మర్రిచెట్టు

లాల్ బహుదూర్ నగర్ మర్రిచెట్టు.

రోజు నడిచే రహదారే
ఆరోజు ఎందుకో దారి తప్పి వచ్చానని అనుకున్నా
ఏదో వెలితి 
నిన్నటిదాకా చల్లటి గాలితో నీడనిచ్చిన మర్రి మరి కనపడలేదు
నిజంగా మర్రి బాటసారి లందరికీ మురారి.

ఎవరూ నీరు నారు పోసి పెంచలేదు.
రోడ్డు పక్కన అనాధల పెరిగి
లాల్ బహుదూర్ నగర్ వాసుల అడ్రస్ కి అడ్డా అయింది.

వంద సంవత్సరాల బ్రతికిన మనిషిని 
గొప్పగా చెప్పుకుంటారు.
ఈ మర్రిమాను వయస్సును కొలిచేవాడు
పైనున్న దేవుడు ఒక్కడే.

పొడవాటి జడలతో రాక్షసుడులా కనిపించే
మర్రి రెండు ముక్కలైంది.
అవశేషాలన్నీ నిర్జీవంగా దొర్లుతున్నాయి
 గూడు చెదిరిన పక్షులు ఆక్రందనగా అరుస్తున్నాయి
కొత్త గూడు కోసం వలసలు వెళ్ళిపోతున్నాయి.
ఎవరిస్తారు ఆ పక్షులకు ఆశ్రయం.
అంత పెద్ద మాను దొరకాలంటే చెయ్యాలి భగీరథ ప్రయత్నం.

మర్రి నీడలో మొక్క మొలవదు అంటారు.
చిరు వ్యాపారికి ఆశ్రయమిచ్చి బ్రతుక్కి దారి చూపేది
దారి తెన్ను లేక చెదిరిపోయింది చిరు వ్యాపారి బ్రతుకు.

చెట్టు కింద ఉన్న పుట్టలో ఉన్న చీమలకి అయాచితంగా
 ఆహారం దొరికేది.
పండిన మర్రి పండు తిని ఆనందంగా కాలం గడిపేవి.
చెట్టుతోపాటు పుట్టలన్నీ పోయాయి.
చీమల పొట్ట కొట్టేశారు

అట్లతద్దికే కాదు అనుదినం మర్రి ఊడలుతో ఉయ్యాల ఊగే
చంటి బిడ్డ కళ్ళల్లో కన్నీళ్లు కనపడ్డాయి.
చంటి బిడ్డకే కాదు తలపoడిన నాకు కూడా.

 దారిన పోయే బైరాగి జోలె సంచి నుంచి గంజాయి 
సంపాదించవచ్చు.
కానీ త్రినాధ వ్రతానికి మర్రి ఆకులు దొరకడం గగనం.
నగరం పెరుగుతోంది పచ్చదనం తరుగుతోంది.

పదిమంది ఇల్లు కట్టుకుంటే మంచిదే
పచ్చటి చెట్టును చంపేస్తే మాత్రం పాపం.

ఒకటి నీడని ఇచ్చేది ఒకటి ఊపిరి ఇచ్చేది
రెండు మానవాళికి ముఖ్యమే.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ 9491792279.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట