మన కథ ఆడనే ప్రారంభం

మన కథ అక్కడే ప్రారంభం.

" ఆడదే ఆధారం మన కథ ఆడనే ప్రారంభం అంటూ ఎక్కడో పాట వినిపిస్తోంది. నిజమే ఇది అక్షర సత్యం. మగవాడు ఉనికికి గమనానికి అభివృద్ధికి ఆడదే ఆధారం. ఆమె లేకపోతే బ్రతుకు శూన్యం. ఇది ప్రతి మహిళా దినోత్సవం నాడు చెప్పుకునే మాట కాదు. నిరంతరము తలుచుకోవాల్సిన మాట. 

ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు లక్ష్మీదేవి పుట్టిందని అంటారు. పెరిగి పెద్దయిన తర్వాత ఆ పిల్ల అందచందాలు చూసి కళకళలాడుతూ లక్ష్మీదేవి లా ఉంది అని అంటారు. ఇంటికి ఇల్లాలు అందం. నిజమే ఇల్లాలు లేని ఇల్లు బోసిపోతుంది. వెలవెలబోతుంది. ఇల్లాలు తోటే ఆ ఇంటికి అందం. ఆ కుటుంబానికి ఆనందం. నిజజీవితంలో ఒక కుటుంబంలో ఆమె పాత్రను పరిశీలిస్తే అష్టలక్ష్మి తత్వం కనబడుతుంది. ఆ కుటుంబం కోసం పిల్లల కోసం భర్త కోసం ఆమె పడే శ్రమ వెనుక ఉన్న ఆదర్శ మూర్తులు ఎవరని అడిగితే అష్టలక్ష్మిలు అని నా ఉద్దేశం.

ఒక ఇంటికి ఇల్లాలు అందం. ఆ ఇంటిలో ఉండే వారి ఆపదలన్నీ తీర్చడానికి ఆనందంగా ఉంచడానికి ఆమె అహర్నిశలు శ్రమ పడుతూ ఉంటుంది. అందుకే ఆమె చేతులలో ఆ కుటుంబానికి అభయ వరముద్రలు ఉంటాయని అనిపిస్తుంది.
ఆమె కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది.
ఇకపోతే ఆ ఇల్లు ఎప్పుడు పిల్లలతో కళకళలాడుతూ సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఆ స్త్రీ ఎల్లప్పుడూ పాటు పడుతూ ఉంటుంది. సంతానం కనే అధికారం అర్హత ఎప్పుడు స్త్రీకే ఉంటుంది. అందుచేత ఆమె సంతాన లక్ష్మి అంటాము. 

నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించి ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని కుటుంబ గౌరవాలను కాపాడటానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంది. అందుకే ఆమె ధైర్యలక్ష్మి.   

పిల్లలకి ఎప్పుడూ విద్యాబుద్ధులు నేర్పుతూ సమాజంలో ఒక మంచి స్థానంలో నిలబెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది .పిల్లలకి మొదటి గురువు అమ్మ. ఆమెని విద్యాలక్ష్మి అనడంలో సందేహం ఏముంది .

భర్త సంపాదించిన దానిని పొదుపుగా ఖర్చు చేస్తూ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ ముందుకు నడిపించే వారిని ఆ కుటుంబానికి సంబంధించి అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి తోడ్పడే స్త్రీలని విజయలక్ష్మి అనడంలో తప్పేముంది. 

ఇంటి పనులన్నీ ధైర్యంగా ఓర్పుతో నేర్పుతో సాధించగల శక్తి ఆమెకు ఉండడం వలన ఆమెని గజలక్ష్మి అనడంలో తప్పేముంది. 

ఆ కుటుంబంలో ఉండే జీవులందరికీ ఆకలి తీరుస్తోంది తద్వారా వారి అభివృద్ధికి తోడ్పడుతోంది. ఆకలి తీర్చే అన్నపూర్ణ కూడా లక్ష్మీ స్వరూపమే.

స్త్రీ సహనానికి మారుపేరు. భూదేవి అంత సహనం ప్రతి స్త్రీలోనూ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక కుటుంబంలో ఎన్ని కష్టాలు బాధలు ఉన్నప్పటికీ ఓర్పు పట్టి కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది . పరిస్థితులు ఎప్పటికైనా చక్కబడతాయని ఆశతో జీవిస్తూ ఉంటుంది .

 వరుణ దేవుడిలా ఎప్పుడు ఆ కుటుంబంలోని పిల్లల మీద , ముసలి వాళ్ళ మీద కరుణ వర్షం కురిపిస్తూనే ఉంటుంది.

కుటుంబంలో ఉండే పిల్లలను మంచి చదువులు చదివించి మంచి ఉద్యోగాలు సంపాదించే వాతావరణం కల్పించడానికి, భర్త అభివృద్ధికి ఎల్లప్పుడూ స్త్రీ కష్టపడుతూ ఉంటుంది. పరోక్షంగా ఇంటి ఆర్థిక అభివృద్ధికి స్త్రీ తోడ్పడుతోంది . అందుచేత ఇంట్లో కుబేర స్థానం ఆమెదే.

అవసరమైతే కుటుంబం కోసం శత్రువుల మీద అగ్ని ధారలు కురిపిస్తుంది. నిత్యం అగ్నిహోత్రాన్ని ఆరాధన చేసి రుచికరమైన ఆహారం కుటుంబానికి అందిస్తుంది.పరోక్షంగా కుటుంబానికి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. 
చల్లగా వీచే మలయ మారుతం లాంటి మాటలతో అలసిపోయిన హృదయాలని పలకరించి పులకరింప చేస్తుంది. వాయువులా ఆమె శక్తి మనకు కనపడదు. కానీ ఆమె లేకపోతే ఒక్క నిమిషం మనకి గడవదు. 

ఒక తల్లిగా పిల్లల్ని రక్షిస్తుంది, శిక్షిస్తుంది. భర్తకు భార్యగా కుటుంబం నడపడానికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబ అభివృద్ధికి తోడ్పడే ఆమె శక్తి సామర్థ్యాలకి ఆకాశమే హద్దు. ఆకాశం లేని చోటు ఉండదు. అలాగే ప్రకృతి అంతా స్త్రీ స్వరూపమే. 

ఆకాశాన్ని హద్దుగా పెట్టుకుని స్త్రీ అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతోంది . ఇది అభినందించవలసిన విషయం. కుటుంబ వ్యవస్థ గట్టిపడాలంటే స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఇటీవల కాలంలో స్త్రీపురుషుల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చి కాపురాలన్నీ కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. స్త్రీ పురుషులు ఇద్దరు బాగా విజ్ఞానవంతులు అయినప్పటికీ ఇంకా సంసార రథానికి ఇద్దరు ముఖ్యులే అనే విషయం మర్చిపోతున్నారు. అందమైన ఆదర్శనీయమైన భారతీయ కుటుంబ వ్యవస్థని వీధిలోకి తీసుకొస్తున్నారు నేటి యువతరం. " ఓర్చినమ్మకు తేటనీరు అనే సామెతను ఎప్పుడో మర్చిపోయారు. ఇంత ప్రతిభాపాటవాలున్న స్త్రీ జీవితం అడవిగాచిన వెన్నెల్లా అయిపోతోంది.
కలకాలం కలిసి ఉండి కాపురాలు చేయవలసిన యువతరం అసలు పెళ్లి వద్దనుకుని కొద్ది రోజులు కలిసి ఉంటాం బాగుంటే ముందుకు సాగుతాం అనే పద్ధతికి మనదేశంలో కూడా శ్రీకారం చుట్టేశారు. నా జీవితం నా ఇష్టం అని ధోరణి వినపడుతోంది. అసలు పిల్లలు వద్దనుకునే వాదన కనబడుతోంది. ఇది రాబోయే కాలంలో భారతీయ కుటుంబ వ్యవస్థకు పెద్ద ముప్పు.

యువతరంలో పెరిగిపోతున్నటువంటి వాదనలని భయాన్ని ఆందోళనను తగ్గించి భారతీయ కుటుంబ వ్యవస్థను నిలబట్టవలసిన బాధ్యత ప్రతి మహిళా సంఘం మీద , సమాజంలోని మేధావులు విజ్ఞుల మీద ఉంది. 

ఈ మహిళా దినోత్సవం నాడు సన్మానించుకోవలసిన స్త్రీలలో సమాజంలో ఉండే అత్యున్నత పదవులు అలంకరించే వారే కాక అట్టడుగు వర్గాలలో ఉండే స్త్రీలలో కూడా ఆదర్శ మూర్తులు కూడా ఉన్నారనే విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం