కన్యాశుల్కం

కన్యాశుల్కం 

మానవుడు ఊహనుంచి పుట్టిందే కవిత్వం. ఏ కళ అయినా కూడా మనిషి ఊహనుంచి పుట్టినవే. ఊహ ఎంత గొప్పది.
ఆ ఊహకి ఆధారం చుట్టూ ఉండే సమాజం, సమాజంలోని లోటుపాట్లు కావచ్చు. ఉదాహరణకి నిరుద్యోగ సమస్య మీద ఆకలి రాజ్యం వంటి చలనచిత్రం రూపుదిద్దుకుంది.
అలాగే వరకట్నం మీద అనేక రచనలు సినిమాలు రూపుదిద్దుకున్నాయి. ఒక ప్రియుడు తన ప్రియురాలు విరహ వేదన భరించలేక మేఘముల ద్వారా సందేశం పంపుతాడు.
అదే కాళిదాసు మహాకవి మేఘసందేశం అనే కావ్యం. ఇది నిజంగా జరిగింది కాదు. కానీ కవి ఊహించి వ్రాసింది. అలాగే లంచగొండితనం మీద అనేక సాంఘిక చలనచిత్రాలు వచ్చాయి. 

    ఆనాటి సంఘంలో ఉన్న సాంఘిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఒక అద్భుతమైన నాటక కళాఖండాన్ని
తయారు చేసిన వారు శ్రీ గురజాడ అప్పారావు గారు. ఆ రోజుల్లో కన్యకి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవారు. ఒక విధంగా కన్యను కొనుక్కున్నట్లే. పది పన్నెండు సంవత్సరముల వయస్సులోనే ఆడపిల్లలు కన్యాశుల్కానికి బలి అవుతుండేవారు. కాటికి కాళ్లు చాచుకుని ఉండే ముదుసలి కూడా పునర్వివాహం చేసుకునేవారు. అలా ఎందరో పసి మొగ్గల జీవితాలు నాశనం అవుతుండేవి. ఆ ముసలి ప్రాణం కాస్త గుటుక్కుమంటే జీవితకాలం ఆ పసి మొగ్గ అష్ట కష్టాలు పడి వైధవ్యం అనుభవించేది. 
అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు కనువిప్పు తీసుకురావడానికి కన్యాశుల్కం అనే నాటకం ఒక మహాకవి కలం నుండి పుట్టింది. కాదు గుండెలోన బాధ నాటకంగా రూపుదిద్దుకుంది.
 . ఆనాటి కవులికి సమాజం పట్ల చాలా బాధ్యత ఉండేది. సమాజంలో మార్పు తీసుకురావాలనే తాపత్రయం ఉండేది. గురజాడ వారి మరొక రచన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ఇతివృత్తం కూడా ఒక సామాజిక సమస్య. కవి సమాజంలోని తప్పులు ఎత్తి చూపేవాడు . గురజాడ వారి ఆలోచనలు వినూత్నంగా ఉండేవి. బూజుపట్టిన సమాజాన్ని ఏకీపారేసేవారు. గురజాడ వారు ఒక అభ్యుదయ వాది. సమాజంలో ఆనాడు తప్పు జరుగుతుందని వేలెత్తి చూపించారు. నిజానికి అటువంటి సాంఘిక సంస్కర్తలు తప్పు అని చెప్పకపోతే ఆ సాంప్రదాయాలు ఈనాటి వరకు కొనసాగుతూనే ఉండేవి. ఏదైనా సమాజ ప్రయోజనం కోసమే కవి తాపత్రయపడేవాడు.
    ఆ రోజుల్లో నాటకాలే ప్రజలకు ఉండే అతి ముఖ్యమైన వినోద సాధనాలు. కన్యాశుల్కం ఒక సాంఘిక నాటకం. ఇది అత్యంత ప్రజాభిమానాన్ని చూరగొన్న నాటకం. సుమారు నూట పాతిక సంవత్సరములు క్రిందట వ్రాసిన నాటకం.
ఎన్నో వందల ప్రదర్శనలు ఇచ్చి చలనచిత్రంగా కూడా రూపుదిద్దుతుంది. గిరీశం పాత్రలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నటించిన తీరు ప్రేక్షకుల హృదయాల్లో గిరీశం అంటే టక్కున గుర్తుకొచ్చేది రామారావు గారే. అలాగే నాటకంలోని ముఖ్య పాత్రలు పోషించిన గొల్లపూడి వారు జేవి రమణమూర్తిగారు J V సోమయాజులు గారు లాంటి మహానుభావులు ఆయా పాత్రలలో జీవించినారనే చెప్పాలి. ఈ నాటకాన్ని కన్నులారా కాంచిన కొంతమంది మహానుభావులు చెప్పిన మాటలు. చలనచిత్రం చూసే అదృష్టం మాకు దక్కింది కానీ ఆ నాటకం చూడలేకపోయాం. కానీ దురదృష్టం అందులోని పాత్రధారులు చాలామంది ఈ లోకంలోనే లేరు. 

   ఈ నాటకంలోని పాత్రలు పాత్రల మధ్య జరిగే సంభాషణ సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. మన ఇంట్లో మాట్లాడుకున్నట్టు ఉంటుంది. గిరీశం ఒక అవకాశవాది. పనీపాటా లేకుండా మాటలు చెప్పి పరుల మీద బతికేస్తుంటాడు.
వెంకటేశం అనే విద్యార్థికి సెలవు దినాల్లో ఇంగ్లీషు భాష నేర్పించడానికి ట్యూషన్ మాస్టర్ గా అగ్నిహోత్రావధానులు ఇంటికి చేరుతాడు. అగ్నిహోత్రావధానులు ఇంట్లో విద్యార్థి తో ఆంగ్ల భాషలో మాట్లాడిన విధానం చాలా నవ్వు తెప్పిస్తుంది.
చిన్నపిల్లల చేత పలికించే ఆంగ్లభాష లోని పద్యాలు చెప్పిస్తాడు.
అదే ఆంగ్లభాష పరిజ్ఞానం నమ్మిస్తాడు. డామిట్ కధ అడ్డం తిరిగింది అనేది అతని ఊత పదం. అంటే ఆనాటి సమాజంలో ఇటువంటి పాత్రలను దగ్గరగా చూసి నాటకం రాసినట్లుగా అనిపిస్తుంది.

 ఈ నాటకంలోని మరొక పాత్రధారి మధురవాణి ఒక వేశ్య. గురజాడ వారు ఒక స్త్రీ ఆనాడు సంఘంలో ఏ విధంగా హింసకు గురవుతుందో తన నాటకంలో కళ్ళ కట్టినట్లు చూపించారు. మధురవాణి ఒక వేశ్య అయినప్పటికీ తన తెలివితేటలతో ముదుసలైన లుబ్ధవదాన్లకు ఏ రకంగా బుద్ధి చెప్పింది కళ్ళ కట్టినట్లుగా చూపించారు. విటులను ఆకర్షించే సానిమనిషి ఒక మంచి పనికి సహకరించినట్లుగా చూపించడం
ఇది ఎంతోమందికి ఆదర్శం.

  ఇక మరొక పాత్ర రామప్ప పంతులు. పేరుకు తగినట్లుగా ఉండదు ప్రవర్తన. చెప్పేదొకటి చేసేదొకటి. గిరీశం తోపాటు
రామప్ప పంతులు కూడా మధురవాణి వెళ్తుంటాడు. ఒకరోజు మధురవాణి ఇంట్లో ఉండగా పూట కూళ్ళమ్మ చే తరుమబడుచు గిరీశం మధురవాణి ఇంటి తలుపు తడతాడు. రామప్ప పంతులని మంచం కిందకి దాస్తుంది. పూటకూళ్లమ్మ భయంతో గిరీశం కూడా మధుర వాణి ఇంటిలోనికి వచ్చి మంచం కిందకు దూరతాడు. గిరీశాన్ని వెతుకుతూ వచ్చిన పూటకూళ్ళమ్మ మధురవాణి సౌజ్ఞలతో మంచం కింద ఉన్న రామప్ప పంతుల్ని గిరీష్ అనుకుని చీపురు కట్టతో కొడుతుంది. రామప్ప పంతులు దొడ్డి తలుపు తీసుకుని పారిపోతాడు. గిరీశం బతక నేర్చినవాడు. రాగల ప్రమాదం ముందుగానే పసికట్టి రామప్ప పంతులను ముందుకు నెట్టి తను వెనుక వైపు జరుగుతాడు. అందుచేత ఆ దెబ్బ రామప్ప పంతులకు తగిలింది. ఇలాంటి సన్నివేశం ఈనాటి అనేక చలనచిత్రాల్లో మనకు కనిపిస్తుంది. పునాది మాత్రం ఆ నాటకం లోనేదే. ఏదైనా ఒక సినిమా కానీ ,నాటకం కానీ ప్రజలు ఇప్పటికీ అభిమానిస్తున్నారు అంటే అర్థం ఆ కథా వస్తువు కథ నడిపించిన తీరు పాత్రలు సంభాషణలు గుండెకు హత్తుకునేలాగా ఉంటే ప్రజలు బాగా అభిమానిస్తారు . అటువంటి కోవకు చెందినదే కన్యాశుల్కం నాటకం.

సమాజ ప్రయోజనం కోసం వ్రాయబడిన ఈ నాటక రచయిత శ్రీ గురజాడ అప్పారావు గారు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయుడు. స్త్రీ సంక్షేమం కోసం పాటుపడిన అభ్యుదయ వాది. ఆ మహాత్ముడుకి నివాళులర్పిద్దాo.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
ఊరు కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట