కళాతపస్వి
కళాతపస్వి.
శ్రవణేంద్రియముల ద్వారా మనసుకు ఆనందం కలిగించేది
సంగీతం.
స్వరబద్ధమైన సంగీతం మనుషులందరినీ కాదు ప్రాణులన్నింటిని
కూడా ఆనందపరుస్తుంది.
ఆ సంగీత ప్రధానంగా చిత్రాలు తీయడమే ఒక కత్తి మీద సాము. అయినా అది ఒక మహా దర్శకుడు కి అభిరుచి. సినిమా పేర్లు కూడా వరుసగా స అనే అక్షరంతో ప్రారంభించిపెట్టడం కూడా అరుదైన విషయం. ఆ దర్శకుడు ఎవరో కాదు కళాతపస్వి.
సంగీత ప్రధానంగా ఉన్న చిత్రాలు తీయడమే మన విశ్వనాథుడికి
వెన్నతో పెట్టిన విద్య.
ఎంతోమంది దర్శకులు ఉన్నారు. కొద్ది మంది మాత్రం కలకాలం మన మదిలో నిలిచిపోతారు. కులం గోత్రం మనకు అవసరం లేదు. ప్రేక్షకుల గుండెను దోచుకున్నాడా లేదా అన్నదే ప్రశ్న.
తొలి సినిమాతో తెలుగు కళామతల్లి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి బంగారు నందిని కూడా తన వాకిట్లో కట్టేసుకున్నాడు.
విప్లవ రచయిత శ్రీశ్రీ గారి చేత ప్రేమ పాటలు రాయించేసాడు.
ఒక మూగ పిల్ల చేత నాట్యం చేయించి ఝుమ్మంది నాదం అంటూ తెలుగు కళామతల్లి దర్శకులలో సిరిసిరి మువ్వగా నిలిచాడు. ఎప్పుడూ ఖాకీ దుస్తులలో కనిపించే కళా కార్మికుడు.
పొట్ట చించితే అక్షరం ముక్క రాదు అయినా సినిమా మీద మోజుతో మాయమాటలు నమ్మి పట్నం చేరిన ఒక మహాలక్ష్మి కథ. సీతామాలక్ష్మి పాత్రలో జీవించిన తాళ్లూరి రామేశ్వరికి
నంది అవార్డును సొంతం చేశాడు. సామాజిక సమస్య మీద కూడా దృష్టి పెట్టిన సినిమా. సంగీత ప్రధానమైన సినిమా కాకపోయినా వీనుల విందైన సంగీతానికి ఎక్కువ విలువనిచ్చిన పాటలు ఉన్న సినిమా. ఒక సినిమాలో మంచి పాట ఉంటే ఆ సినిమా కలకాలం గుర్తుండిపోతుంది.
ఒక సినిమా ఎంతోమందిని సంగీత అభిమానులుగా మార్చేసింది
ఈ చిత్రాన్ని చూసి సంగీతం మీద అభిమానం పెరిగి ఎంతో మంది సంగీతం నేర్చుకున్న తార్కాణాలు ఉన్నాయి. అంతవరకు సినిమా అంటే మాస్ మసాలా. ఒక సంగీత రాగం పేరు సినిమా పేరుగా పెట్టి ఒక సంగీత విద్వాంసుడు శంకర శాస్త్రికి ఆయన ఏకలవ్య శిష్యురాలు తులసికి మధ్య జరిగిన కథ. ఈ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చాయో తెలియదు గానీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడిన సినిమా.
ఇదంతా విశ్వనాథుడి సృష్టి.
ఒక జటిలమైన సమస్యకు సినిమా ద్వారా పరిష్కారం చూపడం వలన ఈ సినిమా ఎన్నో విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆమె నాట్య మయూరి. తాతగారు ఒక గుడిలో పూజారి. మనసు ఇచ్చిన వాడు ఇతర కులానికి చెందినవాడు. అతనికి వేణుగానం అంటే ప్రాణం.ఇద్దరి మనసులని దగ్గర చేసింది ఆ సంగీతం. సరే పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లి అయ్యింది కానీ ముందుకు సాగలేదు కాపురం.చాందస భావాలు గల పూజారి ఆ నాట్య మయూరిని మనసిచ్చిన వాడితో జత కలుపుతాడు. ఈ ముక్తాయింపును సంఘంలో ఒక వర్గం ప్రజలు ఆగ్రహానికి గురైనా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ సినిమా ద్వారా అనేకమంది సమస్యలకు సమాధానం కూడా దొరికింది.
సున్నితమైన హాస్యం సుమధుర సంగీతం వెరసి సప్తపది.
ఒక అగ్ర హీరోని పశువుల కాపరి పాత్ర వేయించి ఆ పాత్ర చేత ఒక కుటుంబానికి అవసరమైన సమయంలో తగువిధంగా సహాయం చేయించి న కథ ఆపద్బాంధవుడు. సినిమా లో హీరో అంటే సాహసాలు చేస్తాడు నృత్యాలు చేస్తాడు యుద్ధం చేస్తాడు
అని ప్రేక్షకులు ఊహించుకుంటారు. కానీ ఈ కథానాయకుడు
పాత్రలో నటించాడు అని చెప్పడానికి బదులు జీవించాడని చెప్పాలి. అగ్ర హీరో చిరంజీవి పిచ్చివాడిగా నటించిన తీరు కళ్ళు చమ్మగిల్లుతాయి. దర్శకుడి ప్రతిభ అంత సినిమాను నడిపించిన విధానoలోనే ఉంటుంది.
అలా చెప్పుకుంటూ పోతే శృతిలయలు .సాగర సంగమం స్వరాభిషేకం స్వాతికిరణం స్వర్ణకమలం ఒక కథకి మరొక కథకి వైవిధ్యం. పోటీపడి నడిచే నటులు సంగీత సరే సరి.
ఏ కథ చూసినా ఆణిముత్యమే. అసలా దర్శకుడే ఆణిముత్యం.
సంగీతం అంటే ఆయన ప్రాణం. ఆయన భారతదేశంలో పుట్టడం మనకు వరం. ఆయన పేరులోను ఇంటిపేరులోనూ ఈశ్వరుడే ఉన్నాడు.
అద్భుతమైన కావ్యం సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి. కళాత్మక చిత్రాలకు ఎప్పుడూ విలువ ఉంటుంది. ఈ సృష్టి ఉన్నంత కాలం ఆయన తీసిన సినిమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయి.
కాలం అయిపోయింది.ఒక కళాత్మక దర్శకుడు మనల్ని వదలి స్వర్గ లోకానికి వెళ్లిపోయాడు. ఆ అమృతమూర్తికి శతకోటి నివాళులు.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి