డాక్టరు

🏥 డాక్టరు 💊 

అర్ధరాత్రి 12 గంటలు అయింది. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి నిద్ర పట్టక అటు ఇటు మంచం మీద దొర్లుతున్నాడు డాక్టర్ శ్రీనివాస్ ప్రముఖ కార్డియాలజిస్ట్. ఇంతలో వీధిలోంచి అంబులెన్స్ శబ్దం వినిపించింది. ఎవరికి ఎలా ఉందో పాపం! అనుకున్నాడు. రోజు ఎన్నో వేల మందికి గుండె వైద్యం చేసి అంబులెన్సులు సిరంజిలు శతస్కోపులు మందులు ఆపరేషన్ థియేటర్లు ఇంటెన్సు కేర్ యూనిట్లు స్పెషల్ వార్డు మధ్య బతుకుతున్నా , అంబులెన్స్ శబ్దం అంటే డాక్టర్ కైనా భయం అనిపిస్తుంది. అంటే ఎవరో ప్రమాదంలో ఉన్నారని సూచన ఇస్తోందన్నమాట ఆ శబ్దం. 

రంగరాయ మెడికల్ కాలేజీ డాక్టర్ క్వార్టర్స్ లో కాపురం ఉంటుంన్న డాక్టర్ శ్రీనివాసు కి ఆ అంబులెన్స్ తమ క్వార్టర్స్ లో లో నుంచే వెళ్లడం గమనించాడు కిటికీలోంచి. ఎవరబ్బా. అనుకుంటూ ఆలోచించసాగాడు. ఇంతలో టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. హలో అనగానే అవతల నుంచి క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ రమేష్ సార్ మన డాక్టర్ శశాంక్ గారికి పెయిన్ వచ్చిందిట. ఇప్పుడు కాజువాలిటీలో ఉన్నారు కండిషన్ సీరియస్ గా ఉంది. సార్ మీరు వెంటనే రావాలి అంటూ గబగబా నాలుగు ముక్కలు చెప్పేసాడు. వెంటనే మళ్ళీ ఫోన్ చేసి చేయవలసిన ట్రీట్మెంట్ తీసుకోవలసిన జాగ్రత్తలు గబగబా చెప్పి కారు దగ్గరకు పరిగెత్తాడు డాక్టర్ శ్రీనివాస్

సాధారణంగా రోగులు ఇటువంటి స్థితిలో ప్రతిరోజు హాస్పిటల్ కి వస్తుంటారు. కానీ డాక్టర్లు ఇటువంటి కేసులు చాలా చూసి ఉంటారు. కానీ నిత్యం మన మధ్య తిరిగే మన మనిషికి ఏదైనా అయితే డాక్టర్ కూడా సామాన్య మానవుడు అయిపోతాడు. అలా ఉంది ఆ డ్యూటీ డాక్టర్ రమేష్ పరిస్థితి. క్యాజువాలిటీ అంటేనే అలా ఉంటుంది. కొన ఊపిరితో ఎన్నో వేల ఆశలతో ఆసుపత్రికి వచ్చేవాళ్ళు, వచ్చిన తర్వాత వైద్యం ప్రారంభించకుండానే కన్ను మూసే వాళ్ళు, తాము ఎక్కడ ఉన్నాము ఎలాంటి స్థితిలో ఉన్నాము నమ్ముకున్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఏమీ తెలియని అయోమయ స్థితిలో పోయిన వాళ్ళు అది అంతా ఒక భయంకరమైన వాతావరణం. అక్కడ ఉద్యోగం చేసే వార్డుబాయి దగ్గరనుంచి పెద్ద డాక్టర్ గారు వరకు నిత్యం అది ఒక యుద్ధభూమి లాంటిది. కొంతమంది వచ్చిన పది నిమిషాల్లోనే మొహం మీద చిరునవ్వు తెచ్చుకునే వాళ్ళు కొంతమంది రెండు సంవత్సరంలైనా కన్ను తెరవని వాళ్ళు ఎంతోమంది నీ నిత్యం చూస్తూనే ఉంటారు ఆ డాక్టర్లు . రోగి చెయ్య పట్టుకుంటే కాసేపట్లో కన్నుమూస్తాడని తెలుస్తుంది 
అయినా కర్మయోగిలా డాక్టర్లు తమ బాధ్యతను నిర్వర్తిస్తూ పోతుంటారు. బహుశా అది వృత్తి ధర్మం కానీ భగవద్గీత చెప్పింది కూడా అదే. నీ విధిని నిర్వర్తించు . ఫలితం దైవానికి వదిలే యి. ఆ సూత్రం వాళ్ళు నమ్ముతారో లేదో తెలియదు కానీ ప్రాణం కాపాడ్డానికి నిత్యం పోరాడుతూనే ఉంటారు. డాక్టర్లు అపర ధన్వంతరి అంటారు. ప్రాణాన్ని బాగు చేయగలం కానీ ప్రాణం పోయలేo. అది మన చేతుల్లో లేదు అంటారు డాక్టర్లు. 

అంటే మన ప్రాణo అనేది ఏదో ఒక అదృశ్య శక్తి చేతుల్లో ఉందని మనకు అర్థమవుతుంది. లక్షల ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నా ప్రాణం పోయలేము అంటారు డాక్టర్లు. ఏమీ లేని నిరుపేదకి ఆయుర్దాయమనే ఆయుధం ఉంది అందుకే అంత పెద్ద రోగాన్ని జయించాడు మేము కాస్త చెయ్యి అడ్డు పెట్టాము అంటారు అంత పెద్ద చదువు చదువుకున్న డాక్టర్.

కారు స్టార్ట్ చేసి స్పీడ్ గా హాస్పిటల్ వైపుకు పోనిచ్చాడు శ్రీనివాస్ . గబగబా కాజువాలిటీ వార్డులోకి వెళ్లి చేస్తున్న ట్రీట్మెంట్ ఒకసారి చూసి బ్లడ్ ప్రెషర్ ఒకసారి చెక్ చేశాడు. హైబీపీ ఉంది. వెంటనే బీపీ తగ్గడానికి ఇంజక్షన్ ఇచ్చి పల్స్ చెక్ చేస్తూ కూర్చున్నాడు. కార్డియాలజీలో విశేష అనుభవమున్న శ్రీనివాసు వెంటనే యాంజియోగ్రాము యాంజియో ప్లాస్టి ఒకేసారి చేసేసాడు. రెండు స్టంట్ లు పడ్డాయి. పేషంటు పరిస్థితి బాగానే ఉంది. అప్పటికి రాత్రి మూడు గంటలు అయింది. తొలిరోజు రాత్రి నిద్ర లేదు. ఈరోజు సరే సరే. రేపు ఉదయం మళ్లీ డ్యూటీ కి రావాలి. అందులో కార్డియాలజీ డాక్టర్ ఏమాత్రం అలక్ష్యం చేసిన ప్రాణాలతో పని. ప్రతిరోజు ఇంచుమించుగా రాత్రి ఏదో ఒక కేసు వస్తూనే ఉంటుంది. ఒక కేసు ఒక కేసు భిన్నంగా ఉంటుంది. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

పేషంటు బంధువులకి నిజాలు ఓపిగ్గా పూసగుచ్చినట్లు చెప్పాలి. అంత ఓపిగ్గా ఉండాలంటే ఎంత శక్తి ఎంత సహనం ఉండాలి. డాక్టర్ గారు బాగా చూశారు. బాగా వైద్యం చేస్తారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్లు తీస్తుంటారు. అడిగిన వాటికి ఓపిగ్గా సమాధానం చెప్తారు అంటూ ఎంతోమంది పేషెంట్లు డాక్టర్లకి కిరీటాలు తగిలించిన వాళ్లకుండే ఒత్తిడి ఎవరికి ఉండదు. ఎన్నో లక్షల ప్రాణాలు చేతిలో ఉంటాయి. ఏ మాత్రం పొరపాటు జరిగిన జీవితకాలం శిక్ష అనుభవించవలసి ఉంటుంది.

అలా పేషెంట్ స్థిమిత పడిన తర్వాత బయటకు వచ్చి డాక్టర్ శశాంక్ గారి భార్యతో అన్ని విషయాలు విశదంగా చెప్పాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. ఒక నాలుగైదు రోజులు హాస్పిటల్ లోనే ఉంచుదాం అంటూ సమాధానం చెప్పి ఇంటికి వచ్చేటప్పటికి తెల్లవారుజామున 5:00 అయింది. అలా వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇంటికి వచ్చాడు డాక్టర్ శశాంక 

ఎంత డాక్టర్ అయినా డాక్టర్ శశాంక ఆ షాక్ నుంచి ఇంకా తేలుకోలేకపోయాడు. రోజు భార్య ధైర్యం చెబుతూ మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నించేది. ఒక నెల రోజుల తర్వాత బాగా కోలుకున్న తర్వాత మీరు కూడా అంత పెద్ద హార్ట్ స్పెషలిస్ట్ కదా మీకు హార్ట్ ఎటాక్ వస్తుంది అని ముందుగా తెలియదా అంటూ అమాయకంగా ప్రశ్నించింది. 

డాక్టర్ శశాంక ఒకసారి నవ్వు వచ్చింది. చూడు మేము వైద్యులము మాత్రమే. జ్యోతిష్కులం కాదు. ముందుగా జరగబోయేది చెప్పడానికి. వాన రాకడ ప్రాణం పోకడ గురించి ఎవరికి తెలుస్తుంది. అలాగే హార్ట్ ఎటా క్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుస్తుంది. వచ్చిన తర్వాత వైద్యం చేయగలం. అప్పుడున్న ప్రమాదాన్ని పసిగట్టి చెప్పగలం. రోగం అనేది పాప కర్మల ఫలితం. మేము పనిచేసే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండదు. భయంకరంగా ఉంటుంది. రోజు ఎన్నో వేలమంది నొప్పితో కేకలు వేసే పేషెంట్లు, ఈ లోకం విడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ బంధువుల ఏడుపులు, ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణిని తీసుకురావడానికి ప్రయత్నించే వాళ్ళ ఆర్తనాదాలు, ప్రమాదం అంచున ఉన్నవాళ్లు, శరీరంలో భయంకరమైన రోగాలు ఉన్నా తెలియని వాళ్ళు, లక్షలు ఖర్చు పెడతాము రోగాన్ని మీ చేత్తో తీసి వేయమని ప్రార్థించే వాళ్ళు, ఒంటిలో ఉన్న క్యాన్సర్ రోగం ముదిరిపోతున్న చేతిలో నయా పైసా లేక వైద్యం చేయించుకోలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు కూర్చోలేని వాళ్ళు బాధతో అరిచే వాళ్ళు, పేదవాళ్లు, ఇలా ఎన్నో రకాల సమస్యలు మా బుర్ర నిండా మునిగిపోయి ఉంటాయి. రోజు అదే రకమైన సమస్యలు. చుట్టూ భయంకరమైన వాతావరణం. నిజాలనిగ్గు తేల్చడానికి ఒక్కొక్కసారి కన్నతల్లిదైనా ప్రాణమిచ్చే స్నేహితుడిదైనా శరీరం ముక్కలు ముక్కలుగా కోసి అతుకు పెట్టవలసిన బాధ్యత మాదే. ఆ గది వైపు చూస్తే హృదయం ద్రవించిపోతుంది. ఇంటి దగ్గర ఏమి ఇబ్బందో ఏమో కన్నుమూసిన ఆ రాత్రి ఆ ఇనప పెట్టెలో అక్కడే ఉంచవలసిన పరిస్థితి ఉన్నవాళ్లను చూసి మనసు ఏదోలా అయిపోతుంది. చుట్టూ ఉత్సాహకరమైన వాతావరణం ఉండదు. మనసుకి ఆహ్లాదo ఉండదు. రోగులందరికీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి అని చెప్పే మేము మా మనసులు ప్రశాంతంగా ఎలా ఉంచుకుంటాం. ఇన్ని సమస్యల మధ్య. మా దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకునే వాళ్ళది ఒక రకమైన ఒత్తిడి. మాది ఇంకొక రకమైన ఒత్తిడి అంటూ చెప్పుకొచ్చిన భర్త వైపు కన్నీళ్ళతో చూసింది డాక్టర్ శశాంక్ భార్య. సంఘంలో కావలసినంత పేరు చేతినిండా డబ్బు ఉన్నాయనుకుని సంతోష పడుతున్నాం కానీ డాక్టర్ బుర్రలో ఇన్ని సమస్యలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది ఆమెకి. 

వెంటనే శశాంక్ భార్య ఒక నిర్ణయానికి వచ్చింది. పిల్లలు సెటిలైపోయారు కదా. మీరు ఇంకా ఏమి ఉద్యోగం చేయొద్దు. వెంటనే రాజీనామా చేసేయండి. లేదా లాంగ్ లీవ్ పెట్టండి. ఈ ఒత్తిడిలో వద్దు మనకి అంటూ ఏడ్చింది. చూడు ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్ని వృత్తి మానేయమనడం ఎంతో తప్పు. నా ఒక్కడి వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయి. భయపడకు. అన్నిటికీ దేవుడున్నాడు అంటూ గూట్లో ఉన్న సాయిబాబా ఫోటోకి నమస్కారం చేసుకున్నాడు.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట