గమ్యం తెలియని ప్రయాణం

గమ్యం తెలియని ప్రయాణం

ఉదయం 5:10 అయింది 

కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అంత ప్రయాణికులతో హడావుడి గా ఉంది. ఇంతలో కాకినాడ నుంచి షిరిడి వెళ్లే ఎక్స్ప్రెస్ స్టేషన్లో వచ్చి ఆగింది.

ప్రయాణికుల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. అంతవరకు బెంచీల మీద కూర్చున్న జనం ఒక్కసారిగా లేచి సామాన్లు తీసుకుని బోగిల్లోకెక్కి సామాన్లు సర్దుకుంటున్నారు. అందరితోపాటు అక్కడ బెంచ్ మీద కూర్చున్న చిన్ని గాడు కుడి చేతి భుజానికి జోలి సంచి తగిలించుకుని జనరల్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కాడు. ఆ బోగి ఎక్కడా ఖాళీ లేదు . విపరీతమైన జనం. అలాగే బాత్రూం దగ్గర ప్రయాణికులను గమనిస్తూ కూర్చున్నాడు. చిన్ని గాడికి వయసు ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది కానీ రైలు ప్రయాణం ఏమీ కొత్త కాదు. 

చిన్ని గాడిది గమ్యం తెలియని ప్రయాణం. బతుకుదెరువు కోసమే రైలు ఎక్కుతాడు. అంతెందుకు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న గుడిసెలోనే పుట్టాడు. పుట్టగానే వాడి ఏడుపు రైలు కూతలతో కలిసిపోయింది. ఆడుకోడానికి ఆటస్థలం అదే. పొట్ట నింపే స్థలం కూడా అదే. వర్షం వస్తే తలదాచుకోవడానికి చిన్ని గాడికి తెలిసిన స్థలము అదే.
 నాన్న అనే పదం తెలియదు. అన్నీ తానై పెంచింది తల్లి. వేసవి కాలంలో అందరూ డాబాల మీద పడుకుంటే చిన్నిగాడు తన తల్లితో ఒకటో నెంబర్ ప్లాట్ఫారం చివరన పడుకున్నప్పుడు కలిగిన అనుభవాలు, పోలీసుల తిట్లు జీవితం మీద విరక్తి కలిగించేయి. ఇంకేముంది ఆ స్టేషన్ కి రోజు వచ్చి పోయే రైళ్లు అవకాశం కల్పిస్తున్న ఎదురుగుండా కనపడిన తల్లి బాధ్యత గుర్తుకొచ్చి రైలు కింద పడవలసిన వాడు ప్రతిరోజు ఏదో ఒక రైలు ఎక్కి బోగీలను పరిశుభ్రంగా ఉంచడంలో ఇటు రైల్వే వారికీ ,అటు ప్రయాణికులకు సహాయపడుతుంటాడు. అలా ఎక్కే రైలు ,దిగే రైలుతో జీవితంలో ఊహ తెలిసినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు అలా పట్టాల మీదనే గడిచిపోయాయి. 

ఇంతలో రైలు రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆగింది. చిన్ని గాడు జనరల్ బోగి దిగి గబగబా సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో అడుగుపెట్టాడు. ప్రయాణికులంతా టిఫిన్ తినే హడావుడిలో ఉంటే కాఫీ టీలు అమ్మేవాళ్ళు, టిఫిన్ అమ్మేవాళ్ళు కూల్ డ్రింకులు ,మజ్జిగ ,జామకాయలు అమ్మేవాళ్ళు, సమోసా అమ్మేవాళ్ళు , బ్యాగులు రిపేర్ చేసే వాళ్ళు, షూలు పాలిష్ చేసేవాళ్లు ,చెయ్యి చాచి అడుక్కునేవాళ్లతో హడావిడిగా ఉంది. ఎవరి బ్రతుకు జీవనం వారిది. నిజంగా రైల్వే డిపార్ట్మెంట్ అభినందించదగ్గది. ఎంతోమందికి పరోక్షంగా ఇంత అన్నం పెడుతుంది. రకరకాల భాషలు మాట్లాడే ప్రయాణికులతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. బాధల్ని మోసుకుని పోతుంది. బంధాలను కలుపుతుంది. అనుబంధాలను పెంచుతుంది.

కొందరు బంధాలను విడలేక రైలు బయలుదేరుతున్న కూడా పరిగెత్తుతారు. పరిగెత్తుతున్న రైలుని ఆపలేమని వాళ్లకు కూడా తెలుసు. ఆ బంధం అంత గొప్పది.కిటికీ పక్కన కూర్చుంటే ఎన్నో వింతలు చూపిస్తుంది. ఎంతోమందిని స్నేహితులుగా చేస్తుంది. పరిచయాలు పెంచుతుంది. రైలు ప్రయాణానికి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది అంటారు. ఎవరి గమ్యం రాగానే వాళ్ళు దిగిపోతారు. 

 చిన్ని గాడు తన సంచిలోంచి చీపురు, గుడ్డ ముక్క తీసి బోగీని తుడవడం ప్రారంభించాడు. ఆ బోగి అంతా చాలా గలీజ్ గా ఉంది. రైలు బయలుదేరి గంట దాటిందేమో. అప్పుడే ఇంత చెత్త చేసేసారు ఏమిటి? .కనీసం కిటికీలోంచి బయటకు కూడా విసరరు. ఆ బోగీలోనే పడేస్తారు. అలా ప్రతి సీటు దగ్గర తుక్కు తుడుస్తూ చేతులు చాచి అడుగుతుంటే కొంతమంది తమకు తోచింది ఇస్తుంటే ,కొంతమంది విసుగ్గా మొహం పెట్టి ఆ చిన్ని గాడికి చూడడం మానేసి ఎటో చూడడం మొదలు పెడితే, కొంతమంది తెచ్చుకున్న టిఫిన్ వాడి చేతిలో కూడా పెట్టి జాలిగా మొహం పెట్టే వాళ్ళు కొంతమంది , ఇదేమి చిన్న గాడికి కొత్త కాదు. ప్రతిరోజు ఇదే తంతు. రైలు బయలుదేరేటప్పుడు క్లీన్ చేసి ప్రయాణం మొదలుపెడతారు రైల్వే వాళ్ళు. కానీ మధ్యలో ఎక్కడ శుభ్రం చేయరు. చిన్ని గాడి లాంటి వాళ్లే ప్రయాణికులకి సహాయం చేస్తుంటారు. ఆ విషయం ప్రయాణికులు కూడా తెలుసు. 

మొత్తానికి బోగీ ఆ చివర నుంచి చివరి వరకు తుడిస్తే వంద రూపాయలు వచ్చాయి అనుకుంటూ ఆ సొమ్ముని జాగ్రత్తగా సంచిలో పెట్టుకుని ప్యాకెట్ విప్పుకుని ఆకలి తీర్చుకున్నాడు. వీళ్ళెవరో మంచి వాళ్ల లాగా ఉన్నారు. కొంతమంది ఇచ్చామనే పేరుకు కానీ ప్యాకెట్ విప్పి చూస్తే సరుకు పాడైపోయి ఉంటుంది. ఇలాంటివి ఎన్నో అనుభవాలు చిన్ని గాడికి. 

రైలు తన పని తాను చేసుకుని పోతూనే ఉంది . ఎక్కేవాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు దిగేవాళ్లు దిగుతూనే ఉన్నారు. చిన్ని గాడు తన పని మళ్ళీ మొదలు పెట్టాడు . ప్రతి బోగీ లో ఉండే అనుభవాలు ఇవే. అయినా అవి చేదు అనుభవాలనుకుని ముందుకు నడిచి పోతున్నాడు చిన్ని గాడు. చాలామంది టీసీలు ఇలాంటి వాళ్ళని పట్టించుకోరు. కానీ కొంతమంది నిర్దాక్షిణ్యంగా మధ్యలోనే దింపేస్తుంటారు. గట్టిగా కోప్పడుతుంటారు. ఈరోజు అలాంటివి లేకపోగా సాఫీగా నడుస్తూఉంటే ఒక బోగీలో చూసిన దృశ్యం తల్లిని గుర్తు చేసింది. 

  చిన్ని గాడి వయసంత వయసున్న కుర్రాడు తల్లి అనుకుంటా ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. ఆ తల్లి ఆ కుర్రాడి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి జుట్టు సర్దుతోంది. ఈమధ్య అమ్మకి ఒంట్లో బాగుండట్లేదు . ఏ పని చేయలేకపోతోంది. ఆ ప్లాట్ఫారం మీద కూర్చుని ఉంటుంది. వచ్చిపోయే ప్రయాణికులు ఏదో దయ తలచి ఇచ్చిందానితో కడుపునింపుకుంటుంది. దానికి తోడు ర కళ్ళు కూడా కనపడటం లేదు. ఆపరేషన్ చేయించాలి. 

ఎంత కడుపు కట్టుకున్న ఆపరేషన్ కి సొమ్ము సంపాదించడం కష్టమైపోతోంది. ఆపరేషన్ అంటే మాటలా! కనీసం ఒక పదిహేను రోజులైనా విశ్రాంతి ఇవ్వాలి . అమ్మ దగ్గరే కూర్చుంటే కడుపు నిండదు. మరి అమ్మని ఎవరు చూసుకుంటారు ?. తమ పక్కనే ప్లాట్ ఫామ్ మీద ఉండే అక్కని సహాయం అడిగాడు చిన్ని గాడు. కానీ అప్పుడు ఇద్దరినీ తనే పోషించాలి. ఇది వాడి బాధ్యత. ఇలా ఆలోచిస్తూ కూర్చున్న చిన్ని గాడికి ఎవరో చేతిలో ప్యాకెట్ ,వాటర్ బాటిల్ పెట్టి వెళ్లిపోయారు. అసలే ఆకలి మీద ఉన్నాడేమో గబగబా ప్యాకెట్ కాళీ చేసి కడుపునిండా నీళ్లు తాగేసాడు. మళ్లీ మొదలైంది బతుకు ప్రయాణం. రైలు తన చేరవలసిన గమ్యం తొందరగా చేరాలని, చిన్ని గాడు తన బాధ్యత తొందరగా తీర్చుకోవాలని వేగంగా పరుగులెత్తి సాయంకాలానికి సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగింది రైలు. 

చిన్ని గాడు రైలు దిగి ప్లాట్ ఫామ్ మీద ఉండే బెంచి మీద కూర్చున్నాడు. మళ్లీ రేపు ఉదయం జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కి సామర్లకోటలో దిగిపోతాను . ఈరోజు రాత్రి ఇక్కడే ఎక్కడో కాలం గడుపుకోవాలి అనుకున్నాడు చిన్ని గాడు. అలా చాలాసేపు కూర్చుని అసలు ఈవేళ సంపాదన ఎంత మొత్తం ఎంత అయింది ఇప్పటికీ అనుకుని సంచిలోంచి సొమ్ము తీసి లెక్కపెట్టుకుంటూ ఒకసారి తల పక్కకు తిప్పేటప్పటికి పక్క బెంచ్ మీద చేతిలో కర్ర పట్టుకుని జోలి సంచి తగిలించుకుని గడ్డం పెంచుకుని, కాళ్లకు కిర్రు చెప్పులు వేసుకుని మొహానికి విభూతి పెట్టుకుని, కాషాయ వస్త్రాలు ధరించిన పెద్దాయన పలకరింపుగా ఒకసారి చిరునవ్వు నవ్వి రాత్రి ఇక్కడ పోలీసులు పడుకొనివ్వరు!తరిమేస్తారు!. నీకు పడుకోవడానికి ప్రదేశం నేను చూపిస్తాను. నాతో వస్తావా !అని అడిగాడు. చిన్ని గాడు అవసరం అటువంటిది. తెలియని ఊరు, పోలీసులు తరిమేస్తే రాత్రి అంతా జాగారం చేయాలి అనుకుని వస్తానని తల ఊపి ఆ బైరాగి వంటి బయలుదేరాడు. ఐదో నెంబర్ ప్లాట్ఫారం చివర ఒక చెట్టు కింద వరకు తీసుకెళ్లాడు. ఆ చెట్టు కింద రెండు ట్రాలీలు ఉన్నాయి. ఒక దాని మీద నువ్వు పడుకో . దీని మీద నేను పడుకుంటాను అంటూ ఆ ట్రాలీ మీద కూలబడ్డాడు బైరాగి.

చిన్ని గాడు ఆ పక్కనే ఉన్న కుళాయి దగ్గర స్నానం చేసేసి ఇంకో ట్రాలీ మీద నడుం వాల్చాడు. ఏ ఊరు నుంచి వస్తున్నావు? అని అడిగాడు ఆ బైరాగి. కాకినాడ నుంచి వచ్చాను అన్నాడు చిన్ని గాడు. అన్నం తింటావా! అంటూ తన సత్తు క్యారియర్ చిన్ని గాడి చేతిలో పెట్టాడు బైరాగి. మరి మీకు అని అడిగాడు చిన్ని గాడు .నా భోజనం అయిపోయింది అన్నాడు బైరాగి. రేపు ఉదయం వరకు ఈ అన్నం ఉంటే పాడైపోతుంది. నువ్వు తిని అన్నాడు ప్రేమగా బైరాగి. ఏ దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అంటారు. మరి బైరాగిని దేవుడే పంపించాడు నాకోసం అనుకుని చిన్ని గాడు సంచిని తల కింద జాగ్రత్తగా పెట్టుకుని అన్నా రేపు జన్మభూమికి వెళ్లిపోవాలి! కాస్త నిద్ర లేపు అన్నాడు చిన్ని గాడు బైరాగితో. సరేలే పడుకో అంటూ ఇద్దరు పడుకున్నారు. 

అసలే దూర ప్రయాణం, దానికి తోడు అలిసిపోయిన శరీరం వెంటనే నిద్ర పట్టేసింది చిన్ని గాడికి. మెలుకువచ్చి చూసేటప్పటికి స్టేషన్లో పెద్దగా అలికిడి లేదు. పక్కన బైరాగి లేడు. చిన్ని గాడి తల కింద ఉన్న సంచి కనబడలేదు. ఒక్కసారిగా గుండె ఆగిపోయింది చిన్ని గాడికి. బోరున ఏడ్చాడు. ఓదార్చే నాథుడే లేడు. ఆ సంచి లోనే ఉంది తన జీవితం అంతా. దాచుకున్న సొమ్ము, చీపురు గుడ్డ ముక్క, అంతకంటే విలువైంది తండ్రి ఫోటో .. స్టేషన్ అంత అటు ఇటు చూసాడు. ఎక్కడైనా బైరాగి కనబడతాడేమో అని. బైరాగి లాంటి బట్టలు వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ ముఖం కనిపించలేదు. జీవితమంతా శూన్యంగా ఉన్నట్టు అనిపించింది. అమ్మ కోసం దాచుకున్న సొమ్ము. అమ్మ ప్రేమగా దాచుకున్న ఫోటో. కొన్ని నెలల కష్టపడితే సొమ్ము సంపాదించవచ్చు. కానీ ఫోటో ఎలా సంపాదించగలను ? అమ్మకు ఏం సమాధానం చెప్పగలను ?. మాలో కూడా దొంగలు ఉంటారా!. మమ్మల్ని అందరూ దొంగలుగా చూస్తారు. మా సొమ్ము దోచుకునే వాళ్ళు కూడా ఉన్నారా! విచిత్రంగా ఉంటుంది జీవితం.
 
అప్పుడు తల్లి మాటలు గుర్తుకు వచ్చే చిన్ని గాడికి. బతకడం అంటే అడుగులు వేస్తూ ముందుకు సాగిపోవడమే. ముళ్ళు ఉన్నాయని ఆగిపోవడం కాదు. రైలు చూడు జీవితంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అయినా తన ప్రయాణాన్ని ఆపదు .

 అలాగే మన జీవితం కూడా ఆ మాటలు గుర్తు చేసుకుని మళ్లీ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాడు చిన్ని గాడు.

 రైలు బోగి మనిషి జీవితంలో ఒక దశ లాంటిది. ఎక్కడైనా ఆగచ్చు. తిరిగి ముందుకు బయలుదేరవచ్చు. ఎవరు గమ్యం రాగానే వాళ్ళు దిగిపోతారు. కానీ చిన్ని గాడి లాంటివారు తమ ప్రయాణాన్ని ఎప్పటికీ అలా కొనసాగిస్తూనే ఉంటారు. అదే వారి బ్రతుకు తెరువు. ఇలాంటి వాళ్లు ఎంతో మంది రైలు మీద ఆధారపడి బతుకుతున్నారు. మనది గమ్యం తెలిసిన ప్రయాణం. వాళ్లది గమ్యం ఎరగని ప్రయాణం. వాళ్ల జీవితం అక్కడే ముగిసిపోతుంది. మన జీవిత ప్రయాణంలో ఎంతోమంది ఇలాంటి వాళ్లు. కనబడినప్పుడు చెయ్యి చాచినప్పుడు తోచింది ఇచ్చి వాళ్ల ప్రయాణం ముందుకు సాగనివ్వడమే మన కర్తవ్యం

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట