సేవగా మారిన విషాదం



ఇది ఇప్పటి మాట కాదు. ఒకప్పటి చరిత్ర. ఒక పక్షి మరణం ఒక అద్భుత కావ్య రచనకి అవకాశం కల్పించింది. అన్నదమ్ముల పిల్లల మధ్య జరిగిన యుద్ధం భగవద్గీతకు ప్రేరణగా నిలిచింది. 
ఒక చారిత్రక కట్టడం నిర్మించడానికి వెనుక అనేక బలీయమైన కారణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది.. భార్య మీద ఉన్న ప్రేమతో ఒక నవాబు గారు తాజ్ మహల్ నిర్మించారు. అలాగే భాగ్యనగరంలో ఉన్న నాలుగు స్తంభాల కట్టడం వెనుక అనేక చారిత్రక కథలు ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాకినాడ మండలం పెనుమర్తి గ్రామంలో నిర్మించిన ఈ ఆసుపత్రి వెనుక ఒక విషాదకరమైన కథ ఉంది.

మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం కళ్ళు. కళ్ళు లేని జీవితం ఊహించలేం. ఆ చీకటి ప్రపంచంలో వారు పడే బాధలు వర్ణనాతీతం. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా ఉచితంగా కంటి చూపును ప్రసాదించాలనే ఆశయంతో కాకినాడ జిల్లా పెనుమర్తి గ్రామంలో కిరణ్ కంటే ఆసుపత్రి 1993 సంవత్సరంలో ప్రారంభించబడి రోగులకు సేవలు చేస్తూ దిన దిన ప్రవర్ధమానం అవుతూ వచ్చింది. 

ఈ ఆసుపత్రి అంధుల పాలిట ఒక వరం. ఈ ఆసుపత్రి ప్రారంభించడానికి వెనుక ఉన్న ఆశయం పరిశీలిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. జీవితంలో ఎవరికి ఇటువంటి సమస్య రాకూడదు అని అనిపిస్తుంది.

 వ్యక్తిగత జీవితం ఎన్ని విషాదాలు మిగిల్చినప్పటికీ ధైర్యంతో సేవే ప్రధాన ఆశయంగా ఈ ఆసుపత్రిని ప్రారంభించిన వ్యక్తి డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్. ఆయన వ్యక్తిగత జీవితానికి ఈ ఆసుపత్రికి చాలా దగ్గర సంబంధం ఉంది.

ఆయన డాక్టర్ చంద్రశేఖర్. వృత్తి రీత్యా వైద్యుడు కాదు గాని జీవశాస్త్రంలో ఆయన ప్రతిభకు ఇచ్చినది డాక్టరు పట్టా. విదేశాల్లో ఉద్యోగం. ఇద్దరు పిల్లలతో చక్కటి సంసారం. ఉద్యోగ రీత్యా అట్టావా నగరంలో స్థిరపడిన డాక్టర్ చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులను స్వదేశానికి పంపించడానికి ఎక్కించిన ఎయిర్ ఇండియా విమానం ఉగ్రవాదుల బాంబు దాడిలో 
1985 వ సంవత్సరంలో జూన్ 23వ తారీఖున ఐర్లాండ్ సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది.

 అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ చనిపోయారు. అందులో తన కుటుంబాన్ని కోల్పోయిన డాక్టర్ చంద్రశేఖర్ కెనడా నుండి తిరిగివచ్చి భార్యాపిల్లల స్మృతి చిహ్నంగా సంకురాత్రి ఫౌండేషన్ అనే ట్రస్టును స్థాపించి తన కుమారుడి పేరు మీదగా కిరణ్ కంటి ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కుమార్తె మీదుగా శారద విద్యాలయం అనే పాఠశాలను ప్రారంభించి ఉచితంగా విద్య ను ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకి నేర్పించడం జరుగుతోంది. ఈ పిల్లలకి కావలసిన యూనిఫారంలు పుస్తకాలు మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా ఉచితంగానే అందించడం జరుగుతోంది

ఇప్పటివరకు సుమారు 270000 కంటి ఆపరేషన్లు చేయడం జరిగింది. అందులో సుమారు 90 శాతం వరకు ఉచితంగా జరిగినవి. అధునాతమైన కంటి వైద్యం సేవా దృక్పథం తో నడిచే ఈ ఆసుపత్రి నిజంగా చెప్పుకోదగినది . ముఖ్యంగా ఇంకొక విశేషం రవాణా సౌకర్యం.. కాకినాడ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఆసుపత్రి వరకు ఉచిత బస్సుల ద్వారా రవాణా సౌకర్యం కల్పించడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం

అలాగే ప్రకృతి వైపరీత్యాలు వరదలు అధిక వర్షాలు పడే సమయంలో బాధపడుతున్న ప్రజలుకి సహాయ సహకారాల అందించడానికి స్పందన అనే సంస్థను కూడా ప్రారంభించి సేవలు అందిస్తున్నారు ఈ సంక్రాంతి ఫౌండేషన్ ద్వారా.

ఈ సంక్రాంతి ఫౌండేషన్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా అనేక సంస్థలు అవార్డులు రివార్డులు ఇచ్చినప్పటికీ 2023 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం డాక్టర్ చంద్రశేఖర్ ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇది చాలా ఆనందించదగ్గ విషయం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట