మా ఊరి వినోదం

మా ఊరి వినోదం.

 అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామం పొలిమేరలో మా చింతలు తీర్చే పోలేరమ్మ కాపురం. ఆ దేవాలయానికి ఎదురుగా అందమైన చెరువు. చెరువులో నిత్యం స్నానం చేసేది అమ్మవారి భక్తులు కాదు. అమ్మ బిడ్డలు వదిలేసిన మురికి దుస్తులు. తరతరాలుగా అదే రేవు. రేవు గట్టుమీద మురికి బట్టలతోపాటు తలలు తెగిపడి ఉన్న జీవులు. రక్తపు మరకలు. గాలికి ఎగురుతున్న కోడి ఈకలు. అమ్మవారి గుడి ముందు గుమి కూడిన జనం . జనం మధ్యలో జనాలను అదుపు చేస్తూ చింత నిప్పులాంటి కళ్ళతో ఒక భారీ కాయం. మధ్యలో కోడిపుంజుల పౌరుషం. ప్రాణాలకు తెగించి పోరాటం. చుట్టూ ఉన్న జనం అరుపులు కేకలు ఈలలు గోలలు. ఇంతకీ ఆ సంబరం ఏమిటి అక్కడ జరుగుతున్నది ఏమిటి. ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి జరిగే కోడి పందాలు ఆట. సంక్రాంతికి జరిగే సంబరం. మా ఊరి ప్రజలకు సంక్రాంతి వినోదం. 
మా ఊరు అంటే ఎవరికి తెలుస్తుంది. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని ఒక పల్లె. ఆ పల్లె పేరు పల్లిపాలెం. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న గ్రామం. ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఉన్నారు. అన్ని పల్లెటూర్లు మాదిరిగానే. వేద పండితులు పురాణ కర్తలు కవులు కళాకారులు ఆయుర్వేద వైద్య పండితులు వ్యవసాయదారులు తెలుగు భాష, పురాణాల పట్ల అభిమానంతో సంస్కృతం నేర్చుకున్న వ్యవసాయదారులు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళు ఉన్నత ఉద్యోగం పొందిన వారిని ఎందరినో కన్న తల్లి ఈ గ్రామం. ఇటీవల కాలంలో పట్టణ సంస్కృతి అలవర్చుకున్న ఈ గ్రామంలో కోడి పందాలు, సంక్రాంతి పండుగకు తీర్థం తరతరాలుగా ఆ పోలేరమ్మ తల్లి గుడి ముంగిట జరుగుతున్నాయి.పక్క గ్రామాల నుంచి ఎంతోమంది ఈ జాతర చూడ్డానికి వస్తారు భోగి పండుగ మొదలుకొని ముక్కనుమ వరకు జరిగే సంక్రాంతి సంబరం.

 సంక్రాంతికి ముందు నెల రోజుల నుంచి ఈ పందెం పుంజులను ప్రత్యేక ఆహారం పెట్టి తయారు చేస్తారు. కాళ్లకు కత్తులు కట్టి ప్రత్యేక శిక్షణ ఇచ్చి యజమానులు బరిలోకి దింపుతారు. ఉత్సాహపరుస్తారు. తనకు నచ్చిన పుంజు మీద పందెం కాస్తుంటారు . ఈ పందెం లక్షల్లో కూడా ఉంటుందని వినికిడి ఎదురుగా పందెం పుంజు కనబడగానే పైకి ఎగిరి ఎగిరి పుంజులు దెబ్బలాడుకుంటాయి. నోరులేని మూగ జీవి మనసులో శత్రుత్వం ఉండదు. జాతి పౌరుషం మాత్రమే. శక్తి కొలది పోరాడి వీర స్వర్గం పొందుతాయి. గెలిచిన వాళ్లు ఆనందంతో, ఓడిన వాళ్ళు విచారంకొద్ది బాటిల్ ఎత్తేస్తారు. పుంజులన్ని ఫలహారంగా మారిపోతాయి. గెలిచిన ఓడిన పుంజుకి ఒరిగిందేమీ లేదు. ప్రాణత్యాగం తప్ప. భారతదేశ చరిత్ర పరిశీలించి చూస్తే పెద్ద పెద్ద యుద్ధాలు కోడిపందాలు మూలంగా జరిగినట్లు తెలుస్తుంది. ఈ కోడిపందాలుకు ఒక శాస్త్రమే ఉంది. దాని పేరు కుక్కుట శాస్త్రం. కుక్కుటము అంటే కోడిపుంజు. అలా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంకాలం పొద్దుపోయే వరకు ఈ పందాలు జరుగుతూనే ఉంటాయి. 
ఆ విగతజీవులను చూస్తుంటే మనసు బాధపడు తోందా కొంతసేపలా తీర్థాన్ని చూసొద్దాం. బయటకు వచ్చి ఒకసారి చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా కోలాహలంగా ఉంది. ప్రతి అంగడి ముందు జనం. కొత్త బట్టలలో మెరిసిపోతున్నారు. ఒక మూల నుంచి డబ్బాలో గులకరాళ్లు వేసినట్లు చప్పుడు. ఏమిటాని పరిశీలనగా చూస్తే ఒక తలపండిన వ్యక్తి చేతిలోని డబ్బా ను అటు ఇటు తిప్పుతూ ఒక బోర్డు మీద బోర్లిస్తున్నాడు. చుట్టూ జనం గుమిగూడి ఐదు తిప్పు రాజన్న అంటూ గట్టిగా అరుస్తున్నారు ఇవేవీ పట్టనట్టు ఆ బోర్డు మీద కాపు కాసిన సొమ్ము మీద దృష్టి మరల్చి డబ్బాను తిప్పుతున్నాడు. ఆ డబ్బాలో నుంచి నలుచదరపు ఆకారంలో పైన అంకెలు ఉన్న ప్లాస్టిక్ ముక్కలు బోర్డు మీద పడ్డాయి. ఆ ప్లాస్టిక్ ముక్క మీద ఆరు నంబరు కనబడింది . 6 నెంబర్ మీద కాపు కాసిన వాళ్లకు రెట్టింపు సొమ్మిచ్చి మిగిలిన సొమ్మంతా గల్లా పెట్టిలోకి లాగేసుకుంటున్నాడు. ఇదేమి ఆట. రాజన్న గుండాట. ఇది మా ఊరు తీర్థంలోని ప్రతి ఏటా ఉండే ప్రత్యేకమైన వినోదం. మా ఊరు తీర్థం వెళ్లిన వాళ్ళు ఎవరు ఈ గుండాట ఆడకుండా ఉండరు.

 ఈలోగా ముక్కుకి మంచి మంచి వాసనలు తగిలాయి. మనసు చెరువు పక్కకు లాగేసింది. అక్కడ నులక మంచం మీద రకరకాల తినుబండారాలు నోరూరిస్తున్నాయి. పండగ నాడు ఎవరు కొనుక్కుంటారని ఆలోచిస్తే చేతిలో చంటి బిడ్డతో ఒక ముష్టిది దాతలు ఇచ్చిన సొమ్ముతో పిండి వంటలు కొనడానికి వచ్చింది. అప్పుడు అర్థమైంది. ఎంతోమంది ఈ దేశంలో పండగ నాడు కూడా పరమాన్నం తినటం లేదని. ఏమిటో సృష్టి. దేవుడి మాయ. అమ్మ అన్ని అమర్చి పెడుతుంటే ఏమీ తెలియదు. బయట ప్రపంచం తెలియదు. అలా ముందుకు నడిచి వస్తుంటే దారిలో బూరాలమ్మే బుడ్డిది బుడగలు అమ్మే బుడ్డోడు హడావిడిగా అటు ఇటు తిరుగుతూ కనిపించారు. వాళ్ల జీవనోపాధి ఇదే. ముక్కు పచ్చలారని వయసులో మూడు పూటలు గడవాలంటేఈ యాతన తప్పదు. ఆ చిట్టి భుజాల మీద ఏమి బాధ్యతలు ఉన్నాయో ఎవరికి తెలుసు.

 అమ్మానాన్నల నీడలో అపురూపంగా పెరగవలసిన బుడతలు ఒంటిమీద సరైన దుస్తులు లేకుండా కాళ్లకు చెప్పులు లేకుండా బతుకు యాతన. అదే జాతరలో అమ్మ ఒడి నుండి కిందకు దిగకుండా వీరి దగ్గర సరుకు కొనే పసిబిడ్డలే వీరికి కస్టమర్లు. భగవంతుడుది ఎంత మాయ. ఇద్దరూ మనుషులే. పరిస్థితులే వేరు. అవసరం ఉన్నా లేకపోయినా పెద్దలు పిల్లలు వీరి దగ్గర సరుకు కొంటే భగవంతుడికి పూజలు చేసినంత ఫలితం. దారిలో చంటి బిడ్డ రంగురంగుల కళ్ళజోడు పెట్టుకుని కనబడింది. పిల్లలకు ప్రపంచమంతా రంగుల మయంగానే కనబడుతుంది. కానీ పెద్దయ్యాక తెలుస్తుంది అసలు రంగు. అది రంగుల లోకం కాదు మాయలోకమని. ఎదిగే పిల్లలని ఆ మాయా లోకం వైపు నడిపించకుండా చూడవలసిన బాధ్యత పెద్దలదే. 

ఎక్కడి నుంచో వినపడుతోంది శృతి లేని వేణు గానం. ఏమిటా అని చూస్తే వెదురు వేణువులు అమ్ముతూ ఒక యువకుడు కనిపించాడు. ఆ వేణువులు సప్త స్వరాలుపలికించలేకపోయినా చంటి బిడ్డకు ఆట వస్తువు. ఆ యువకుడి ఉపాధికి అదే ఆధారం. ఆ పక్కనే పిల్లలందరూ గుమి గూడి ఉన్నారు. ఆ నేల మీద పరిచిన రంగు దుప్పటి మీద లక్క పిడతల నుండి విమానం బొమ్మల వరకు అన్నీ పేర్చి అందంగా అమర్చి ఉన్నాయి. ఈ లక్క పిడతలుఒక రకమైన చెక్కతో తయారు చేస్తారు. ఇది కూడా చాలా ప్రాచీన కళ. మన రాష్ట్రంలో విశాఖ జిల్లాలోని ఏటికొప్పాక గ్రామం లక్క పిడతలకు ప్రసిద్ధి. ఈ లక్క పిడతల్లో ఒక సంసారానికి పనికొచ్చే సామానంతా ఉంటుంది. ఈ లెక్క పిడతలతో చిన్నతనంలో బువ్వాలట ఆడుకునేవాళ్ళం ఈ లక్కపిడతలతో ఆడుకోవడం ఆరోగ్యకరమైన ఆట. ఆధునిక కాలంలో వచ్చే ఆట వస్తువులు అంత మంచివి కాదు. ముఖ్యంగా తుపాకీ లాంటి ఆట వస్తువులు అంత మంచివి
 కాదు. సరే చంటి దానికి కావాల్సిన బొమ్మలు కొనుక్కుని నా కళ్ళు దేనికోసమే వెతుకుతున్నాయి. కావలసిన దుకాణం దొరికింది. ఏమిటా దుకాణం బెల్లo జీళ్ళు ఖర్జూర పండు అమ్మే దుకాణం. బెల్లం జీళ్లు అంటే ఈ కాలం పిల్లలకు తెలియదు. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు. ఆ తీర్థం చూసేవాళ్ళు తప్పకుండా కొనుక్కునే ఆహారం. బరువెక్కిన సంచి తో మళ్లీ తీర్థం ఎప్పుడు చూస్తానన్న మనసుతో ఇంటి దారి పట్టిన నాకు దారిలో గంగిరెద్దుల వాళ్లు ,మల్లికార్జున స్వామి బొమ్మను ఎత్తుకుని ప్రతి ఏట సంక్రాంతి పండగకు వచ్చే అతిధులు ఎదురుపడ్డారు. బసవన్న ఆశీర్వాదం తీసుకుని మల్లికార్జున స్వామి వారికి నమస్కారం చేసుకొని మధుర ఊహాలతో నగరం దారి పట్టాను.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం