పాదముద్రలు

పాదముద్రలు

మన జీవిత ప్రయాణంలో మనకు ముఖ్యంగా సహకరించేవి మన శరీరంలో అంతర్భాగమైన కాళ్లు మరియు వాటిని అంటిపెట్టుకొని ఉండే పాదాలు. 

మన గమనానికి ఇవే ఆధారం. బాల్యంలో అమ్మ చిటికెన వేలు పట్టుకుని నడిపించే తొలి అడుగులుకి తడబడే అడుగులకి మన కాళ్ళే మనకు ఆధారం. 

కాలం గడిచే కొద్దీ కాళ్లు బలపడతాయి. మనసు కూడా బలపడుతుంది. ఒకప్పుడు అమ్మ ఆసరా అవసరమయ్యే మనల్ని మన కాళ్లు స్నేహితులతో పాఠశాలలకి ఆటపాటలకి తీసుకెళ్తాయి.

ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి కూడా మన అడుగులు ముందుకు పడతాయి. జీవితంలో ఎక్కవలసిన మెట్లు ఎక్కడానికి మనల్ని గమ్యం చేరుస్తూ ఉంటాయి మన కాళ్లు

కానీ...
పాదాలు మాత్రం ప్రతి అడుగులో ముద్ర వేసిపోతుంటాయి.
కాళ్లు మన శరీరాన్ని మోస్తే...పాదాలు మన కదలికల్ని జ్ఞాపకంగా మిగులుస్తాయి.

ఎప్పుడో చిన్నప్పటి ఇంటి ప్రాంగణం లో మిగిలిన పాదముద్రలు
ఇప్పుడీ వృద్ధాప్యంలో వెతుక్కుంటే కనిపించవు.
కానీ మనసులో మాత్రం అవే పాదాలు... మనల్ని వెనక్కి పిలుస్తుంటాయి. కాళ్లు శక్తి కాదు కాదు... ఆశ్రయం.
పాదాలు గుర్తు కాదు కాదు... అనుబంధం.ఏదో ఒక రోజు 
ఈ కాళ్లు నిలబడలేని స్థితి వస్తుంది. కానీ మనం వేసిన పాదాల దారులు మాత్రం...ఇంకెవరైనా నడిచే దారి అవుతాయి.

పాదాలు అనే పదం చాలా సందర్భాల్లో వాడుతారు. కవిత్వంలో పాదాలు అంటే కవిత్వ రేఖలు అంటే lines of a poem అని అర్థం.

భావోద్వేగంగా కానీ వ్యంగంగా కానీ పాదాలు అనే మాటకు అర్థం చెప్పాలంటే ఆశ్రయం అని అర్థం.

అన్నమయ్య తన తన కీర్తనలో బ్రహ్మ కడిగిన పాదము అని వెంకటేశ్వర స్వామి పాదాలని వర్ణించాడు. 

ఒక విప్లవ కవి ఒక సినిమా పాటలో హీరో తన చెల్లెలి మీద ప్రేమని నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడ పుట్టిన ఋణ oతీర్చుకుంటనే చెల్లెమ్మ అంటాడు. 

ఒక నవవధువు అత్తవారింట్లో అడుగుపెట్టినప్పుడు కుడికాలు పాదం మోపి అడుగుపెడుతుంది. ఏదైనా అశుభం జరిగినప్పుడు కాలు పెట్టింది గా ఆ మహా తల్లి అంటారు. 
వివాహ సందర్భంలో వరుడు కాళ్లు వధువు తండ్రి కడిగి కన్యాదానం చేస్తాడు. 

మన పూజా విధానంలో భగవంతుడిని పాదయో పాద్యం సమర్పయామి అని ఆరాధిస్తారు. అంటే భగవంతుడు కాళ్లు కడగడానికి నీళ్లు సమర్పిస్తున్నాను అని అర్థం. 

అలాగే ఏడాదికి ఒకసారి పెట్టే తద్దినములో కూడా పితృదేవతల రూపంలో ఉన్న బ్రాహ్మణుల కాళ్లు కడిగి తలపై చల్లుకుంటారు. 

మన పెద్దలు మన శరీరంలో కళ్ళు కాళ్ళు రెండూ కూడా అతి ముఖ్యమైనవిగా చెప్తూ ఉంటారు. మన బుద్ధి సక్రమ మార్గంలో ఉంటే కాళ్లు మంచి మార్గంలో ప్రయాణిస్తాయి. లేదంటే అధోగతి పాలు చేస్తాయి.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట