జీవితం
సాయంకాలం ఐదు గంటలు అయింది. రోడ్డంతా చాలా రష్‌గా ఉంది. రిక్షా చెట్టు కింద పెట్టి సవారి కోసం ఎదురుచూస్తున్న లక్ష్మికి ఒక జంట నడుచుకుంటూ వస్తూ కనిపించారు.
" అయ్యా రిక్షా కావాలా !అని అడిగింది లక్ష్మి. స్వప్న థియేటర్ కి ఎంత తీసుకుంటావు! అని అడిగాడు ఆయన. "ఇరవై రూపాయలు ఇవ్వండి అంది లక్ష్మి. ఆ దంపతులిద్దరూ సరేనని తల ఊపి రిక్షా ఎక్కి కూర్చున్నారు.
"కొంచెం తొందరగా పోనీయమ్మ! సినిమాకు టైం అయిపోతోంది," అన్నాడు రిక్షాలో కూర్చున్న వ్యక్తి.
"అలాగే అయ్యా! ట్రాఫిక్కు ఎక్కువగా ఉంది కదా!" అంటూ బలవంతంగా బండిని స్పీడ్‌గా లాగడానికి ప్రయత్నించింది లక్ష్మి.
బరువు లాగడం లక్ష్మికి కొత్త ఏం కాదు. బతుకు బండి నడపడానికి ఈ రిక్షాని, తాగుబోతు తండ్రి వదిలేసిన సంసారాన్ని లాగుతూనే ఉంది రోజు పాపం లక్ష్మి.
రిక్షా ఎక్కిన దగ్గర్నుంచి ఊరికే కంగారు పడిపోతున్నాడు రిక్షాలో కూర్చున్న వ్యక్తి. ఎంత తొందరపడితే ఏం లాభం? మార్గం ఉండాలిగా బండి నడవాలంటే.
స్కూలు, కాలేజీలు, సినిమా హాలు వదిలిన సమయం. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వాళ్లతో రోడ్ అంతా బిజీగా ఉంది.
"బండిలో కూర్చున్నాయన తొందర చూసి ఎందుకండి తొందరపడతారు? ఆడపిల్ల కదా పాపం! అయినా ఆటో ఎక్కుదాం అంటే డబ్బులు తక్కువ అవుతాయి అని రిక్షా ఎక్కించారు," అంది ఆ పెద్దమనిషి పక్కన కూర్చున్న ఆవిడ.
లక్ష్మికి ఇవేమీ కొత్త కాదు. రోజు రకరకాల ప్యాసింజర్లు ఎక్కుతారు. కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు కసురుకుంటారు. కొందరు గీసి గీసిబేరం ఆడతారు. మరికొందరు దిగేటప్పుడు కొంచెం ఎక్కువ ముట్ట చెబుతారు.
దారిలో ఆ రిక్షాలో కూర్చున్న ఆవిడ లక్ష్మి చరిత్ర అడుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఎంతమందికి చెప్పిందో! అయినా ఏం ఉపయోగం. ఎవరు పది రూపాయలు ఎక్కువ ఇచ్చిన పాపాన పోలేదు. అయినా పెద్దవాళ్లు అడిగినప్పుడు చెప్పకుండా ఉంటే పొగరు అనుకుంటారు అని అయిష్టంగానే దారి పొడుగునా తన కథ చెబుతూ, సినిమా హాలు ముందు రిక్షా ఆపింది లక్ష్మి.
ఆ దంపతులిద్దరూ రిక్షా దిగి ఇవ్వవలసిన బాడుగ కంటే యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చారు. ఆ నోటు తిరిగి ఇచ్చేస్తూ, "యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చారు అయ్యా!" అంది లక్ష్మి.
"లేదమ్మా, కావాలని ఇచ్చాము ఉంచుకో," అంటూ స్పీడ్‌గా వెళ్లే కార్లు, బస్సులు, ఆటోలు ఉన్న ఈ రోజుల్లో, "మేము నీ రిక్షా ఎందుకు ఎక్కామో తెలుసా?" అని అడిగారు దంపతులు.
లేదన్నట్లుగా తల ఊపింది లక్ష్మి.
"గమ్యం తొందరగా చేరడానికి అనేక ప్రయాణ సాధనాలు ఉన్నాయి ఈ రోజుల్లో. అలా తొందరగా చేరే ప్రయాణ సాధనాలు వచ్చి రిక్షా కార్మికుల పొట్ట కొట్టాయి. ఇలాంటి ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో తప్పనిసరిగా మనం రిక్షా మీద ఆధారపడే వాళ్లం. మరి ఇప్పుడు ఎవరూ రిక్షాలు ఎక్కడం లేదు. మరి ఆ కార్మికులు ఎలా బతుకుతారు అని ఎవరు ఆలోచించడం లేదు. మనిషిగా పుట్టినవాడు తోటి వ్యక్తి బాగోగులు ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు.
అందులో ముఖ్యంగా నా వయసు వాళ్లు జ్ఞానంతో మెలగాలి. ఇప్పుడు నాకు సినిమాకు ఆలస్యమైనా పర్వాలేదు. అందులో నువ్వు ఆడపిల్లవి ఇంత కష్టమైన పని చేస్తున్నావంటే నీ కథ వినక్కర్లేకుండానే వెనకాల ఎంత కష్టం ఉందో అర్థం అవుతుంది. నాకు బజార్లో కిరాణా షాప్ ఉంది. నేను కూడా ఒక మనిషి గురించి వెతుకుతున్నాను. నీకు ఇష్టమైతే ఇదిగో నా అడ్రస్," అంటూ జేబులోంచి కార్డు తీసి ఇచ్చాడు ఆ పెద్దాయన.
ప్రతిరోజు ఎంతోమంది రిక్షా ఎక్కుతుంటారు, దిగుతుంటారు. ఈ సవారి జీవితంలో ఒక మెట్టు ఎక్కించింది. జీవితానికి భద్రత కల్పించింది అనుకుని రెండు చేతులు జోడించి తన కర్తవ్యంలో మునిగిపోయింది లక్ష్మి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి