మరిచిపోలేని మా ఊరి పోస్ట్ మెన్
మరిచిపోలేని మా ఊరి పోస్ట్ మాన్.
"న వాబు గారు మాకు ఏమైనా ఉన్నాయా! అంటూఎదురపడిన సైకిల్ మీద తిరిగే ఆ ఆరడుగుల మనిషిని ప్రతిరోజు ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ అదే పలకరింపు.
"ఏమీ రాలేదండి అంటూ ఆ వ్యక్తి నవ్వుతూ సమాధానం. రావాల్సింది అందించినప్పుడు తమ ఆనందం కళ్ళల్లో వ్యక్తం చేసేవారు.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు. అందమైన పంచ కట్టు దానిపైన ఆ కాలంనాటి చొక్కా ,కాళ్లకు చెప్పులు ,చేతిలో ఉత్తరాల కట్ట, సైకిల్ మీద ఊరంతా ఉత్తరాల బట్వాడా. ఎండైనా వానైనా క్రమం తప్పకుండా తన వృత్తి ధర్మం నిర్వర్తించే మా ఊరి తపాలా ఉద్యోగి షేక్ లాల్ సాహెబ్.
మాటవరసకి కాకి చేత కబురు పంపితే చాలు వచ్చి వాలిపోతాం అంటారు. పూర్వకాలంలో ఆ ఊరి నుంచి ఈ ఊరికి సమాచారం పంపించాలంటే రాజుల కాలంలో అయితే వేగుల ద్వారా, పావురాలు ద్వారా కూడా పంపించేవారుట. కాలక్రమేణా బ్రిటిష్ వారి పుణ్యమా అని తంతి తపాలా వ్యవస్థ ఏర్పడింది.
ఒకప్పుడు ఆ ఊరికి పోస్ట్ ఆఫీస్ ఉండేది కాదుట. ఇంతకీ ఆ ఊరి పేరు ఏమిటి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకా వయా యానం పల్లిపాలెం గ్రామం ఆ ఊరి అడ్రస్.ప్రక్కనే ఉన్న ఊరి నుంచి ఉత్తరాలు బట్వాడా చేసేవారుట. ఆ ఊరికి రోడ్డు సౌకర్యం సరిగా ఉండేది కాదుట. ప్రతిరోజు పొరుగూరునుంచి రాలేక మధ్యలో ఉన్న పెద్ద కాలువలో ఆ ఉత్తరములు పడేసి తిరిగి వెళ్ళిపోయేవాడేట అప్పట్లో. ఈ మాట ఆ నోట ఈ నోట విన్న మాట నా చిన్నతనంలో.
ఎవరో మహానుభావుల కృషి ఫలితంగా మా కుగ్రామానికి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ వచ్చిందిట. ఆ మహానుభావుడు అప్పట్లో పంచాయతీ ప్రెసిడెంట్ గా చేసిన కీర్తిశేషులు మధునా పంతుల కామరాజు గారు అయ్యుంటారని నా అభిప్రాయం. అది ఆ ఊరి అదృష్టం .అందులో వృత్తికి అంకితమైపోయిన షేక్ లాల్ సాహెబ్ లాంటి ఉద్యోగి ఉండడం.
ఉదయం ఏడు గంటలకి ఆ ఎర్ర డబ్బాలో పడిన ఉత్తరాలన్నిటిని పోగుచేసుకుని కాఫీరంగు సంచిలో వాటిని దాచి సీలు వేసి పొరుగూరు లో ఉన్న తపాల ఆఫీసుకి అందించడం మధ్యాహ్నం పూట ఆ ఊరికి వచ్చే కాఫీ రంగు బ్యాగును మోసుకు రావడం అది అధికారి సమక్షంలో విప్పి రాజముద్ర వేసి వీధుల వారీగా ఉత్తరాలను అమర్చుకుని
మనీ ఆర్డరు సొమ్ము జేబులో పెట్టుకుని గ్రామ సంచారం మొదలెట్టేవాడు మా పోస్ట్ మాన్ గారు.
రోజు ఎంతో మంది ఎదురుచూపులు ఆ మహా వ్యక్తి కోసం. కొత్తగా పెళ్లి అయిన అమ్మాయి భర్త దగ్గర నుంచి వచ్చే ఉత్తరం కోసం ,అబ్బాయి ఉద్యోగానికి సంబంధించిన ఆర్డర్ కోసం, లేదంటే చదువుకు సంబంధించిన అడ్మిషన్ సమాచారం కోసం, దూరంగా ఉన్న పిల్లల దగ్గర నుంచి వచ్చే సమాచారం కోసం ముసలి తల్లిదండ్రులు, ప్రతి నెల కొడుకు పంపించే డబ్బు కోసం ఓ వృద్ధుడు, ఇలా అన్ని రకాల వర్గాల ప్రజలు ఆశగా ఎదురు చూసే మనిషి. ఆ మనిషి కోసం కాదు ఆ మనిషి తెచ్చే సమాచారం కోసం. వీధుల్లో అరుగుల మీద కూర్చుని వీధి చివర వరకు ఎదురు చూడటం కనుచూపు మేర లో ఎక్కడైనా కనపడుతున్నాడేమో అని. అంత ఆత్రుతగా ఎదురుచూసేవారు అతని రాక కోసం. వచ్చినవాడు మన ఇల్లు దాటి వెళ్ళిపోతుంటే ఒకింత నిరుత్సాహం.
అబ్బాయిగారు మనీ ఆర్డర్ వచ్చిందనో శుభలేఖ వచ్చిందనో అమ్మాయి గారికి ఆర్డర్ కాగితం వచ్చిందనో అంటూ అతను చెప్పే మాటలు అందరికీ ఆనందం కలిగించేవి. పైగా అతను సెంట్రల్ గవర్నమెంట్ వారి ఉద్యోగి. నిబంధనలను కచ్చితంగా పాటించే ఉద్యోగి. ఊరంతా సైకిల్ తొక్కుకుంటూ ఉత్తరాల బట్వాడా చేసి సాయంకాలం చీకటి పడే వేళకి ఇంటికి చేరినా ఆ పోస్ట్ మాన్ వెళ్లే సమయానికి సదరు వ్యక్తి ఇంటి దగ్గర లేకపోతే ఇంటిలో ఉన్న వారికి కబురు అందించి వచ్చేసేవాడు
ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మనీ ఆర్డర్ తీసుకోవడానికి రిజిస్టర్ పోస్ట్ తీసుకోవడానికి వచ్చే వాళ్లకు కూడా చిరునవ్వుతో
వాటిని అందించేవాడు. ఊరంతా తెలుసున్న జనం అయినా కానీ రిజిస్టర్ పోస్టు కానీ వేరొకరికి ఇవ్వడానికి వీలు లేదు. అడ్రస్ మీదనున్న వ్యక్తికే అందజేయాలి. ఇది నిబంధన.
రోజు ఊరంతా సైకిల్ మీద తిరిగి ఉత్తరాల బట్వాడా చేసిన అతనికి అలుపు సొలుపు ఉండేది కాదు గాని అడ్రస్ సరిగా లేనీ ఉత్తరాలు చాలా చికాకు తెప్పించేవి. రోజు సైకిల్ తొక్కడo శరీరానికి మంచి వ్యాయామమే కానీ బోరున కురిసే వర్షంలో,
మండుటెండలో మా నవాబు గారి బాధలు వర్ణనాతీతం.
పైగా మా నవాబు గారు కళాకారుడు కూడా. ఆయన గురువు ఎవరో తెలియదు కానీ శుభకార్యాలకి నాదస్వరం వాయించేవాడు. అందుబాటులో అందులోనూ మా కుగ్రామoల్లో
అటువంటి కళాకారుడు ఉండడం నిజంగా అదృష్టమే. ఒక కీర్తనతో పెళ్లి పిలుపు అయిపోయేది. ఇంక మరి పెళ్లికి ఎన్ని కీర్తనలు వాయించేవాడో నాకు తెలియదు.
నాకు గుర్తు ఉన్నంతవరకు అప్పట్లో అందరికీ ప్రముఖంగా ఉండే వాహనానికి అదేనండి రెండు చక్రాల బండికి వైద్యం కూడా చేసేవాడు.
జీతం ఎన్ని అంకెల్లో ఉండేదో నాకు తెలియదు గానీ బాధ్యత మటుకు చాలా ఎక్కువ. బండెడు చాకిరి. అయినా తన బాధ్యతనీ సక్రమంగా నిర్వర్తించి అందరి చేత మంచివాడు మా ఊరి పోస్ట్ మాన్ అనిపించుకున్నాడు.
ఒక సంస్థ యొక్క గౌరవం ఆ సంస్థలో పని చేసే ఉద్యోగుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇటువంటి ఉద్యోగులు ఉండడం ఈ రోజుల్లో చాలా అరుదు. సమయానికి ఉత్తరాలు అందించాలని ఆత్రుత ఉండేది మా పోస్ట్ మాన్ గారికి. అంటే సేవాభావం. పైగా నిబంధనలకు నీళ్లు వదిలి పని ఎప్పుడూ చేయలేదు.
మనం ఆ ఎర్ర డబ్బాలో అడ్రస్ రాసి ఉత్తరం పడేస్తాం. తండ్రి పేరు రాయడం మర్చిపోయి ఉండవచ్చు. అడ్రస్ తప్పుగా వ్రాసి ఉండొచ్చు. పిన్ కోడ్ సరిగా వ్రాయడం వల్ల ఆ ఊరు చేరిన ఉత్తరాన్ని సదరు వ్యక్తికి అందించడానికి ఆ పోస్ట్ మాన్ పడే బాధలు వర్ణనాతీతం. ఇక నగరాల్లో అయితే అతని బాధ అరణ్యరోదనమే అవుతుంది. ఢిల్లీకి వెళ్లి రావచ్చు గాని ఆ గల్లీలో అడ్రస్ పట్టుకోవడం కష్టం. అయినా బాధ్యత మరువని మహా మనిషి పోస్ట్ మాన్.
మహాకవి తిలక్ అద్భుతమైన కవిత లో పోస్ట్ మాన్ గురించి రాస్తూ " ఇన్ని ఇళ్ళు తిరిగినా నీ గుండె బరువు దింపుకోవడానికి ఒక్క ఇల్లు లేదు.
ఇన్ని కళ్ళు పిలిచినా ఒక్క నయనం కూడా నీ కోటు దాటి లోపలికి చూడదు అంటాడు. ఇంకేం కావాలి ఆ పోస్ట్ మాన్ జీవితం గురించి చెప్పడానికి.
ఎందుకో అక్టోబర్ 9 తంతి తపాలా దినోత్సవం నాడు మా లాల్ సాహెబ్ గుర్తుకొచ్చాడు. జీవితంలో ఎంతో మంది పోస్ట్ మాన్ లను చూస్తాం. నగరంలో చాలామంది మారిపోతుంటారు. కానీ తన సర్వీస్ అంతా అదే కుగ్రామంలో పనిచేసి పదవి విరమణ చేసిన మా లాల్ సాహెబ్ సేవలు మర్చిపోలేనివి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి