నిశ్శబ్ద వీరుడు
నీ గెలుపుకోసం
ఎన్నోసార్లు నేనే ఓడిపోయాను —
మన సంసార సమరంలో
బాధ్యతగల భర్తగా నిలిచాను.
కన్నబిడ్డల కలలన్నీ
నా భుజాలపై మోసుకుంటూ,
నాన్నగా నా జీవితాన్ని
నిశ్శబ్ద త్యాగంగా మార్చుకున్నాను.
కుర్చీకి అతుక్కుపోయిన రోజులు,
పని గంటలు మరిచిన రాత్రులు,
రక్తపోటు పెరిగినా
కుటుంబ సంతోషమే ఔషధమైంది.
ఎవరూ చప్పట్లు కొట్టలేదు,
ఎవరూ గాథలు రాయలేదు;
అయినా ప్రతి ఇటుకలో నా చెమట ఉంది,
ఈ ఇంటి ప్రతి వెలుగులో నా శ్వాస ఉంది.
ఇంతకీ నేనెవరు?
పేరులేని త్యాగాల మధ్య
నిశ్శబ్దంగా జీవించే వాడిని కాదు —
తుఫాన్లను ఆపే తీరం,
చీకట్లను తట్టుకునే దీపస్తంభం,
కూలిపోకుండా కుటుంబాన్ని నిలబెట్టే
అదృశ్య బలాన్ని.
నేను సగటు మగవాడిని కాదు…
ప్రేమను బాధ్యతగా మోసే
ఒక నిశ్శబ్ద వీరుడిని
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి