అమ్మ కన్నీళ్లు
అమ్మ కన్నీళ్లు అమెరికా నుండి చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చిన రాజశేఖర్ ని తల్లి సీతమ్మ చూసి ఒక్కసారి అలా ఉండిపోయింది. కొడుకును గట్టిగా కౌగిలించుకుని తల మీద ముద్దు పెట్టుకుంది . ఆ సమయంలో తల్లి సీతమ్మ కళ్ళలో తడి కనిపించింది రాజశేఖర్ కి. అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు రాజశేఖర్. కన్నీళ్లు కార్చవలసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆమె జీవితంలో. రాజశేఖర్ తండ్రి పోయినప్పుడు, అత్తవారు ఆస్తి ఇవ్వకుండా ఏడిపించినప్పుడు, ఒక పూట తిని రెండో పూట మంచినీళ్లు తాగి పడుకున్నప్పుడు, రాజశేఖర్ తండ్రి చేసిన అప్పులు తీర్చలేకపోతే అప్పులు వాళ్ళు ఇంటి మీద పడి గొడవ చేసినప్పుడు ఎప్పుడు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనేది. రాజశేఖర్ తండ్రి పోయేటప్పటికి సీతమ్మ వయసు ముప్పై సంవత్సరాలు. సీతమ్మ తల్లిదండ్రులతో సహా అందరూ రెండో పెళ్లి చేసుకోమని ఎంత బలవంత పెట్టినప్పటికీ ఎప్పుడూ ఆమె కళ్ళు రాజశేఖర్ మీదే ఉండేవి. సీతమ్మ తల్లిదండ్రులు రాజశేఖర్ ని దత్తత తీసుకుంటామని చెప్పినప్పటికీ సీతమ్మ ససేమేరా ఒప్పుకోలేదు. చిన్నప్పుడు రాజశేఖర్ ఆడుకుంటూ క్రింద పడిపోయినప్పుడు ఏమి కంగారు పడకుండా ఏడవకూడదు అంటూ ధైర్యం చెప్పే...