గురువు
ఆషాఢ శుద్ధ పౌర్ణమి – గురు పౌర్ణమి.
వ్యాస మహర్షి జన్మదినం. ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు వ్యాస మహర్షిని పూజించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. నాలుగు వేదాలను లోకానికి అందజేసిన వారు వ్యాస మహర్షి. అష్టాదశ పురాణాలను ఆయనే రచించారు. మానవ జీవితం నడవడికకు ఇవే ప్రమాణాలు.
అయితే నిత్య జీవితంలో, అంటే బాల్యం నుంచి అనేకమంది వ్యక్తులు మనకు మంచి మాటలు చెప్పి, మనల్ని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దేవారు ఉంటారు. వారందరూ కూడా మనకు గురువులే.
మొట్టమొదటి గురువు తల్లి.
మంచి చెడ్డలు నేర్పేది తల్లిదండ్రులు మాత్రమే. ప్రతి వ్యక్తి మీద తల్లి ప్రభావం చాలా ఎక్కువ. పిల్లలకు తల్లి దగ్గర చేరిక ఎక్కువగా ఉంటుంది. తండ్రి అంటే భయం. చిరు ప్రాయంలోనే తల్లి నీతి కథలు, రామాయణ మహాభారత కథలు చెబుతుంది. ఆ వయసులో తప్పుడు పనులు చేయకూడదని అర్థమవుతుంది. మనకు జ్ఞానం వచ్చే వరకు మన నడవడికను తీర్చిదిద్దేది తల్లే. ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను కూడా తల్లి దగ్గర నుంచే తెలుసుకుంటాము.
కొంత వయసు వచ్చిన తర్వాత పాఠశాల చేరినప్పుడు
ఓనమాలు దగ్గరుండి దిద్దించి, భవిష్యత్తుకు పునాది వేసేవారు ఉపాధ్యాయులు. అక్షరాన్ని కనుక మనం నేర్చుకోకపోతే, ఎవరు బ్రతుకు బండిలో ముందుకు పోలేరు. అజ్ఞానాన్ని దాటలేరు. ప్రతి గురువు కూడా తన శిష్యుడు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు.
కొంతమంది గురువు దగ్గర విద్య నేర్చుకుని, గురువును మించిన శిష్యులుగా తయారైన వారు అనేకమంది ఉన్నారు.
గురువు విద్య నేర్పకపోయినా, గురువునే దైవంగా భావించి విద్య నేర్చుకున్న వాళ్లు కూడా చరిత్రలో చాలామంది ఉన్నారు. దత్తాత్రేయ స్వామికి 24 మంది గురువులు. చుట్టూ ఉండే ప్రకృతే ఆయనకు గురువు. ఇంకా ప్రతి వ్యక్తి దగ్గర నుంచీ ఎంతో కొంత నేర్చుకోవచ్చు. వారు కూడా మనకు పరోక్షంగా గురువులే.
గురువుగారి అంతిమ లక్ష్యం శిష్యుల అభివృద్ధి.
ప్రతిఫలాపేక్ష లేకుండా ఎంతోమంది వేద విద్యార్థులను తయారుచేసిన మా గురువుగారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు తాతపూడి రామకృష్ణాధులు గారిని ఈ సందర్భంగా తప్పకుండా గుర్తు చేసుకోవాలి. వీరు తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామ వాస్తవ్యులు.
ఈ గురువుగారు అనేకమంది శిష్యులకు వేద విద్యను బోధించడమే కాకుండా
బ్రతుకుతెరువు మార్గం కూడా చూపించారు. ఇలాంటి గురువులు చాలా అరుదుగా కనిపిస్తారు. నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే గురువులను తప్పకుండా మనం ఈరోజు స్మరించుకోవాలి. ఎందుకంటే, పురాణం చదివి అర్థం చేసుకునే శక్తి ఎవరికీ లేదు. సమయం కూడా సరిపోవడం లేదు.
వీరు నిత్యం ఏదో ఒక ఛానెల్ ద్వారా మనకు పురాణాలను వినిపిస్తున్నారు.
దాంతో మనకు ఆ రకంగా ఎంతోకొంత పురాణాల్లోంచి మంచి విషయాలను తెలుసుకునే అవకాశం లభిస్తోంది. ప్రతి మనిషి జీవితంలోను గురువు పాత్ర చాలా ముఖ్యమైనది. మనిషి నడవడికను ప్రభావితం చేసేది గురువే.
మంచి చెడులను విశ్లేషించేది మనస్సు.
మన మనస్సు మనకు పెద్ద గురువు. మరొకసారి గురువులందరికి నమస్సుమాంజలులు
రచన: మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
📞 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి