పెళ్లి కాజా
పెళ్లి కాజా.
"అయ్యా గోపాలకృష్ణ గారు పెళ్లి వారిని భోజనానికి పిలవవచ్చునా! వంట సంగతి ఏమిటి? అంటూ అడిగిన కన్యాదాత చలపతిరావుకి నిరభ్యంతరంగా పిలవచ్చు. మీరు చెప్పిన వంటలన్నీ రెడీగా ఉన్నాయి అన్నాడు గోపాలకృష్ణ.
బంగాళదుంప కూర, వంకాయ జీడిపప్పు సాంబారు అప్పడాలు వడియాలు కంది పొడి ఆవకాయ వీటన్నిటితో పాటు కాజాలు, జిలేబి వడ్డించండి. పిండి వంటలన్నీ ఆ మూల గదిలో పెట్టించాను. వడ్డనకి ఊరి వారు సరిపోతారా! మా కుర్రాళ్లను కూడా పంపించినా అవసరమైతే నేను కూడా వస్తాను. మీరు బంతి వేసే లోపు నేను అన్నం వార్చుతాను అంటూ గాడి పొయ్యి దగ్గర స్టూల్ మీద కూర్చున్న వంట బ్రాహ్మణుడు గోపాలకృష్ణ చెప్పాడు చలపతిరావు తో.
సదరు గోపాలకృష్ణ వంటలు వండడంలో పిండి వంటలు చేయడంలో ఆరితేరిన వ్యక్తి. నల్లగా పెద్ద బొజ్జతో పొట్టిగా ఉండి ఎర్రటి అంగవస్త్రం కట్టుకుని నలుగురు కుర్రాళ్లను వెంటబెట్టుకుని ఎంతటి పెళ్లి వంట అయిన రుచికరంగా శుభ్రంగా తయారుచేసే ఆ గోపాలకృష్ణ కాకినాడ నివాసి.
ఆ ఊర్లో చిన్న తోరణం కడితే చాలు వంటకి గోపాలకృష్ణ నే పిలిచేవారు.అంత అలవాటు పడిపోయారుఆ ఊరి జనం గోపాలకృష్ణ వంటకి.
గోపాలకృష్ణ వంటలో ఉన్నాడంటే నిశ్చింతగా ఉంటాడు యజమాని. కావలసిన సరుకులు అన్ని అందించేస్తే అందరితో సరదాగా నవ్వుతూ ఉంటూ ఆ కార్యాన్ని గట్టెకిస్తాడు గోపాలకృష్ణ. మనిషి అలా లావుగా కనపడతాడు కానీ పగటిపూట అసలు అన్నం తినడు.కాఫీలు టీలు టిఫిన్ కూల్ డ్రింకులు మజ్జిగ కొబ్బరి బొండాలతో కడుపు నింపుకునేవాడు గోపాలకృష్ణ. రాత్రిపూట కాస్త మజ్జిగ అన్నం. ఎంతసేపు ఆ గాడి పొయ్యి దగ్గర కూర్చున్న ప్పుడు తగిలిన వేడికి అన్నం తినబుద్ధి కాదట ఆ వంట బ్రాహ్మణులకి. అందుకే ఆ యజమాని చలపతిరావు ఎంత హడావుడిలో ఉన్నప్పటికీ వాళ్లకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించేస్తాడు ముందుగానే.
ఇంకా గోపాలకృష్ణ కాజా చేసాడంటే కోటయ్య గారు ఎందుకు పనికిరారేమో. అందుకే పెళ్లిళ్లకి తప్పనిసరిగా గోపాల కృష్ణ చేత పాకం కాజాలు తయారు చేయించుకుంటారా ఊరు జనం.
తయారుచేసిన పిండి వంటల్ని అక్కడ కూర్చున్న పిల్లలకి రుచి చూపించడం గోపాలకృష్ణ అలవాటు. ఆ అలవాటు కొద్ది ఒకసారి అప్పుడే తయారుచేసి పెట్టి మైసూర్ పాక్ ముక్కలన్నీ డబ్బాలో పెట్టి మిగిలిన పొడిని ఆ పళ్లెంలో ఉంచడంతో అప్పుడు వచ్చిన ఒక అబ్బాయి గబగబా నోట్లో పెట్టుకుంటే నోరు కాలిపోయింది. అలాంటి సంఘటనలు ఎన్నో. ఎప్పటిలాగే రెండు రోజులు ముందుగా వచ్చి కావలసిన స్వీట్లు అన్నీ తయారుచేసి ఓ మూల గదిలో పెట్టించాడు గోపాలకృష్ణ.
ఆ పల్లెటూర్లో పెళ్లంటే ఊళ్లో వాళ్ళందరూ తమ ఇంట్లో పెళ్లి లాగే తలో చెయ్యి వేసి కార్యాన్ని గట్టెక్కించేవారు. అది ఆ ఊరు కట్టుబాటు.
సదరు కన్యాదాత కూడా ఆ ఊర్లో ఏ శుభకార్యానికైనా ముందుండి దగ్గరుండి నడిపించేవారు. అంతటి సేవా తత్పరుడు ఆ ఇంటి యజమాని. అలాంటి చలపతిరావు ఇంట్లో పెళ్ళికి పాపం సాయం చేద్దామని ఊర్లోని కుర్ర కారు అంతా బయలుదేరి వచ్చారు.
అలా పెళ్లికి సాయం చేద్దామని వచ్చిన కుర్రకారులో మన కామేశ్వరరావు ఒకడు. మనిషి మంచోడే హడావుడి ఎక్కువ. అన్నిటికీ భయం. తయారుచేసిన పిండివంటల గది తాళాలు ఆ కామేశ్వరరావుకి ఇచ్చాడు చలపతిరావు. ఎవరింట్లో పెళ్లయినా పిండి వంటలు గది తాళాలు కామేశ్వరరావు దగ్గరే. ఎవరి హడావుడిలో వాళ్ళు ఉంటే కామేశ్వరరావు పిండివంటలన్నీ చీమల పట్టకుండా మందు జల్లడం ,డబ్బాలో జాగ్రత్తగా నిల్వ చేయడం ,నిలవచేసిన సరుకుని అందరూ చేతులు పెట్టకుండా శుభ్రంగా చేతులు కడుక్కుని వడ్డనకి అందించడం చాలా శ్రద్ధగా చేస్తాడు.
పెళ్లి భోజనాలు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పచ్చటి తాటాకుల పందిరి మావిడాకు తోరణాలు శుభ్రంగా అలికి ముగ్గేసిన నేల దానిమీద నేల బల్లలు వేసి పెళ్లి వారిని సాదరంగా ఆహ్వానించారు చలపతిరావు దంపతులు.
సుశిక్షితులైన సైనికుల్లాగా తాటాకు బుట్టలో పదార్థాలు పెట్టుకుని వరుసగా వడ్డన ప్రారంభించారు ఆ ఊరి కుర్ర కారు. వరుసగా పదార్థాలన్నీ మళ్లీ మారు అడుగుతూ కాజాలు వడ్డించేవాళ్లు సగం మందికి వడ్డించిన తర్వాత మళ్లీ కనపడకపోవడంతో దూరం నుంచి ఈ పరిస్థితి గమనించి గబగబా పరిగెత్తుకుంటూ దొడ్డి వైపుకు వచ్చారు చలపతిరావు.
ఏమైంది కాజాలు మిగిలిన వాళ్ళకి వడ్డించడం లేదు. అని ఆందోళనగాఅడిగాడు. కాజాలు అయిపోయాయండి కామేశ్వరరావు కనబడలేదు అనేసరికి ఒక్కసారిగా చలపతి గారికి మతి పోయినంత పని అయింది. కాజాలయిపోవడం ఏంటండీ. ఐదు మనుగుల కాజా చేయించాను. రాత్రి భోజనాలకి ఎక్కువ మంది ఉంటారని అనుకుని చేయించిందే. ఐదువందల మందికి సరిపోతుంది అని అoటు గోపాల కృష్ణవేపు తిరిగేటప్పటికీ అవునండి నేనే కదా! తయారు చేసింది మరి ఏమైపోయాయి అప్రతిష్ట కూడాను అంటూ బాధ పడసాగాడు గోపాలకృష్ణ. అయితే వెంటనే కామేశ్వరరావు కి కబురు పంపించాడు చలపతిరావు.
చలపతి రావుకి ఏం చేయాలో తోచలేదు. ఆయనకు అసలు ముక్కు మీద కోపం. ఎవరికైనా మర్యాదలకు లోటు వచ్చిందంటే ఊరుకోడు. ఇంకేముంది లోకువ ఎవరయ్యా అంటే భార్య ఆ సీతమ్మ తల్లిని తిట్టడం ప్రారంభించాడు. "ఎవ్వరూ చూసుకోరు అన్నిటికీ నేనే చావాలి అంటూ చిందులు వేయసాగాడు. ఇంతలో పెళ్లికొడుకు తండ్రి పిలుస్తున్నాడంటూ చలపతిరావుని ఎవరో పిలిచారు.
అసలే పెళ్లి వారు సరైన వాళ్ళు కాదు. ఏమంటారు ఏమిటో. ఎప్పుడు ఇలా జరగలేదు . డబ్బు ఖర్చయింది కానీ మాట దక్కలేదు అనుకుని బాధపడుతూ ఆ భోజనాల దగ్గరికి వచ్చాడు చలపతిరావు. బావగారు కాజాలు ఎవరు చేసారో గాని చాలా బాగున్నాయండి. ఎన్నో చోట్ల కాజాలు తిన్నాం గానీ ఈ రుచి రాలేదు. చూడ్డానికి పొట్టిగా ఉన్న ఆత్రంగా కొరికితే ఒంటి మీద పాకం పడిపోతోంది అంటూ చెప్పేసరికి చలపతిరావుకి ఒకపక్క భయంగాను మరొకపక్క సంతోషంగాను అనిపించింది.
భయం ఎందుకయ్యా అంటే మళ్లీ మారు అడుగుతాడేమో అని భయం
ఇంతలో దూరంగా పంచ లాల్చీ కట్టుకుని గబగబా అడుగులు వేస్తూ వస్తున్న కామేశ్వరరావు కనబడ్డాడు. చలపతిరావు ముందుకు ఎదురు వెళ్లి కామేశ్వరరావు రెక్క పట్టుకుని గదిలోకి ఎక్కడికి వెళ్ళిపోయావు? అని కోపంగా అడిగాడు. లేదండి స్నానం చేసి వద్దామని ఇంటికి వెళ్ళాను. ఇంతలో మీరు పిలుస్తున్నారని చెప్తే పరుగు పరుగున వచ్చాను.
ఏమైందండీ? అని అడిగాడు. డైరెక్ట్ గా అడిగితే బాగుండదని కొంప మునిగింది కాజాలు వడ్డనకి సరిపోలేదు అని చలపతిరావు అనేసరికి కాజాలు లేకపోవడం ఏమిటి పిల్లలు తింటారని నేనే కొన్ని అవతల గదిలో తీసి దాచి ఉంచాను అన్నాడు కామేశ్వరరావు నిదానంగా.
ఒక్కసారిగా వచ్చిన కోపాన్ని తమాయించుకుని చలపతిరావు ఇది పెళ్లి కోసం కదయ్యా పిల్లల కోసం కాదు కదా గబగబా బయటికి తియ్యి అంటూ గది తాళం దించి నలుగురిని పిలిచి గబగబా కాజాలు వడ్డించారు. ఎందుకంటే పెళ్లిలో ఏ చిన్న లోపం వచ్చినా కన్యాదాతకి ఎవరు సహకరించరు. అందరూ తలోరకంగానూ చెప్పుకుంటారు. పెళ్లికి బంధువులే కాదు స్నేహితులు తెలియని వాళ్ళు కూడా ఎంతో మంది వస్తుంటారు. అందుకే పెళ్లిళ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చలపతిరావుకి ఇంకో భయం కూడా ఉంది. ఆ ఊర్లో కొంతమంది తయారుచేసిన సరుకుని పట్టుకు పోవడం కూడా ఉంది. మళ్లీ దగ్గర బంధువులే. అందుకే చాలా భయపడ్డాడు చలపతిరావు. మొత్తానికి కథ సుఖాంతం అయింది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి