అతిధి@అరవై
అతిధి @ అరవై.
సాయంకాలం నాలుగు గంటలు అయింది. నీలిరంగు ఆకాశం హఠాత్తుగా రంగు మారిపోయింది. వరుణ దేవుడు వాయుదేవుడు ఇద్దరూ రంగంలోకి దిగారు. పెద్ద వర్షం కాదు గాని చిన్న చిన్న తుంపర్లతో రహదారంతా తడిసిపోయింది.
ఇంతలో స్కూటర్ వచ్చి ఆగింది . ఎవరబ్బా ఈ వర్షం లో అని తొంగి చూశాడు కుర్చీలో కూర్చున్న ప్రసాద్. స్కూటర్ స్టాండ్ వేస్తూ రామారావు వెనకాల అతను భార్య సుజాత కనబడ్డారు.
వీధిలోకి వెళ్లి ఇద్దర్ని సాదరంగా ఆహ్వానించాడు ప్రసాద్. కుశల ప్రశ్నలు అయిన తర్వాత ప్రసాద్ స్నేహితుడు రామారావు "ఒరేయ్ ప్రసాదు రేపు ఉదయం 9 గంటలకి మా అమ్మాయి శ్రీమంతం నువ్వు మీ ఆవిడ తప్పకుండా రావాలి ! అంటూ చెప్పాడు. కాఫీ టిఫిను భోజనం కూడా అక్కడే అంటూ ఆప్యాయంగా చెప్పాడు రామారావు.
"నేనెందుకు రా ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ కదా నేనేం చేయను వచ్చి అంటూ పకపక నవ్వేడు ప్రసాద్.
"లేదురా నువ్వు తప్పకుండా రావాలి. మీలాంటి దంపతులు వచ్చి మా పిల్లనీ ఆశీర్వదించాలి అంటూ సెంటిమెంట్ గా చెప్పాడు
ఇంతలో రామారావు భార్య సుజాత అన్నయ్య గారు వదిన గారు లేరా ! అని ప్రశ్నించింది . లేదమ్మా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళింది అంటూ చెప్పాడు ప్రసాద్. రాత్రికి వచ్చేస్తుంది. నేను చెప్తాను లే అమ్మ అంటూ చెప్పి వాళ్ళిద్దర్నీ సాగనంపాడు ప్రసాదు.
రామారావు, ప్రసాదు ఇద్దరూ ఒకే ఆఫీస్ లో పనిచేసి గత సంవత్సరం పదవీ విరమణ చేశారు. పైగా ఇద్దరూ బాల్య స్నేహితులు కూడా. ఏరా! ఒరేయ్! అనుకునే అంత చనువు.
ఇంట్లో తోరణం కట్టడం పాపం రామారావు ప్రసాద్ ని పిలవకుండా ఏ ఫంక్షన్ చేయడు. ప్రసాద్ కూడా అంతే. ప్రసాద్ కి ఎవరైనా ఫంక్షన్ కి పిలుస్తున్నారు అంటే చాలా భయంగా ఉంటోంది ఈ మధ్య. గత సంవత్సరం రిటైర్ అయిన దగ్గర్నుంచి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. గుప్పెడు మందులు మింగనిదే ఏ రోజు గడవదు. పైగా ఆహారం కూడా అన్నీ తింటుంటే పడట్లేదు. ఒక్కరోజు ఫంక్షన్ కి వెళ్లి వస్తే రెండు రోజులు లేవలేని పరిస్థితి. అయినా ఈ ఫంక్షన్ కి తప్పనిసరిగా వెళ్లాలి మానేస్తే రామారావు చాలా బాధపడతాడు అనుకున్నాడు ప్రసాద్.
ఏదైనా అరవై సంవత్సరములు దాటిన తర్వాత ఇంచుమించుగా అందరి ఆరోగ్య పరిస్థితిలు ఒకే విధంగా ఉంటున్నాయి. కానీ రాను రాను వయసుతో కూడా నిమిత్తం లేకుండా అయిపోతోంది. బ్లడ్ ప్రెషర్ షుగరులు లేకుండా ఎవరు ఉండరు. గుప్పెడు మందులు దానికి తోడు ఆహార నియమాలు ఇది ప్రస్తుత పరిస్థితి.
ఏదో ఒక ఫంక్షన్ కి ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు. ఆరోగ్య పరిస్థితి బాగున్న లేకున్నా వెళ్లి రావాలి. లేకపోతే రకరకాలుగా ఊహించుకుని నిష్టూరంగా మాట్లాడతారు. అసలు విషయం చెప్పిన ఏదో సాకు అని కొట్టి పారేస్తారు.
ఈ బాధలు పడలేక మొహమాటం కొద్దీ ఫంక్షన్ కి వెళ్తే అక్కడ వెళ్ళగానే ఒక కప్పు కాఫీ తోటి మర్యాద ప్రారంభం అవుతుంది. మొహమాటం కొద్దీ కాఫీ కప్పు అందుకొని తాగేసి ఏదో నలుగురు కలుస్తారు కదా కబుర్లలో పడతాం. ఇంట్లో శుభకార్యం మొదలు పెట్టగానే మనకి క్యాటరింగ్ వాడే దిక్కు. ఇదివరకులా వంట వండించుకునే రోజులు ఎప్పుడో పోయే యి. పెద్దపెద్ద స్టీల్ ప్లాస్కుతో కాఫీ టీలు అక్కడ పెడతాడు. ఆ పాత్రల పరిశుభ్రత విషయం దేవుడికే తెలియాలి. సరే అల్పాహారానికి రండి అంటూ పిలిచి కూర్చోబెడతారు.
ఎక్కడికి వెళ్ళినా అదే కాంబినేషన్. ఇడ్లీ వడ లేదంటే ఇడ్లీ మైసూర్ బజ్జి . ఉదయం ఆయిల్ టిఫిన్ ఏం తింటామని మనసులో అనుకున్న ఎర్రగా బుర్రగా ఉన్న మైసూర్ బజ్జి చూసి నాలుక లాగేస్తుంటే వద్దనుకుంటేనే రెండు మైసూర్ బజ్జీలు నాలుగు ఇడ్లీలు తోటి ఆత్మరాముడిని శాంత పరుస్తాము. "అబ్బా టిఫిన్ హెవీ అయిపోయింది.
మధ్యాహ్నం లైట్ గా తినాలి అని ఇప్పటినుంచే ప్లాన్ చేసేసుకుని కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఆకబురు ఈ కబురు చెప్పుకుంటూ కాలం గడిపేస్తాము. కాలం ఎంత సేపు కదలకుండా ఉంటుంది. రండి భోజనానికి అంటూ మర్యాదగా పిలుపు . ఆకునిండా ఐటమ్ లు చూసి ఉదయం చేసిన ప్రతిజ్ఞ మర్చిపోయి పదార్థాల మీదకి దాడి చేస్తా ము. ఆకులో వడ్డించిన కొన్ని పదార్థాల పేర్లు మనకు తెలియదు కొన్ని మనం గుర్తుపట్టొచ్చు. సరే ఏదైనా సరే జాగ్రత్తగా తినాలని మొదలుపెడితే కొంతమంది మరీ బలవంత పెట్టి వద్దని చేతులు అడ్డుపెట్టిన వడ్డించేస్తుంటారు. ఎదుటి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోరు. ఎంతసేపు అతిధి మర్యాదలే. అలా సుష్టుగా భోజనం చేసి కిళ్లి బిగించి ఇంటికి వచ్చి ఆపసోపాలు పడడం చాలామందికి తప్పడం లేదు.
రాత్రి పది గంటలకి ఇంటికి వచ్చిన భార్య శాంతకి రామారావు దంపతులు వచ్చి వెళ్లిన సంగతి చెప్పి ఉదయం వెళ్లి వద్దామని నిర్ణయించుకున్నారు ప్రసాద్ దంపతులు. "మీరు అక్కడికి వెళ్లిన కడుపు మర్చిపోయి తినకండి. మళ్లీ ఇంటికి వచ్చి నన్ను చంపుతారు అంటే ముందుగానే హెచ్చరించింది శాంత. *అబ్బా నేనే అసలు భోజనాలు అంటేనే భయపడి చచ్చిపోతున్నా ను.
నాకు తెలుసులే అంటూ శాంత మాట కొట్టి పారేశాడు.
మర్నాడు ఉదయమే రామారావు ఇంటికి వెళ్లిన ప్రసాదు దంపతులను చూడగానే రామారావు సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు. అప్పటికే చాలామంది బంధువులు అందరూ వచ్చి ఉన్నారు.
*ఇంతలో టిఫిను కు రండి అంటూ పిలుపు వచ్చింది. ప్రసాదు ఇంటి వెనకాల షామియానాలన్నీ వేసి టేబుల్ లన్ని అందంగా గుడ్డలతో మెరిసిపోతూ పదార్థాలన్నీ వేడిగా ఉండడానికి అవసరమైన ఏర్పాట్లతో రెడీగా ఉన్నాయి. ఎవరో పేరున్న క్యాటరింగ్ వాళ్లకి ఇచ్చినట్టు ఉన్నాడు అనుకున్నాడు ప్రసాద్. ఇంతలో మైక్ లో అనౌన్స్మెంట్ వినిపించింది. క్యాటరింగ్ యజమాని అనుకుంటా తమ క్యాటరింగ్ గురించి చెప్తూ తదుపరి సీనియర్ సిటిజన్లకి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ పక్క ప్రత్యేకంగా వడ్డిస్తున్నాము అంటూ చెప్పాడు.
ఇంతలో రామారావు వచ్చి నువ్వు సీనియర్ సిటిజన్ కదా! ఇటువైపుకు రా అంటూ తీసుకు వెళ్లి కూర్చోబెట్టాడు. వడ్డన ప్రారంభమైంది. ఆకులోని పదార్థాలు చూసి ప్రసాద్ నిజంగా ఆనందపడ్డాడు. మిల్లెట్ తో చేసిన ఇడ్లీ , ఫ్రూట్ సలాడ్ మొలకలొచ్చిన పెసలు షుగర్ లెస్ కాఫీలు టీలు, మామూలు కాఫీలు టీలు పాలు. అన్ని సులభంగా జీర్ణం అయ్యేవి. ఎక్కడ నూనె సరుకులు లేవు. విచిత్రంగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా వేసిన టేబుళ్లు అన్ని నిండిపోయాయి. ఆ టేబుల్ ముందు కూర్చున్న వాళ్ళలో వయసు మళ్ళిన వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.
ప్రసాద్ సంతృప్తిగా టిఫిన్ తిని ఇటువంటి ఆలోచన రామారావు దంపతులకు వచ్చినందుకు ఆనందపడ్డాడు. అయినా ఈ క్యాటరింగ్ వాడిని రామారావు ఎలా పట్టుకున్నాడో అనుకున్నాడు ప్రసాద్. టిఫిన్ సెక్షన్ ఈ విధంగా ఉంటే ఇంక లంచ్ గురించి బెంగ లేదు అనుకున్నాడు ప్రసాద్. ఇంతలో అటుగా వస్తున్న రామారావు టిఫిన్ ఎలా ఉందిరా? ప్రసాద్ అని అడిగాడు. ప్రసాద్ వెంటనే ఆరోగ్యకరంగా ఉంది రా !అంటూ నవ్వేసి సమాధానం ఇచ్చాడు. సరే రా మరి నీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చింది రా! అంటూ అడిగాడు ప్రసాద్.
మొన్న బెంగళూరు లో మా అమ్మాయి అత్తవారి వాళ్ళింట్లో చూసి హైదరాబాదులో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు అని అడిగి అడ్రస్ తీసుకున్నాను. ముఖ్యంగా మన ఇంటికి వచ్చిన అతిధుల్లో చాలామంది సీనియర్ సిటిజన్లు ఉంటారు. ఆహార నియమాలు ఉన్నవాళ్లు ఉంటారు. మన ఇంటికి పిలిచి అలాంటి వాళ్ళని బాధ పెట్టకూడదు. సీనియర్ సిటిజెన్లకి రైలులోను బస్సులోను ఇన్కమ్ టాక్స్ లోను ప్రత్యేకత ఉంటుంది. ఒక వ్యక్తిగా సీనియర్ సిటిజన్ ని మనం గౌరవిస్తా ము. కానీ అతిథిగా చాలా ఇబ్బంది పెడతాం. ఎందుకంటే అతిథిదేవోభవ అనేది మన సాంప్రదాయం. పూర్వకాలంలో రాళ్లు తిన్న కరిగించుకునే శక్తి ఉండేది.ఇప్పుడు అది లేదు.కొన్ని లక్షలు ఖర్చుపెట్టిన ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వలేం అంటూ చెప్పుకుంటూ వచ్చాడు రామారావు.
చాలా హాయిగా ఉందండి మీరు పెట్టిన భోజనం. సుఖంగా ఉంది ప్రాణం అంటూ చాలా మంది రామారావుని అభినందించడం గమనించాడు ప్రసాద్. రుచికరమైన ఆహారం కన్నా ఆరోగ్యకరమైన ఆహారం ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నాడు
ప్రసాద్.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి