పిచిక గూడు
పిచిక గూడు
ఈ లోకంలో ఏ ప్రాణి కూడా తన గూడు తానే సొంతంగా నిర్మించుకోలే దు. మాట తెలిసిన మానవుడు కూడా అన్నీ ఉండి నిపుణులైన వారి మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఒక్క పక్షి జాతి మాత్రం తన గూడు తానే నిర్మించుకుంటుంది. గూడు ఈ విధంగా ఉండాలని, నిర్మించాలని ఎవరు నేర్పారు ఈ మాటలు రాని పక్షికి. ఒక్క భగవంతుడు తప్పితే ఇంకెవరు చెప్తారు.
ఒక మనిషి ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం వారి అనుమతితో పాటు, శాస్త్ర సమ్మతము కూడా అయి ఉండాలి. ప్రతి మనిషికి కొన్ని కలలు ఉంటాయి. ఆ కలల ప్రకారం తన స్వర్గం నిర్మించుకోవాలని తాపత్రయ పడిపోతుంటాడు.
మనిషికి ఆశకి అంతులేకుండా పోయింది. మూడు గదులలో సంసారం చేసే కుటుంబాలు రెండు పడకగదులతో ఇల్లు ఉండాలని అది కాకుండా ఎవరు పడకగది వాళ్ళకు ఉండాలని అది కాకుండా ఆధునిక కాలంలో జనం మెచ్చే విధంగా డూప్లెక్స్ కట్టుకోవాలని ఇలా రోజురోజుకీ మనిషి కోరికల సముద్రంలో కొట్టుకుపోతూ ఉన్నాడు. చివరికి మిగిలేది ఇద్దరే ఆ ఇంట్లో. చివరికి తన స్వర్గాన్ని శుభ్రం చేసుకునే ఓపిక కూడా ఆ మనిషికి ఉండదు.
ఆ పక్షికేముంది చెట్టు కొమ్మ ఉంటే చాలు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా గూడు నిర్మించేసుకుంటుంది. ఆ పక్షి జాతి తరతరాలుగా ఒకే రకమైన గూడును నిర్మించుకుంటూ ఉంది దానినీ పిచిక గూడు అంటారు. పెనుగాలికి ఆ గూడు ఊయలలా ఊగిపోయి నేల పాలైన మళ్లీ ఇంకో కొమ్మను వెతుక్కుంటుంది. మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో ఇంకో గూడు నిర్మించుకుంటుంది. కానీ మానవుడు గూడు పోయిందంటే నిరుత్సాహపడిపోతాడు .భయపడిపోతాడు. వాస్తు బాగాలేదని మానసికంగా కృంగిపోతాడు.
ఆ పక్షి పనితనం చూడండి. ఏ ఆర్కిటెక్చర్ కూడా ఆకాశంలో ఎగిరే పక్షి లాగా గూడు నిర్మించలేడు. అంతా గజిబిజిగా ఉంటుంది. అందుకే దువ్వుకోకుండా ముడి వేసిన జుట్టుని పిచిక గూడు తో పోలుస్తారు.
ప్రజా కవి గోరేటి వెంకన్న తన మాటల్లో " ఓ పుల్ల ఓ పుడక ఎండు గడ్డి చిన్న కొంప చిట్టి గూడు పిట్ట బ్రతుకే హాయి కదరా!
అంటాడు .
మనిషి గూడు నిర్మించుకోవాలంటే కోట్ల కొలది రూపాయిలు అప్పులు పాలైపోతాడు. కానీ ఈ పక్షి ఆకాశంలోకి ఎగిరిపోయి కనబడిన వాటిని ముక్కున కరుచుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి సంపాదించుకుని గూడు తనకు తానుగా నిర్మించుకుంటుంది.
హాయిగా బిడ్డలను పెట్టుకుని కాలక్షేపం చేస్తుంది. వెళ్లవలసిన చోటికి ఎగురుకుంటూ వెళ్లిపోతుంది.
అందుకే గోరేటి వెంకన్న * ఈ పూటకు ఉంటే చాలు రేపటి కోసం బాధే లేదు దాచుకునే గుణమే లేదు. లోభితనం అన్నది ఎరగదు. చదువు చెప్పే శాల లేదు. బోధ చెప్పే గురుడు లేడు. అన్ని ఉండి మానవుడు తన భవిష్యత్తు పక్షి చేత చెప్పించుకుంటున్నాడు* అంటాడు. ఎంత తత్వం ఇమిడి ఉంది ఈ కవిత్వంలో. పల్లెని జల్లెడ పట్టేసి పదాలను హృదయానికి అతుక్కునేలా ఈ కవిత రాశాడు గోరేటి వెంకన్న. ఈ చిత్రపటం చూడగానే నాకు గోరేటి వెంకన్న కవిత గుర్తుకొచ్చింది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి