మేము పండక్కి వెళ్ళాము!
మేమూ పండక్కి వెళ్ళాము!
"
ప్రతి సంవత్సరం ఈపాటికి ఎంత హడావిడిగా ఉండేది. ఇల్లంతా పిల్లలతోటి బంధువులతోటి సందడిగా ఉండేది. ఊరంతా సంక్రాంతి సంబరాలతో హడావుడిగా ఉండేది. మరి ఏం కర్మమో నాలుగు సంవత్సరాల నుంచి ఇలా ఈ ఆశ్రమంలో ఒంటరిగా జీవించవలసి వస్తోంది. ప్రతి సంవత్సరం ఎవరైనా పండగలకి పిలుస్తారని ఆశగా ఎదురుచూడడం నిరాశపడడం మామూలు అయిపోయింది. ఆఖరికి ఆశ్రమంలో పనిచేసే పని వాళ్లు కూడా ఒక్క రోజైనా సెలవులు పెట్టి వెళ్ళిపోతారు. కానీ ఆశ్రమంలో మిగిలిపోయేది మనలాంటి వాళ్ళే" అందరూ అనుకుంటూ బాధపడుతున్నారు పార్వతమ్మ పరంధామయ్య దంపతులు.
సంక్రాంతి నెల మొదలుపెట్టిన దగ్గర్నుంచి పిల్లలకు సంక్రాంతి పండుగకి రమ్మని మరీ మరీ చెప్పడం పిల్లలకు బట్టలు కొనడం పిండి వంటలు చేయడం ఇల్లు శుభ్రం చేసుకోవడం వీటితోటి ఎక్కడ ఖాళీ ఉండేది కాదు పాపం పార్వతమ్మకి.
ఒక పిల్లలేమిటి ఇంట్లో పనిచేసే పనిమనిషి చాకలి దొడ్లో పాలేరు కి కూడా పండగ బహుమానాలు ఇవ్వడంతో పాటు బట్టలు పెట్టి సంతోష పెట్టడం ప్రతి ఏటా మామూలే. అలాంటిది గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి పండగకి ఇలా ఆశ్రమంలో ఒంటరిగానే గడపడం నిజంగా బాధగా ఉంది అనుకుంది పార్వతమ్మ. వయసులో ఉన్న రోజుల్లో చేతినిండా పని ఉండి చేయలేకపోయేది. ఇప్పుడు చేద్దాం అన్నా ఏం పని ఉండడం లేదు పండుగనాడు. ఏమిటో జీవితం ఇలా అయిపోయింది ఎవరి శాపమో అనుకుంది పార్వతమ్మ . కనీసం బంధువులైన పండగకి పిలిచిన వాళ్ళు లేరు.
కడుపుని పుట్టిన పిల్లలు ఇద్దరినీ మంచి మంచి చదువులు చదివించి ప్రయోజకులను చేసి పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీరాయని ఆనందపడే సమయంలో భవిష్యత్తు బాగుంటుందని ఇద్దరు పిల్లలు అమెరికా వెళ్ళిపోతే వయసు సహకరించక ఉన్నది అమ్మేసి శరణాలయంలో చేరిపోయారు ఆ దంపతులు.
ఆ శరణాలయం పేరుకే శరణాలయం గానీ అక్కడ ఉండే వాళ్ళందరని కుటుంబ సభ్యులు లాగా చూసుకుంటుంది యాజమాన్యం. శరణాలయంలో ఉన్న 50 గదుల్లో కొందరు భర్తలు లేని వాళ్ళు కొందరు భార్య లేని వాళ్ళు కొంతమంది కొడుకులు లేని వాళ్ళు కొడుకులు ఉన్నా చూడని దంపతులు పరిస్థితులు వల్ల శరణాలయంలో చేరిన దంపతులు ఇలా ఎంతోమంది. అందరి హృదయాల్లోనూ ఒకటే బాధ.
అలాంటి బాధపడుతున్న వాళ్ళలో ఆ శరణాలయాన్ని నడుపుతున్న కుటుంబరావు సరస్వతమ్మది కూడా అదే సమస్య.
తెలుగువారికి అతిముఖ్యమైన పండగ ఈసంక్రాంతి పండుగ. ఈ పెద్ద పండుగకి ఎంతోమంది అతిధులుగా వస్తారు . ఆకాశంలోని చుక్కలు వాకిట్లోకి వచ్చి మెరిసిపోతూ పండగకి ప్రత్యేక శోభని తీసుకొస్తాయి. ప్రతి పండక్కి అల్లుడు గారిని ప్రత్యేక అతిథిగా పిలవడం మన సాంప్రదాయం. ఆకాశం అంచులు దాకా ఎగిరే గాలిపటాలు, వీధుల్లో విన్యాసాలు చేసే బసవన్నలు ఒక సంక్రాంతి పండగకే కనిపిస్తాయి.
సంక్రాంతి పండుగకు నెలరోజులు ముందు నుంచి హరినామ సంకీర్తన చేస్తూ వీధుల్లో తిరిగే హరిదాసులు సంక్రాంతి నెలలో తప్పితే మరి ఎప్పుడు కనపడరు. పొగ మంచు తెరల మధ్య దాక్కున్న చందమామ సూర్యోదయం అయిన కనిపించని సూరీడు వీళ్ళందరూ సంక్రాంతి అతిధులే.
రంగురంగుల చామంతులు బంతిపూలు ఇవన్నీ సంక్రాంతి పండుగకి మాత్రమే కనబడతాయి.
అయితే ప్రపంచమంతా ఈ పండుగ చేసుకుంటున్న ఈ శరణాలయంలో ఉంటున్న వృద్ధుల్ని మటుకు ఎవరూ పిలిచే వాళ్ళు లేక ఆ పండగ మూడు రోజులు పాపం వాళ్లు మౌనంగా శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోతుంటారు. అలా ప్రతి సంవత్సరం చూస్తున్న కుటుంబరావు సరస్వతమ్మకి చాలా బాధ కలిగి ఒక స్థిర నిర్ణయం తీసుకున్నారు. కుటుంబరావు సరస్వతమ్మ కూడా ఆ శరణాలయంలో పక్కనే ఉన్న పెద్ద ఇంట్లో కాపురం ఉంటూ ఈ శరణాలయం నడిపిస్తూ ఉంటారు.
రేపటి రోజు భోగి పండుగ అనగా తొలిరోజు సాయంకాలం ప్రతి గదికి వెళ్లి వరసలు పెట్టి సంక్రాంతి పండుగకి తప్పకుండా తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు ఆ శరణాలయంలో ఉన్నవాళ్లు అందర్నీ. ఆ మాట వినగానే వృద్ధులు అందరి కళ్ళల్లో ఆనందం కనిపించింది . ఏదో ఉత్సాహం కనిపించింది. ఎన్ని రోజులు అయింది ఇటువంటి కబురు విని. ఆరోజు రాత్రి అంతా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూశారు ఆ శరణాలయంలోని వృద్ధులు.
ఎన్నాళ్ళు అయింది పండగ తలంటు అంటుకుని అనుకుంటూ శుభ్రంగా నువ్వుల నూనెతో ఒళ్ళు మర్దన చేసుకుని శుభ్రంగా తలంటుకుని ఇస్త్రీ బట్టలు కట్టుకుని అతిథులుగా కుటుంబరావు ఇంటికి వెళ్తుంటే ఆ వృద్ధుల కళ్ళల్లో పండగ సంతోషం కనపడింది.
అప్పటికే వీధిలో పెద్ద భోగిమంట వేసి అతిధుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబరావు దంపతులు ఆ వృద్ధులని సాదరంగా ఆహ్వానించి అందరి చేత భోగి దండలు మంటలో వేయించారు.
ఎర్రటి భోగి మంటలు పైకి ఎగురుతుంటే చిన్నపిల్లవాళ్ళ లా ఆకాశంలోకి చూస్తున్న వృద్ధులను చూస్తే పసిపిల్లల్లా కనిపించారు.
అలా వృద్ధులందరినీ సాదరంగా లోపలికి ఆహ్వానించి కడుపునిండా దగ్గరుండి టిఫిన్ తినిపించారు. ఆ మర్యాదలు చూస్తే ఒకప్పటి పండగలలో తాము అతిథులకు చేసిన మర్యాదలు గుర్తుకు వచ్చి కన్నీళ్లు వచ్చాయి వృద్ధులందరికీ. రోజు శరణాలయంలో టిఫిన్ సమయం అయిందని భోజన సమయం అయిందని గంటలు కొడతారు. ఇవాళ అందుకు భిన్నంగా ఉంది తమ దినచర్య అనుకున్నారు.
అలా హోమ్ థియేటర్లో పాత సినిమాలు చూపించి మధ్యాహ్నం మళ్లీ మర్యాదలతో అరిటాకు భోజనం. అరిటాకు చూడగానే తమ సొంతిల్లు గుర్తుకొచ్చింది. అలా గౌరవ మర్యాదలతో ప్రేమగా ఆదరించి పెట్టిన ఆ భోజనం తిని అలా మూడు రోజులు పండుగ ఆనందంగా గడిపి శరణాలయానికి బయలుదేరి వెళ్లిపోయారు ఆ వృద్ధులు. వెళ్లే ముందు వృద్ధులందరికీ కుటుంబరావు దంపతులు బట్టలు పెట్టి ఆనందంగా సాగనంపారు. మేము కూడా పండక్కి వెళ్ళాము అంటూ సెలవు నుండి తిరిగి వచ్చిన శరణాలయం సిబ్బందికి సంతోషంతో చెప్పిన వృద్ధులు చూసి ఆనందపడ్డారు కుటుంబరావు దంపతులు.
ఈ శరణాలయం గురించి ఈ శరణాలయంలో వృద్ధుల పండగ గురించి సోషల్ మీడియా వచ్చిన వార్తలు చూసి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఈ శరణాలయాన్ని సందర్శించి కుటుంబరావు దంపతులను అభినందించారు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి