వాళ్ళు వ్యతిరేకించిన గత సంవత్సరం అనుభవానికి భయపడి చలపతి శాస్త్రి గారి ఇంటికి వచ్చేసారు. అప్పటికే చలపతిశాస్త్రి గారి భార్య సీతమ్మ గారు వేడివేడిగా అన్నం ,సాంబారు, బంగాళదుంప వేపుడు రెడీ చేయించి రాగానే ఆదరించి కడుపునిండా పెట్టారు.
ఈ లోగా వర్షం కూడా బాగా పెరిగిపోయింది. ఇలాంటి తుఫాను ఇంతకుముందు ఎప్పుడూ రాలేదని రేడియోలో టీవీలు చాలా దారుణంగా తుఫాను బీభత్స దృశ్యాలు ప్రసారం చేస్తున్నాయి గోదావరి పొంగి ఊర్లోకి వచ్చేసింది. ఆ ఊరిలో ఉన్న పూరిగుడిసె లన్ని గోదావరిలో కలిసిపోయేయి. విచిత్రం ఏమిటంటే పశువులు పాకతో సహా గుడిసె అనేది ఆ ఊర్లో ఎక్కడా కనపడలేదు.
చలపతి శాస్త్రి గారి మాటనమ్మి ఇక్కడకు రాకపోతే తాము అన్యాయంగా ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళం అని ఆ తుఫాన్ బాధితులు చలపతి శాస్త్రి గారికి రెండు చేతులుఎత్తి నమస్కరించారు.
ఆ బాధితుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. రెండు రోజులకు కానీ ప్రభుత్వాన్ని నుంచి సహాయం అందలేదు.
అలా నాలుగు రోజుల వరకు తుఫాను బాధితులకు ఆశ్రయమిచ్చి ప్రజలందరి మన్నన పొందారు శాస్త్రి గారు
ప్రభుత్వ అధికారులు ఎక్కడకి వెళ్ళినా ఏ నోట విన్న శాస్త్రి గారి మాట వినబడింది.
ఆ మండలంలో అన్ని గ్రామాల కంటే ఈ గ్రామంలోనే ప్రాణ నష్టం తక్కువగా జరిగిందని అన్ని పత్రికలు చలపతి శాస్త్రి గారు చేసిన ముందస్తు చర్య ని కొనియాడుతూ వార్తలు వ్రాశాయి. శాస్త్రి గారి ఇంటర్వ్యూ కోసం అనేక పత్రికల వాళ్ళు టీవీల వాళ్లు ఎగబడ్డారు.
"మీరు అగ్రవర్ణాన్ని చెందినవారు కదా !మరి గూడెం వాళ్ళని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారు. దీన్ని అడ్డంగా పెట్టుకుని రాజకీయంగా ఎదగాలని ఆలోచన ఉందా !అని ఒక కొంటె విలేకరి అడిగిన ప్రశ్నకి చలపతి శాస్త్రి గారు ఆవేశంగా సమాధానం ఇస్తూ "నాకు ప్రజాసేవ అంటే చాలా ఇష్టం. కేవలం నేను ప్రెసిడెంటు గా ప్రజల చేత ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను. ఇది ప్రజలు కోరుకు ని నాకు ఇచ్చింది. నాకు అన్ని కులాల వాళ్ళతోను సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నాతో సమానంగా వాళ్ళు అరుగు మీద కూర్చుంటారు. నేను మొదటి నుంచి అలాంటి చొరవ వాళ్ళకి ఇచ్చాను.
ఎందుకంటే నేను ప్రజా సేవకుడిని. కులమతరహితంగా నాయకుడు అనే వాడు పని చేయాలి. ఆపద సమయంలో కులము మతం అంటూ పట్టించుకుంటుంటే ఎవరిని కాపాడలేo. దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు, యుద్ధాలు ఏర్పడినప్పుడు జాతి సమైక్యంగా ఉండి ఎదుర్కోవాలి. మనలో మనమే దెబ్బలాడుకుంటే శత్రువులని ఎలా ఎదుర్కోగలం. ఎవరి కులం వారిది ఎవరు మతం వారిది. ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళవి. మనం మనిషిగా పుట్టినందుకు అన్నీ విడిచిపెట్టి అందరినీ కలుపుకుంటూ పోవాలి.
అందరి మత సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ ముందుకు సాగిపోతే ఏ దేశ అభివృద్ధికి ఆటంకం ఉండదు. ఒకరు బలహీనులు మరొకరు బలవంతులు అంటూ విడగొట్టే పద్ధతి స్వస్తి చెప్పాలి. ఏ కులం వాళ్ళు ఆ కులం అభివృద్ధికి చూసుకుంటే జాతి సమైక్యత అన్న పదానికి అర్థం ఉండదు.
ఒకే దేశంలో ఉంటున్నాం కాబట్టి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అవసరమైనప్పుడు కలిసికట్టుగా పనిచేసి వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవడం ఎంతో ముఖ్యం. భారతదేశం పల్లె లో నివసిస్తుందంటారు. నిజమే జాతి సమైక్యత అనే పదానికి నిర్వచనం చెప్పగలిగేలా పల్లెలు ఉండాలి. అలా పల్లెలను తయారు చేయాలి. ముందుగా ఒక్కడితో ప్రారంభమైన ఏ ఉద్యమమైన తర్వాత అది శక్తిగా మారి ఫలితం కొద్దిగా కాలానికి కనిపిస్తుంది. ముందు ప్రయత్నం ఆరంభించాలి అంటూ చెప్పారు చలపతి శాస్త్రి గారు.
ఆ మాటలా ఊరి ప్రజల్లో చాలా మార్పు తీసుకువచ్చాయి.తర్వాత ఆ ఊర్లో ఏ కష్టం వచ్చినా అన్ని వర్గాల ప్రజలు తలో చేయి వేసి సాయం అందించే స్థాయికి ఎదిగిపోయారు. ఇది చూసి చలపతి శాస్త్రి గారు భావి భారతదేశం కూడా ఇలాగే ఉండాలని కలలు కన్నారు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి