మావగారి నాటకం

మావ గారి నాటకం.

 ఊరంతా దీపావళి సంబరాలతో హడావుడిగా ఉంది. బాణసంచా కాల్పులతో ఊరంతా మారుమోగిపోతో oది.గత సంవత్సరం నాన్న ఎంత హడావుడి చేశాడు దీపావళి నాడు. పిల్లలతో పోటీపడి బాణసంచా కాల్చుకున్నాడు. కొత్త బట్టలు కట్టుకొని చిన్నపిల్లాడి లాగా మతాబులు చిచ్చుబుడ్లు కాకరపువ్వొత్తులు పాము బిళ్ళలు మనవలతో పోటీపడి కాల్చుకున్నాడు.

దీపావళి నాడు ఆయన పుట్టినరోజు. పిల్లలు అంటే ఎంత సరదా. ఒక్కరోజు సెలవు ఉన్నా సరే రమ్మని పదేపదే ఫోన్లు. అంత దూరం నుంచి ఏం వస్తాము నాన్న అంటే లేదమ్మా పిల్లల సరదా మనమే తీర్చాలంటూ వచ్చేవరకు ప్రాణం తినేసేవాడు. ఇంట్లో అందరికీ బట్టలు, బాణసంచాలు ,పిండి వంటలు ,ఇంటి నిండా దీపాలు ,గుమ్మానికి మావిడాకులు తోరణాలు అన్నీ తనే దగ్గరుండి చూసుకునేవాడు." ఇవన్నీ ఆడవాళ్ళ పనులండి మీకెందుకు మీరు మనవళ్ళతో ఆడుకోండి అని అమ్మంటే కాదు నేను సహాయం చేస్తాను అంటూ అన్నిట్లోనూ ఉండేవాడు.
అసలు విషయం అది కాదు ఎక్కడైనా అమ్మ సరిగా చేయదేమో అని అనుమానం. పిల్లలు అంటే ప్రాణం.

 మరి ఈ ఏడాది దీపావళి కి అప్పుడే మూడు నెలలు అయిపోయింది. తారాజువ్వల హఠాత్తుగా పైకి వెళ్ళిపోయాడు అని సుమతి మనసులో బాధపడుతూ కంటి నుండి జారిన నీళ్లను తుడుచుకుంటూ బజార్ నుంచి వచ్చిన భర్త రమేష్ పిలిచిన పిలుపుకి వస్తున్నానండి అని సమాధానం చెప్పి హాల్లోకి అడుగు పెట్టింది. 
సుమతికి పెళ్లి అయ్యి ఆరేళ్లయింది . భర్త రమేష్ స్టేట్ గవర్నమెంట్లో పెద్ద ఉద్యోగి. ఆ ఇంట్లో సుమతి భర్త అందరికంటే పెద్దవాడు. రమేష్ కి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లిళ్ళు. అందరూ పెళ్లిళ్లు అయ్యి ఎవరి కాపరాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ఏడాది సుమతి మామ గారికి డబ్బై ఏళ్ళు వచ్చిన సందర్భంగా అందరూ దీపాల పండక్కి రమేష్ ఇంటికి వచ్చారు. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ గదిలో కూర్చుని ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నారు తప్పితే ఒకళ్ళు వంటింట్లోకి సుమతికి సాయం చేసిన పాపాన పోలేదు. మామూలుగా పండుగ అంటేనే బోల్డంత పని. దానికి తోడు ఇంటి నిండా చుట్టాలు. ఆ పని అంతా ఒకర్తి ఎలా చేస్తుంది ? అని జ్ఞానం ఎవరికీ లేదు. అందరూ ఆ తండ్రి కడుపున పుట్టిన వాళ్లే ఫంక్షన్ జరిగేది తండ్రి కోసం. ఎవరు బాధ్యతలు తీసుకోకుండా వేళకు అన్నీ అందిస్తే కబుర్లు చెప్పుకుని కూర్చుంటున్నారు.

సుమతి భర్త రమేష్ రెండు నెలల ముందు నుంచి ఆ ఫంక్షన్ ఏ విధంగా చేయాలో సుమతికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నాడు. ఒక పక్క తండ్రిపోయిన బాధ మరొకపక్క ఇంటి కోడలుగా బాధ్యత ఆ రెండింటి మధ్య నలిగిపోతోంది సుమతి. భర్త చెబుతున్న ఫంక్షన్ ఏర్పాట్లకి తల ఊపుతోంది తప్పితే మనసు మనసులో లేదు. మాటిమాటికి తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు వస్తున్నాయి. సుమతిది రక్తసంబంధం .

 రమేష్ కి మామగారు పట్ల అంత అభిమానం ఎలా వస్తుంది? రమేష్ అసలు మామగారు పోయిన సందర్భం మర్చిపోయి ఎంతో వేడుకగా ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తున్నాడు. మనసు బాగున్న బాగా లేకపోయినా బలవంతంగా అయినా తన బాధ్యత నిర్వర్తించాలి పెద్ద కోడలుగా సుమతి. లేదంటే తప్పుగా అనుకుంటారు. అందరికీ తెలుసు తండ్రి పోయిన బాధ. అయినా ఒక తరం వాళ్లకి పంతాలు తప్పితే మనసు అర్థం చేసుకోలేరు. మామూలుగా అయితే అసలు పండగలు చేసుకోవడానికి మనసు రావడం లేదు సుమతికి. 

అసలు ఆడపిల్ల జీవితమే అంత. ఒక్కసారి పెళ్లి చేసుకుని ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చిన తర్వాత పుట్టింటి వారి బాధలు, కన్నీళ్లు, కష్టాలు తీర్చే అవకాశం చాలా తక్కువ మంది ఆడపిల్లలకి ఉంటుంది. ఆ ఆడపిల్ల ఒక కోడలిగా అత్తవారింటికి అంకితం అయిపోతుంది. పుట్టింటికి చుట్టపు చూపుగా వెళ్లడం తప్పితే మరో అవకాశం ఉండదు.
 ఇంక పెళ్లి అయిన ఆ పిల్ల లోకమే వేరు. ఆ హడావుడిలో పడిపోతుంది. చిన్నప్పుడు నాన్న ఎంత ప్రేమగా పెంచాడు. తండ్రి చనిపోయే వరకు ప్రతిరోజు ఫోన్ చేయకపోతే ఊరుకునే వాడు కాదు. నెలకు ఒకసారైనా వచ్చి చూసి వెళ్లేవాడు. "మాటిమాటికి కూతురింటికి వెళ్ళకూడదు వాళ్ల అత్తవారు ఏదైనా అనుకుంటారు అంటూ అమ్మ చెప్పిన మాటలు వినేవాడు కాదు. పెళ్లయి వెళ్ళిపోతే అది మన పిల్ల కాకుండా పోతుందా అంటూ అమ్మని కోప్పడుతుండేవాడు.

అక్కడ పుట్టింట్లో తమ్ముళ్లు అమ్మా నాన్న గురించి ఏడుస్తుంటే ఆ తండ్రికి పుట్టిన పెద్ద కూతురు ఇలా ఫంక్షన్లో పాల్గొనడం ఎందుకో సుమతికి నచ్చట్లేదు. అయినా మనసులో ఉన్న విషయం చెప్తే ఎవరు ఒప్పుకుంటారు. 

ఆ ఇంట్లో ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? అని ఆలోచిస్తూ హాల్లోకి అడుగు పెట్టిన సుమతికి భర్త చూపిస్తున్న కొత్త బట్టలు, బాణసంచా ,స్వీట్లు ఇష్టం లేకుండానే తీసుకుని గదిలో సర్ది పెట్టింది. భర్త తీసుకొచ్చిన మతాబులు చూసి చిన్నప్పుడు నాన్న తన చెయ్యి పట్టుకుని కాల్పించిన దృశ్యం కళ్ళ ముందు మెదిలింది. పెద్ద గెడ కర్రకు కట్టి కాకర పువ్వొత్తుని చాలా రోజుల వరకు అలాగే కాల్పించేవాడు. ముందుగా పుట్టిన పిల్ల కాబట్టి ఎంతో గారాబంగా పెంచాడు. సుమతికి ఇష్టమని తొక్కుడు లడ్డు చేయమని అమ్మకి పదేపదే చెప్పేవాడు. 

చనిపోయిన వాళ్ళ తో గల అనుభవాలు ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ ఏదో రకంగా గుర్తుకొస్తూనే ఉంటాయి.
హాల్లోకి వచ్చిన సుమతి మొహం చూసి రఘురామయ్యగారికి అంటే సుమతి మామ గారికి ఎందుకో బాధగా అనిపించింది. ఎప్పుడు హుషారుగా ఉండే పిల్ల ఇలా అయిపోయింది. ఆ అమ్మాయి ఎందుకు అలా ఉందో అందరికీ తెలుసు

 ఒక ఇంట్లో కుటుంబ సభ్యురాలికి సమస్య వచ్చినప్పుడు మనం ఇలా పండగలు జరుపుకోవడం ఎంతవరకు సబబు అని మనసులో అనుకొని ఇన్ని రోజులు ఇలాంటి ఆలోచన రానందుకు తనని తానే తిట్టుకున్నాడు. ఎవరికైనా కన్నతండ్రి అంటే ఒకటే. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి. అప్పటికే స్థానికంగా ఉండే స్నేహితులందరినీ ఆహ్వానించాం. అందరికీ సమాధానం ఏమి చెప్పాలి. ఏదో ఒకటి ఆలోచించాలి.

 ఒక్కసారిగా కొడుకు మీద కూడా కోపం వచ్చింది. భార్య మనసు అర్థం చేసు కోనందుకు. ఇదే విషయం రఘురామయ్య తన భార్యతో చెప్తే కొట్టిపడేసింది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అంతమాత్రాన మన సరదాలు ఆపకుంటామా. 

వచ్చే ఏడాదికి ఎలా ఉంటామో ఏమో అని చెప్పి పట్టించుకోలేదు రఘు రామయ్య భార్య అన్నపూర్ణమ్మ.
మిగిలిన కుటుంబ సభ్యులు కూడా మాకు మళ్లీ సెలవులు దొరకవు అంత దూరం నుంచి రావడం అంటే కష్టం అంటూ ఫంక్షన్ ఆపడానికి ఒప్పుకోలేదు.

ఇంతలో వీధిలో కారు ఆగిన చప్పుడయింది. అప్పుడే ఎవరబ్బా ఫంక్షన్ కి వచ్చింది అనుకుంటూ వీధిలోకి తొంగిచూసిన కుటుంబ సభ్యులు రఘురామయ్య స్నేహితుడు డాక్టర్ రాజగోపాల్ కారు దిగుతూ కనిపించాడు. కార్ దిగుతూనే సరాసరి ఇంట్లోనికి వచ్చి రఘురామయ్య గారిని పరీక్ష చేయడం ప్రారంభించాడు. ఇంతలో రమేష్ ఏమైంది నాన్నగారికి అంటూ ప్రశ్నించాడు డాక్టర్ని . ఏమి లేదు కొంచెం బిపి ఎక్కువగా ఉంది ఒక రెండు రోజులు హాస్పిటల్ లో ఉండాలి పదండి తీసుకెళ్దాం అంటూ డాక్టర్ చెప్పిన మాటలకు నిర్ధాంత పోయాడు రమేష్. 

అదేమిటి మనకు ఏమి చెప్పకుండా డైరెక్ట్ గా డాక్టర్ గారికి ఫోన్ చేశాడు తండ్రి అనుకుని రఘురామయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత డాక్టర్ రాజగోపాల్ చెప్పిన మాటలు విని నవ్వుకున్నాడు రమేష్. ఇదంతా నాటకం తెలుసుకొని నవ్వుకున్నారు కుటుంబ సభ్యులు.

చిన్నపిల్లలు చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళడానికి ఎన్నో సాకులు చెబుతుంటారు. కడుపు నొప్పి వస్తోంది అని కాలు నొప్పి వస్తోంది అని రకరకాల కారణాలు చెబుతుంటారు.
 అవన్నీ అబద్ధాలు మనకు తెలుసు. రోజు కడుపు నొప్పేనా అని కోప్పడతాము. కానీ రఘురామయ్య లేటుగా గ్రహించిన తన తప్పుని సరిదిద్దడానికి వేరొక కారణం దొరకలేదు పాపం. ఆ వయసులో ఆయనకు అనారోగ్యం వచ్చిందంటే అందరికీ భయమే. నిజానికి ఏ అనారోగ్యం లేదు. కేవలం ఒక కుటుంబ సభ్యురాలని సంతోషపెట్టడం కోసం చేసిన పని. ఇలాంటి మామగారు ఉండడం ఎంత అదృష్టం ఈ కాలంలో.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం