చంటి బిడ్డ

చంటి బిడ్డ

ఆ మాయా లోకం నుండి 
మన లోకానికి వచ్చిన మహావీరుడు.

నవ మాసాలు చిమ్మ చీకటిలో పయనించి
మాయా నిద్ర లో మునిగి పైకి తేలి
మనల్ని ఆనంద సాగరంలో ముంచిన అందాల వీరుడు.

కెవ్వుమంటూ కేక వేసి తన రాక తెలియజేస్తాడు.
అమ్మకి అమ్మతనం తీసుకొస్తాడు.
బంధుజనంతో వరసలు కట్టేస్తాడు

అతిధి మర్యాదలు కోరడు
నోరు తెరిచి బువ్వ పెట్టమని అడగడు
కొంగు చాటున చేరి తను తీసుకువచ్చిన బువ్వ తినేస్తాడు.
అమ్మ పక్కకు చేరి అన్నయ్యని ఏడిపిస్తాడు

వాడికి తెలియదు పాపం
అమ్మ ఒడి అక్షయపాత్ర లాంటిది
ఎంతమంది చేరిన కొంత చోటు మిగులుతుంది
అమ్మ మనసు కూడా అంతే.

పుట్టిన పురిటి గదికి రారాజు.
అమ్మ కి వాడు నెలరాజు.
నాన్న మదిని దోచిన మహారాజు.

ఈ మహారాజుకి ఎన్ని పూల పాన్పులో
బొజ్జ నింపడానికి అందాల అమ్మ వడి చేరుతాడు
జోగిన కళ్ళతో ఉయ్యాల ఎక్కి అమ్మకి జోల పాట నేర్పుతాడు.
ఊరికనే ఉయ్యాల ఎక్కడు
ఉత్సవాలు జరిపి ఆ సింహాసనం ఎక్కుతాడు.

 నోటి మాటతో కాదు
 నోరంతా తెరిచి రాగం తీసి పెత్తనం చేస్తాడు
 పరివారాన్నంతా పరిగెత్తించి సపర్యలు పొందుతాడు.
 బుంగమూతి పెట్టి గారాలు పొందుతాడు
 నోటిలో వేలు దోపి చిన్ని కృష్ణుడిని మరిపిస్తాడు.
 బట్టలన్నీ తడిచేసి అమ్మకు సహనం నేర్పుతాడు.
 ఇల్లంతా బృందావనంగా మార్చేస్తాడు.

 తన రాజ్యంలో నవ్వులు పూయిస్తాడు
  సంతోషాల సంబరాలు చేయిస్తాడు

ఎవరు గిలిగింతలు పెట్టారోతెలియదు
బోసినవ్వులు నవ్వుతాడు.

చంటిపిల్ల పదిమంది పెట్టు
 ఎవరన్నారో ఈ మాట.
జీవితానుభవం నుంచి వచ్చిన మాట.
అక్షరాలా ఇది వరహాల మూట.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
          కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం