భూమాత కన్నీరు


"అమ్మా పద్మ! నా బంగారు తల్లి కదా, రెండు మాత్రలు వేసుకో. పొద్దున్న టిఫిన్ మాత్రలు కూడా వేసుకోలేదు. ఈ లంచ్ మాత్ర వేసుకో అమ్మా. నీరసం వస్తుంది" అంటూ పద్మ తల్లి నీరజ కూతుర్ని బతిమాలుతోంది.


"లేదమ్మా! నాకు ఆకలిగా లేదు. ఆ మాత్రలు వేసుకుంటే కడుపులో ఏదోలా ఉంటోంది. ఆ మాత్రలు చేదుగా ఉంటున్నాయి. వికారంగా ఉంటుంది. నాకు వద్దు" అంటూ ఏమి తినకుండానే స్కూల్‌కి వెళ్ళిపోయింది పద్మ.


"ఆకలి చంపుకోడానికి మాత్రలు వేసుకుంటున్నాను కానీ నిత్యం నా పరిస్థితి కూడా ఇదే" అని తనలోతాను అనుకుంది పద్మ తల్లి నీరజ. "అయినా శరీరానికి ఈ మాత్రలు అలవాటు పడటానికి కొద్ది రోజులు పడుతుంది అని డాక్టర్ గారు చెప్పారు కదా. ఈ పిల్ల అర్థం చేసుకోవడం లేదు" అని అనుకుంది నీరజ.


"ఒసేయ్ నీరజా! నాకు ఆ దిక్కుమాలిన మాత్రలు వద్దు. నాకు రెండు ముద్దల మజ్జిగ అన్నం పెట్టు. అసలే నేను రోగానికి మందులు మింగుతున్నాను. దానికి తోడు మళ్ళీ ఈ దిక్కుమాలిన బాధ ఒకటీ! అలవాటైన ప్రాణం... వేళకి రెండు ముద్దలు తినకుండా ఉండలేము. ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏమిటి దేవుడా! కడుపులోని ఆకలిని చంపడానికి మందులు మింగే స్థితికి వచ్చేసాము" అంటూ ఏడుస్తోంది మంచం మీద ఉన్న తొంభై ఏళ్ల వయసున్న నీరజ అత్తగారు పార్వతమ్మ.


ఇంతలో స్నానం చేసి బాత్రూంలో నుంచి వచ్చిన నీరజ భర్త రామారావు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, టేబుల్ మీద ఉన్న సీసాలోని రెండు మాత్రలు నోట్లో వేసుకుని, లంచ్ మాత్రలు జేబులో పెట్టుకుని ఆఫీస్‌కి వెళ్లిపోయాడు. ఇదివరకు రోజు కావలసినవన్నీ అడిగి చేయించుకుని ఆఫీస్‌కి పెద్ద క్యారేజీ పట్టుకుని వెళ్లే రామారావు మొహం చూసి నీరజకి బాధగా అనిపించింది.


"ఏమిటో! పని లేకుండా ఉన్నట్టుంది. లేచిన వెంటనే వంటింట్లోకి వెళ్లి పొయ్యి వెలిగించి, అక్కడి నుంచి సాయంకాలం వరకు ఏదో ఒకటి పిల్లలకు, కుటుంబానికి వండి పెట్టుకోవడంలోనే సరిపోయేది సమయం అంతా. ఇప్పుడు చెయ్యి విరిగినట్టుంది. ఏ పని లేదు" అనుకుంటూ దొడ్లో ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్లింది నీరజ.


ఒకప్పుడు ఎలా ఉండేది ఆ పెరడు! చుట్టూ మొక్కలు, పాదులు, చెట్లు, పశువులతో కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు సెంటు స్థలంలో కూడ ఇళ్ళు కట్టేశారు. "ఎంత మార్పు వచ్చింది!" అనుకుంటూ ఒక్కసారి తండ్రి రాజారావు మాటలు గుర్తుకొచ్చాయి.


"నాన్నా! మా పొలం అమ్మేద్దాం అనుకుంటున్నాము. రియల్ ఎస్టేట్ వాళ్ళు అడుగుతున్నారు. ఎకరం 10 కోట్ల రూపాయలు స్థలాల కింద చేసి అమ్ముతారట. రేపు అక్కడ అందరూ ఇల్లు కట్టుకుంటారు. మన ఊరు పక్కనున్న సిటీలో కలిపేస్తారు. నువ్వు కూడ అమ్మి బ్యాంకులో వేసుకో" అంటూ కూతురు నీరజ మాటలకు రాఘవరావు గారికి ఏం చెప్పాలో తోచలేదు.


"ఇలా పొలాలన్నీ అమ్మేస్తే, ఆ పొలంలో ఇల్లు కట్టేస్తే మనకి తిండి గింజలు ఎక్కడ దొరుకుతాయి? అయినా ఎప్పటినుంచో ఈ పొలాన్ని దున్నుకొని జీవిస్తున్నావమ్మా. దాంతో అనుబంధం చాలా పెద్దది. మా అమ్మతో ఉన్న అనుబంధం లాంటిది. అమ్మని ఎవరైనా అమ్ముకుంటావా చెప్పు!" అంటూ అడిగాడు రాఘవరావు.


"లేదు నాన్న! నీకు తెలియదా మరి? ఆహారానికి బదులుగా మాత్రలు కనిపెట్టారు శాస్త్రజ్ఞులు. నువ్వు పేపర్‌లో చదవలేదా? న్యూస్‌లో వినలేదా? తిండి గింజలు ఉండవు. మన ఉదయం, సాయంకాలం, రాత్రి ఆ మాత్రలు మింగడమే" అని సమాధానం ఇచ్చింది నీరజ.


"ఆ పొలం మీద ఆధారపడే రైతులు, వ్యవసాయ కూలీలు పొలం అమ్ముకుని ఎలా జీవిస్తారు? వాళ్ళు ఏం పని చేస్తారు? అయినా ఇరవై నాలుగు గంటలు రెక్కల కష్టంపైనే ఆధారపడే రైతు ఖాళీగా ఉంటే పిచ్చెక్కిపోతుంది. అటువంటి వ్యక్తి దేశానికి ప్రమాదం. దేశంలో ఆహార కొరత ఇప్పటికే ఎక్కువగా ఉంది" అన్నాడు రాఘవరావు.


అయినా ఎంత చెప్పినా వినకుండా, నీరజ తండ్రిని నచ్చజెప్పి పొలాలన్నీ అమ్మించేసింది. ఆ ఊర్లో ఉన్న రైతులు ఒకరిని చూసి ఒకరు, ఆ ఊరే కాదు జిల్లాలు, రాష్ట్రాలు, మొత్తం దేశమంతా ఇదే పని. ప్రతి ఊర్లోనూ ఆహారానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించే మాత్రల ఫ్యాక్టరీలు పెట్టేశారు. ఇదో పెద్ద వ్యాపారం.


కరోనా సమయంలో మెడికల్ షాపులు ఎంత రద్దీగా ఉండేవో అంతలా ఉంటున్నాయి ఆ ఫ్యాక్టరీలు. ఎక్కడ సెంటు ఖాళీ స్థలం లేదు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద మేడలు, డూప్లెక్స్ ఇళ్ళు, అపార్ట్‌మెంట్లు ఇవే కనబడుతున్నాయి. ఆకాశాన్నంటే భవంతులు చూసి సంతోషపడిపోతున్నారు జనం.


పచ్చటి పంట పొలాలన్నీ రూపాయలుగా మారిపోయాయి. బ్యాంకుల్లో మూలుగుతున్న రూపాయలను చూసి ఆనందపడిపోయారు జనం. కానీ పంటల మీద ఆధారపడి బతికే పక్షులు, ఎలుకల వంటి జంతువులు, ఆవులు, గేదెలు వంటి జంతువులు కనుమరుగయ్యాయి. గాలి లేక ప్రజలందరూ అల్లల్లాడిపోయారు. పర్యావరణం పూర్తిగా పాడైపోయింది.


అది అలా ఉంచితే, ఆహారానికి బదులుగా మాత్రలు కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు మన భారతదేశ వాడవడం ఎంతో గర్వకారణమని, దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని, శాస్త్రజ్ఞులు మరిన్ని పరిశోధనలు చేయాలని ప్రభుత్వం ఆ శాస్త్రజ్ఞుణ్ణి గౌరవించింది. ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్ని భారతదేశం వైపు చూసాయి. ఆహారానికి ప్రత్యామ్నాయం కనిపెట్టిన శాస్త్రజ్ఞుడికి నోబెల్ బహుమతి లభించింది.


కానీ దేశంలో ఎక్కడ చూసినా భూకంపాలు, వరదలు, తుఫాన్లు, అకాల వర్షాలు, మండే ఎండలు, సునామీలు పెరిగి, జననష్టం, ఆస్తినష్టం కూడా పెరిగిపోయింది. "ఇది కలియుగాంతం" అని పండితులు, "ప్రకృతి సమతుల్యత లేకపోవడం కారణం" అని శాస్త్రజ్ఞులు చెప్పుకుంటూ వచ్చారు.


"జరిగిన తప్పు సరిదిద్దుకుందాం" అంటే, "భూమిని మనం సృష్టించలేదు. గాలిని సృష్టించలేం. వర్షాన్ని తెప్పించలేం" అంటూ చేతులు దులుపుకున్నారు శాస్త్రజ్ఞులు. మానవుడు చేసిన తప్పిదానికి మానవుడే బాధపడుతున్నాడు అనుకున్నారు జనం.


ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి చూసి పంచభూతాలు పాలకడలిలో శేషతల్పం మీద హాయిగా పడుకున్న విష్ణుమూర్తి దగ్గరకు పరుగెత్తాయి. వారి వెనుక ఇంద్రుడు, చతుర్ముఖ బ్రహ్మ, దేవతలు వరుసగా వచ్చారు. ఇంతమంది ఒక్కసారిగా రావడం చూసి విష్ణుమూర్తి అందరికీ ఉచితాసనం చూపించి విషయం ఏమిటని ప్రశ్నించాడు.


అప్పుడు భూమాత చేతులు జోడించి చెప్పింది:

"సృష్టి ప్రారంభం నుంచి నాలో పంటలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు వేసుకొని సుఖంగా జీవించేవారు ప్రజలు. ఈ మధ్య ప్రజలకు దుర్బుద్ధి పుట్టింది. పంట పొలాలను ఇంటి స్థలాలుగా మార్చి అమ్మేస్తున్నారు. ఎక్కడా ఎవరూ పంటలు పండించడం లేదు. ఆహారానికి బదులుగా మాత్రలు మింగుతున్నారు. ప్రజల మాట అలా ఉంచండి. నా మీద ఆధారపడి ఉన్న జంతువులు, పశువులు, పక్షులు, చెట్లు అన్నీ సర్వనాశనం అయిపోయాయి. భూలోకంలో మచ్చుకి ఒకటి కూడా కనబడటం లేదు. నా మీద ఎత్తైన భవంతులు కట్టేస్తున్నారు. వారు చేసే పాపపు పనులు భరించలేకపోతున్నాను" అంటూ బోరున ఏడ్చింది భూమాత.


అప్పుడు వరుణదేవుడు లేచి చెప్పాడు:

"ప్రకృతి సమతుల్యం లేకపోవడం వల్ల వర్షాకాలంలో నాకు అసలు పని లేదు. పంట భూములు లేకపోవడం వల్ల నన్ను ప్రజలు మర్చిపోయారు. ఇదివరకు వర్షం కోసం పూజలు చేసేవారు. కప్పలకి పెళ్ళిళ్లు చేసేవారు. నా మనుగడనే మర్చిపోయారు ప్రజలు" అని.


"నాకు రూపం లేదు కానీ నా ఉనికి తెలియజేసే చెట్లు లేకపోవడం వల్ల నాకు అసలు పని లేదు" అని వాయుదేవుడు అన్నాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు విష్ణుమూర్తికి తమ బాధలు చెప్పారు.


అందరి బాధలు విన్న విష్ణుమూర్తి, "ఇక సమయం ఆసన్నమైంది" అంటూ బ్రహ్మగారి వైపు తిరిగి అన్నాడు. ఆ మాటలోని అర్థం బ్రహ్మగారికి అర్థమైంది.


రచన: మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు

 కాకినాడ

📞 9491792279



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట